government failures
-
Mallikarjun Kharge: ‘పదేళ్ల అన్యాయ కాలం’
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్’ విడుదల చేసింది. మోదీ పాలనా కాలంలో ప్రజలకు వాటిల్లిన సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాన్ని ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని, మహిళలపై నేరాలు పెరిగాయని పేర్కొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం అతిపెద్ద తప్పు అని స్పష్టం చేసింది. ఈ బ్లాక్ పేపర్‌కు ‘10 సంవత్సరాల అన్యాయ కాలం’గా పేరుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వైట్ పేపర్‌కు పోటీగా ఈ బ్లాక్ పేపర్‌ను కాంగ్రెస్ తీసుకొచి్చంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 54 పేజీల ఈ బ్లాక్ పేపర్‌ను నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ‘చార్జిషీట్’గా అభివరి్ణంచారు. గత పదేళ్ల కాలమంతా అన్యాయ కాలమేనని విమర్శించారు. ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఎన్నో మాటలు చెప్పే ప్రధానమంత్రి వైఫల్యాలను మాత్రం నిస్సిగ్గుగా దాచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థత గురించి తాము మాట్లాడితే దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అందుకే సర్కారు వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి బ్లాక్ పేపర్ తీసుకొచ్చామన్నారు. ఉత్తరం, దక్షిణం పేరిట దేశాన్ని విచి్ఛన్నం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మోదీ చేసిన విమర్శలపై ఖర్గే స్పందించారు. గతంలో మాట్లాడిన మాటలను అబద్ధాలకోరులు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ పన్ను హక్కులు అంటూ మాట్లాడారని గుర్తుచేశారు. దళితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారు తనను దూషిస్తూ కొన్నిరోజులుగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖర్గే తెలిపారు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, దళితుడినైన తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల గురించి తాము నిలదీసినప్పుడల్లా ప్రధాని మోదీ.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, వాటిపై వివక్ష కొనసాగుతోందని చెప్పారు. ఆయా రాష్ట్రాలకే కేంద్రం నిధులు ఇవ్వడంలేదని, పైగా నిధులిస్తే ఖర్చు చేయడం లేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో మోదీ ప్రభుత్వం లూటీకి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ఈ సొమ్మును వాడుకుంటోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తిప్పుకున్నారని, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారని ఆక్షేపించారు. -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
ఆ చైతన్యం ఏది..?
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతుల్లో అవగాహన కల్పించేందుకు ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. అందులో భాగంగా ఆధునిక వ్యవసాయం, నకిలీ విత్తనాలు, సాగు పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి, పంటల ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ చేసి రుణం పొందే విధానం, వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయాల్సిన పంటలు, చీడపీడల నివారణ, పాడి పశువుల ద్వారా అభివృద్ధి, పశు సంవర్ధక శాఖ అందిస్తున్న రాయితీలు, వ్యవసాయంలో విద్యుత్ వినియోగం, విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రోత్సాహం వంటి అంశాలపై వ్యవసాయాధికారులతో రైతుల్లో చైతన్యం కలిగించేవారు. కానీ, గతేడాది ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఈ ఏడాది కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు లేదు. దీంతో రైతులు పలు అంశాలపై అవగాహన లేక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా? లేదా? అనే అయోమయంలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, కనీసం దీని గురించి కూడా ఊసెత్తకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు ముందే ప్రభుత్వం ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఈ కార్యక్రమాన్ని గతేడాది నిర్వహించకపోగా, ఈ ఏడాది కూడా నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ‘రైతు చైతన్య యాత్ర’ పేరును ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’గా మార్చి ఏటా మే చివరి నుంచే రైతులకు సాగు అంశాలు, నకిలీ విత్తనాలు, ఆధునిక వ్యవసాయం, భూసార పరీక్షల అవశ్యకత, పంట మార్పిడి లాంటి అంశాలపై వ్యవసాయాధికారులతో సమావేశాలు (వారం రోజులపాటు) పెట్టించి రైతులకు అవగాహన కల్పించేవారు. కానీ ఈ చైతన్య యాత్రలను గతేడాది నిర్వహించలేదు. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ చైతన్య యాత్రలపై స్పష్టత లేకపోవడం, ప్రభుత్వం కనీసం ఊసెత్తకపోవడంతో నిరాశ వ్యక్తం అవుతోంది. అవగాహన లేకపోతే ఎలా? ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు ఏఏ పంటలు సాగు చేయాలి? ఖరీఫ్‌లో ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది, ఏ పంట సాగు చేస్తే పెట్టుబడి తగ్గుతుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే అందుకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావాలంటే పాటించాల్సిన సాగు పద్ధతులపై అవగాహన కల్పించకపోతే ఎలా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటితోపాటు పంటల సాగుకు విత్తనాల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి? నకిలీ విత్తనాలతో వచ్చే నష్టాలు, ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సేంద్రియ ఎరువుల వాడకం, చీడ పురుగుల నివారణ, భూసార పరీక్షలు అలాంటివి వ్యవసాయ రుణాలు, సబ్సిడీ రాయితీలు పొందే పద్ధతులు, పంటల మార్పిడి, వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు పద్ధతులతోపాటు ఆరుతడి పంటలపై మండలస్థాయి, జిల్లా స్థాయి వ్యవసాయధికారులే స్వయంగా ఆయా గ్రామాలకు వచ్చి రైతుల్లో చైతన్యం కల్పించడం ‘రైతు చైతన్య యాత్ర’ల ముఖ్య ఉద్దేశం. ఈ చైతన్య యాత్రలు, అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖతోపాటు ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్, మార్కెటింగ్ శాఖ, మరో 7 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు రైతుల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేవారు. కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఈ సారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైతన్య యాత్రలు నిర్వహించకపోతే రైతులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యథావిధిగా కొసాగించాలి గతేడాది ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించాలి. సాగు పద్ధతులపై అవగాహన లేక రైతులు పంట వేసి నష్టపోయే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించాలి. జంగ జమలయ్య, వేంసూరు అవగాహన కల్పిస్తేనే మేలు ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తేనే మేలు జరుగుతుంది. సాగు చేసే పంటలపై అవగాహన లేకపోతే పంటలు సాగు చేసి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం, రాయితీలపై అవగాహన కల్పిస్తే రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో మాదిరిగానే రైతు చైతన్య యాత్రలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. సంగీతం వీర్రాజు, రైతు, వేదాంతపురం -
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతాం
మల్లాపూర్(కోరుట్ల): ప్రభుత్వ వైఫల్యాలలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడుతామని మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లు అన్నారు. మల్లాపూర్ మండలంలోని రేగుంటలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మాధవేని ఆదిరెడ్డి కుటుంబాన్ని శుక్రవార పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ అయిన లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్గరీని ఏర్పాటు చేయాలని కోరారు. చెరుకురైతులు, కార్మికులతో కలిసి ప్రభుత్వం దిగివచ్చే దాక పోరాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కటుకం గంగారెడ్డి, అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు, ఓబీసీ మండల కన్వీనర్ వంగ అశోక్‌యాదవ్, సీనియర్ నాయకులు రాంరెడ్డి, మండలయూత్ అధ్యక్షుడు శశిగౌడ్, నాయకులు సాయికుమార్, పెనుకుల మల్లేశ్, ప్రవీణ్, వంశీ పాల్గొన్నారు. -
సీఎం వైఫల్యాలపై ప్రోగ్రెస్ కార్డు
నితీష్ కుమార్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఏడాది నిండటంతో.. ముఖ్యమంత్రి వైఫల్యాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ఎన్డీయే విడుదల చేసింది. రాష్ట్రంలో పాలన అన్ని రకాలుగా విఫలమైందని, ముఖ్యంగా శాంతిభద్రతలు మంటగలిశాయని చెప్పింది. 'ఏక్ సాల్.. బురా హాల్' అనే పేరుతో బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఈ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేశారు. గడిచిన ఏడాది కాలంలో వీళ్లు చేసిన తప్పుల కారణంగానే వార్తల్లో నిలిచారని ఆయన మండిపడ్డారు. ఒకరోజు ముందుగానే తాము ఈ ప్రోగ్రెస్ కార్డును విడుదల చేస్తున్నామని, ఇది చూసి ముఖ్యమంత్రి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుశీల్ మోదీ అన్నారు. నితీష్ సర్కారులో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూడా భాగస్వాములే. ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆదివారంతో ఏడాది పూర్తవుతుంది. 2005 నవంబర్‌లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 నుంచి ప్రతియేటా ఇలా ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడాన్ని ఆయనే మొదలుపెట్టారు. కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాం విలాస్ పాశ్వాన్, కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, హిందూస్థాన్ ఆవామీ మోర్చా (ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళ్ పాండే తదితరులు కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహ్మద్ షహాబుద్దీన్, రాజ్ వల్లభ్ యాదవ్, రాకీ యాదవ్ తదితరులకు బెయిల్ మంజూరుచేయడంపై ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించి ఉండకపోతే నితీష్ సర్కారు వాటిపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేది కాదని సుశీల్ మోదీ అన్నారు. 1.52 లక్షల కోట్ల వ్యవసాయ రోడ్ మ్యాప్ పేమైందని, మిషన్ మానవ్ వికాస్, మహాదళిత్ వికాస్ మిషన్, విజన్ డాక్యుమెంట్ 2025 అన్నీ ఎక్కడకు పోయాయని నిలదీశారు. -
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, అమలు చేయని ఎన్నికల హామీలను వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాల జాబితాను రూపొం దిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రసంగాల రూపంలో ఎత్తిచూపడమే గాక ఇతరత్రా రూపాల్లో కూడా వాటిని వీలైనంత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్, జేఏసీ అనుసరించిన ‘ఆట-పాట’ పద్ధతిని ఇందుకు ప్రధానంగా ఉపయోగించుకోనుంది. దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, రైతు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాలు వంటి ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ప్రచారం చేయడంతో పాటు, తద్వారా తలెత్తిన సమస్యలపై పాటల రచన ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు మంత్రులుగా, కూతురు కవిత ఎంపీగా పదవులు అనుభవిస్తున్నారంటూ పాటలు రూపొందిస్తున్నారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలుచేయకపోవడంపై ఇంకో పాటను రాస్తున్నారు. పాటలు పూర్తవగానే సీడీలను రూపొందించనున్నారు. ఈ పాటలతో తెలంగాణ అంతటా కళాజాతాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల్లోనూ కళాజాతాలు నిర్వహించనున్నారు. -
సర్కారు వైఫల్యాలపై ఆన్లైన్ యుద్ధం
బెంగళూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరులో ఆదివారం జరిగిన బీజేపీ రాష్ట్రశాఖ కోర్‌కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో రెండు నెలలుగా రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం పై ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొంటున్న ఐఏఎస్ అధికారులను తరుచూ బదిలీలు చేస్తున్నారని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం 135 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కరువు నివారణ పనులు సాగడం లేదు. దీంతో తాగునీటితో పాటు పశువుల మేతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని రాష్ట్ర హోంశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విపక్ష భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా అందులో భాగంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఎస్.ఎం.ఎస్‌ల ద్వారా ప్రభుత్వలోపాలను ప్రజలకు తెలియజెప్పాడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ జరిగిన పారిశ్రామిక అభివృద్ధి., గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి, ప్రస్తుతం ఆ రంగంలో ఏర్పడిన తిరోగమనం... ఇలా ప్రతి విశయాన్ని గణాంకాల రూపంలో బల్క్ ఎస్.ఎం.ఎస్ రూపంలో పంపించాలని నిర్ణయించింది. ఇక ఫేస్బుక్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న శాంతిభద్రతల సమస్యలు, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఉంచాలని కమలనాథులు నిర్ణయించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు చైతన్య యాత్రలు ముగిసిన తర్వాత ఈ నూతన ఘట్టానికి తెరలేపనున్నట్లు బీజేపీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. -
రైతుకు రిక్తహస్తం
- రైతుల్ని పట్టించుకోని బాబు ప్రభుత్వం - ఘోరంగా విఫలమైన సర్కార్ - వైఎస్సార్సీపీ మహా ధర్నాలో ధ్వజమెత్తిన నాయకులు - కలెక్టరేట్ వద్ద పోలీసుల ఓవర్‌యాక్షన్ - హాఎమ్మెల్యే ఈశ్వరి పట్ల ఏసీపీ దురుసు వైఖరి సాక్షి, విశాఖపట్నం: ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా జరిగింది. ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతోపాటు రైతులు, డ్వాక్రామహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉదయం పది గంటల నుంచి ప్రారంభ మైన ధర్నా మధ్యాహ్నం ఒం టిగంట వరకు జరిగింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ ధర్నాకు తరలివచ్చిన కార్యకర్తలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలతో సహా పార్టీ నేతలంతా తమ ప్రసంగాల్లో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినా రైతులకు రుణాలు..విత్తనాలు, ఎరువులు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఎస్ఎల్బీసీ సమావేశం ఇప్పటివరకూ జరగకపోవడం చరిత్రలో ముందెన్నడూలేదన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అనంతపురంలోనే 100మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సర్కార్‌కు కనీస స్పందనలేదన్నారు. మరోపక్క ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్లులో పొం దుపర్చిన కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న వాటాను రాబట్టుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. ఓ టుకునోటుకేసులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయలేదని.. పైగా టేపుల్లో ఆ వా యిస్ నీది అవునా కాదా అని అడిగితే డొంకతిరుగుడు స మాధానాలతో తప్పించుకుంటున్నారని ధ్వజ మెత్తారు.గవర్నర్‌ను నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ సెక్షన్-8 పేరిట సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో రాష్ర్ట కార్యదర్శులు జాన్‌వెస్లీ, కంపా హనోక్, పీలా ఉమారాణి, రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మాజీ ఎమెల్యే తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తిరెడ్డి, కర్రి సీతారాం, మిలటరీ నాయుడు, సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, అదీప్‌రాజు, కోలా గురువులు, పార్టీ మహిళా, యువజన, ఎస్సీ, సేవాదళ్ సాంస్కృతిక విభాగాల జిల్లా అధ్యక్షులు ఉషాకిరణ్, వల్లూరి భాస్కర్, బోని శివరామకృష్ణ, వాసు, రాధ, రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, సీఈసీ సభ్యులు వీసం రామకృష్ణ, శ్రీకాంత్‌రాజు,రాష్ర్ట ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల రవిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ జిల్లా అధికార ప్రతినిధి ఉరుకూటి అప్పారావు, చిక్కాల రామారావు, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్, సత్తిరామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి వర్మ నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు షరీఫ్ నగర పరిధిలోని డివిజన్ అధ్యక్షులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. గిడ్డి ఈశ్వరిపై ఏసీపీ జులం ధర్నా అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా కలెక్టర్‌తో సహా అధికారులెవరూ లేకపోవడంతో ఛాంబర్ వద్ద బైటాయించారు. ఛాంబర్ కు వినతిపత్రం అంటించే ప్రయత్నం చేస్తుండగా ఏసీపీ రమణ అడ్డుకుని ప్రతులను లాక్కొని నలిపేశారు. ఎమ్మెల్యే ఈశ్వరి, పార్టీ రాష్ర్ట కార్యదర్శి పీలా ఉమారాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషారాణి తదితరులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, మళ్ల విజయప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లను గెంటేసే ప్రయత్నం చేశారు. ఏసీపీ వెనక్కి నెట్టేయడంతో యలమంచిలి పార్టీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు కింద పడిపోయారు. డీఆర్‌ఒ నాగేశ్వరరావు ఆహ్వానించగా లోనికి వెళ్లనీయకుండా ఏసీపీ మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీఆర్వో వారిస్తున్నా వినకుండా ఈశ్వరి పట్ల ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారు. మళ్లీ ధర్నా ఎలా చేస్తారో చూస్త్తానంటూ ఏకవచనంతో ఏసీపీ రెచ్చిపోయారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ ఎస్టీ మహిళా ఎమ్మెల్యేనైన తన పట్ల ఏసీపీ రమణ ప్రవర్తించిన తీరు కలిచి వేసిందన్నారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహరించాలనుకుంటే పచ్చ చొక్కాలు వేసుకోవాలని సూచించారు. ఏసీపీపై అసెంబ్లీలో ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేస్తానని, స్పీకర్‌కు, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీమహిళల నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ రమణపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని అమర్నాథ్ చెప్పారు. -
సై అంటే.. సై
- జిల్లాలో వేడెక్కిన రాజకీయం - అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం - ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై విమర్శనాస్త్రాలు - అంతే ధీటుగా అధికారపక్షం ఎదురుదాడి - సర్కారు పనితీరుపై చర్చకు సై అంటే సై కరీంనగర్ సిటీ : ఎన్నికల నాటి నుంచి నిన్నమొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో వేడెక్కుతోంది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన నాయకులు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకొని క్షేత్రస్థాయి బాట పట్టారు. ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో సై అంటే సై అంటున్నారుు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టడానికి విపక్షాలు అస్త్రాలు సంధిస్తుంటే... అధికార పక్షం గత పాలనను గుర్తు చేస్తూ అంతే స్థాయిలో ఎదురు దాడికి దిగుతోంది. ఫలితంగా ఏడాది కాలంగా నిశ్శబ్దం రాజ్యమేలిన జిల్లాలో అధికార, విపక్షాలు తమ ఆయుధాలకు పదును పెడుతుంటే రాజకీయం రసకందాయంగా మారుతోంది. సంవత్సరం క్రితం జిల్లాలోని 13 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. జగిత్యాల సెగ్మెంట్ మినహా మిగతా అన్నిచోట్లా గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. అప్పటినుంచి అధికార టీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. ఉనికి కోల్పోయిన టీడీపీ, చావుతప్పి కన్నులొట్ట పోయిన కాంగ్రెస్ పార్టీల నేతలు ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్య నేతలైతే హైదరాబాద్ దాటేందుకే ఇష్టపడడం లేదు. కేవలం అధికార పార్టీ నేతల పర్యటనలు, కార్యక్రమాలు తప్ప జిల్లాలో రాజకీయంగా కార్యక్రమమే కనిపించలేదు. ఎన్నికలు జరిగి ఏడాది అరున తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాల్లో అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో విపక్షాలు గొంతెత్తడం ప్రారంభించాయి. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సంక్షేమ శాఖ రుణాలు, సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీల్లో జరిగిన అక్రమాలపై టీఆర్ఎస్ను విపక్షాలు ఇరుకున పెట్టగలిగాయి. అకాల వర్షాలకు పంట నష్టపరిహారం, పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, భూ క్రమబద్దీకరణ తదితర పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై విపక్షాలు దృష్టిసారించారు. పాలకుల అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎజెండాగా విపక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు, విమర్శల పర్వానికి తెరతీశాయి. తాజాగా ఆర్టీసీ సమ్మెను కూడా విపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృతుంజయం తదితరులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, మంత్రుల తీరును ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితర సీనియర్ నేతలు జిల్లాలో క్షేత్రస్థాయికి వెళ్లి నష్టపోయిన పంటను స్వయంగా పరిశీలించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్షాన్ని ఎండగట్టారు. ఇక టీడీపీ సైతం ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది. విపక్షాల దాడిని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ నేతలు సైతం ప్రత్యారోపణలకు తెరతీశారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కేటీఆర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బోరుునపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్‌లు విపక్షాలపై విరుచుకుపడడం సంచలనానికి దారితీసింది. వాటర్‌గ్రిడ్ ప్రారంభానికి ముందే అవినీతి మసిపూయడం విపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనమని ఈటెల రాజేందర్ తదితరులు విపక్షాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ పనితీరుపై, అవినీతి ఆరోపణలు, రైతు సంక్షేమం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా కానీ, మర్కెడైనా కానీ చర్చకు సిద్ధమంటూ ఈటెల ఇటీవల సవాల్ విసిరారు. మితభాషిగా పేరున్న ఆయన విపక్షాలపై ఎదురుదాడి చేయడంతో పాటు ‘తేల్చుకుందాం..’ రమ్మంటూ సవాల్ విసరడంతో జిల్లా రాజకీయాల్లో వేడి మరింత రాజుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు టీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు బహిరంగ చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. వ్యవసాయంతో సంబంధం లేని ఎమ్మెల్యేలను ఇజ్రాయిల్‌లో జరిగిన రైతు సదస్సు పంపించారని, గ్రానైట్ వ్యాపారుల నుంచి ప్లీనరీ కోసం రూ.2 కోట్లు వసూలు చేశారని, సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు, వారి సంబంధీకులకే కేటారుంచారని ఆరోపణలు సంధించారు. విజయ్ వ్యాఖ్యలపై కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ అంతే ఘాటుగా స్పందిస్తూ బహిరంగ చర్చకు టైం, ప్లేస్ చెప్పాలని సవాల్ కు సై అన్నారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఘోర ఓటమిని చవిచూసి ఇన్నాళ్లూ అంటీముట్టన ట్లుగా వ్యవహరించిన విపక్ష నాయకులు ఆరోపణల స్వరాన్ని పెంచుతున్నారు. మొన్నటి వరకు విపక్షాల ఆరోపణలను ఎదుర్కోవడంపై పెద్దగా దృష్టిపెట్టని టీఆర్ఎస్ సైతం అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగింది. నగర నాయకుల నుంచి సాక్షాత్తూ మంత్రుల వరకు విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ముందు వరుసలో ఉంటున్నారు. పార్టీల నడుమ మొదలైన విమర్శల పర్వం రాన్రాను వ్యక్తిగత దూషణలకు తావిస్తుండడం అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయూంశంగా మారింది. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం: లక్ష్మణ్
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అధికారపక్ష వైఫల్యాలను ఎండగడతామని బీజేఎల్పీనేత డా.కె.లక్ష్మణ్ చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీసి అసెంబ్లీ నియమనిబంధనలకు అనుగుణంగా సభను స్తంభింపచేసైనా సమాధానాన్ని రాబడతామన్నారు. ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు. పాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు. ఫిరాయింపులపై స్పీకర్‌కు, మండలిచైర్మన్‌కు హైకోర్టు నోటీసులిచ్చినా అధికారపక్షం విలువలు లేని రాజకీయాలు నడుపుతోందన్నారు.బీజేఎల్పీగా ప్రజల పక్షాన నిలిచి సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలను సాధించేందుకు అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకుంటామన్నారు. ముఖ్యమైన సమస్యలపై టీడీపీతోనే కాకుండా కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి సభలో సమన్వయంతో వ్యవహరిస్తామన్నారు. శుక్రవారం పార్టీ నాయకులు ఎస్.కుమార్,పి.రాములుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిందని, కొత్త రాష్ర్టం, కొత్తప్రభుత్వంగా ఇచ్చిన గడువు కూడా తీరిపోయిందన్నారు.ఫిబ్రవరి చివరి వరకు బడ్జెట్ అమలు తీరును పరిశీలిస్తే గొప్పలకు పోయి రూ.లక్ష కోట్లకు పెట్టినట్లుగా తెలుస్తోందన్నారు. గత బడ్జెట్లో చాలా మటుకు ఎన్నికల హామీల ప్రస్తావనే లేదన్నారు. జలహారం, చెరువుల పునరుద్ధరణ, పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితులకు భూ పంపిణీ వంటివి పేర్కొన్నా ఆచరణలో ఇవి అమలుకు నోచుకోలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం జీహేచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి శాసనసభ వరకు 5గురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతల పాదయాత్రను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీఏకు టీఆర్ఎస్ మద్దతునిస్తుందనేది ఊహాజనితమైన ప్రశ్న అని ఇచ్చిన హామీల అమలుకు పనిచేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని, దాని నుంచి వైదొలిగితే వదిలే ప్రసక్తే ఉండదని ఒక ప్రశ్నకు లక్ష్మణ్ బదులిచ్చారు. -
ప్రభుత్వ వైఫల్యాలపై పోరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ ఫిరాయింపులను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం (బీజేఎల్పీ) నిర్ణయించింది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ అసెంబ్లీ ఆవరణలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ.1.07 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సగం కూడా వ్యయం చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. గత బడ్జెట్లో 67 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం కూడా విడుదల చేయకపోవడంపై నిలదీయాలని నిర్ణయించారు. రైతుల రుణమాఫీ, ఆత్మహత్యలు, కరెంటు కోతలు, గ్రామీణ సడక్యోజన, బీసీలపై నిర్లక్ష్యం, జీవోలు 58, 59 ద్వారా ప్రభుత్వ భూముల అమ్మకం, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్‌లో వసూలు చేస్తున్న పన్నులు వంటి అంశాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక పోరాటం చేయాలని బీజేపీ శాసనసభ్యులు నిర్ణయించారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే అనే అంశంపైనా ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనిపై హైకోర్టు నుంచి ఫిరాయింపు నోటీసులు శాసనసభ స్పీకరుకు, శాసనమండలి చైర్మన్‌కు అందడంపైనా నిలదీయాలని నిర్ణయించారు. హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎన్.రామచందర్‌రావు హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రధానకార్యదర్శి, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతోనే కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించారన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి తప్పదన్నారు.