భారత్ పొరుగు దేశమైన శ్రీలంకలో మార్క్సిస్టు నాయకులైన అనూర కుమార దిస్సనాయకే దేశ అధ్యక్షుడుగానూ, హరిణి అమరసూర్య ప్రధానమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆసియా రాజకీయాల్లో పెను ఆసక్తికర, ఆహ్వానించదగిన పరిణామాలకు ఆస్కారం ఏర్పడింది. భారత దేశంలోని ఎన్డీయే– ఆరెస్సెస్ వినాశకర కూటమి ప్రభుత్వం శ్రీలంకలోని మితవాద పక్ష పాలకులతో ‘జోడీ’ కట్టి చిరకాలంగా వర్ధిల్లుతున్న భారత్–శ్రీలంక స్నేహ పూర్వక సంబంధాలలో ‘చిచ్చు’ పెట్టింది. ఈ విషమ పరిణామానికి సకాలంలో విరుగుడుగా వచ్చిందే సింహళంలో వామపక్ష పరిపాలన.
శ్రీలంక సమగ్రాభివృద్ధిని కాంక్షించి, పాక్షిక ధోరణుల్లో గాక శ్రీలంక ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని చేపట్టారు మార్క్సిస్టు నాయకులు. అలాంటి పరిణామాన్నే భారతదేశంలోనూ ఆవిష్కరించగల అవకాశం ఉన్నా... చీలికలు పీలికలుగా ఉన్న వామపక్షాలు ఒకే తాటిపైకి రాలేకపోతున్నాయి. నాయకులు తమ పదవులను త్యజించి విస్తృత ప్రాతిపదికన ఒకే ఒక పార్టీగా ఆవిర్భవించడానికి కృషి చేయడంలేదు. ఎన్టీయే కూటమి దుష్ట ఇజ్రాయెల్‌తో కలిసి దేశంలోని ప్రగతివాద శక్తులపై నిఘాపెట్టి నానా ఇబ్బంది పెట్టిన చరిత్ర తెలియంది కాదు. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే దేశంలోని వామ పక్షాలన్నీ ‘చిల్లర తగాదాలు’ మానుకుని ఐక్య వామపక్ష ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. ఇందుకు శ్రీలంక చూపిన ‘ఐక్య ఉద్యమ స్ఫూర్తి’ని భారత వామపక్షాలన్నీ తక్షణం పొందాల్సిన అవసరం ఉంది.
ఇదే సందర్భంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశంలో ఆచరణలో నిజమైన ఫెడరల్ వ్యవస్థను పాదుకొల్పడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సమతులమైన అధికారాల పంపిణీ నొక్కి వక్కాణించారు. ఫెడరల్ వ్యవస్థ సూత్రాల ప్రకారం, కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలనుంచి వసూలు చేస్తున్న సెస్‌లు, ఇతర పన్నులను అదే దామాషా ప్రకారం రాష్ట్రాలకు పంచి తీరాల్సిందేనని భట్టి కోరారు. దీన్నిబట్టి చూస్తే, ఇరుగు–పొరుగైన శ్రీలంకలో అంతటి భారీ స్థాయిలో వామపక్ష నేతల ఆధ్వ ర్యంలో క్రమానుగతంగా సాగక తప్పని పరిస్థితులు ఎందుకు వచ్చాయో భారత వామపక్షాల నేతలు కేవలం గుర్తించడమేగాదు, ఆచరణలో దేశంలో ఐక్య ఉద్యమ నిర్మాణానికి పునాదుల్ని పటిష్టం చేసుకొనక తప్పదు. ఇటాలియన్ మాఫియా నుంచి, ఇజ్రాయెల్ గూఢచారుల నుంచి భారతదేశ తక్షణ రక్షణకు దేశంలోని వామపక్షాలన్నీ సిద్ధం కావాలి. నిరుపేదలైన షెడ్యూల్డ్ తరగతులకు చెందిన అట్టడుగు వర్గాల ప్రజలపైనే 13 రాష్ట్రాలలో దారుణమైన అత్యాచారాలు నమోదయ్యా యని తాజా నివేదికలు సాధికారికంగా ప్రకటించాయి. వీటన్నింటికి ముగింపు ఎప్పుడు? ఫెడరల్ వ్యవస్థ పునరుద్ధరణ ద్వారానేనని ఆ నివేదికలు తెలియజేస్తున్నాయి.
చదవండి: ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ఎన్డీయే – ఆరెస్సెస్ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ దశలో, ముఖ్యంగా చైతన్యశీలి అయిన ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి 2025 నాటికి గానీ పదవీ విరమణ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆ లోగా ‘ఒక దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని’ అన్న నినాదంతో ప్రస్తుత కేంద్ర పాలకులు ఏ అఘాయిత్యం చేసే అవకాశం లేదు. ఈలోపు దేశీయ వామపక్షాలు, సంబంధిత వర్గాలన్నీ ఒక్క తాటిపై కదిలి రాగల కార్యాచరణ వ్యూహానికి శ్రీకారం చుట్టాలి.
శ్రీలంకలో కమ్యూనిస్టు – మార్క్సిస్టుల అను భవం సుదీర్ఘ కాలంలో నేటి అమూల్యమైన దీర్ఘకాలిక ఫలితాన్ని శ్రీలంక ప్రజలకు ప్రసాదించగల్గింది. లంక పరిణామం ఆసియాలోని చుట్టు పట్ల దేశాల ప్రజాబాహుళ్యానికి సహితం ఆదర్శంగా పరిణమించింది. భారత వామపక్షాలు ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని ఏకం కావాలి. శ్రీలంక వామపక్షాలు సాధించి ఆదర్శనీయమైన విజయం నుంచి భారత ప్రజల భవిష్యత్తుకు అనువైన ఉమ్మడి వ్యూహ రచనకు నడుం బిగించాలి. ఇందుకు మొదటి షరతుగా నాయకత్వం రూపకల్పనకు అవసరమైన వ్యూహాన్ని సమష్టిగా రూపొందించుకోవాలి. ఇది తప్ప మరో మార్గం లేదు. ఈ సందర్భంగా శ్రీలంకలో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన గోపాలకృష్ణ గాంధీ శ్రీలంక పరిణామాల్ని సమీక్షిస్తూ... విప్లవాత్మక భావాలు మార్చుకోకుండానే ప్రజాస్వామిక ధోరణులు కూడా బలపడటానికి అనువుగా రాజకీయ పక్షాల సిద్ధాంత ధోరణులు కూడా ఉండాలనీ, ఈ ధోరణుల్ని శ్రీలంక వామపక్షాలు పెంచుకుంటూ మార్పునకు అనుగుణమైన వ్యూహరచనను ఆశ్రయించాయనీ అన్నారు. భారత్–శ్రీలంక సంబంధాలలో కూడా పెను మార్పులకు అవకాశం ఉందని గోఖలే ఆశాభావం వెలిబుచ్చారు.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సందకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment