
సందర్భం
ఉగ్రవాద కర్కశ దాడితో పహల్‌గామ్ ప్రశాంతత భగ్నమైంది. కశ్మీర్ లోయలో శాంతి ఇప్పటికీ దైవాధీనమే! శత్రువుల తుపాకులు ఎంత ప్రమాదకరమైనవో... ఉదాసీనత, తప్పుడు అంచనాలు కూడా అంతే ప్రమాదకరమైనవి. పౌరుల మీద కాదు, ఇండియా విశ్వసనీయత మీద జరిగిన దాడి ఇది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో దెబ్బ తీయడాన్ని ఇంకెలా భావించాలి? ఇదొక కొత్త రకం మిలిటెన్సీ.
కశ్మీర్ వినూత్న విపత్తును ఎదుర్కొంటోంది. రమారమి 60 మంది విదేశీ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో మాటు వేసి ఉన్నారని నిఘా వర్గాల అంచనా. వీరిలో సగం మంది టీఆర్‌ఎఫ్ సంబంధీకులే. ఇది లష్కర్–ఎ–తోయిబాకు ముసుగు సంస్థ. ప్రపంచం కళ్లు గప్పేందుకు, స్థానిక సంస్థగా మభ్యపెట్టే పేరుతో వ్యవహారం నడిపిస్తోంది.
భౌతిక గస్తీ కీలకం
టీఆర్‌ఎఫ్ తదితర గ్రూపులు హైబ్రిడ్ తీవ్రవాదాన్ని అవలంబిస్తున్నాయి. అందుకే ఇవి మరింత ప్రమాదకరమైనవి. తుపాకుల వంటి మారణాయు ధాలలో శిక్షణ పొంది, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అధీన రేఖ దాటి వచ్చే దుండగులపై ఈ కొత్త తరహా ఉగ్రసంస్థలు ఆధార పడవు. బదులుగా స్థానికులనే ‘రాడికలైజ్’ చేసి వారిని ఉపయోగించు కుంటాయి. వీరికి పిస్టల్స్ లేదా గ్రనేడ్స్ సమకూరుస్తాయి.
వీటితో లక్ష్యాలపై దాడి చేసి వెంటనే జనంలో కలిసిపోతారు. వీరు రెండోసారి మళ్లీ దాడులకు పాల్పడరు. కాబట్టి ఎలాంటి డిజిటల్ ఆధారాలూ ఉండవు. దాడులూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. కాబట్టి ‘సెక్యూరిటీ గ్రిడ్స్’ పసి గట్టలేవు. సంప్రదాయ నిఘా, పోలీసు వ్యవస్థలను ముప్పుతిప్పలు పెట్టే రహస్య తీవ్రవాదం ఇది.
నిజానికి వాన్స్ వంటి హైప్రొఫైల్ వ్యక్తులు పర్యటనకు వచ్చినప్పడు అన్ని సున్నిత ప్రాంతాలపై నిఘా పకడ్బందీగా ఉండాలి. అలా జరగలేదు. ముప్పు అవకాశాల మదింపు, ముందస్తుగా బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకోవ డంలో మునుపటి క్రియాశీలత్వం కొరవడింది. ప్రాంతాల వారీగా ముమ్మర గస్తీ నిర్వహించే విధానం సడలిపోయింది.
మరీ ముఖ్యంగా 24/7 ఎలక్ట్రానిక్ నిఘా కింద లేని ప్రాంతాల్లో ఈ ఉదాసీనత ఆందోళనకరమైన విషయం. డ్రోన్ సమాచారం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు పర్వత మార్గాల భద్రతకు చాలవు. పర్వత ప్రాంతాల్లో భౌతిక గస్తీకి ప్రత్యామ్నాయం లేదు. డ్రోన్లు స్కాన్ చేస్తాయి, కెమెరాలు రికార్డు చేస్తాయి, సమాచార నిఘా వ్యవ స్థలు హెచ్చరిస్తా్తయి. కాదనలేం. కానీ క్షేత్రస్థా యిలో భౌతిక ఉనికి, అంతర్దృష్టికి ఇవి ప్రత్యా మ్నాయం కావు.
స్థానిక నిఘా వ్యవస్థ
విద్రోహ నిరోధక వ్యవస్థను తక్షణం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దుర్ఘటనను ప్రతిఘ టించడం కాకుండా ముందుగానే దాన్ని అరికట్టే దిశగా మార్పు రావాలి. ఇందులో భాగంగా శాశ్వత గస్తీ యూనిట్లు, రొటేషనల్ నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా, చురుకైన కౌంటర్ ఇంటెలిజన్స్ గ్రిడ్ (సీఐ గ్రిడ్) చాలా ముఖ్యమైంది. ఉరి, పుల్వామా దాడుల అనంతరం చురుగ్గా పనిచేసి ప్రశంసలు పొందిన ఈ గ్రిడ్ ఇప్పుడు బలహీనపడినట్లు ఉంది. దీనిపై ఎలాంటి రాజకీయ సంకోచాలూ లేకుండా కఠినమైన సమీక్ష జరగాలి.
స్థానికుల సాయంతో నిఘా పెట్టే వ్యవస్థ ఎప్పుడో విచ్ఛిన్నమైంది. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుస్తోంది. హైబ్రిడ్ టెర్రరిస్టులు సంప్రదాయ ఉగ్రవాద నెట్ వర్క్‌ల నుంచి వచ్చిన వారు కారు. వారి నియామకాలు స్వల్పకాలానికి పరిమితమై ఉంటాయి. తరచూ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంటాయి. వారికి వన్ టైమ్ ప్రాతిపదికన విద్రోహ లక్ష్యాలు అప్పగిస్తారు. ఉగ్రవాద స్థావ రాల్లో తల దాచుకోరు. కోడెడ్ ఫోన్ కాల్స్ చేయరు.
కాబట్టి, లోతైన రియల్ టైమ్ నిఘా అవసరమ వుతుంది. మొహల్లాలు, స్కూళ్లు, మదర్సాలు, మార్కెట్ల నుంచి గుట్టుగా సమాచారం రాబట్టాలి. టెక్నా లజీకి దాని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అయితే, కశ్మీర్ పరోక్ష యుద్ధం (షాడో వార్)లో స్థానికుల నుంచి సమాచారం రాబట్టే నిఘా వ్యవస్థను మరే ఇతర వ్యవస్థా భర్తీ చేయలేదు. స్థానిక ఇన్‌ఫార్మర్ల విశ్వాసం చూరగొనడం, లోప్రొఫైల్ క్షేత్రస్థాయి ఏజెంట్లను ఉపయోగించడం తప్పనిసరి. ఉగ్రవాద వ్యూహాల ముందస్తు గుర్తింపునకు ఈ వ్యూహం వెన్నెముక లాంటిది.
నిర్మొహమాటంగా మాట్లాడుకుందాం. ‘అమన్ కీ ఆశా’ (శాంతి కోసం ఆశ) నినాదం ప్రస్తుతానికి అటకెక్కుతుంది. కశ్మీర్ లోయలో ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం అద్భుతంగా పుంజుకుంది. దేశీయ, విదేశీయ పర్యాటకులు కలిసి 2023లో రెండు కోట్లు దాటారు. కశ్మీర్ ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. ఇప్పుడవి చెదిరిపోయాయి. పర్యాటకులు బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు.
హోటళ్లు, హౌస్ బోట్లలో ఖాళీ రూములు దర్శనమిస్తున్నాయి. కశ్మీరీల ఆర్థిక నష్టం భారీగా ఉంటుంది. అయితే, కౌంటర్ – టెర్రర్ కార్యకలాపాలతో సాధారణ ప్రజల్ని దూరం చేసుకోకూడదు. ఉగ్రవాదంపై పోరాటానికీ, వర్గాలను తూలనాడటానికీ మధ్య ఉండే రేఖను దాటకూడదు. కశ్మీరీలు విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం, రాజకీయ అనిశ్చితి... ఈ రెండింటి బాధితులు.
కశ్మీర్‌లో నాయకత్వం అలంకారప్రాయంగా కాకుండా క్రియాశీలం కావాలి. జాతీయ భద్రత బాధ్య తను ఎవరికైతే అప్పగించారో వారు ఫలితాలు చూపెట్టాలి. లేదా వైదొలిగి సమర్థులకు అవకాశం ఇవ్వాలి. ఈ వేసవి తీవ్రత కశ్మీర్‌లో ఎక్కువగానే ఉంటుంది. కర్ఫ్యూలు, సోదాలు, ఉద్రిక్తతలు పునరావృతం కావచ్చు. స్థానికుల పట్టువిడుపులకు, భారత ప్రభుత్వ రాజనీతికి ఇది పరీక్ష లాంటిది.
ఒకవంక దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడుతూ, మరోవంక దేశం లోపల భారతీయత భావనను పరిరక్షించు కోవాలి. ఇండియా అంతర్గత శాంతిని ఎవరూ తుపాకీతో శాసించలేరని రుజువు చేసుకోవడానికి మనం సుదీర్ఘ ప్రయాణమే చేయాలి.
మనోజ్ కె. చన్నన్
వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్)