సాక్షి, మెదక్ : తన ఇంటిపై దాడి జరిగిందని నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా తమ గ్రామంలో మెలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని తెలిపారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారని పేర్కొన్నారు.
దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తానును ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని.. తమ సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లారు. గోమారంలోని ఎమ్మెల్యే నివాసంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది.
తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బిహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.
ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు.
కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు.
వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి . దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది.
ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని పేర్కొన్నారు.
సునీతా లక్ష్మారెడ్డితో అటు బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఘటన వివరాలు, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.
కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. ఇంటి లోపలికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు.
అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్‌ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment