తెలంగాణ మరువలేని మనిషి
తెలంగాణ రాష్ట్రం కోసం మనసా, వాచా తపించిన నరసింగరావు పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఎనిమిది మంది అగ్ర నాయకులలో ఒకరు. ఆ ఒప్పందం తు.చ. తప్పకుండా అమలు జరిపించాలనే జీవితాంతం ప్రయత్నించారు.
మల్లెపూవు వంటి పైజామా, కమీజు ధరించి, పైన నల్లని షేర్వాణి వేసుకుని, పాపూ సులు తొడుక్కుని, కొన్నిసార్లు నెత్తిపై కుచ్చు వేళ్లాడే రూమీ టోపీ పెట్టుకుని, ఎత్త్తు కాకుం డా, మరీ పొట్టి కాకుండా, ఆ రోజుల్లో సాధారణంగా కని పించే ఆ వకీలు అసాధారణ రీతిలో కోర్టులో వివిధ వ్యాజ్యాలు వాదించి విజయం సాధించారు. ఆ తర్వాతి కాలంలో ఆయనే షేర్వాణి రంగు మాత్రమే మార్చుకుని, టోపీ తీసేసి విద్య, సాంస్కృతిక రంగాలలోని యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆంధ్ర విద్యాలయం లాంటి సంస్థల ద్వారా తపన పడ్డారు. దానికి కూడా న్యాయం చేశారు. తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి, ఉద్యమకారునిగా, హైదరాబాదు రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అహరహం శ్రమించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారు. పెద్దమనిషిగా అందరి మన్ననలను అందుకున్నారు. ఆయనొక మరపురాని మనీషి. ఇంత నేపథ్యం కలిగిన ఆ అసాధారణ నాయకుడు జోగినపల్లి వెంకట నరసింగరావు. అందరూ ఆ రోజుల్లో ప్రేమతో, అభిమానంతో, భక్తితో ‘జె.వి. సాబ్’ అనేవారు.
చదువూ సంస్కారం, సంయమనం, మానవీయత జె.వి.కి పెట్టని ఆభరణాలు. ఏ విషయంైలోనెనా ఆయన వైఖరి సుస్పష్టం. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టు బడడం ఆయన నైజం. అల్ప సంతోషి. కోపం వచ్చినప్పుడు తాటాకులా భగ్గుమన్నా, తర్వాత చల్లారి, స్నేహం నెరపేవారు. విద్యాదాతగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎదిగినా మానవ సంబం ధాలకే ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. గాంధీ సిద్ధాం తాలను ఆచరించేవారు. అమ్మమ్మగారి ఊరు కరీంనగర్ జిల్లా కురిక్యాలలో నరసింగరావు పుట్టారు. పెరిగిం దంతా స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ తాలూకా ద్వారకలో. తల్లిదండ్రులు - వెంకట గోపాలరావు, లోకమాంబ. వీరిది తగినంత భూవసతి గల కుటుంబం. ఆ రోజుల్లో అలీఘడ్ విశ్వవిద్యా లయంలో బి.ఎ., బనారస్ హిందూ విశ్వవిద్యా లయంలో ఎం.ఎ., ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. ఈ కారణాన కూడా వారిలో జాతీయతా భావం నెలకొన్నదనవచ్చు.
హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావాలనే ఉద్యమం ప్రారంభ మైనప్పుడు దానికి మద్దతుగా న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. ఆ ఉద్యమంలో నరసింగరావు కీలక పాత్ర నిర్వహించారు. హైదరాబాద్ రాష్ర్టంపై 1948లో పోలీస్ చర్య జరిగి, ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. అనంతర కాలంలో జె.వి. నరసింగరావు హైదరాబాద్ రాష్ర్ట కాంగ్రెస్‌లో చురుకుగా పాల్గొన్నారు. క్రమంగా ఎంతో ముమ్మరంగా ఉన్న వకాల్తా వదిలేసి, రాజకీయాల్లో స్థిరపడిపోయారు. గాంధీమార్గంలో నడిచారు. కె.వి. రంగారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిల చొరవతో రంగారెడ్డి అనుయాయులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
డాక్టర్ చెన్నారెడ్డి వ్యూహం ఫలించి జె.వి. హైదరాబాద్ రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. తెలంగాణ రాష్ర్టం కోసం మనసా, వాచా తపించిన నరసింగరావు పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ఎనిమిది మంది అగ్ర నాయకులలో ఒకరు. ఆ ఒప్పందం తు.చ. తప్పకుండా అమలు జరిపించాలనే జీవితాంతం ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అవత రణ అనంతరం నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గాలలో కీలకమైన ప్రజాపనులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి శాఖలను నిర్వహించడమే కాకుండా, కొంతకాలం ఉప ముఖ్యమంత్రిగా కూడా నరసింగరావు బాధ్యతలు నిర్వర్తించారు.
విద్యుచ్ఛక్తి శాఖ మంత్రిగా, విద్యుత్ బోర్డు తొలి అధ్యక్షుడిగా రాష్ర్టంలోని మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయించారు. దేశం మొత్తం మీద మొట్టమొదటి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థను కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ప్రారంభించడంలో జె.వి. ప్రధాన పాత్ర వహించారు. విద్యుచ్ఛక్తి విలాసాల కోసం కాదనీ, అది బతుకు తెరువుకోసమనీ పదేపదే చెప్పే వారు. జాతీయాభివృద్ధికీ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికీ విద్యుచ్ఛక్తిని ఉపయోగించాలని ఉద్భోధించేవారు. పలుమార్లు నీటిపారుదల శాఖను కూడా నిర్వహించి బీడుపడిన వేలాది ఎకరాలకు నీరు అందించారు. కొత్త ప్రాజెక్టులతోపాటు పాడుపడిన ప్రాజెక్టులకు మరమ్మతులు చేయించారు. నగరంలోని పారిశ్రామిక ప్రదర్శన సంఘం అధ్యక్షులుగా బాధ్యత చేపట్టి, అనేక విద్యాసంస్థలు నెలకొల్పడానికి కృషి చేశారు. వివిధ ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు సహకరించారు.
తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు, దీనికి పరిష్కారంగా ప్రధాని ఇందిరాగాంధీ అనుసరించిన విధానానికి బాసటగా నిలిచారు. జేవీ ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా, అందరినీ కలుపుకుపోయే ప్రయత్నమే చేశారు. తెలంగాణలోని ఆ తరం యువ కులు జె.వి.సాబ్‌తో ఏదో ఒక సాయం పొందినవారే. అందుకే ఆయన రాష్ట్ర రాజకీయరంగంలో మరపురాని మనీషి. జేవీ సేవలు రాష్ట్రానికి ఇంకా అవసరమున్న తరుణంలోనే 1972 సెప్టెంబర్ 3వ తేదీన ఆయన కన్నుమూశారు.
ఉడయవర్లు (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
మొబైల్: 98856 86415)