అలుపెరుగని అక్షరాయుధుడు.. | Aluperugati Aksharayududu Book launch of ABK Guest Column Special Story | Sakshi
Sakshi News home page

అలుపెరుగని అక్షరాయుధుడు..

Published Thu, Aug 1 2024 11:42 AM | Last Updated on Thu, Aug 1 2024 11:48 AM

Aluperugati Aksharayududu Book launch of ABK Guest Column Special Story

నేడు ఏబీకే ప్రసాద్‌ 90వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ‘అలుపెరుగని అక్షరాయుధుడు–ఏబీకే’ పుస్తకావిష్కరణ

తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనాత్మక సంపాదకుడు ఏబీకే ప్రసాద్‌. పుస్తకాలు చదివే అల వాటు లేని వారంతా ఇతర కారణాలతో సంపాదకులై పోతున్న తరుణంలో ఏబీకే లాంటి నిత్య పఠనాభిలాషి సంపాదకుడు కావడం అరుదు, ఆదర్శం.

వెనకటికి ‘నా కలమే ఖడ్గ’మని చెప్పిన కోటంరాజు రామారావు ప్రతిరోజూ రాజీనామా లేఖ తన జేబులో పెట్టుకొని ఉండేవారని చెప్పగా విన్నాము. కానీ ఏబీకే విషయంలో దాన్ని సమకాలీనులంతా స్వయంగా చూశారు. తన భావాలకు చోటు లేనిచోట ఆయన నిమిషమైనా నిలువలేరు. అందుకే ‘ఈనాడు’ వైజాగ్‌ ఎడిషన్‌లో ఎడిటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే రాష్ట్రంలో ఎడిటర్‌గా పని చేయని తెలుగు దినపత్రికంటూ దాదాపు లేకుండా పోయింది. నిజానికి తెలుగు పత్రికల సంస్థాపక సంపాదకుడుగా ఆయనకు గొప్ప పేరు వచ్చింది.

‘ఈనాడు’ తర్వాత ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లు ఏబీకే వెలిగించిన దీపాలే. ‘ఆంధ్రభూమి’ అసోసియేట్‌ ఎడిటర్‌గా, ‘ఆంధ్రప్రభ’ చీఫ్‌ ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. ప్రభుత్వ మాస పత్రిక‘ఆంధ్రప్రదేశ్‌’కు కూడా ఎడిటర్‌గా పనిచేశారాయన. పక్ష పత్రికలు ‘సుప్రభాతం’, ‘మాభూమి’లకు ఎడిటర్‌గా తొలు దొలుత వాటిని తీర్చిదిద్దింది ఆయనే.

1956లో వామపక్ష భావాల పత్రిక ‘విశాలాంధ్ర’లో తెలుగు జర్నలిజం రంగంలో ప్రవేశించిన ఏబీకే గత ఏడు దశా బ్దాలుగా ఈ భూప్రపంచంలో జరిగే మానవ సంబంధ పరి ణామాలన్నింటిపై స్పందించారు. ఆయన చలించిపోయి అక్షరా కృతి నిచ్చిన ‘నిబద్ధాక్షరి’ సాహిత్య ప్రియులంతా చదివి తీర వలసిందే. ఏబీకే సంపాదకీయాలు ఇప్పటివరకు పది సంపు టాలుగా వచ్చాయి. ఆయన సంపాదకీయాలు విస్తృత విజ్ఞానా నికి, పఠనశీలానికి, నిశిత పరిశీలనాశక్తికి, భావనాపటిమకు, భాషా పాటవానికి, పాఠక మార్గదర్శకత్వానికి ప్రతీకలు. మరీ ముఖ్యంగా తెలుగు పత్రికలలో ఇతర సంపాదకులు స్పృశించని ఆర్థిక సంబంధ అంశాలకు చెందిన అంశాలను తీసుకుని ఎంతో లోతుగా, సమయస్ఫూర్తితో సంపాదకీయాలు రాశారు. ఆర్థిక రంగ నిపుణులకు దిక్సూచి వంటి సేవలందించారు.

పాఠక జనరంజకంగా సంపాదకీయం రాయడంతో పాటుగా పత్రిక మొదటి పేజీని సుందరంగా, సందర్భాను సారంగా తీర్చిదిద్దడం, చద్దివాసన లేకుండా పరిశోధనాత్మక వార్తలు ప్రచురించడం, ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టడం, ఆ తర్వాత ఎడిట్‌ పేజీని చక్కగా రూపొందించడం, ప్రత్యేకంగా వ్యాసాలు రాయడం, ఇతరులతో పలు కొత్త శీర్షికలు రాయించడం – దిన పత్రికను అన్నివిధాలా సమగ్రంగా, అప్పుడే వండి వార్చిన భోజనంలాగా తాజా వార్తల కోసం, వ్యాసాల కోసం నకనక లాడే పాఠక జనానికి వడ్డించడంలో ఏబీకే సిద్ధహస్తులు. అత్యాధునిక భావా లుగల ఏబీకేలో పట్టుదల, సమయ స్ఫూర్తి, వేగం ఎక్కువ. జర్నలిజం రంగంలో ఆయనతో పాటుగా కలాలు పట్టిన వారంతా కలాలు మూసేశారు. ఏబీకే లాగా ఇప్పటికీ రచనలు చేస్తున్న పాత్రికే యులెవరూ లేరు.

ఇవాళ తెలుగు జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువమంది ఏబీకే తయారుచేసిన సైన్యమే. ప్రవృత్తిపరంగా ఎవరెలా ఉన్నా, వృత్తిపరంగా చాలామందిని ఆయన చాకుల్లా మార్చారు. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఏడు దశాబ్దాల అనుభవం గల ఏబీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా నిరంతర కృషి చేశారు. తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి సాధించడంలో ఆయన పాత్ర ఎంత గానో ఉంది.

ముప్ఫై శాతం మంది పిల్లలు తమ మాతృభాషకు దూరమైపోతున్న కొద్దీ ఆ భాషను మృత భాషగా పరిగణించవలసి వస్తుందని యునెస్కో నిర్ధారణ చేసిందనీ, సమాచార విశ్వీకరణవల్ల భాషా వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందనీ కూడా యునెస్కో తీర్మానించిందని ఏబీకే హెచ్చరించారు. ఒక భాష మరొక భాషపై పెత్తనం చలాయించడాన్ని నిరసించాలని యునెస్కో ఇచ్చిన సలహాను తెలుగు ప్రజానీకం ఆహ్వానించాలన్నారు. పాఠశాల విద్యలో తెలుగు బోధనను అయిదవ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాలయా న్నింట్లో ఎస్‌.ఎస్‌.సి. వరకు విధిగా అమలు చేస్తేనే విద్యార్థుల్లో భావప్రకటనకు స్థిరత్వం వస్తుందని ఏబీకే అభిప్రాయం వ్యక్తం చేశారు. జపనీస్, చైనీస్‌ భాషల అభివృద్ధికి, వాటి వికాసానికి మూలం అంతా మాతృభాషలను మాధ్యమంగా చేసుకున్నందు వల్లనే అన్నారు.

ఈ ఆగస్టు ఒకటో తేదీన తొంభయ్యవ ఏట అడుగిడుతున్న ఏబీకేను వయోధిక పాత్రికేయ సంఘం ‘జీవన సాఫల్య పుర స్కారం’తో ప్రెస్‌క్లబ్‌లో సత్కరిస్తున్నది. ఏబీకే వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తూ సమగ్రంగా రూపొందించిన ‘అలుపెరుగని అక్షరా యుధుడు–ఏబీకే’ గ్రంథాన్ని పూర్వ ప్రధాని మీడియా సలహా దారు సంజయ్‌బారు ఆవిష్కరిస్తున్నారు.

ఈ సందర్భంగా యువ పాత్రికేయులకు మీరిచ్చే సందేశ మేమిటి? అని ప్రశ్నిస్తే – ‘యువ పాత్రికేయులు సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్రీయ సంబంధమైన ప్రతి పరిణామాన్నీ పరిశీలించాలి. వాటిని అవగా హన చేసుకోవాల’న్నారు. పుస్తక పఠనాన్ని మరవకూడద న్నారు. పాత్రికేయులు వృత్తిరీత్యా తమకు అప్పగించిన పని మీద దృష్టి మొత్తం కేంద్రీకరించాలన్నారు.

అంతేకాదు– ‘యువ పాత్రికేయులు తమ వృత్తికి సంబంధంలేని అంశాలలో జోక్యం చేసుకోకూడదు, ధర్మాచరణను వీడ కూడదు. ఇందులో సాధకబాధకాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే అయినా, అన్ని అవాంతరాలను తట్టుకుని నిలబడినవాడే ఆదర్శం కాగలడ’ని ఏబీకే ఘంటాపథంగా చెప్పారు.


– టి. ఉడయవర్లు, వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయుడు, 98856 86415

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement