సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, అమలు చేయని ఎన్నికల హామీలను వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రావిర్భావం నుంచి ఇప్పటిదాకా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వైఫల్యాల జాబితాను రూపొం దిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రసంగాల రూపంలో ఎత్తిచూపడమే గాక ఇతరత్రా రూపాల్లో కూడా వాటిని వీలైనంత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్‌ఎస్, జేఏసీ అనుసరించిన ‘ఆట-పాట’ పద్ధతిని ఇందుకు ప్రధానంగా ఉపయోగించుకోనుంది.
దళితుడిని ముఖ్యమంత్రి చేయడం, రైతు రుణమాఫీ, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య, లక్ష ఉద్యోగాలు వంటి ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ప్రచారం చేయడంతో పాటు, తద్వారా తలెత్తిన సమస్యలపై పాటల రచన ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణకు తొలి సీఎం దళితుడే అని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు మంత్రులుగా, కూతురు కవిత ఎంపీగా పదవులు అనుభవిస్తున్నారంటూ పాటలు రూపొందిస్తున్నారు.
తెలంగాణలో లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి హామీలను అమలుచేయకపోవడంపై ఇంకో పాటను రాస్తున్నారు. పాటలు పూర్తవగానే సీడీలను రూపొందించనున్నారు. ఈ పాటలతో తెలంగాణ అంతటా కళాజాతాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల్లోనూ కళాజాతాలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు
Published Wed, Oct 14 2015 4:49 AM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM
Advertisement