sunitha lakshma reddy
-
కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయకపోతే, డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, మెదక్ : తన ఇంటిపై దాడి జరిగిందని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా తమ గ్రామంలో మెలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని తెలిపారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారని పేర్కొన్నారు.దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తానును ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని.. తమ సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లారు. గోమారంలోని ఎమ్మెల్యే నివాసంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది.తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బిహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు.కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు.వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి . దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది.ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని పేర్కొన్నారు.సునీతా లక్ష్మారెడ్డితో అటు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఘటన వివరాలు, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. ఇంటి లోపలికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగానే కలిశాం
-
సునీతా లక్ష్మారెడ్డికి బీ-ఫామ్ ఇచ్చిన సీఎం కేసీఆర్
-
టీఆర్ఎస్లో పోటాపోటీ.. ప్రజాక్షేత్రంలో బిజీగా నేతలు
సాక్షి, మెదక్: అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు పోటాపోటీ కార్యక్రమాలకు తెరలేపారు. బహిరంగంగా ఎక్కడా విభేదాలు కనబడకున్నా.. అంతర్గతంగా ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నట్లు చర్చసాగుతోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతూ జనం మధ్యలో ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రజల మద్దతుకై ఆరాటం ► అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువున్నా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటి నుంచే ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ► మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు టికెట్ ఆశిస్తు న్న ముఖ్య నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ, ఏ చిన్న అవ కాశం ఉన్నా వదులుకోకుండా హాజరవుతున్నారు. ► ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ పోటీపోటీగా అధికార, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడంతో రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చ మొదలైంది. మెదక్ నియోజకవర్గంలో.. ► మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ఇప్పటికే జిల్లా పార్టీ పగ్గాలను సీఎం కేసీఆర్ అప్పగించటంతో నియోజకవర్గంతో పాటు ఇతర ముఖ్య పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ బీజీగా గడుపుతున్నారు. ► ప్రతీ మంగళవారం క్యాంపు కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ► అవకాశం దొరికినప్పుడల్లా మెదక్ జిల్లాకు రైలు, మెడికల్ కళాశాల మంజూరు తదితర పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ► సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గతేడాది ఆగస్టులో ఆయన వర్గీయులు నియోజకవర్గంలో భారీ ర్యాలీ, కటౌట్లతో హంగామా చేశారు. ► తమ వర్గీయులతో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్యలపై దృష్టి పెడుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో... ► సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి పోటాపోటీగా పర్యటనలు చేస్తూ, స్థానికంగా ఎక్కువ సమయం ఉండేలా చూసుకుంటున్నారు. ► నర్సాపూర్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సు నితా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఆమె వర్గీయులు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ► మరోవైపు మదన్‌రెడ్డి అనుయాయులు ఆయన పుట్టిన రోజున ఆలయాల్లో పూజలు చేశారు. నర్సాపూర్ నుంచి చాకరిమెట్ల వరకు కాలినడకన వెళ్లి పూజలు నిర్వహించారు. ► మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డిలు, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి ఎవరికి వారు ప్రజల్లో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ► ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాలు.. ► జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాలు ఉన్నా, మెదక్ మాత్రమే పూర్తిస్థాయి నియోజకవర్గంగా కొనసాగుతోంది. ► మెదక్ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్, రామాయంపేట, పాపన్నపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలతో పాటు మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ► నర్సాపూర్ నియోజక వర్గంలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్దూర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్ మున్సిపాలితో పాటు హత్నూర మండలం ఉన్నా, పాలనా సౌలభ్యం కోసం దానిని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. ► గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్లను, దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట, నార్సింగ్ మండలాలను, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలాన్ని, అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గ్, మండలాలను మెదక్ జిల్లాలో కలిపారు. ► ఇటీవల ఏర్పడిన మాసాయిపేట మండలంతో కలిపి జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలో కొనసాగుతున్నాయి. (క్లిక్: అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది?) -
మద్దతు కోసం రాస్తారోకో
చెరకు ‘మద్దతు’ కోసం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు రోడ్డెక్కారు.. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే ఎన్డీఎస్ఎల్లో కూడా టన్నుకు రూ. 2,600 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో చేపట్టారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదంటూ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో డీఎస్పీ రాజారత్నంతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆర్డీఓ నగేష్ హామీతో ఆందోళనకారులు శాంతించారు. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో గల నిజాం దక్కన్ షుగర్స్(ఎన్డీఎస్ఎల్)లో టన్ను చెరుకుకు రూ.2,600 మద్దతు ధర ఇవ్వాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని హౌస్ కమిటీ ద్వారా తీర్మానం చేసినట్లు తెలిపారు. 2013లో సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా చెరుకు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో సైతం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త ఆధీనంలో నడిచిందని ఏనాడు ఇతర ఫ్యాక్టరీల కన్నా తక్కువ ధర ఇచ్చిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించాలని ఎన్డీఎస్ఎల్ జీఎం నాగరాజును కోరారు. దీనిపై జీఎం స్పందిస్తూ.. మిగతా ఫ్యాక్టరీల మాదిరిగా తాము ధర ఇవ్వలేమని 2014 జూన్‌లోనే ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తే తప్ప ఇతర ఫ్యాక్టరీల మాదిరిగా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ సమాధానంతో మండిపడ్డ మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. గంటన్నరపాటు రాస్తారోకో... మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ముందుగల నర్సాపూర్ - మెదక్ ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా విరమించాలంటూ రూరల్ సీఐ రామకృష్ణ, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో మెదక్‌కు వస్తున్న డీఎస్పీ రాజరత్నం వాహనం దిగి సునీతాలక్ష్మారెడ్డి దగ్గరకు చేరుకున్నారు. రాస్తారోకోకు అనుమతి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆమె రైతులకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో వాహనాలను మాచవరం మీదుగా దారి మళ్లించాలని అక్కడే ఉన్న సీఐకి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులు ఆ రహదారిపై కూడా నిరసనకు దిగడంతో డీఎస్పీ, సునీతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ నగేష్‌గౌడ్‌కు ఫోన్ చేసిన రెవెన్యూ అధికారులు సునీతాలక్ష్మారెడ్డితో మాట్లాడించారు. సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిచారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టీపీసీసీ రాష్ట్రకార్యదర్శి సుప్రభాతరావు, సీడీసీ చైర్మన్ నరేంద్రరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిండ్ల ఆంజనేయులు, కొల్చారం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, నందారెడ్డి, నాయకులు బీమరి శ్రీనివాస్, కిషన్‌గౌడ్, మదుసుధన్‌రావు. నాగిరెడ్డి, హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ డీసీసీ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం ఆమె నియామక పత్రం అందుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాలతో తెలంగాణ పీసీసీ ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు తెలంగాణ పీసీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి హాజరు అయ్యారు.ఇటీవల జరిగిన మెదక్ ఉప ఎన్నికలో సునీతా లక్ష్మారెడ్డి పరాజయం పొందిన విషయం తెలిసిందే. -
అహంకారంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ నేతలు: డీఎస్
చేగుంట: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి చెల్లని రూపాయి అంటూ మహిళలను అవమానించే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, శాసనమండలి పక్షనాయకుడు డి. శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాసేవకు ప్రాముఖ్యత ఇచ్చే సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, సునీ తాలక్ష్మారెడ్డి, బండి నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
'బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపుతున్నాం'
హైదరాబాద్: మెదక్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నిలలో అభ్యర్థిగా బరిలోకి దిగాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఆశించినప్పటికీ... బలమైన అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతున్నామని టీ.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం గాంధీ భవన్లో సునీత లక్ష్మారెడ్డికి పార్టీ భీ ఫారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో సునీత తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాత్సారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ద్వారా టీఆర్ఎస్కు ప్రజలే గుణపాఠం చెబుతారని చెప్పారు. -
'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించామనే బాధ రాష్ట్ర ప్రజల్లో ఉందని మాజీ మంత్రి, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో టీ.పీసీసీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నుంచి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా ఆమె బీఫారం తీసుకున్నారు. అనంతరం సునీత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని అలాగే మెదక్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ఆ పార్టీ కార్యాచరణను ప్రకటించలేకపోయిందని ఆమె విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. -
మీడియాతో సునీతా లక్ష్మారెడ్డి
-
మెదక్ ఎంపీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?
హైదరాబాద్:మెదక్ లోక్ సభ స్థానానికి సెప్టెంబర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సునీతా లక్ష్మారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఆ స్థానం నుంచి అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేసిన అనంతరం సునీతా లక్ష్మారెడ్డినే ఎన్నికల బరిలోకి దింపాలని టీపీసీసీ భావిస్తోంది. శనివారం హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యహహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ టీపీసీసీ నేతలతో గాంధీభవన్‌లో మంతనాలు జరిపారు. తొలుత జగ్గారెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినా.. లక్ష్మారెడ్డి వైపే కాంగ్రెస్ నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని తెలంగాణలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కు పునరుత్తేజం తేవాలని హైకమాండ్ భావిస్తోంది. దీనిపై ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇంతకుముందు బుధవారం నగరంలోని ఒక హోటల్ సమావేశమైన కాంగ్రెస్ నేతలు దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి దిగ్విజయ్ అందజేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను మాత్రం టీపీసీసీ ఇంకా వెల్లడించలేదు.ఇంకా రెండురోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్న దిగ్విజయ్ పార్టీ పటిష్టత సదస్సుపై చర్చించనున్నారు. -
మెదక్ ఎంపీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?