అభిప్రాయం
సరిగ్గా నాలుగు నెలల కిందట బంగ్లాదేశ్ ప్రధాని నివాసంలో కనిపించిన దృశ్యాలే ఇవాళ సిరియా అధ్యక్ష భవనంలో కనిపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి గురై షేక్ హసీనా దేశాన్ని వీడిన వెంటనే ఆమె ప్రధానమంత్రి అధికారిక నివాసంలో తిరుగు బాటుదారులు దాడిచేసి ఇంటిని లూటి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇదే సీన్ సిరియా అధ్యక్ష భవనంలో రిపీట్ అయ్యింది. ఆ దేశ నియంత బషీర్ అల్ అసద్ తిరుగుబాటుదారుల దాడికి దేశాన్ని వీడారు. ఆ వెంటనే అధ్యక్ష భవనంలోకి తిరుగుబాటుదారులు జొర బడి కనిపించిన వస్తువులను ఎత్తుకెళ్లటం చూస్తున్నాం. సిరియా అధ్యక్షుడిగా రెండున్నర దశాబ్దాల పాటు ఆ దేశాన్ని ఏలిన బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారి పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
సిరియా దాదాపు 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతం అవుతూనే ఉంది. దీనిలో ‘తిలాపాపం తలా పిడికిడు’ అన్నట్లు రష్యా, అమెరికా వంటి దేశాల పాత్రను కూడా మరిచిపోకూడదు. అసద్ తండ్రి హఫీజ్ 1970లో తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నారు. ఆయన మరణానంతరం అసద్ అధికారంలోకి వచ్చారు. అంటే ఏకంగా 54 ఏళ్ళుగా అసద్ కుటుంబ నియంతృత్వ పాలనలోనే సిరియా మగ్గి పోయింది. ఉగ్రవాదాన్ని, అంతర్యుద్ధాన్ని కట్టడి చేయ లేకపోవటం ప్రజాస్వామిక విధానాలను దరిదాపుల్లోకి రానీయకపోయిన ఫలితాన్ని అసద్ ఇవాళ చవిచూస్తున్నారు. దేశాన్ని వదిలి రష్యా నీడన ఆశ్రయం పొందుతున్నారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన హయాత్ తహరీర్ ఆల్ షామ్ (హెచ్‌టీఎస్) సంస్థను ఐక్యరాజ్య సమితి గతంలోనే ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న అబూ మహమ్మద్ అల్–జులానీ ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది. అంటే సిరియా దేశంలో నియంతృత్వం అంతరించే సూచనలు కనుచూపు మేరలో కనిపించకపోగా... ఆ దేశ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సిరియా, బంగ్లాదేశ్ పరిస్థితులను ఒకే గాటన కట్టలేకపోవచ్చు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు రేగి అవి హింసాత్మంగా మారటంతో పరిస్థితి చేయి దాటిపోయింది బంగ్లాదేశ్‌లో. హసీనా ప్రభుత్వం కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసు కున్నా... అప్పటికే ఆమె నిరంకుశ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత ఒక్కసారిగా ఎగిసిపడింది. ఆమె దేశాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితిని తెచ్చింది. ఈ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ మత ఛాందస దిశగా అడుగులు వేయటం ఆందోళనకరమైన అంశం. నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడి హిందూ మైనార్టీలపై దాడులు, చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించాలన్న డిమాండ్లు వీటికి సంకేతాలు.
కాస్త వెనక్కి వెళితే...
రెండేళ్లు వెనక్కి వెళితే 2022 జూలైలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సా కూడా ఇదే విధంగా పెట్టేబేడా సర్దుకుని ఉన్నపళంగా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తటంతో తిరుగుబాటుదారులు అధ్యక్ష భవనంపై దాడి చేశారు. అదే సమయంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసానికి కూడా నిప్పు పెట్టారు. ప్రజాగ్రహానికి తలొంచి రణిల్ సైతం ఆ రోజు రాజీనామా చేయక తప్పలేదు. ఇక సిరియా లాంటి తిరుగుబాటును 2021 ఆగష్టులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ చవిచూశారు. దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్యుద్ధాలకు కేంద్రంగా మారిన అఫ్గానిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ నియంతలా పాలన చేశారు. చివరకు తాలిబాన్ల దాడిని ఎదుర్కోలేక దేశం విడిచి పారిపోయారు. ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇస్లాం చట్టాల పేరుతో ఏ విధంగా మానవ హక్కులను కాలరాస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తూనే ఉంది.
చదవండి: ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?
ఈ నాలుగు దేశాల్లో సంక్షోభాలకు కారణాలు వేర్వేరు కావచ్చు, తీవ్రతల్లో తేడాలు ఉండొచ్చు. కాని ఫలితం మాత్రం ఒకటే. అంతే కాదు, పర్యవసానాల్లోనూ సారూప్యత కనిపిస్తోంది. శ్రీలంక మినహాయిస్తే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, సిరియాల్లో మత ఛాందసవాదమే రాజ్యమేలేటట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆ యా దేశాల ప్రజలకే కాదు ప్రపంచానికి సైతం ప్రమాదకరం.
- రెహానా బేగం
రాష్ట్ర సమాచార కమిషనర్, ఏపీ
Comments
Please login to add a commentAdd a comment