
సాక్షి, మెదక్: జిల్లాలో అధికారికంగా 160 గ్రామాల్లో నీటి సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కానీ వాస్తవంగా 200 పైచిలుకు గ్రామాల్లో నీటి సమస్య ఉంది. దీనికి తోడు భగీరథ పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇటీవల పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు పనుల పురోగతి దృష్ట్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాలని ఆదేశించారు. దీన్ని బట్టి అర్థంచేసుకొవచ్చు పనులు జరుగుతున్న తీరు. ప్రస్తుతం జిల్లాలో నీటి మట్టం 19 మీటర్ల లోతుకు చేరింది. గత ఏడాదికంటే 3 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. పాపన్నపేట మండలంలో 27 గ్రామాలు, హవేళిఘణాపూర్‌లో 23, మెదక్‌లో 37, రామాయంపేటలో 26, నిజాంపేటలో 19, చిన్నశంకరంపేటలో 28 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అయితే చేగుంట, రేగోడ్, అల్లాదుర్గం, రేగోడ్, మనోహరాబాద్, కౌడిపల్లి, చిల్పిచెడ్ మండలాల్లో సైతం నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ మండలాల్లో అన్ని కలిపి వంద గ్రామాల్లో నీటి సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.
పాపన్నపేట కేజీబీవీలో ఉన్న బోరుబావి ఎండిపోవడంతో విద్యార్థులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోరోజు విద్యార్థినులు స్నానం కూడా చేయలేని పరిస్థితి. నర్సాపూర్ ఎమ్మెల్యే సొంత గ్రామం కౌడిపల్లిలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మొక్కుబడిగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారే తప్ప సరిపడా మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికే హవేలిఘణాపూర్ మండలంలోని పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండాలో మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు రెండుసార్లు మెదక్ – బోధన్ ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు.
సమస్య తీవ్రంగా ఉంది..
చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయితండా, మిర్జాపల్లి, శేరిపల్లి, గవ్వలపల్లి, సంకాపూర్, ఖాజాపూర్ గిరిజన తండాలు. హవేళిఘణాపూర్ మండలంలో పోచమ్మరాల్, పోచమ్మరాల్ తండా, బూర్గుపల్లి, హవేళిఘణాపూర్ తండా, గంగాపూర్, సర్థన. చేగుంట మండలంలో కంసాన్‌పల్లి, చిన్నశివనూరు. రేగోడ్ మండలంలో పెద్దతండా, పాపన్నపేట మండలంలో నర్సింగరావుపల్లి, లింగాయపల్లి, సోమ్లా, డాక్యా, రజ్యా, దూమ్లా తండా మెదక్ మండల పరిధిలోని శివాయిపల్లి తండా, మల్కాపూర్, మల్కాపూర్ తండా, పాతూర్, రాయిన్‌పల్లి, కోంటూరు, వెంకటాపూర్, రాయిన్‌పల్లి, మక్తాభూపతిపూర్ , నర్సాపూర్ మండలంలో కౌడిపల్లి, కూకుట్లపల్లి కాగా బ్రాహ్మణపల్లి, నాగులపల్లి తదితర గ్రామాలలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా ప్రజలకు సరిపడా నీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిట్కుల్, గౌతాపూర్ తండా, ఫైజాబాద్, కొల్చారం మండలంలో రంగంపేట, అంసాన్‌పల్లి, తుక్కాపూర్, వరిగుంతం, కొంగోడు, తోపాటు పలు తండాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది.
నీటి ఇబ్బందులతో సతమతం
మా తండాలో తీవ్రమైన నీటి కొరత ఉంది. ఇక్కడ మూడు మినీ ట్యాంకులు ఉన్నాయి. కానీ వాటికి నీటి çసరఫరా లేదు. తండాలోని మహిళలు, చిన్న, పెద్ద అందరూ నీటి కోసం వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నాం. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ఐనా మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు. –రాట్ల నిర్మల, ఎర్రమట్టి తండా
Comments
Please login to add a commentAdd a comment