ఖమ్మం సమీపంలో ఆగిన రైతు ప్రదర్శన ట్రాక్టర్లు. (ఇన్‌సెట్‌లో) బయల్దేరిన రైతులు
ప్రగతి నివేదన సభకు పదపదమంటూ రైతులు ఉత్సాహంగా బైలెల్లారు. నేతల ఫ్లెక్సీలతో అలంకరించుకున్న ట్రాక్టర్లు బండెనక బండి.. వేలాది బండ్లు అన్నట్లు జాతర మాదిరిగా తరలివెళ్లాయి. హోరెత్తిన తెలంగాణ పాటలు, డీజే మోతలతో ఉర్రూతలూగించాయి. ఎటుచూసినా ఇక్కడే నివేదన సభ.. అన్నట్లుగా ట్రాక్టర్ల సందడి కనిపించింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఖమ్మం నగరంలో సందడి నెలకొంది. కాగా.. టీఆర్‌ఎస్ కార్యకర్తల కోలాహలం నడుమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ నడపగా.. పక్కనే ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తదితరులు కూర్చున్నారు.
ఖమ్మం మయూరిసెంటర్ : రెండో తేదీన హైదరాబాద్‌లో జరిగే ప్రగతి నివేదన సభలో పాల్గొనేందుకు రైతులు వందలాది ట్రాక్టర్లలో తరలిరావడం, ఉత్సాహంగా ప్రదర్శన వెళుతుండడం కొత్త ఉత్సాహాన్నిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన రైతులు 1890ట్రాక్టర్ల ద్వారా శుక్రవారం ప్రదర్శనగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీకి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గుమ్మడికాయ కొట్టగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రైతు కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5లక్షల బీమాను వర్తించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాని ప్రారంభించారన్నారు. పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచకుండా ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి సాయం చేస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్ల ను ఆధునీకరించడం, పంట ఉత్పత్తులను దాచుకునేందుకు గిడ్డంగులను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులకు తమ పార్టీ చేసిన మేలు గతంలో ఏ పార్టీ చేయలేదన్నారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా రైతులు తమవెంటే ఉంటారని తెలిపారు. అన్నదాతకు సేవలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారే స్వచ్ఛందంగా తరలిరావడం గొప్ప కార్యక్రమం అన్నారు. భవిష్యత్‌లో రైతాంగానికి మరిన్ని మంచి కార్యక్రమాలు అందించేందుకు, సేవలు చేసేందుకు కేసీఆర్‌ను ఆశీర్వదించడానికి రైతులు ప్రగతినివేదనసభకు తరలి వెళ్తున్నారన్నారు. ఇంత భారీ ప్రదర్శనను నిర్వహిస్తున్న ఎంపీకి రాష్ట్ర పార్టీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రైతులు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో యువత పాల్గొని అండగా నిలవాలన్నారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకే..: ఎంపీ పొంగులేటి
ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభ ద్వారా తమకు సేవ చేసిన రైతుబాంధవుడికి కృతజ్ఞత తెలుపుకునేందుకే రైతులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 51నెలల్లో సాధించిన ప్రగతిని, ప్రజలకు చేసిన సేవలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. 28 లక్షల మంది ఈ నివేదన సభలో పాల్గొనేలా ఏర్పాట్లు జరిగాయన్నారు.సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మంచి అవకాశం వచ్చిందంటూ జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా నివేదన సభకు తరలివస్తున్నారన్నారు.
గత ప్రభుత్వాలు పలు కారణాలతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి చెల్లిస్తుందన్నారు. ఖమ్మం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన సూర్యాపేట, నల్లగొండ మీదుగా ప్రగతినివేదన సభా ప్రాంగణానికి చేరుకుంటుందని, చివరలో తాను కూడా వీరితో కదలివెళ్తానని వివరించారు. రెండు రోజుల పాటు రైతులకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మేయర్ పాపాలాల్, నల్లమల వెంకటేశ్వరరావు, సాధు రమేష్‌రెడ్డి, లింగాల కమల్‌రాజు, తాతా మధు, కమర్తపు మురళి, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment