‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమం
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, నకిలీ విత్తనాలు, సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి, పంటల ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ చేసి రుణం పొందే విధానం, వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ, పాడి పశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీలు, వ్యవసాయంలో విద్యుత్ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహం వంటి అంశాలపై వ్యవసాయాధికారులతో రైతుల్లో చైతన్యం కలిగించేవారు. కానీ, గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు లేదు. దీంతో రైతులు పలు అంశాలపై అవగాహన లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా? అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం దీని గురించి కూడా ఊసెత్తకపోవడం గమనార్హం.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ముందే ప్రభుత్వం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించకపోగా, ఈ ఏడాది కూడా నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ‘రైతు చైతన్య యాత్ర’ పేరును ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’గా మార్చి ఏటా మే చివరి నుంచే రైతులకు సాగు అంశాలు, నకిలీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి లాంటి అంశాలపై వ్యవసాయాధికారులతో సమావేశాలు (వారం రోజులపాటు) పెట్టించి రైతులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ చైతన్య యాత్రలను గతేడాది నిర్వహించలేదు. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చైతన్య యాత్రలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం కనీసం ఊసెత్తకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది.
అవగాహన లేకపోతే ఎలా?
ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి? ఖరీఫ్‌లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఏ పంట సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అందుకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావాలంటే పాటించాల్సిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించకపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటితోపాటు పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలతో వచ్చే నష్టాలు, ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సేంద్రియ ఎరువుల వాడకం, చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలు అలాంటివి
వ్యవసాయ రుణాలు, సబ్సిడీ రాయితీలు పొందే పద్ధతులు, పంటల మార్పిడి, వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు పద్ధతులతోపాటు ఆరుతడి పంటలపై మండలస్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయధికారులే స్వయంగా ఆయా గ్రామాలకు వచ్చి రైతుల్లో చైతన్యం కల్పించడం ‘రైతు చైతన్య యాత్ర’ల ముఖ్య ఉద్దేశం. ఈ చైతన్య యాత్రలు, అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ, మరో 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేవారు. కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్రలు నిర్వహించకపోతే రైతులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
యథావిధిగా కొసాగించాలి
గతేడాది ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలి. సాగు పద్ధతులపై అవగాహన లేక రైతులు పంట వేసి నష్టపోయే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించాలి.
జంగ జమలయ్య, వేంసూరు
అవగాహన కల్పిస్తేనే మేలు
ఖరీఫ్, రబీ సీజన్‌లో రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తేనే మేలు జరుగుతుంది. సాగు చేసే పంటలపై అవగాహన లేకపోతే పంటలు సాగు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, రాయితీలపై అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
సంగీతం వీర్రాజు, రైతు, వేదాంతపురం
Comments
Please login to add a commentAdd a comment