మద్దతు కోసం రాస్తారోకో | Rasta Rocco for support price | Sakshi
Sakshi News home page

మద్దతు కోసం రాస్తారోకో

Published Sun, Dec 21 2014 10:40 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Rasta Rocco for support price

చెరకు ‘మద్దతు’ కోసం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు రోడ్డెక్కారు.. జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే ఎన్‌డీఎస్‌ఎల్‌లో కూడా టన్నుకు రూ. 2,600 చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాస్తారోకో చేపట్టారు. అన్నదాతలకు న్యాయం జరిగేవరకూ కదిలేది లేదంటూ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి భీష్మించుకు కూర్చున్నారు. ఈ సమయంలో డీఎస్పీ రాజారత్నంతో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆర్డీఓ నగేష్ హామీతో ఆందోళనకారులు శాంతించారు.      
 
జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీల మాదిరిగానే మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో గల నిజాం దక్కన్ షుగర్స్(ఎన్‌డీఎస్‌ఎల్)లో టన్ను చెరుకుకు రూ.2,600 మద్దతు ధర ఇవ్వాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకోవాలని హౌస్ కమిటీ ద్వారా తీర్మానం చేసినట్లు తెలిపారు. 2013లో సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఫ్యాక్టరీని వెంటనే ప్రభుత్వ పరం చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా చెరుకు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. గతంలో సైతం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ, ప్రైవేట్ సంయుక్త ఆధీనంలో నడిచిందని ఏనాడు ఇతర ఫ్యాక్టరీల కన్నా తక్కువ ధర ఇచ్చిన సందర్భాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించాలని ఎన్‌డీఎస్‌ఎల్ జీఎం నాగరాజును కోరారు.

దీనిపై జీఎం స్పందిస్తూ.. మిగతా ఫ్యాక్టరీల మాదిరిగా తాము ధర ఇవ్వలేమని 2014 జూన్‌లోనే ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇన్‌సెంటివ్ ఇస్తే తప్ప ఇతర ఫ్యాక్టరీల మాదిరిగా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఈ సమాధానంతో మండిపడ్డ మాజీమంత్రి సునీతాలక్ష్మారెడ్డి అఖిలపక్ష నాయకులు, రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.  
 
గంటన్నరపాటు రాస్తారోకో...
మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీ ముందుగల నర్సాపూర్ - మెదక్ ప్రధాన రహదారిపై సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా విరమించాలంటూ రూరల్ సీఐ రామకృష్ణ, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కృష్ణారెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో మెదక్‌కు వస్తున్న డీఎస్పీ రాజరత్నం వాహనం దిగి సునీతాలక్ష్మారెడ్డి దగ్గరకు చేరుకున్నారు. రాస్తారోకోకు అనుమతి లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఆమె రైతులకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో వాహనాలను మాచవరం మీదుగా దారి మళ్లించాలని అక్కడే ఉన్న సీఐకి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనకారులు ఆ రహదారిపై కూడా నిరసనకు దిగడంతో డీఎస్పీ, సునీతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్డీఓ నగేష్‌గౌడ్‌కు ఫోన్ చేసిన రెవెన్యూ అధికారులు సునీతాలక్ష్మారెడ్డితో మాట్లాడించారు. సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతిచారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టీపీసీసీ రాష్ట్రకార్యదర్శి సుప్రభాతరావు, సీడీసీ చైర్మన్ నరేంద్రరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిండ్ల ఆంజనేయులు, కొల్చారం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపాల్, ఏడుపాయల దేవాలయ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నాయకులు గడ్డం శ్రీనివాస్, నందారెడ్డి, నాయకులు బీమరి శ్రీనివాస్, కిషన్‌గౌడ్, మదుసుధన్‌రావు. నాగిరెడ్డి, హఫీజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement