
భారత స్వాతంత్య్రోద్యమ తొలితరం మేరునగధీరుల్లో మహదేవ గోవింద రనడే ఒకరు. 1943లో ఆయన శత జయంతి కార్యక్రమంలో డా‘‘ బీఆర్‌అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘రనడే కేవలం ఆజానుబాహుడు మాత్రమే కాదు; విశాల భావాలు కలిగిన వారూ, ప్రజల పట్ల సమదృష్టిని కలిగిన వారు కూడా’ అని ప్రశంసించారు. ఓరిమి కలిగిన ఆశావాది.
తన జీవిత కాలంలో‘వక్తృత్వోత్తేజక సభ’, ‘పూర్ణ సార్వజనిక సభ’, ‘మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ’, ‘ప్రార్థనా సమాజం’ లాంటి సంస్థలను స్థాపించారు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ‘ఇందు ప్రకాష్’ అనే మరాఠీ–ఆంగ్ల దినపత్రికను నిర్వహించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్‌లో 1842 జనవరి 18న జన్మించారు. కొల్హాపూర్‌లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివారు. తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మారారు. 14 ఏళ్ల వయసులో బాంబేలోని ఎల్ఫిన్‌స్టన్ కళాశాలలో చేరారు. బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఆయనా ఒకరు. 1867లో ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చు కున్నారు. 1871లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డు పడుతూ వచ్చారు.
ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితులయ్యారు.అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మత పరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణ. గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు రాజకీయ గురువుగా పేరు పొందారు. తుదకు 1901 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. నేటి స్వేచ్ఛా భారతానికి దారులు వేసిన ఆయన చిరస్మరణీయులు.
– యం. రాం ప్రదీప్; జేవీవీ సభ్యులు, తిరువూరు
(రేపు మహాదేవ గోవింద రనడే జయంతి)