సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న విలువైన తాగునీటి వృథాకు కారణమైన పైప్‌లైన్ లీకేజీలకు చరమగీతం పాడాలని జలమండలి నిర్ణయించింది. దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పైపులైన్ల నాణ్యత, మన్నికను త్వరలో పరిశీలించనున్నారు. అమెరికా, సింగపూర్, ఇజ్రాయిల్ తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ‘స్మార్ట్‌బాల్’ టెక్నాలజీ ఆధారంగా పురాతన తాగునీటి పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, వాటి సామర్థ్యాన్ని నిర్ధారించాలని నిర్ణయించింది. ప్రధానంగా ఎనిమిదవ దశకంలో ఏర్పాటుచేసిన సింగూరు, మంజీరా పైపులైన్లతోపాటు 17 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కృష్ణా మొదటిదశ పైపులైన్లను ప్రయోగాత్మకంగా ఈ సాంకేతికత ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న విలువైన తాగునీరు పైపులైన్ల లీకేజీలతో వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనుండడం విశేషం.
తాగునీటి వృథా..వ్యథ ఇదీ..
మహానగరానికి వందలకిలోమీటర్ల దూరం నుంచి తరలిస్తోన్న సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి జలాల్లో సుమారు 40 శాతం విలువైన తాగునీరు లీకేజీలు, చౌర్యం కారణంగా వృథా అవుతోంది. నిత్యం జలమండలి సరఫరా చేస్తున్న 440 మిలియన్ గ్యాలన్లలో 40 శాతం మేర సరఫరా నష్టాలున్నాయి. అంటే సుమారు 176 మిలియన్ గ్యాలన్ల జలాలు వృథాఅవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నీటిని తరలించే పురాతన తాగునీటి పైపులైన్లే. వీటిలో ఆర్‌సీసీ(రీ ఇన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్)తో తయారైనవే అధికంగా ఉన్నాయి. పైపులైను మార్గంలో వాటి పైనుంచి భారీ వాహనాలు వెళ్లిన ప్రతీసారీ లీకేజీలు ఏర్పడి ఫౌంటెన్లను తలపిస్తున్నాయి. పలుమార్లు ఈ నీరంతా ప్రధాన రహదారులపైకి చేరి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. లీకేజీలకు మరమ్మతులు చేపట్టేందుకు రెండు, మూడు రోజులు పలు ప్రాంతాలకు నీటిసరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి తలెత్తింది. సుమారు 100 కి.మీ మార్గంలో పైపులైన్లకు తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరోవైపు పాతనగరంలో సుమారు 1100 కి.మీ మార్గంలో దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన తాగునీటి పంపిణీ చేసే పైపులైన్లు (చిన్నపరిమాణంలోనివి)ఉన్నాయి. వీటికి కూడా లీకేజీల పరంపర తప్పడంలేదు.
స్మార్ట్ బాల్ సాంకేతికత పనిచేస్తుందిలా...
రాడార్, జీపీఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేసే బంతి ఆకృతిలో ఉన్న పరికరాన్ని పురాతన తాగునీటి పైపులైన్లలోనికి తీగ ద్వారా ప్రవేశపెడతారు. పైపులైన్ లోపలకు వెళ్లిన ఈ పరికరం భూగర్భంలో ఉన్న తాగునీటి పైపులైన్ గోడలను క్షుణ్ణంగా తనిఖీచేస్తుంది. జీపీఆర్‌ఎస్ సాంకేతికత ఆధారంగా ఈ దృశ్యాలను పైన ఉన్న కంప్యూటర్‌కు గ్రాఫ్ రూపంలో చేరవేస్తోంది. ఈ గ్రాఫ్‌ను నిపుణులు పరిశీలించడం ద్వారా పైపులైన్ల లోపల ఉన్న పగుళ్లు, దాని సామర్థ్యం, మన్నిక వంటి అంశాలను నిర్ధారించవచ్చు. అవసరమైన చోట మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పురాతన భారీ ఆర్‌సీసీ పైపులైన్ల స్థానంలో మైల్డ్‌స్టీల్(ఎంఎస్), చిన్న పరిమాణంలో ఉన్న ఆర్‌సీసీ పైపులైన్ల స్థానంలో డక్టైల్ ఐరన్(డీఐ)పైపులైన్లను ఏర్పాటుచేయాలని జలమండలినిర్ణయించింది.
లీకేజీలకు చరమగీతం పాడేందుకే
తాగునీటి పైపులైన్ల లీకేజీలను సమూలంగా నివారించేందుకు ముందుగా పురాతన పైపులైన్ల నాణ్యత,మన్నికను నిర్ధారించాలని నిర్ణయించాము. తద్వారా విలువైన తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కలుషిత జలాల నివారణ,తాగునీటి సరఫరాలో తరచూ తలెత్తే అంతరాయాలను పూర్తిగా నివారించవచ్చు. స్మార్ట్‌బాల్ సాంకేతికత వినియోగంతో సత్ఫలితాలుంటాయని భావిస్తున్నాము.
– ఎం.దానకిశోర్,జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment