ప్రభుత్వ వైఫల్యాలపై పోరు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ ఫిరాయింపులను శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం (బీజేఎల్పీ) నిర్ణయించింది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ అసెంబ్లీ ఆవరణలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ.1.07 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సగం కూడా వ్యయం చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. గత బడ్జెట్‌లో 67 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం కూడా విడుదల చేయకపోవడంపై నిలదీయాలని నిర్ణయించారు. రైతుల రుణమాఫీ, ఆత్మహత్యలు, కరెంటు కోతలు, గ్రామీణ సడక్‌యోజన, బీసీలపై నిర్లక్ష్యం, జీవోలు 58, 59 ద్వారా ప్రభుత్వ భూముల అమ్మకం, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్‌లో వసూలు చేస్తున్న పన్నులు వంటి అంశాలపై ప్రభుత్వంపై నిర్మాణాత్మక పోరాటం చేయాలని బీజేపీ శాసనసభ్యులు నిర్ణయించారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే అనే అంశంపైనా ప్రశ్నించాలని నిర్ణయించారు. దీనిపై హైకోర్టు నుంచి ఫిరాయింపు నోటీసులు శాసనసభ స్పీకరుకు, శాసనమండలి చైర్మన్‌కు అందడంపైనా నిలదీయాలని నిర్ణయించారు.
హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: ఎన్.రామచందర్‌రావు
హైకోర్టు విభజనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ప్రధానకార్యదర్శి, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచందర్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతోనే కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించారన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదన్నారు.