ఖమ్మంఅర్బన్ : జిల్లాలో నీటి తీరువా కోట్లలో పేరుకుపోయింది. సాగునీరు వాడుకున్నందుకు ఎకరానికి రైతులు కొంత మొత్తం నీటి తీరువా రూపంలో చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని సాగునీటి కాల్వల మరమ్మతు తదితర పనుల కోసం వినియోగిస్తుంటారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అందించిన సాగునీటి లెక్కల ప్రకారం.. ప్రతి ఏడాది నీటి తీరువా రైతుల నుంచి వసూలు చేయాల్సి ఉంది.
దాదాపు ఏడేళ్లుగా నీటి తీరువా వసూలు చేయకపోవడంతో వసూళ్లు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లాలోని 17 మండలాల పరిధిలో ఖరీఫ్, రబీలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు పైగానే సాగర్ జలాలు అందుతున్నాయి. సాగర్‌లో నీరుంటే రెండు పంటలకు పుష్కలంగా నీరందుతుంది. ఆయకట్టుగా ఉన్న సుమారు 2లక్షల 60వేల ఎకరాల్లో సగానికి పైగా వరి, మిగతా సగం ఆరుతడి పంటలు సాగు చేస్తుంటారు.
ఇవేకాక చెరువులు, ప్రాజెక్టుల పరిధిలో లిఫ్టులు, చెక్‌డ్యాంల పరిధిలో అదనంగా సుమారు లక్ష ఎకరాలకు పైగానే సాగవుతుందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే 2012–13 నుంచి వరుసగా ఇప్పటివరకు నీటి తీరువా వసూలు కావడం లేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదని ఎన్నెస్పీ అధికారులు చెబుతుండగా.. చెరువుల పరిధిలో కొందరు వీఆర్వోలు అరకొరగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఎకరానికి రూ.100, రూ.200 వరకు..
సాగర్ ఆయకట్టు పరిధిలో నీటిని వినియోగించుకున్నందుకు వరికి ఎకరానికి రూ.200, ఆరుతడి పంటలకు రూ.150, చెరువుల పరిధిలో వరికి రూ.150, ఆరుతడి పంటలకు రూ.100 చొప్పున వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో కాల్వలు, తూములు తదితర మరమ్మతు పనులకు వినియోగిస్తారు. ఇందులో 50 శాతం నీటి సంఘాల పరిధిలోకి, 20 శాతం డీసీల పరిధిలో, 20 శాతం ప్రాజెక్టు కమితీ పరిధిలోని కాల్వల మర్మతులకు వాడొచ్చు. 10 శాతం పంచాయతీ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఆరేడు ఏళ్లుగా నీటి తీరువా వసూలు కాకపోవడంతో ప్రభుత్వ నిధులతోనే పనులు చేపడుతున్నారు.
మంత్రి, కలెక్టర్ ఆరా..
నీటి తీరువా వసూళ్లపై సంబంధిత అధికారులతో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, కలెక్టర్ చర్చించినప్పుడు.. నీటిని వాడుకున్నందుకు ప్రతి ఎకరాకు నీటి తీరువా వసూలు చేయాలని, రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో లెక్కలు తీసి.. పక్కాగా పన్ను వసూళ్లు చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ ఆయకట్టు పరిధిలో ఏడేళ్లకు సంబంధించిన బకాయిలు సుమారు రూ.18కోట్ల వరకు ఉన్నట్లు ఒక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందించినట్లు సమాచారం.
ఈ లెక్కల్లో కొద్ది తేడా ఉన్నట్లు నీటిపారుదల శాఖ వాదన. క్షేత్రస్థాయిలో వీఆర్వోలు దృష్టి పెట్టకపోవడంతోనే నీటి తీరువా సరిగా వసూలు కావడం లేదని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. సాగర్, చెరువుల పరిధిలో సుమారు రూ.25కోట్లకు పైగా నీటి తీరువా ఉంటే.. ఇందులో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.2.5కోట్ల మేర నిధులు వచ్చేవని చెబుతున్నారు.
ఎన్నెస్పీ లెక్కలిలా..
2012–13, 2015–16, 2017–18లో ఖరీఫ్‌లో సాగునీరు అందించలేదని మధ్యలో ఒక ఏడాదికి సంబంధించి పన్నులు నమోదు చేయలేదు. మిగిలిన సంవత్సరాల్లో మొత్తంగా రూ.17.88కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఇవికాక చెరువులు, లిఫ్టులు, ప్రాజెక్టుల పరిధిలో కలిపి రూ.25కోట్ల వరకు వసూలు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు అందించాం..
సాగర్ నీటి విడుదల ప్రకారం తమ ఇంజనీర్లు ఇచ్చిన లెక్కల మేరకు నీటి తీరువా జాబితా ఇస్తాం. తాము కాల్వల వెంట తిరుగుతున్నప్పుడు రైతులు పొలాలకు నీరు వాడుకుంటున్నారు. పన్ను ఎందుకు చెల్లించడం లేదని అడిగితే.. తమ వద్దకు ఎవరూ రాలేదని కొందరు రైతులు సమాధానం ఇస్తున్నారు. వరుసగా పన్నులు వసూలు కాకపోవడంతో కోట్లలోనే బకాయిలు ఉన్నాయి.
– ఎం.వెంకటేశ్వర్లు, ఎన్నెస్పీ ఈఈ
చెరువుల పరిధిలో వసూలు చేశాం..
తన పరిధిలో చెరువుల పరిధిలో రైతుల నుంచి నీటి తీరువాను గత ఏడాది కూడా వసూలు చేశాం. తమ పరిధిలో సాగర్ ఆయకట్టు పెద్దగా లేదు. చెరువుల పరిధిలో ఉన్న మేరకు వసూలు చేశాం.
– హుస్సేన్, వీఆర్వో ఏన్కూరు
Comments
Please login to add a commentAdd a comment