ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా? | Today is Indian English Day | Sakshi
Sakshi News home page

ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?

Published Sat, Oct 5 2024 4:23 AM | Last Updated on Sat, Oct 5 2024 1:59 PM

Today is Indian English Day

ప్రపంచమంతా ఇంగ్లిష్‌ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్‌ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. 

ఇంగ్లిష్‌ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్‌ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.

యావత్‌ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్‌ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్‌ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్‌ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. 

సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్‌ రంగ ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్‌ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్‌ షా, నితీష్‌ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్‌ కుమార్‌ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. 

ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్‌ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్‌’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.

దేశంలో ఇంగ్లిష్‌ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్‌ 5న భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.

ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్‌ మాధ్య మంలో చదివిస్తున్నారు.

ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయి
కమలా హ్యారిస్‌ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్‌ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్‌ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? 

తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ ఇంగ్లిష్‌ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్‌ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? 

పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్‌ తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్‌ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?

యూరప్‌ కూడా ఆంగ్లం దిశగా...
యూరోపియన్‌ యూనియన్‌ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్‌ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్‌ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. 

ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్‌ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్‌ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.

భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.
- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త  (నేడు ఇండియన్‌ ఇంగ్లిష్‌ డే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement