udayavarlu
-
అలుపెరుగని అక్షరాయుధుడు..
తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనాత్మక సంపాదకుడు ఏబీకే ప్రసాద్. పుస్తకాలు చదివే అల వాటు లేని వారంతా ఇతర కారణాలతో సంపాదకులై పోతున్న తరుణంలో ఏబీకే లాంటి నిత్య పఠనాభిలాషి సంపాదకుడు కావడం అరుదు, ఆదర్శం.వెనకటికి ‘నా కలమే ఖడ్గ’మని చెప్పిన కోటంరాజు రామారావు ప్రతిరోజూ రాజీనామా లేఖ తన జేబులో పెట్టుకొని ఉండేవారని చెప్పగా విన్నాము. కానీ ఏబీకే విషయంలో దాన్ని సమకాలీనులంతా స్వయంగా చూశారు. తన భావాలకు చోటు లేనిచోట ఆయన నిమిషమైనా నిలువలేరు. అందుకే ‘ఈనాడు’ వైజాగ్ ఎడిషన్‌లో ఎడిటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే రాష్ట్రంలో ఎడిటర్‌గా పని చేయని తెలుగు దినపత్రికంటూ దాదాపు లేకుండా పోయింది. నిజానికి తెలుగు పత్రికల సంస్థాపక సంపాదకుడుగా ఆయనకు గొప్ప పేరు వచ్చింది.‘ఈనాడు’ తర్వాత ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లు ఏబీకే వెలిగించిన దీపాలే. ‘ఆంధ్రభూమి’ అసోసియేట్ ఎడిటర్‌గా, ‘ఆంధ్రప్రభ’ చీఫ్ ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. ప్రభుత్వ మాస పత్రిక‘ఆంధ్రప్రదేశ్’కు కూడా ఎడిటర్‌గా పనిచేశారాయన. పక్ష పత్రికలు ‘సుప్రభాతం’, ‘మాభూమి’లకు ఎడిటర్‌గా తొలు దొలుత వాటిని తీర్చిదిద్దింది ఆయనే.1956లో వామపక్ష భావాల పత్రిక ‘విశాలాంధ్ర’లో తెలుగు జర్నలిజం రంగంలో ప్రవేశించిన ఏబీకే గత ఏడు దశా బ్దాలుగా ఈ భూప్రపంచంలో జరిగే మానవ సంబంధ పరి ణామాలన్నింటిపై స్పందించారు. ఆయన చలించిపోయి అక్షరా కృతి నిచ్చిన ‘నిబద్ధాక్షరి’ సాహిత్య ప్రియులంతా చదివి తీర వలసిందే. ఏబీకే సంపాదకీయాలు ఇప్పటివరకు పది సంపు టాలుగా వచ్చాయి. ఆయన సంపాదకీయాలు విస్తృత విజ్ఞానా నికి, పఠనశీలానికి, నిశిత పరిశీలనాశక్తికి, భావనాపటిమకు, భాషా పాటవానికి, పాఠక మార్గదర్శకత్వానికి ప్రతీకలు. మరీ ముఖ్యంగా తెలుగు పత్రికలలో ఇతర సంపాదకులు స్పృశించని ఆర్థిక సంబంధ అంశాలకు చెందిన అంశాలను తీసుకుని ఎంతో లోతుగా, సమయస్ఫూర్తితో సంపాదకీయాలు రాశారు. ఆర్థిక రంగ నిపుణులకు దిక్సూచి వంటి సేవలందించారు.పాఠక జనరంజకంగా సంపాదకీయం రాయడంతో పాటుగా పత్రిక మొదటి పేజీని సుందరంగా, సందర్భాను సారంగా తీర్చిదిద్దడం, చద్దివాసన లేకుండా పరిశోధనాత్మక వార్తలు ప్రచురించడం, ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టడం, ఆ తర్వాత ఎడిట్ పేజీని చక్కగా రూపొందించడం, ప్రత్యేకంగా వ్యాసాలు రాయడం, ఇతరులతో పలు కొత్త శీర్షికలు రాయించడం – దిన పత్రికను అన్నివిధాలా సమగ్రంగా, అప్పుడే వండి వార్చిన భోజనంలాగా తాజా వార్తల కోసం, వ్యాసాల కోసం నకనక లాడే పాఠక జనానికి వడ్డించడంలో ఏబీకే సిద్ధహస్తులు. అత్యాధునిక భావా లుగల ఏబీకేలో పట్టుదల, సమయ స్ఫూర్తి, వేగం ఎక్కువ. జర్నలిజం రంగంలో ఆయనతో పాటుగా కలాలు పట్టిన వారంతా కలాలు మూసేశారు. ఏబీకే లాగా ఇప్పటికీ రచనలు చేస్తున్న పాత్రికే యులెవరూ లేరు.ఇవాళ తెలుగు జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువమంది ఏబీకే తయారుచేసిన సైన్యమే. ప్రవృత్తిపరంగా ఎవరెలా ఉన్నా, వృత్తిపరంగా చాలామందిని ఆయన చాకుల్లా మార్చారు. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఏడు దశాబ్దాల అనుభవం గల ఏబీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా నిరంతర కృషి చేశారు. తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి సాధించడంలో ఆయన పాత్ర ఎంత గానో ఉంది.ముప్ఫై శాతం మంది పిల్లలు తమ మాతృభాషకు దూరమైపోతున్న కొద్దీ ఆ భాషను మృత భాషగా పరిగణించవలసి వస్తుందని యునెస్కో నిర్ధారణ చేసిందనీ, సమాచార విశ్వీకరణవల్ల భాషా వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందనీ కూడా యునెస్కో తీర్మానించిందని ఏబీకే హెచ్చరించారు. ఒక భాష మరొక భాషపై పెత్తనం చలాయించడాన్ని నిరసించాలని యునెస్కో ఇచ్చిన సలహాను తెలుగు ప్రజానీకం ఆహ్వానించాలన్నారు. పాఠశాల విద్యలో తెలుగు బోధనను అయిదవ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయా న్నింట్లో ఎస్.ఎస్.సి. వరకు విధిగా అమలు చేస్తేనే విద్యార్థుల్లో భావప్రకటనకు స్థిరత్వం వస్తుందని ఏబీకే అభిప్రాయం వ్యక్తం చేశారు. జపనీస్, చైనీస్ భాషల అభివృద్ధికి, వాటి వికాసానికి మూలం అంతా మాతృభాషలను మాధ్యమంగా చేసుకున్నందు వల్లనే అన్నారు.ఈ ఆగస్టు ఒకటో తేదీన తొంభయ్యవ ఏట అడుగిడుతున్న ఏబీకేను వయోధిక పాత్రికేయ సంఘం ‘జీవన సాఫల్య పుర స్కారం’తో ప్రెస్‌క్లబ్‌లో సత్కరిస్తున్నది. ఏబీకే వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తూ సమగ్రంగా రూపొందించిన ‘అలుపెరుగని అక్షరా యుధుడు–ఏబీకే’ గ్రంథాన్ని పూర్వ ప్రధాని మీడియా సలహా దారు సంజయ్‌బారు ఆవిష్కరిస్తున్నారు.ఈ సందర్భంగా యువ పాత్రికేయులకు మీరిచ్చే సందేశ మేమిటి? అని ప్రశ్నిస్తే – ‘యువ పాత్రికేయులు సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్రీయ సంబంధమైన ప్రతి పరిణామాన్నీ పరిశీలించాలి. వాటిని అవగా హన చేసుకోవాల’న్నారు. పుస్తక పఠనాన్ని మరవకూడద న్నారు. పాత్రికేయులు వృత్తిరీత్యా తమకు అప్పగించిన పని మీద దృష్టి మొత్తం కేంద్రీకరించాలన్నారు.అంతేకాదు– ‘యువ పాత్రికేయులు తమ వృత్తికి సంబంధంలేని అంశాలలో జోక్యం చేసుకోకూడదు, ధర్మాచరణను వీడ కూడదు. ఇందులో సాధకబాధకాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే అయినా, అన్ని అవాంతరాలను తట్టుకుని నిలబడినవాడే ఆదర్శం కాగలడ’ని ఏబీకే ఘంటాపథంగా చెప్పారు.– టి. ఉడయవర్లు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, 98856 86415 -
తెలంగాణ మరువలేని మనిషి
తెలంగాణ రాష్ట్రం కోసం మనసా, వాచా తపించిన నరసింగరావు పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఎనిమిది మంది అగ్ర నాయకులలో ఒకరు. ఆ ఒప్పందం తు.చ. తప్పకుండా అమలు జరిపించాలనే జీవితాంతం ప్రయత్నించారు. మల్లెపూవు వంటి పైజామా, కమీజు ధరించి, పైన నల్లని షేర్వాణి వేసుకుని, పాపూ సులు తొడుక్కుని, కొన్నిసార్లు నెత్తిపై కుచ్చు వేళ్లాడే రూమీ టోపీ పెట్టుకుని, ఎత్త్తు కాకుం డా, మరీ పొట్టి కాకుండా, ఆ రోజుల్లో సాధారణంగా కని పించే ఆ వకీలు అసాధారణ రీతిలో కోర్టులో వివిధ వ్యాజ్యాలు వాదించి విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో ఆయనే షేర్వాణి రంగు మాత్రమే మార్చుకుని, టోపీ తీసేసి విద్య, సాంస్కృతిక రంగాలలోని యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆంధ్ర విద్యాలయం లాంటి సంస్థల ద్వారా తపన పడ్డారు. దానికి కూడా న్యాయం చేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి, ఉద్యమకారునిగా, హైదరాబాదు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అహరహం శ్రమించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారు. పెద్దమనిషిగా అందరి మన్ననలను అందుకున్నారు. ఆయనొక మరపురాని మనీషి. ఇంత నేపథ్యం కలిగిన ఆ అసాధారణ నాయకుడు జోగినపల్లి వెంకట నరసింగరావు. అందరూ ఆ రోజుల్లో ప్రేమతో, అభిమానంతో, భక్తితో ‘జె.వి. సాబ్’ అనేవారు. చదువూ సంస్కారం, సంయమనం, మానవీయత జె.వి.కి పెట్టని ఆభరణాలు. ఏ విషయంైలోనెనా ఆయన వైఖరి సుస్పష్టం. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టు బడడం ఆయన నైజం. అల్ప సంతోషి. కోపం వచ్చినప్పుడు తాటాకులా భగ్గుమన్నా, తర్వాత చల్లారి, స్నేహం నెరపేవారు. విద్యాదాతగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగినా మానవ సంబం ధాలకే ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. గాంధీ సిద్ధాం తాలను ఆచరించేవారు. అమ్మమ్మగారి ఊరు కరీంనగర్ జిల్లా కురిక్యాలలో నరసింగరావు పుట్టారు. పెరిగిం దంతా స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ తాలూకా ద్వారకలో. తల్లిదండ్రులు - వెంకట గోపాలరావు, లోకమాంబ. వీరిది తగినంత భూవసతి గల కుటుంబం. ఆ రోజుల్లో అలీఘడ్ విశ్వవిద్యా లయంలో బి.ఎ., బనారస్ హిందూ విశ్వవిద్యా లయంలో ఎం.ఎ., ఆ తర్వాత ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. ఈ కారణాన కూడా వారిలో జాతీయతా భావం నెలకొన్నదనవచ్చు. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలనే ఉద్యమం ప్రారంభ మైనప్పుడు దానికి మద్దతుగా న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. ఆ ఉద్యమంలో నరసింగరావు కీలక పాత్ర నిర్వహించారు. హైదరాబాద్ రాష్ర్టంపై 1948లో పోలీస్ చర్య జరిగి, ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. అనంతర కాలంలో జె.వి. నరసింగరావు హైదరాబాద్ రాష్ర్ట కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొన్నారు. క్రమంగా ఎంతో ముమ్మరంగా ఉన్న వకాల్తా వదిలేసి, రాజకీయాల్లో స్థిరపడిపోయారు. గాంధీమార్గంలో నడిచారు. కె.వి. రంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిల చొరవతో రంగారెడ్డి అనుయాయులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ చెన్నారెడ్డి వ్యూహం ఫలించి జె.వి. హైదరాబాద్ రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. తెలంగాణ రాష్ర్టం కోసం మనసా, వాచా తపించిన నరసింగరావు పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఎనిమిది మంది అగ్ర నాయకులలో ఒకరు. ఆ ఒప్పందం తు.చ. తప్పకుండా అమలు జరిపించాలనే జీవితాంతం ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అవత రణ అనంతరం నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాలలో కీలకమైన ప్రజాపనులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి శాఖలను నిర్వహించడమే కాకుండా, కొంతకాలం ఉప ముఖ్యమంత్రిగా కూడా నరసింగరావు బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుచ్ఛక్తి శాఖ మంత్రిగా, విద్యుత్ బోర్డు తొలి అధ్యక్షుడిగా రాష్ర్టంలోని మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయించారు. దేశం మొత్తం మీద మొట్టమొదటి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రారంభించడంలో జె.వి. ప్రధాన పాత్ర వహించారు. విద్యుచ్ఛక్తి విలాసాల కోసం కాదనీ, అది బతుకు తెరువుకోసమనీ పదేపదే చెప్పే వారు. జాతీయాభివృద్ధికీ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికీ విద్యుచ్ఛక్తిని ఉపయోగించాలని ఉద్భోధించేవారు. పలుమార్లు నీటిపారుదల శాఖను కూడా నిర్వహించి బీడుపడిన వేలాది ఎకరాలకు నీరు అందించారు. కొత్త ప్రాజెక్టులతోపాటు పాడుపడిన ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించారు. నగరంలోని పారిశ్రామిక ప్రదర్శన సంఘం అధ్యక్షులుగా బాధ్యత చేపట్టి, అనేక విద్యాసంస్థలు నెలకొల్పడానికి కృషి చేశారు. వివిధ ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు సహకరించారు. తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు, దీనికి పరిష్కారంగా ప్రధాని ఇందిరాగాంధీ అనుసరించిన విధానానికి బాసటగా నిలిచారు. జేవీ ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా, అందరినీ కలుపుకుపోయే ప్రయత్నమే చేశారు. తెలంగాణలోని ఆ తరం యువ కులు జె.వి.సాబ్తో ఏదో ఒక సాయం పొందినవారే. అందుకే ఆయన రాష్ట్ర రాజకీయరంగంలో మరపురాని మనీషి. జేవీ సేవలు రాష్ట్రానికి ఇంకా అవసరమున్న తరుణంలోనే 1972 సెప్టెంబర్ 3వ తేదీన ఆయన కన్నుమూశారు. ఉడయవర్లు (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) మొబైల్: 98856 86415)