Water Problems
-
హైదరాబాద్‌లోని ఇందిరా నెహ్రూ నగర్లో నీటి సమస్య
-
నేడు కేజ్రీవాల్ విడుదల.. నీటి సంక్షోభంపై ఆప్ నిరసన
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. గురువారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు అయింది. అయితే బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి న్యాయ బిందు ఆదేశాలను జారీ చేశారు.దర్యాప్తును అడ్డుకోవడానికి, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని ఆదేవించారు. అంతేగాక అవసరం ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని పేర్కొన్నారు. అయితే48 గంటల పాటు బెయిల్ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.ఎట్టకేలకు బెయిల్ లభించడంతో కేజ్రీవాల్ నేడు(శుక్రవారం) తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. సీఎం విడుదల నేపథ్యంలో ఆప్ నేతలు నేడు ఆయన్ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో మంత్రి అతిషి, భార్య సునీతా, ఇతర ఆప్ నేతలు తీహార్ జైలుకు వెళ్లనున్నారు.మరోవైపు దేశ రాజధానిలో నెలకొన్ని నీటి సంక్షోభంపై అధికార ఆప్ ప్రభుత్వం ఆందోళనలకు సిద్ధమవుతోంది. నేటి సాయంత్రం కేజ్రీవాల్ విడుదలకు ముందేనీటి కొరతపై నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ ఆందోళనల్లో మంత్రి అతిషి, కేజ్రీవాల్ సతీమణి సునీతా రాజ్ ఘాట్‌ను సందర్శించనున్నారు, అక్కడ నిరవధిక నిరాహారదీక్ష చేశారు. కాగా దేశ రాజధానికి నీటిని రాకుండా పొరుగున ఉన్న హర్యానా అడ్డుకుంటోందని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.హర్యానా యమునా నదికి నీటిని విడుదల చేయనంత వరకు ఢిల్లీలో నీటి కొరత కొనసాగుతుందని అతిషి పేర్కొన్నారు. మునక్ కెనాల్‌కు చాలా తక్కువ నీరు వస్తోందని, వజీరాబాద్ బ్యారేజీకి నీరు రావడం లేదని అన్నారు. యమునా నుంచి నీరు నీటి శుద్ధికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ ప్రజలకు సరాఫరా అవుతోందన్నారు. అయితే యమునాలో నీటి శాతం తక్కువ ఉందని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ తాను హర్యానా ప్రభుత్వం ముందు చేతులు కట్టుకుని నిలబడి అర్థిస్తున్నట్లు చెప్పారు.ఇదిలా ఉండగా నీటి సమస్యతో పాటు హస్తీనాను ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీలో 50 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులు, వడదెబ్బలతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 20 మందికి పైగా ప్రాణాలు విడిచారు. -
నీళ్లు.. నేలమట్టం.. డెడ్ స్టోరేజీలో జలాశయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో 2015–16 తర్వాత ఇంతగా నీటి సమస్య రావడం ఇదే తొలిసారి. ఎగువ రాష్ట్రాల్లోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు 2023–24 నీటి సంవత్సరం (వాటర్ ఇయర్ – జూన్ నుంచి మే వరకు)లో తగిన వరద రాలేదు. నిజానికి మొదట్లో రాష్ట్రంలో సాధారణం కంటే 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా.. అక్టోబర్ తర్వాత వానలు జాడ లేకుండా పోయాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మధ్య సాధారణ వర్షపాతంతో పోల్చితే.. 56.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీనితో జలాశయాల్లోకి కొత్త నీరు చేరక.. ఉన్న నీటి నిల్వలు శరవేగంగా అడుగంటిపోతూ వచ్చాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో 14 ప్రధాన జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీనితో మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా కటకట తప్పని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జూన్‌లో వానలు ఆలస్యంగా మొదలైతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ‘కృష్ణా’లో ఏడేళ్ల తర్వాత మళ్లీ కరువు.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఇన్‌ఫ్లో వచ్చింది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015–16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023–24లో 144.36 టీఎంసీలు మాత్రమే వరద వచ్చింది. ఇక నాగార్జునసాగర్‌కు కూడా సాధారణంగా వెయ్యి నుంచి రెండు వేల టీఎంసీలు రావాల్సి ఉండగా.. 2015–16లో కేవలం 72 టీఎంసీలు.. ఆ తర్వాత మళ్లీ తక్కువగా ఈసారి 147 టీఎంసీలు వరద మాత్రమే వచ్చింది. కనీస నిల్వలూ కరువే! శ్రీశైలం జలాశయంలో సాగునీటి అవసరాలకు ఉండాల్సిన కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 854 అడుగులుకాగా.. ఇప్పటికే 810 అడుగులకు పడిపోయింది. నిల్వలు 34.29 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్ కనీస నిల్వ మట్టం (ఎండీడీఎల్) 510 అడుగులుకాగా.. ప్రస్తుతం 511.5 అడుగుల వద్ద ఉంది. నిల్వలు 134.23 టీఎంసీలకు తగ్గిపోయాయి. అయితే ఇందులో వాడుకోగల నీళ్లు అతి తక్కువే. ఇక జూరాల ప్రాజెక్టు కనీస మట్టం 1033 అడుగులకుగాను.. ఇప్పటికే 1031.27 అడుగులకు పడిపోయింది. గోదావరిలో మూడేళ్ల కనిష్టానికి వరదలు గోదావరి నది బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు ఈ ఏడాది ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గాయి. ఇంత తక్కువ వరదలు రావడం మూడేళ్ల తర్వాత ఈసారే. కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2023–24లో 203.73 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20 తర్వాత ఇంత తక్కువ వరద రావడం ఇదే తొలిసారి. 2022–23లో 593 టీఎంసీలు, 2021–22లో 678 టీఎంసీలు, 2020–21లో 368 టీఎంసీలు వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 2019–20 తర్వాత ఈసారి అతితక్కువగా 396 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. ప్రస్తుతం జలాశయంలో 7.53 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. 20.1 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి 12.26 టీఎంసీల నీళ్లు ఉండటం గమనార్హం. ఇక ఈ ఏడాది మిడ్ మానేరు ప్రాజెక్టుకు 45 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. దిగువ మానేరుకు సైతం 2019–20 తర్వాత అతితక్కువగా ఈ ఏడాది 78 టీఎంసీలే ఇన్‌ఫ్లో నమోదైంది. ఒకేసారి వచ్చి.. లాభం లేక.. గోదావరిపై ప్రధాన ప్రాజెక్టుల్లోకి వందల టీఎంసీల్లో నీరు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నా.. అదంతా భారీ వరద కొనసాగే కొద్దిరోజుల్లోనే కావడం గమనార్హం. అప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో నీరంతా దిగువకు వెళ్లిపోయింది. తర్వాత వానలు లేక ఇన్‌ఫ్లో లేకుండా పోయింది. ప్రాజెక్టులు అడుగంటే పరిస్థితి వచ్చింది. మంజీరా వెలవెల సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్‌లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాలకు మంజీరా నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ తొలివారంలోనే ఇలా ఉంటే.. మే వచ్చే సరికి నీటి సరఫరా పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
నదులున్నా తాగునీరేదీ?
‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజలకు ఇప్పటికీ తాగు, సాగునీరు సరిగా అందడం లేదని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కూడా లేవని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకని నిలదీశారు. ‘దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా? రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? సాగు, తాగునీరు అందించని పాపం ఎవరిది? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా? ఇంటికి పంపాలా?..’ అని ప్రశ్నించారు. సోమవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు నివాళులర్పించారు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు, ఇతర నాయకులకు గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం సభకు హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు.. ‘మహారాష్ట్ర పవిత్రభూమికి నమస్కారం. ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది. ముంబై దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? ఔరంగాబాద్, అకోలాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దేశం పురోగమిస్తోందా? తిరోగమిస్తోందా? ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇది ఇలాగే కొనసాగాలా? చికిత్స చేయాలా? ఇంకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు. ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్నివర్గాలకు సరైన న్యాయం దక్కాల్సిందే. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు. అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది. ఒక కులం, మతం, వర్గం కోసం ఆవిర్భవించలేదు. బీఆర్ఎస్కు ఒక లక్ష్యం ఉంది. మార్పు వచ్చే వరకు పార్టీ పోరాటం ఆగదు. నిజాయితీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నీరు ఇస్తాం. కొత్త పార్టీ అనగానే కొందరు అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అబద్ధమైతే సీఎం పదవిలో నిమిషం కూడా ఉండను ‘వాస్తవానికి దేశంలో సమృద్ధిగా నీటి వనరులున్నాయి. వీటిని సాగు యోగ్యత ఉన్న భూములకు అందించాల్సి ఉంది. 24 గంటలు విద్యుత్ సరఫరా చేయగల వనరులు ఉన్నాయి. దేశం మొత్తం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. నేను చెప్పేది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండను. తెలంగాణలో మంచినీటి సమస్య లేకుండా చేశాం. తెలంగాణ రాకముందు రోజుకు 3 గంటలే కరెంటు ఉండేది. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. భూముల రిజిస్ట్రేషన్లు పావుగంటలో అవుతున్నాయి. రైతు చనిపోతే బీమా కల్పిస్తున్నాం. ఇవి మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదు? తెలంగాణలో సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే ప్రధాని, రాష్ట్రాల సీఎంలకు ఆ పనిచేసే సామర్థ్యాలు లేవు..’ అని కేసీఆర్ విమర్శించారు. కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాలి ‘నా మాటలు ఇక్కడ విని ఇక్కడే మరిచిపోకండి. గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. మీ ఇంటివాళ్లు, స్నేహితులు, వీధిలో ఉన్న వారితో చర్చించండి. దేశంలో ఉండాల్సిన స్థితిలో ఉందా? లేదా? అనే విషయంపై చర్చ పెట్టాలి. లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళుతుంది? దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. శంభాజీనగర్‌లో వారానికోసారి నీళ్లు వస్తాయా? మహారాష్ట్రలో కేబినెట్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఉండరా?..’ అని ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అమలు చేస్తే ఎందుకు వస్తా? ‘కేసీఆర్‌కు మహారాష్ట్రలో ఏం పని అని ఫడ్నవీస్ అంటున్నారు. తెలంగాణ లాంటి మోడల్ మహారాష్ట్రలో తీసుకొస్తే నేనెందుకు వస్తాను? మహారాష్ట్రలో దళితబంధు, రైతుబంధు అమలు చెయ్.. 24 గంటల కరెంటు ఇవ్వు. రైతుబంధు, రైతుబీమా కల్పించండి. ఇవన్నీ అమలు చేస్తే మహారాష్ట్రకు రానే రాను. అంబేడ్కర్ జన్మించిన నేలపై దళితులను పట్టించుకోరా? దళితబంధు లాంటి పథకం మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయరు?..’ అని నిలదీశారు. ప్రజల ఆకాంక్ష గెలవాలి ‘దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ గెలిస్తే.. మరో పార్టీ ఓడిపోవడం పరివర్తన కాదు. ఎవరు గెలిచినా సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. అందువల్ల పార్టీలు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజల ఆకాంక్ష గెలవడం ముఖ్యం. పరివర్తన రానంత కాలం ఈ దేశం ఇలాగే కునారిల్లుతుంది. ఎంత త్వరగా మేల్కొంటే.. అంత తర్వగా బాగుపడతాం..’ అని కేసీఆర్ అన్నారు. నూతనంగా నిర్మించే పార్లమెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అభయ్ పాటిల్ ఇంటికి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ సభకు వెళ్లిన కేసీఆర్, విమానాశ్రయం నుంచి నేరుగా వైజాపూర్ మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. ఆయనకు అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేసీఆర్ వెంట పార్టీ ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు. -
Photo Feature: ‘దాహా’కారాలు
రోజురోజుకూ ఎండ తీవ్రతరం అవుతోంది. గిరిజనులకు తాగునీటి కష్టాలు మిగుల్చుతోంది. నీటికోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చెలిమ నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. బావులు, కాలువలు ఎండిపోవడంతో ఆ నీరే దిక్కయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా గంటలకొద్దీ నిరీక్షించి వచ్చే కొద్దిపాటి నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం టెంబ్రిగూడలో వందమంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా నీటికోసం అల్లాడుతున్నారు. కిలోమీటరు దూరంలోని చెలిమ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ నెత్తిన బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్తున్న గ్రామస్తులు -
యంగెస్ట్ ప్రెసిడెంట్..నీళ్ల కోసం గెలిచింది
‘ఇంటి ముందుకు నీళ్లు రావాలి. అది నా లక్ష్యం’ అంది షారుకళ. 22 ఏళ్ల ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టూడెంట్ తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్‌గా గెలుపొందింది. తెన్‌కాశీ సమీపంలోని తన ఊరి చుట్టుపక్కల ఎప్పుడూ నీళ్ల కోసం అవస్థలే. ఆ నీటి కోసం ఆమె నిలబడింది. ‘రాజకీయాల్లో యువత రావాలి. పనులు ఇంకా బాగా జరుగుతాయి’ అంటోంది. తమిళనాడులో ‘కరువు’ ఆధార్ కార్డ్ తీసుకుంటే దాని మీద అడ్రస్ ‘తెన్‌కాశీ’ అని ఉంటుంది. నీటి కటకట ఎక్కువ ఆ ప్రాంతంలో. హటాత్ వానలు కురిస్తే కొన్ని పల్లెలు దీవులు అవుతాయి. తెన్కాశీకి సమీపంలో ఉండే లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ చిన్నప్పటి నుంచి ఇదంతా చూస్తోంది. వాళ్ల నాన్న రవి సుబ్రహ్మణ్యం రైతు. తల్లి స్కూల్ టీచర్. వాళ్లిద్దరూ ఒక్కోసారి చుట్టుపక్కల ఊళ్లలో నీటి బాధలు చూళ్లేక సొంత డబ్బులతో ట్యాంకర్లు తిప్పారు. కాని అది ఒకరిద్దరి వల్ల జరిగే పని కాదు. ఏం చేయాలి? అవును.. ఏం చేయాలి అనుకుంటుంది షారుకళ. ఎన్నికలొచ్చాయి తమిళనాడులో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 9 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. తెన్‌కాశీ కూడా జిల్లా అయ్యింది. అన్ని చోట్ల స్థానిక ఎన్నికలు ఊపు మీద జరిగాయి. ‘ఇది మంచి చాన్స్ అనుకుంది’ షారుకళ. కోయంబత్తూరులోని హిందూస్తాన్ యూనివర్సిటీలో పి.జి చేస్తున్న షారుకళ సెలవలకు ఇంటికి వచ్చి ఈ తతంగం మొదలైనప్పటి నుంచి నేను కూడా ఎలక్షన్స్‌లో నిలబడతా అని చెప్పసాగింది. సరదాకి చెబుతోంది అనుకున్నారు తల్లిదండ్రులు. నామినేషన్స్ సమయానికి ఆమెకు స్థానిక నాయకుల మద్దతు దొరకడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంగానే సరేనన్నారు. షారుకళ నామినేషన్ వేసింది. ఆమె ఊరు వెంకటపట్టి పంచాయతీ కిందకు వస్తుంది. ఆ పంచాయితీకి గత 15 ఏళ్లుగా గణేశన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. అతడు మరణించడం వల్లా, ఆ స్థానం ఈసారి స్త్రీలకు రిజర్వ్ కావడం వల్ల అతని భార్య ప్రధాన పోటీదారు అయ్యింది. ఆమెతో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా నామినేషన్స్ వేశారు. గట్టి అభ్యర్థి షారుకళ కాని షారుకళ వెరవలేదు. ఢీ అంటే ఢీ అంది. ప్రత్యర్థులు ఊరికే ఉండలేదు. ఆమె మీద బాగా ప్రతికూల ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయి చదువుకోడానికి పట్నం వెళ్లిపోతుంది. లేదంటే రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. అప్పుడేం చేస్తారు’ అని ప్రచారం చేశారు. ‘ఆ అమ్మాయికి పొగరు. వాళ్ల ఇంటికి వెళితే కుక్కను వదులుతుంది’ అనీ ప్రచారం చేశారు. కాని షారుకళ అందరినీ కలిసింది. ‘మన పంచాయితీలోని ప్రతి ఊళ్లో ప్రతి గడప దగ్గరకు నీళ్లు వచ్చేలా చేయడం కోసం ఎన్నికల్లో నిలబడ్డాను’ అని చెప్పింది. ‘మన ఊళ్లల్లో పిల్లలు బాగా ఆటలాడతారు. వారి కోసం గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. పార్కులు కూడా కావాలి. ఇవన్నీ నేను గెలిస్తే ఏర్పాటు చేస్తాను’ అని షారుకళ చెప్పింది. ‘యువతకు అవకాశం ఇవ్వండి. చేసి చూపిస్తారు’ అని చెప్పింది. మహిళలు చాలామంది షారుకళను అభిమానించారు. ‘మా ఇంటి ఆడపిల్లలా ఉన్నావు. నీకే ఓటేస్తాం’ అన్నారు. గెలుపు వెంకటపట్టి పంచాయతీలో మొత్తం 6,362 ఓట్లు ఉన్నాయి. ప్రత్యర్థి మహిళకు 2,540 ఓట్లు వచ్చాయి. ఆమె మీద 796 ఓట్ల మెజారిటీతో షారుకళ గెలిచింది. మరో ముగ్గురు మహిళలకు డిపాజిట్లు లేవు. గ్రామస్తులు ఆమెకు రంగులు జల్లి దండలు వేసి సత్కరించుకున్నారు. ‘అమ్మా.. మాతో ఉండు. మా సమస్యలు నెరవేర్చు’ అని చెప్పుకున్నారు. ‘ఆ... ఆ అమ్మాయికి ఏం తెలుసు... రేపటి నుంచి వాళ్ల నాన్న ఆట ఆడిస్తారు’ అనే మాటలు షారుకళ చెవిన పడ్డాయి. వెంటనే షారుకళ ‘మన పంచాయతీకి నేను మాత్రమే ప్రెసిడెంట్. మా నాన్నో, లేదా మా ఇంటి మగవాళ్లో నా మీద గాని నా పదవి మీద గాని పెత్తనం చేయరు. నిర్ణయాలు నావే. ప్రజలు నాతోనే మాట్లాడాలి’ అని స్పష్టం చేసింది. ఆ అమ్మాయి స్పష్టత, ఆత్మవిశ్వాసం, సంకల్పం చూస్తుంటే భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లో పెద్ద పేరు అవుతుందని అనిపిస్తోంది. -
తాగునీటి సమస్యకు చెక్ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం
-
ఏపీలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్ల లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆరి్థక సంవత్సరం వార్షిక ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ వార్షిక ప్రణాళికను శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా 47.13 శాతం కుటుంబాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32.47 లక్షల కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జల్‌జీవన్ మిషన్ కింద గత ఏడాదిన్నర కాలంలో 14.34 లక్షల కొళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు, 17,044 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’గా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,217 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. ఏపీకి జాతీయ కమిటీ ప్రశంస ఆంధ్రప్రదేశ్ రూపొందించిన వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని పరిశీలించిన జాతీయ కమిటీ నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు, తెగల వారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు, కరవు ప్రాంతాలు, నీరు అవసరమైన ప్రాంతాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. 2020 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కింద 41,653 పాఠశాలలు, 42,722 అంగన్వాడీ కేంద్రాలు, 11,948 గ్రామ పంచాయతీ కార్యాలయాలు, 14,383 ఆరోగ్య కేంద్రాలకు మంచినీటిని పూర్తిగా పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ కమిటీ అభినందించింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ మిషన్ మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్ 7,131 గ్రామాల్లో ఏర్పాటుచేసిన నీరు, పారిశుధ్య కమిటీలు మంచినీటి పథకాలు ఎక్కువకాలం సమర్థంగా పనిచేసేలా చూసి నీటిసమస్య పరిష్కారానికి దోహదపడే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన, నిర్వహణ, యాజమాన్య పద్ధతుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 54,568 మందికి శిక్షణ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పటిష్టం చేయడం, సరఫరాను మెరుగు పరచడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలకు జల్‌జీవన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం జిల్లా, ఉప జిల్లా స్థాయిలో 408 మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది. ఇంజనీరింగ్ అనుభవం ఉన్న 54,568 మంది సిబ్బంది, వివిధస్థాయిల అధికారులు, గ్రామ కమిటీల సభ్యులు, స్వయంసహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. 18,536 మందికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పంపుల నిర్వహణల్లో శిక్షణ ఇచ్చి జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే నీటి ప్రాజెక్టుల నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో ఐదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వనున్నారు. నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 9 ప్రయోగశాలలుండగా.. సబ్ డివిజన్ స్థాయిలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా పరిశీలన, యాజమాన్యం కోసం సెన్సార్ ఆధారిత పరికరాలను వినియోగించాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సూచించింది. -
కృష్ణవేణితో దుర్భిక్ష ప్రాంతాలు సుభిక్షం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరవు ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన పశ్చిమ మండలాలకు కృష్ణా వరద జలాలను తరలించి.. తాగు, సాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి సిద్ధమైంది. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) నుంచి 8 టీఎంసీలను తరలించి.. కురుబలకోట మండలం ముదివేడులో 1.5, పుంగనూరు మండలం నేతిగుంటపల్లిలో 1, సోమల మండలం ఆవులపల్లిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా నిర్మించే రిజర్వాయర్లలో నిల్వ చేయనుంది. తద్వారా కొత్తగా 70 వేల ఎకరాలు, చెరువుల కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. మిగిలిన 2 టీఎంసీలను పీలేరు, కుప్పం, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని 33 మండలాల ప్రజలకు తాగు నీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,144.50 కోట్లతో గతేడాది సెపె్టంబర్ 2న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.1,554.21 కోట్ల వ్యయంతో (మిగతాది భూ సేకరణకు) 36 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఆమోదం రాగానే టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి.. గడువులోగా పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మూడు రిజర్వాయర్లకు నీటి తరలింపు ఇలా.. – వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలగా పిలుస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. – మిగతా 1550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. – అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. – పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. -
ఇదేం చోద్యం
సాక్షి, సిటీబ్యూరో:ఎండాకాలం.. నీటి సమస్య.. నీటిని వీలైనంత పొదుపుగా వాడాలి అని జలమండలి అధికారులు నిత్యం చెబుతుంటారు. అయితే నగరంలోని మంచినీటి పైప్లైన్లకు చాలా చోట్ల లీకేజీలున్నాయి. దీంతో నీరంతా వృథా అవుతోంది. స్థానికులు అక్కడక్కడా ఇలా స్నానాలు చేస్తుంటారు. మరి నీరు కలుషితమైతే దానిని ఆపేదెలా? జరిగే ప్రమాదాలకు బాధ్యులెవరు? -
ఫలించిన తోపుదుర్తి కృషి
అనంతపురం రూరల్: అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట, విద్యానగర్, ఎంఎన్ఆర్ కాలనీ, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాలకు పీఏబీఆర్ పైపులైన్ ద్వారా నీటిని అందించడానికి గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫలించిన ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి కృషి గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ పైపులైను ద్వారా అక్కంపల్లి, పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని పలు కాలనీలకు పీఏబీఆర్ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు రోజుకు 22 లక్షల లీటర్ల నీరు అందించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తమ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య తీరిందని, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘హరీశ్‌తో మాటల్లేవ్.. అయినా మాట్లాడాను’
సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన ఇంటికే వచ్చి విన్నవించుకునేలా ఏర్పాట్లు చేశానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం దసరా వేడుకలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ నుంచి సంగారెడ్డిలోని తన ఇంటి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 14 ఏళ్లుగా తనకు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మాటలు లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఐఐటీ తీసుకొచ్చానని, తాను పార్టీలకు తల వంచనని, ప్రజలకే తల వంచుతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలా చేస్తే బతికినన్ని రోజులు కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫోటోలకు మొక్కితే లాభం లేదనీ, వారు బ్రతికుండగానే సేవ చేయాలని హితవు పలికారు. తన తల్లి ఎంతో కష్టపడి తనను జీవితంలో ఇంతవాణ్ని చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా తన సతీమణి నిర్మల బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. తనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవనీ, కోట్లాది రూపాయల అప్పు ఉందనీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ పాపాలు.. తాగునీటికి శాపాలు
సాక్షి, అనుమసముద్రంపేట (నెల్లూరు): గత టీడీపీ ప్రభుత్వ పాలనలో తాగునీటి ఎద్దడి నెలకొన్న సమయంలో పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామాలలో తాగునీటి సమస్య జఠిలమైంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, అధికారులు తాగునీటి కోసం ట్యాంకులు కడుతున్నట్లు గ్రామాలలో హడావుడి చేశారు. కొద్దిగా పనులు ప్రారంభించిన అనంతరం వాటిని వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాధార పరిస్థితులు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటడంతో పాటు ఎక్కడా తాగేందుకు మంచినీరు దొరకడం లేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని పడకండ్ల, యర్రబల్లి, చేజర్ల మండలంలోని కొల్లపనాయుడుపల్లి, ఏఎస్‌పేట మండలంలోని పందిపాడు, జమ్మవరం, సీబీవరం, కాకర్లపాడు ప్రాంతాలలో తాగునీటి కోసం అలమటిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో ఎంజీఆర్ హెల్ప్‌లైన్ సమాచారం అందుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. కానీ ఏఎస్‌పేట మండలం జమ్మవరం పంచాయతీ కాకర్లపాడు గ్రామంలో తాగునీరు అందక నక్కలవాగులో చలమలు తీసి ఆ నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నారు. ఇదే గ్రామంలో నక్కలవాగు దాదాపు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మహిళలు సైతం అక్కడకు వెళ్లి నీరు తెచ్చుకునేవారు. ప్రస్తుతం అక్కడ కూడా నీరు లేకపోవడంతో గ్రామంలోని బోర్ల వద్ద ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుని తాగుతుండడంతో కొంత మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నట్లు ఇటీవల డాక్టర్లు సైతం నిర్థారించారు. గ్రామంలోని గిరిజన కుటుంబానికి చెందిన యాకసిరి పెంచలయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి మంచంలో ఉన్నారు. కాకర్లపాడు గ్రామంలో దాదాపు 400 కుటుంబాలు ఉండగా దాదాపు 300 కుటుంబాల వారు మినరల్ వాటర్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. క్యాన్ రూ.10 వెచ్చించి ప్రతిరోజు ఇంటికి 3 క్యాన్లను వేసుకుంటున్నారు. ఈ విషయంపై గతంలో ఎన్నోసార్లు అధికారులకు తెలిపినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం విశేషం. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదుకుంటున్న ఎంజీఆర్ హెల్ప్‌లైన్ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఎంజీఆర్ హెల్ప్‌లైన్ ద్వారా అనేక గ్రామాలలో నీటి సమస్యలు తీరుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాకర్లపాడు, జమ్మవరం గ్రామస్తులు తాము సైతం ఎంజీఆర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించడమే కాక ఆ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి శాశ్వత మంచినీటి సౌకర్యం కలిగించేలా కోరనున్నట్లు సమాచారం. మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నాం రోజుకు మూడు నీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నాం. పనికి వెళ్లి వచ్చిన కూలి డబ్బులు నీటికే సరిపోతున్నాయి. బోరింగ్‌లో నీళ్లు తాగితే కాళ్లు, చేతులు నెప్పులు వస్తుండడంతో తాగడం మానేశాం. – యాకసిరి కృష్ణమ్మ, గిరిజన కాలనీ ట్యాంకు కడతామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందు గ్రామంలో వాటర్ ట్యాంకు కడుతున్నామంటూ టీడీపీ వాళ్లు నిర్మాణం చేపట్టారు. అయితే ట్యాంకు పూర్తి కాకపోగా తాగునీటి సమస్య మాత్రం తీరలేదు. నక్కల వాగే దిక్కయింది. చలమలు లోడి తాగునీరు తెచ్చుకుని సేద తీరుతున్నాం. ఇప్పటి ప్రభుత్వమైనా స్పందించి శాశ్వత మంచినీటి పథకానికి దారి చూపాలి – తాళ్లూరు కొండయ్య, గిరిజనకాలనీ -
దాహం.. దాసోహం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వం వాటర్ గ్రిడ్ల పేరుతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయించి, డీపీఆర్‌లు సిద్ధం చేసి, బాహుబలి సెట్టింగ్‌ల మాదిరిగా డిజైన్లు చూపించి ప్రజల్ని ఊహల్లో ఊరేగించింది. పదవిలో ఉన్నంతవరకు వాటర్ గ్రిడ్ల ఊసు లేదు. ఆ ప్రతిపాదనలు గుర్తుకు రాలేదు. కానీ ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడి చేసింది. వాటర్ గ్రిడ్లను మళ్లీ తెరపైకి తెచ్చింది. పోనీ అదేనా పూర్తిగా చేయలేదు. రూ.3600 కోట్లతో తొలుత ప్రతిపాదించిన ప్రాజెక్టును పక్కన పెట్టి రూ.1783 కోట్లతో కొత్త ప్రాజెక్టును రూపకల్పన చేసింది. దాన్ని రూ.1000 కోట్లకు కుదిస్తూ ఫిబ్రవరి 21న అనుమతి ఇచ్చింది. దాంట్లో రూ.510 కోట్లకు టెండర్లు పిలిచి, కాంట్రాక్ట్ ఖరారు చేసింది. ఇదంతా చూస్తే టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ప్రతీ ఇంటికి తాగునీరు ఇవ్వాలన్న సంకల్పం లేదని తేటతెల్లమైంది. ఆర్భాటంపై తప్ప ఆచరణలో శ్రద్ధ చూపించలేదు. మొత్తానికి ఐదేళ్లు చేసిన మోసాలను గుర్తు చేసుకున్న ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. మాటిస్తే నిలబెట్టుకుంటారనుకున్న వైఎస్సార్సీపీని గెలిపిం చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఇంకేముంది ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా దానికి మించి చేస్తూ శభాష్ అన్పించుకుంటున్నారు. కిడ్నీ బాధితులున్న ఉద్దానంకు అధికారంలోకి వస్తే శుద్ధ జలాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగునీరే అక్కడ సమస్యని నివేదికలు చెబుతుండటంతో ఉద్దానం సమస్యకు పరిష్కా రం శుద్ధ జలాలు సరఫరాయే మార్గమని భావించా రు. బాధ్యతలు స్వీకరించిన 90రోజుల్లో మాట నిలబెట్టుకున్నారు. ఉద్దానానికి రూ. 600కోట్లతో తాగునీటిని ప్రాజెక్టును ప్రాంభించారు. ఒక్క ఉద్దానమే కాదు జిల్లా అంతటికీ తాగునీటిని అందించాలని, ఇంటింటికి కుళాయి ద్వారా సరఫరా చేయాలన్న ఆలోచనకు వచ్చారు. మనసులో తట్టడమే తరువా యి కార్యరూపంలో పెట్టారు. జిల్లాను యూనిట్‌గా చేసుకుని రూ.3672.50కోట్లతో వాటర్‌గ్రిడ్‌ను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గ డీపీఆర్‌ను త్వరితగతిన తయారు చేయించడమే కాకుం డా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇంకేముంది చిక్కోలు తాగునీటి సమస్య తీరనుంది. -నిబంధనల మేరకు ప్రతి వ్యక్తికి రోజుకు అందించాల్సిన నీరు : 70 లీటర్లు -జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు -రోజుకు 40 లీటర్లు మేర అందించే గ్రామాలు : 1000 -10 లీటర్లలోపు అందించే గ్రామాలు : 400 -నీటి వనరులు లేని గ్రామాలు : 22 గత ప్రభుత్వ ప్రణాళిక.. ప్రతీ వ్యక్తికి రోజుకి 70 లీటర్లు అందిస్తామని చెబు తూ రూ.1783 కోట్లతో 24 మండలాల్లోని 1861 గ్రామాలకు పరిమితం చేస్తూ ప్రతిపాదనలు రూపొం దించారు. దీన్ని రూ.1000 కోట్లకు పరిమితం చేసి పరిపాలన అనుమతి ఇచ్చారు. ఇందులో 510 కోట్లతో పనులకు ఎన్నికలకు రెండు నెలలు ముందు టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. ఈ ప్రణాళికలో నగరం, పట్టణాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఉద్దానంలోని 7 మండలాలకు పూర్తిగా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు మిగతా 17 మండలాల్లోని 11 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనివలన పలు గ్రామాలకు పాక్షికంగా తాగునీరు అందనుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రణాళిక .. జిల్లాలోని 38 మండలాలకు విస్తరించారు. ప్రతీ వ్యక్తి కి రోజుకి 100 లీటర్లు శుద్ధ జలాలు అందించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. 1141 పంచాయతీల పరిధిలో ని 4207 ఆవాసాల్లో 5.66 లక్షల కుటుంబాలకు శుద్ధ జలాలను అందించేందుకు నిర్ణయించారు. నగర, పట్టణ, మండల, గ్రామాలకు శుద్ధ జలాలు అందించాలని కార్యాచరణ రూపొందించారు. యుద్ధ ప్రాతి పదికన డీపీఆర్ తయారు చేయించారు. రూ. 3672.50 కోట్లతో రూపకల్పన చేసిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో తొలి విడతలోనే ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. వాటర్ గ్రిడ్‌లో భాగంగా చేపట్టనున్న చర్యలు.. జిల్లాలో హిరమండలం, పారాపురం, సింగిడి, ఆఫ్‌షోర్, మడ్డువలస జలాశయాలను తాగునీటి వనరులుగా అభివృద్ధి చేయనున్నారు. తోటపల్లి జలాయశం ప్రాజెక్టు నీటిని కూడా వినియోగిస్తారు. వంశధార, నాగావళి ,మహేంద్రతనయ నదుల్లో అవసరమైన నీటి బావుల నిర్మాణాలు చేపడుతారు. తాగునీటి వనరులు దూరంగా ఉన్న ప్రాంతాల్లో చెరువులను జలాశయాలుగా అభివృద్ధి చేయనున్నారు. నగరం, పట్టణం, గ్రామాల్లో అమలవుతున్న రక్షిత మంచినీటి పథకాను అనుసంధానం చేస్తారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితమవడంతో భూ ఉపరిత జలాలనే తీసుకోనున్నారు. నేరుగా ఉపరితల జలాలు అందుబాటులోకి తేవడం( ఇన్ఫిల్టరేషన వెల్స్ నిర్మించి అందుబాటులోకి తెచ్చుకోవడం)పై దృష్టి సారిస్తారు. దీనివల్ల సహజ సిద్ధంగా శుద్ధి అవుతుంది. అలాగే, కాలువల నుంచి నేరుగా నీటి ట్యాంకుల్లోకి మళ్లిస్తారు. శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేస్తారు. తీరనున్న తాగునీటి కష్టాలు.. జిల్లాలో తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్దానానికే పరిమితం అనుకున్న ప్రాజెక్టును జిల్లా అంతటికీ విస్తరించారు. యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్ తయారు చేయించారు. రూ.3,672.50 కోట్లతో రూపొందించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఇంటింటి కుళాయి ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆమేరకు రాజధానిలో జరిగిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. – టి.శ్రీనివాసరావు, ఎస్ఈ, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం జిల్లాలో ఉన్న నీటి వనరులు సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు : 37 సింగిల్ రక్షిత మంచినీటి పథకాలు : 1090 సౌరశక్తి పథకాలు : 177 కమ్యూనిటీ ట్రీట్మెంట్ ప్లాంట్లు : 6 చేతి పంపులు : 15,624 -
కందకాలతో జలసిరి!
భూగర్భ జాలాలు అడుగంటిన నేపథ్యంలో వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లోని పండ్ల తోటల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోకసాని పద్మారెడ్డి కూడా వారిలో ఒకరు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో పద్మారెడ్డికి 80 ఎకరాల భూమి ఉంది. ఇందులోబత్తాయి తదితర తోటలు ఉన్నాయి. తోటలకు నీటి కొరత తీర్చుకునేందుకు గత కొన్నేళ్లుగా మొత్తం 247 బోర్లు వేసిన రైతు పద్మారెడ్డి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల బోర్లలో నీరు ఆఫ్ ఇంచ్‌కు తగ్గిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి (98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), వాటర్ మేనేజ్మెంట్ ఫోరం నిపుణుడు శంకరప్రసాద్ (90003 00993) సూచన మేరకు జూలై 5–6 తేదీల్లో తమ 80 ఎకరాల్లో, వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, కందకాలు తవ్వించారు. అదృష్టం కొద్దీ కందకాలు తవ్విన కొద్ది రోజుల్లోనే 3 రోజుల పాటు మంచి వర్షాలు కురిశాయి. పొలాల్లో కురిసిన ప్రతి చినుకూ కందకాల ద్వారా అంతకుముందెన్నడూ లేని విధంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జల మట్టం పెరిగింది. గతంలో ఆఫ్ ఇంచ్ పోసే బోర్లు ఇప్పుడు 2.5 ఇంచులు ఫుల్లుగా పోస్తుండడంతో పద్మారెడ్డి పరమానందభరితుడయ్యారు. అనూహ్యంగా ఇంత సులువుగా, ఇంత తక్కువ రోజుల్లో భూగర్భ జల మట్టం పెరగడం తనను ఆశ్చర్యపరచిందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో గుంటిపల్లి దగ్గర ఉన్న మరో 30 ఎకరాల్లో కూడా కందకాలు తీయిస్తున్నామన్నారు. సాగు నీటి భద్రత కోసం కందకాల ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తున్న సాక్షి దినపత్రిక, టీవీ యాజమాన్యాలకు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం నేతలకు పద్మారెడ్డి(99481 11931) కృతజ్ఞతలు తెలిపారు. -
నగరవాసులకు తప్పని నీటి కష్టాలు
-
వర్షమియ్యరా స్వామీ!
తిరుమలలో నీటి సమస్య జటిలమవుతోంది. ప్రస్తుత నీటి నిల్వలు మరో 50 రోజులకు సరిపోతాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నాటికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదం ఉంది. కళ్యాణిడ్యాం, కండలేరు, తెలుగుగంగ కూడా డెడ్ స్టోరేజ్‌కి చేరాయి. తిరుమలకు ప్రత్యామ్నాయంగా నీటిని తరలించే అవకాశం కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీటి వాడకాన్ని పొదుపుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరుణదేవుడిపై గంపెడాశలు పెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు. సాక్షి, తిరుమల: తిరుమలకు నీటినందించే జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. విధిలేని పరిస్థితుల్లో టీటీడీ పొదుపు చర్యలు పాటిస్తోంది. దగ్గర్లో వర్షాలు రాకుంటే బ్రహ్మోత్సవాల నాటికి తీవ్ర ఇబ్బందులు తప్పేటట్లు లేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో 70 వేల మందికి పైగా భక్తులు తరలివస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. దీనికితోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులు, స్థానికులు మరో 20 వేల మంది వరకు తిరుమలలో నివాసం ఉంటున్నా రు. వీరందరికి తాగునీటి సౌకర్యం కల్పిం చేందుకు 1963 నుంచి దశల వారీగా తిరుమలలో గోగర్భం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలను టీటీడీ నిర్మించింది. ఇవేగాక తిరుపతి కళ్యాణి డ్యాం నుంచి, బోర్ల ద్వారా కూడా నీటిని తిరుమలకు టీటీడీ తరలిస్తోంది. గోగర్భం డ్యాంలో 2,683 లక్షల గ్యాలన్లు, పాపవినాశనంలో 5,167 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 670 లక్షల గ్యాలన్లు, కుమారధారలో 3,962 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 1,295 లక్షల గ్యాలన్లు నీటిని నిల్వ చేయవచ్చు. తిరుమలకు సంబంధించి నిత్యం 30 నుంచి 40 లక్షల గ్యాలన్లు వరకు నీటి వాడకం ఉంటుంది. కానీ గత ఏడాది ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. తిరుమలలో సగటు స్థాయిలో కూడా వర్షాలు కురవలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వర్షాలు లేవు. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటి పోగా కూమార, పసుపు ధార జంట ప్రాజెక్టుల్లో దాదాపు 2వేల లక్షల గ్యాలన్లు నీటి నిల్వలు ఉన్నాయి. నీటి ఎద్దడి సమస్య కొత్తది కాదు తిరుమలలో నీటి ఎద్దడి సమస్య ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. 2002 సంవత్సరంలో కూడా తీవ్ర వర్షభావం కారణంగా తిరుమలలోని జలాశయాలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పట్లో ట్యాంకర్ల ద్వారా టీటీడీ తిరుమలకు నీటిని తరలించింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం భక్తుల అవసరాల దృష్ట్యా తిరుమలకు తిరుపతి నుంచి నీటిని తరలించేందుకు పైపులైను నిర్మించింది. కళ్యాణిడ్యాం నుంచి నీటిని భక్తుల అవసరాల కోసం తరలించేందుకు అనుమతించడంతో పాటు బోర్ల ద్వారా 2 లక్షల గ్యాలన్ల నీటిని తరలించింది. కానీ ఈ ఏడాది ఇప్పటికే కళ్యాణిడ్యాంలో కూడా నీరు అడుగంటిపోయింది. కండలేరు నుంచి తెలుగు గంగ నీటిని తిరుమలకు తరలించాలని నిర్ణయించినప్పటికీ కండలేరులో కూడా నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం తిరుమలలోని జలాశయాల్లో ఉన్న నిల్వల మేరకు మరో 50 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు అధికారులు. తిరుమలలో వర్షాలు సా«ధారణంగా ఈశాన్య రుతుపవనాలు కాలంలో కాకుండా నైరుతి రుతు పవనాల సమయంలో కురుస్తాయి. అంటే తిరుమల జలాశయాల్లో నీరు చేరే వర్షాలు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అధికారుల లెక్కల మేరకు ఆగస్టు మాసం మధ్యంతరానికి నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోతాయి. బ్రహ్మోత్సవాల నాటికి పరిస్థితి మరింత తీవ్రం సెప్టెంబర్ చివరలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ ఏడాది తిరుమలలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. నీటి ఎద్దడి తరుముకొస్తుండడంతో తిరుపతి నుంచి నీటి తరలింపునకు సంబంధించి సాధ్యాసాధ్యాలను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగంతో టీటీడీ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. రానున్న నీటి ఎద్దడిని నివారించేందుకు త్వరలోనే జిల్లాస్థాయి అధికారులతో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముంచుకొస్తున్న నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందుగా కళ్యాణిడ్యామ్ వద్ద ఉన్న బోర్ల నుంచి సాధ్యమైనంత నీటిని ప్రతిరోజు తిరుమలకు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. అక్కడ నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరుకోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిచోటా నీరు డెడ్ స్టోరేజ్ లెవల్‌కు చేరుకోవడంతో తిరుమలకు నీటిని తరలించే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ప్రస్తుతానికి ఉన్న నీటి ద్వారా దాదాపు 50రోజులు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అటు తర్వాత మాత్రం ఏడుకొండలవాడే దిక్కు అన్నట్లుగా ఉంది పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతా ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడుకొండలవాడు కనికరించపోతాడా.. వర్షం కురవకపోతుందా.. జలాశయాలు నిండకపోతాయా.. సమస్య తీరకపోతుందా.. అని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మానవ ప్రయత్నం ద్వారా చేయాల్సిందంతా చేసేయడంతో అధికారులు ఇక వరుణదేవుడిపై భారం మోపారు. నీటి పొదుపు చర్యలు తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అవకాశం కూడా లేకపోవడంతో తిరుమలలో టీటీడీ నీటి పొదుపు చర్యలను మొదలుపెట్టింది. ఇప్పటికే మఠాలు, హోటళ్లకు కేవలం రోజుకు 4గంటలకు మాత్రమే నీటిని పంపిణీ చేస్తోంది. కాటేజీల్లో నీటి నియంత్రణ చేస్తోంది. ఇక స్థానికులు, ఉద్యోగులు నివాసం ఉండే ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటిని వదులుతోంది. దీంతో స్థానికులు, ఉద్యోగులు నీటికోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మరో చెన్నైగా బెంగళూరు !
సాక్షి బెంగళూరు : భవిష్యత్‌లో బెంగళూరు నగరం మరో చెన్నైగా మారనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నీటి కటకటతో చెన్నై నగరం తీవ్ర కష్టాలు పడుతోంది. ఇదే తరహాలో బెంగళూరుకు కూడా తాగునీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే తీవ్ర వర్షాభావం వల్ల కావేరి నీరు దాదాపుగా లభ్యత తగ్గిపోతూ వస్తోంది. చాలా అపార్టుమెంట్లకు కావేరి నీరు లభించడం లేదు. నగరవాసులు ప్రస్తుతం కావేరి నీరు కంటే బోరు నీళ్లు, వాటర్ ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధార పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో చెన్నైగా మారడానికి ఎంతో సమయం పట్టదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వేగంగా తగ్గుతున్న భూగర్భజలాలు.. చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే నాలుగు రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో చెన్నై నగరానికి నీటి సరఫరా చేయడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టసాధ్యంగా మారింది. పొరుగింటికి అంటుకున్న మంట పక్కనే ఉన్న మన ఇంటికి చేరడానికి ఎక్కువ సమయం పట్టదన్న రీతిగా బెంగళూరుకు నీటి కష్టాలు త్వరలోనే సంభవించే విధంగా ఉన్నాయి. బెంగళూరులో కూడా ప్రస్తుతం నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు రాత్రిబవళ్లు నీటి గురించి ఆలోచించాలిన పరిస్థితి దాపురించింది. బెంగళూరులో 40కి పైగా బోర్వెల్స్లోని నీరు ఒకే నెలలో అడుగంటాయి. భూగర్భ జలాలు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 600 అడుగుల లోతుకు తవ్వినప్పటికీ చుక్క నీరు పడని పరిస్థితి ఉంది. రెండు మూడు రోజులకొకసారి కావేరి నీరు.. నీటి కొరత కారణంగా నీటిని డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నీటి ట్యాంకర్ కోసం ఆర్డర్ చే స్తే వెంటనే లభించడం లేదు. 20 లీటర్ల ఒక క్యాన్ నీరు రూ. 10 చెల్లిస్తే కానీ దొర కడం లేదు. బెంగళూరులో రెండు, మూ డు రోజులకొకసారి కావేరి నీటిని అ«ధికారులు వదులుతున్నారు. ఆ వచ్చే నీరు కూడా ఒక గంట మాత్రమే వస్తోంది. నగరంలో దాదాపు 70 శాతం అపార్టుమెంట్లకు కావేరి నీరు ఇప్పటికే అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో దా దాపుగా 75 వేల అపార్టుమెంట్లు ఉం డగా.. అందులో 22 వేల అపార్టుమెంట్లకు మాత్రమే కావేరి నది అందుతోంది. మిగిలిన వారు వాటర్ ట్యాంకర్లు, బోరుబావుల మీదే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో శరావతి నది నీటిని కూడా బెంగళూరుకు తరలించాలని రాష్ట్ర ప్రభు త్వం ఆలోచన చేస్తోంది. అయితే శివమొ గ్గ జిల్లా పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మలేనాడు ప్రాంతానికి ప్రాణధారమైన శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే శివమొగ్గ, చిక్కమగళూరు, ఉడుపి వంటి జిల్లాలకు తాగు నీటి ఎద్దడి ఏర్పడుతుంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతాయని ఆశగా ఎదురు చూసిన రాష్ట్ర జనాలకు తీవ్ర నిరాశ ఎదురయింది. దీంతో తీవ్ర వర్షాభావం పరిస్థితుల్లో శరావతి నీటిని బెంగళూరుకు తరలిస్తే తమ పరిస్థితి ఏంటని మలేనాడు ప్రాంతవాసులు హెచ్చరిస్తున్నారు. విపరీతమైన పారిశ్రామీకరణ వల్లే.. మరోవైపు బెంగళూరు నగరం ఎంతో వేగంగా విస్తరిస్తున్న రీత్యా విపరీతమైన పారిశ్రామీకరణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బెంగళూరులో అనేక చెట్లను తొలగించాల్సి వచ్చింది. పలు చెరువులను పూడ్చి అక్కడ ఆకాశహరŠామ్యలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, అభివృద్ధి పేరిట సహజ సంపదనను నాశనం చేస్తూ పోయారు. కెంపేగౌడ నిర్మించిన వందలాది చెరువులు ప్రస్తుతం అంతరించిపోయాయి. దీంతో వర్షాభావం పరిస్థితులు తలెత్తి ప్రస్తుతం నీటికటకటకు దారితీసింది. ప్రస్తుతం నగరానికి నీటిని సరఫరా చేసే కేఆర్ఎస్, హేమావతి, హారంగి, కబిని జలాశయాల్లో నీరు దాదాపుగా అడుగంటే స్థితిలో ఉంది. గత జూన్ నెలలోనూ ఈ జలాశయాల్లోకి నీరు వచ్చి చేరలేదు. మున్ముందు కూడా ఇన్‌ఫ్లో లేకపోతే బెంగళూరుకు నీటి ఇక్కట్లు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు నగర ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బెళ్లందూరు వంటి చెరువుల్లో ఈ ఉష్ణోగ్రత పుణ్యమా అని అప్పుడప్పుడు నిప్పులు కక్కుతున్నాయి. ఆయా చెరువుల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. కొన్ని చెరువుల్లో అయితే నీరే ఉండడం లేదు. ఒకవేళ ఉన్న కాలుష్య నీటి వల్ల ఎవరికీ ప్రయోజనం కాకుండా పోతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బెంగళూరు నగరం నరకకూపంగా మారనుందనడంలో అతిశయోక్తి లేదు. -
నీటి కొరత అన్నదాతలను మరింత కుంగదీస్తోంది
-
ఐటీని వణికిస్తోన్న నీటి సంక్షోభం
సాక్షి, చెన్నై: చెన్నైలో రోజు రోజుకి పెరుగుతున నీటి సంక్షోభం అక్కడి ప్రజలతోపాటు ఐటీ సంస్థలను కూడా బెంబేలెత్తిపోతున్నాయి. నీటి సమస్యను తట్టుకోలేక కోన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. నీటి సమస్య తీవ్రతరం కావడం.. తమ కార్యాలయాల్లో కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులకు ఐటీ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ కంపెనీలే కాదు.. చెన్నైలోని రెస్టారెంట్లు కూడా నీటి సంక్షోభంతో చేతెలెత్తేసే పరిస్థితి నెలకొంది. వినియోగదారులకు తగినంత నీటిని అందుబాటులో ఉంచలేక పలు రెస్టారెంట్లు కేవలం టిఫిన్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. నీరు అందుబాటులో లేకపోవడంతో భోజనం సదుపాయం కల్పించలేకపోతున్నామని చెప్తున్నాయి. అంతేకాకుండా రెస్టారెంట్లు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గించాయి. దీంతో ప్రజలు, టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటి సంక్షోభం మీద నివేదికను కోరినట్లు సమాచారం. నీటి సంక్షోభం వల్ల అనేక సంస్థలు మూసివేయబడ్డాయని, ఐటీ కంపెనీలయితే ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయించుకునే పరిస్థతికి దిగజారాయని, ఇవేవి పట్టించుకోకుండా అవినీతితో బిజీగా ఉన్న మున్సిపల్ మంత్రి వేలుమణి దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి రాజీనామా చేయాలని, లేదంటే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని స్టాలిన్ డిమాండ్ చేశారు. -
చెరువులకు నీరు చేరేలా..
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో చెరువులు నింపడానికి నేరుగా తూములను ఏర్పాటు చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎడమకాల్వ పరిధిలో ఉన్న చెరువులను నింపడానికి ప్రత్యేకంగా తూములు ఏర్పాటు చేయకపోయినా నీరు పుష్కలంగా లభ్యం కావడం వల్ల ఆయకట్టులో చెరువులు నిండేవి. కానీ ఇటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగర్ జలాశయంలోకి నీరు చేరడం లేదు. దాంతో ఎడమకాల్వకు నీటిని విడుదల చేయలేని పరిస్థితి వచ్చినా కనీసం చెరువులు నింపడానికి నీటిని విడుదల చేయాల్సి వస్తోంది. కాగా కాల్వ నుంచి నేరుగా చెరువులకు తూములు లేకపోవడం వల్ల మేజర్ కాల్వలకు నీటిని విడుదల చేస్తే నీరు చెరువుకు చేరకుండా వృథాగా పోతోంది. దీంతో ఎన్ఎస్పీ అధికారులు కాల్వలకు నేరుగా తూములు ఏర్పాటు చేసి ఆయకట్టు పరిధిలోని చెరువులు నింపడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయకట్టులో ఉన్న మొత్తం చెరువులపై ఇటీవల సర్వే పూర్తిచేశారు. సర్వే ఆధారంగా ఎడమకాల్వకు నేరుగా తూములు ఏర్పాటు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆయకట్టులో మొత్తం 417 చెరువులు.. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 173 గొలుసుల పరిధిలో 309 గొలుసుకట్టు చెరువులు, 108 ఒంటరి చెరువులు, మొత్తం 417 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నింటిపై ఎన్ఎస్పీ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా 309 గొలుసుకట్టు చెరువుల్లో 151 చెరువులకు మాత్రమే ప్రస్తుతం తూములు ఉన్నట్లు తేలింది. కాగా 22 చెరువులకు భూసేకరణ చే యాల్సి ఉందని, 20 చెరువులకు కాల్వలకు లేవని, 50 చెరువులు ఎన్ఎస్పీ ఆయకట్టు ప రిధిలో లేవని, 13 చెరువులు ఆక్రమణకు గురైనట్లు తెలింది. కాగా మరో 53 చెరువులకు కొ త్తగా తూములు ఏర్పాటు చేయడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. అదే విధంగా 108 ఒంటరి చెరువుల్లో 52 చెరువులకు కాల్వలతో పాటు పంట పొలాల మీదుగా వెళ్లే నీరు చేరుతుంది. ఒక చెరువుకు భూసేకరణ సమస్య, 16 చెరువులకు కాల్వలు తీసే పరిస్థితి లేదు. ఐదు చె రువులు ఆక్రమణకు గురయ్యాయని, 23 చెరువులు ఆయకట్టు పరిధిలో లేవనితే లింది. కాగా 11 ఒంటరి చెరువులకు తూముల ఏర్పాటుకు కసరత్తు సాగుతుంది. 64 చెరువులకు 45 కొత్త తూములు.. మొత్తం 417 చెరువుల్లో కొన్నింటికి తూములు ఉండడంతో పాటు ఇతర సమస్యల కార ణం ఉండగా ప్రస్తుతం 64 చెరువులకు 45 తూములను ఏర్పాటు చేసి ఈ వేసవిలో సా గర్ ఎడమకాల్వ నుంచి నేరుగా చెరువులకు నీటిని నింపేందుకు చర్యలు చేపడుతున్నారు. 35 గొలుసుల పరిధిలోని 53 గొలుసుకట్టు చెరువులకు, 11 ఒంటరి చెరువులకు తూములు ఏర్పాటు చేయనున్నారు. అందుకు గాను ఇటీవలనే ఎన్ఎస్పీ అధికారులు టెండర్లు సైతం పిలిచారు. కొత్తగా ఏర్పాటు చేసే తూముల్లో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నాలుగు, మిర్యాలగూడ నియోజకవర్గంలో 13, హుజూర్నగర్ నియోజకవర్గంలో 11, కోదాడ నియోజకవర్గంలో 17 తూములున్నాయి. వాటి పరిధిలో 64 చెరువులకు నీటిని అందించనున్నారు. నేరుగా నీరు చేరేలా చర్యలు సాగర్ ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని చెరువుల్లో నేరుగా తూముల ద్వారా నీటిని నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆయకట్టు పరిధిలోని చెరువులను సర్వే నిర్వహించాం. నేరుగా తూములు లేని చెరువులను గుర్తించాం. అందుకు కొత్తగా 64 చెరువులకు 45 తూములు ఏర్పాటు చేసి నీటిని నింపుతాం. అందుకోసం టెండర్లు కూడా పిలిచాం. తూములు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులను నింపే అవకాశం ఉంటుంది. – నాగేశ్వర్రావు, ఈఈ, ఎన్ఎస్పీ మిర్యాలగూడ -
‘డబుల్’ కాలనీల్లో సదుపాయాలు కరువు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం... అవి పూర్తయ్యేలోగా ‘డబుల్’ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, సీసీ టీవీలు, కమ్యూనిటీ హాళ్లు, అంగర్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు తదితర ఏర్పాటు చేయాలని భావించింది. అయితే జీహెచ్ఎంసీకి ఇళ్ల నిర్మాణ ఖర్చులు మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులపై స్పష్టత లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖలఅధికారులతో ఏడాది క్రితం సమావేశం నిర్వహించారు. ఆయా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు వివరాలు అందజేయగా, జీహెచ్ఎంసీ వాటిని క్రోడీకరించి ఆయా పనులకు దాదాపు రూ.616 కోట్లు ఖర్చువుతుందని నిర్ణయించింది. ఈ మేరకు పరిపాలన అనుమతులతో పాటు సంబంధిత శాఖలకు నిధులు చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి ఏడెనిమిది నెలల క్రితమే నివేదిక అందజేసింది. అయితే కారణం ఏదైనప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. నిధులకు సంబంధించి ఆయా శాఖలకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయనిదే తాము పనులు చేపట్టలేమని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలు లేనిదే లబ్ధిదారులకు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం త్వరిత్వగతిన నిర్ణయం తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు... ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఆయా శాఖలు మొత్తం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుతం 10వేల ఇళ్ల నిర్మాణం పూర్తకాగా... మరో 35 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయి. కనీసం ఇళ్లు పూర్తయిన కాలనీల్లోనైనా మౌలిక సదుపాయాలు కల్పించనిదే ప్రభుత్వ ప్రయోజనం నెరవేరదని అధికారులు పేర్కొంటున్నారు. వృథాగా మారిన జేఎన్ఎన్యూఆర్ఎం తదితర ఇళ్ల పరిస్థితిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇవీ ప్రతిపాదనలు... ♦ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 109 ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయా శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ♦ టీఎస్ఏపీడీసీఎల్: విద్యుత్ ఏర్పాట్లకు రూ.235.40 కోట్లు. ♦ జలమండలి: ఓఆర్ఆర్ లోపల తాగునీటి సరఫరాకు రూ.158.65 కోట్లు. ♦ ఆర్డబ్ల్యూఎస్అండ్ఎస్: ఓఆర్ఆర్ వెలుపలి కాలనీలకు తాగునీటి ఏర్పాట్లకు రూ.77.40 కోట్లు. ♦ హెచ్ఎండీఏ: జీహెచ్ఎంసీ వెలుపలి ప్రాంతాల్లోని కాలనీలకు అప్రోచ్ రోడ్లకు రూ.94.30 కోట్లు. ♦ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్: 10 ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు రూ.26.16 కోట్లు. ♦ రాచకొండ పోలీస్ కమిషనరేట్: 7 పోలీస్ అవుట్ పోస్టులు, 36 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.11.26 కోట్లు. ♦ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 32 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.7.34 కోట్లు. ♦ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్: 3 పోలీస్ అవుట్ పోస్టులు, 19 లొకేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రూ.5.50 కోట్లు. ♦ అన్నీ కలిపి మొత్తం వ్యయం: రూ.616.01 కోట్లు. ♦ ఇంకా ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. -
నిమ్స్‌లో నీటి చుక్క కరువాయె!
సాక్షి, సిటీబ్యూరో/సోమాజిగూడ: ప్రతిష్టాత్మాక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లోని రోగులకు నీటి కష్టాలు తప్పడం లేదు. దాహమేస్తే తాగేందుకే కాదు...సర్జరీ తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరులేక పోవడంతో సోమవారం పలు విభాగాల్లో చికిత్సలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎండాకాలంలో నీటి అవసరాలపై అధికారులు ముందే ఓ అంచనాకు రాలేక పోవడం, సంపుల్లోకి చేరుతున్న నీటిని, వాటి నిల్వలను పరిశీలించక పోవడం, సరఫరా అయిన నీటిని కూడా సద్వినియోగం చేసుకోక పోవడమే ప్రస్తుత దుస్థితికి కారణం. నీటికోసం ఆస్పత్రి నెలకు రూ. 50 లక్షల చొప్పున ఏడాదికి రూ.ఆరు కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. కానీ రోగుల నిష్పత్తికి తగినంత నీటిని అందించలేక పోతోంది. ఫలితంగా రోగులే బయటి నుంచి బాటిళ్లను కొనుగో లు చేయాల్సి వస్తుంది. ఇలా ఒక ఐదు లీటర్లకు రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆశతో వచ్చి..నిరాశతో వెనుతిరిగిన రోగులు నిజానికి శని, ఆదివారాల్లో రోగుల రద్దీ తక్కువగా ఉంటుంది. ప్రతి సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. జలమండలి నుంచి వచ్చే నీటి సరఫరా, ట్యాంకుల్లో నిల్వల పరిశీలన, వార్డులకు సరఫరా కోసం ఆస్పత్రిలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నీటిసంపులోని నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించక పోవడం వల్ల ఆదివారం సాయంత్రం నుంచి కుళాయిల్లో నీటిసరఫరా నిలిచిపోయింది. ఈ విషయం తెలియక అప్పటికే సర్జరీలకు ప్లాన్ చేసుకున్న వైద్యులు, చికిత్సల కోసం ఉదయం ఐదు గంటలకే ఆపరేషన్ థియేటర్ల ముందుకు చేరుకున్నారు. తీరా చికిత్స తర్వాత వైద్య సిబ్బంది చేతులకు శుభ్రం చేసుకునేందుకు నీరు లేదని తెలిసి చికిత్సలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూ రో సర్జరీ, కార్డియాలజీ, తదితర విభాగాల్లో చిన్నాపెద్ద అన్ని కలిపి 60 సర్జరీల వరకు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం సగం మంది వైద్యులు వేసవి సెలవుల్లో ఉన్నారు. నీరులేక ఉన్నవాళ్లు కూడా సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఉగ్గబట్టుకోవాల్సిందే ఉస్మానియా, గాంధీ వంటి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే నిమ్స్ కొంత భిన్నమైంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మాత్రమే కాదు దీనికి చైర్మన్‌గా స్వయంగా సీఎం కొనసాగుతుంటారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే..ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం, మెరుగైన వైద్యసేవలు అందుతుండటం, అనేక మంది నిపుణులు అందుబాటులో ఉండటంతో రోగులు ఎక్కువగా ఇక్కడికే వస్తుంటారు. 1500 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్పేషంట్ విభాగానికి రోజుకు సగటున రెండు వేల మందికిపైగా వస్తుంటారు. పదిహేను వందలకుపైగా రోగులు ఇన్‌పేషంట్లు చికిత్సలు పొందతుంటారు. ఒక్కో రోగికి ఒక సహాయ కుడు ఉంటారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు కూడా నీటి సరఫరా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతు న్నాయి. జనరల్ వార్డుల్లోనే కాదు పేయింగ్ రూమ్‌ల్లోనూ ఇదే దుస్థితి. మూత్రశాలలు కంపుకొడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఉగ్గబట్టుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా రోగులు, వైద్యులు రోజంతా నీరు లేక ఇబ్బంది పడటంతో అధికారులు మేల్కొని సాయంత్రానికి సమస్యను పరిష్కరించారు. మంగళవారం నుంచి సమస్య రాకుండా చూస్తామని పేర్కొన్నారు. -
నీళ్లు లేవు, పెళ్లి వాయిదా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భయంకరమైన కరువు పీడిస్తోంది. గతేడాది వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఫలితంగా పలు ప్రాంతాల వాసులు వలస పోతున్నారు. పశువులు, గొర్రెలను సంతలో అమ్ముకుని బెంగళూరు, మైసూరు తదితర నగరాలకు వచ్చి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. వేసవి ప్రారంభమైన నాటి నుంచి రోజురోజుకూ తాగునీటి సమస్య ఎక్కువ కావడంతో జనాలు వలస వెళ్లడం తప్ప ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,122 ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాగా పలు తోటల్లో వ్యవసాయ బోర్లు ఎండిపోయాయి. దీంతో పంటలు కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా గృహప్రవేశాలు, వివాహాలు కూడా వాయిదా దాఖలాలు అక్కడక్కడా చూడవచ్చు. అన్నింటికీ సమస్యే ఏప్రిల్, మే నెలల్లో గ్రామాల్లో జరగాల్సిన జాతరల హడావుడి నీటికొరతతో తగ్గిపోయింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు బం ధువుల ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బళ్లారిలో 10 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. చాలా జిల్లాల్లో బోర్లు ఎండిపోయాయి. కుళాయిల్లో నీళ్లు బంద్ అయ్యా యి. హోటళ్లు, హాస్టళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తే కానీ గొంతు తడవని పరిస్థితి నెలకొంది. ఉత్తర, మధ్య కర్ణాటకలోనే సమస్య అధికంగా ఉంది. అన్ని జిల్లాల్లో దాహాకారాలు ♦ ఆలమట్టి జలాశయం నుంచి విజయపుర జిల్లాకు నీళ్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ట్యాంకర్ నీటిపైనే ఆధారపడ్డారు. ♦ భాగల్కోటె జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమీపంలోని ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ♦ బెళగావి జిల్లా చిక్కోడిలో ఈ ఏడాది మార్చి ఆరంభం నాటి నుంచి నీటి సమస్య ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 1,330 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అయితే నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ♦ దావణగెరె జిల్లాలో 1,000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీళ్లు రావడం లేదు. దీంతో ట్యాంకర్లను అద్దెకు తీసుకుని నీళ్లు తరలిస్తున్నారు. ఈక్రమం లో నెలకు రూ.2.16 కోట్లు బాడుగ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ♦ రాయచూరు జిల్లాలో తుంగ, కృష్ణా నదులు ప్రవహిస్తున్నప్పటికీ నీటి సమస్య వేధిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కేవల నాలుగు గ్రామాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తున్నారు. ♦ తుమకూరు జిల్లాలో నీటి సమస్య నివారణ నిమిత్తం 505 బోరుబావులను ప్రక్షాళన చేశారు. అయితే 192 బావుల్లో నీళ్లు లభించలేదు. మిగతా వాటిలో నీళ్లు రావడంతో మోటార్లు బిగించి నీటిని సరఫరా చేస్తున్నారు. ♦ బళ్లారి జిల్లాలో 10 రోజులకు ఒకసారి నీళ్లు లభిస్తున్నాయి. ఫలితంగా జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నీటి సమస్య వేధిస్తోంది. నీటి కోసం వేసిన బోర్లలో 65 సఫలం కాగా.. 177 విఫలమయ్యాయి. ♦ దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు గత 2016 తరహాలో కరువు ఏర్పడింది. నగదు వెచ్చించినా నీళ్లు దొరకని పరిస్థితి. అంతేకాకుండా ట్యాంకర్‌ను ఉదయం బుక్ చేస్తే సాయంత్రానికి వస్తుంది. మూడు ట్యాంకర్లు ఆర్డర్ చేస్తే ఒక ట్యాంకర్ నీటిని పొందవచ్చు. గత 2016లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ♦ శివమొగ్గ జిల్లాలో గాజనూరు, భద్ర, వరాహి, చక్ర, సావేహక్లు, లింగనమక్కి, తలకళలె ఆనకట్టలు ఉన్నా.. నీటి సమస్య ఎక్కువగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా 216 గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. ♦ ఉత్తర కన్నడ జిల్లాలో మూడు దశాబ్దాల తర్వాత నీటి కొరత అధికమైంది. అంకోలా, కారవార నగరాలకు గంగావళి నది నుంచి నీళ్లు వస్తాయి. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఈ నగరాలకు తొలిసారిగా నీటి సమస్య ఏర్పడింది. ♦ చిత్రదుర్గ జిల్లాలో నీటి కోసం నిత్యం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది. సమస్య మరింత తీవ్రం అవుతోంది తప్ప తగ్గుముఖం పట్టలేదు. ♦ కొప్పళ జిల్లాలో బహద్దూర్ బండి గ్రామంలో నీటి కోసం గొడవలు జరుగుతున్నాయి. నిత్యం జగడం పడితే కానీ నీరు సంపాదించలేని పరిస్థితి. కొప్పళ నగరంలో 10 – 15 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. ♦ మైసూరు జిల్లాలో కావేరి, కబిని నదులు ఉన్నప్పటికీ నీటి సమస్య ఉంది. మైసూరు నగరంలో తాగునీటి సమస్య లేకున్నా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేధిస్తోంది. ♦ పనులు లేక వలసలు వెళ్లడం చూశాం.. కానీ నీళ్లు లేక వలస వెళ్తున్న వారి సంఖ్య రాష్ట్రంలో భారీగా పెరిగిపోతోంది. పలు గ్రామాల్లో సుమారు ఐదు పది కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నదుల పక్కనున్న జిల్లాల్లోనూ కటకట నెలకొంది. -
నీటి కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
రాయదుర్గం: నీటి సమస్య తీర్చాలని కోరుతూ గోపన్‌పల్లి రాజీవ్‌నగర్ మహిళలు బిందెలతో రోడ్డెక్కిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై బిందెలు, బకెట్లు వరుసగా పెట్టి నిరసన తెలుపడంతో ఇరువైపులా గంటన్నరపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలియడంతో చందానగర్ పోలీసులు, గచ్చిబౌలి జలమండలి అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపన్‌పల్లిలోని రాజీవ్‌నగర్‌లో నాలుగు నెలల క్రితం తాగునీటి పైప్లైన్లు వేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో కేవలం 30 ఇళ్లకు మాత్రమే నీటి కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు. మిగతావారు ఇప్పటి వరకు తీసుకోలేదు. కాగా ఇటీవలి వరకు బోరు పని చేసినా అది కూడా వట్టిపోవడంతో నీటి సమస్య ఎదురైంది. దీంతో మహిళలు బిందెలు, బకెట్లు పట్టుకొని ప్రధాన రోడ్డుపైకి వచ్చి రోడ్డుకు అడ్డంగా బిందెలు, బకెట్లు పెట్టి వాహనాలను నిలిపివేశారు. దీంతో గంటన్నరపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులతో చర్చించారు. అనంతరం జలమండలి గచ్చిబౌలి సెక్షన్ మేనేజర్ వెంకట్‌రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో స్థానికులు శాంతించారు. అనంతరం అరగంటపాటు తాటునీటి సరఫరా చేశారు. కాగా బోరునుబాగు చేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.గోపన్పల్లిరాజీవ్నగర్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తామని జలమండలి గచ్చిబౌలి మేనేజర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. గోపన్‌పల్లి ప్రాంతంలో రోజువిడిచి రోజు గంటా ఇరవై నిమిషాలపాటు నీటి సరఫరా చేస్తున్నామన్నారు.