- జిల్లాలో వేడెక్కిన రాజకీయం
- అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
- ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై విమర్శనాస్త్రాలు
- అంతే ధీటుగా అధికారపక్షం ఎదురుదాడి
- సర్కారు పనితీరుపై చర్చకు సై అంటే సై
కరీంనగర్ సిటీ : ఎన్నికల నాటి నుంచి నిన్నమొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయం అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో వేడెక్కుతోంది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన నాయకులు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకొని క్షేత్రస్థాయి బాట పట్టారు. ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో సై అంటే సై అంటున్నారుు. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ఎండగట్టడానికి విపక్షాలు అస్త్రాలు సంధిస్తుంటే... అధికార పక్షం గత పాలనను గుర్తు చేస్తూ అంతే స్థాయిలో ఎదురు దాడికి దిగుతోంది. ఫలితంగా ఏడాది కాలంగా నిశ్శబ్దం రాజ్యమేలిన జిల్లాలో అధికార, విపక్షాలు తమ ఆయుధాలకు పదును పెడుతుంటే రాజకీయం రసకందాయంగా మారుతోంది.
సంవత్సరం క్రితం జిల్లాలోని 13 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. జగిత్యాల సెగ్మెంట్ మినహా మిగతా అన్నిచోట్లా గులాబీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. అప్పటినుంచి అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురులేకుండా పోయింది. ఉనికి కోల్పోయిన టీడీపీ, చావుతప్పి కన్నులొట్ట పోయిన కాంగ్రెస్ పార్టీల నేతలు ఇండ్లకే పరిమితమయ్యారు. ముఖ్య నేతలైతే హైదరాబాద్ దాటేందుకే ఇష్టపడడం లేదు. కేవలం అధికార పార్టీ నేతల పర్యటనలు, కార్యక్రమాలు తప్ప జిల్లాలో రాజకీయంగా కార్యక్రమమే కనిపించలేదు. ఎన్నికలు జరిగి ఏడాది అరున తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నారు. ప్రభుత్వ పనితీరు, పథకాల్లో అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడంతో విపక్షాలు గొంతెత్తడం ప్రారంభించాయి.
మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సంక్షేమ శాఖ రుణాలు, సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీల్లో జరిగిన అక్రమాలపై టీఆర్‌ఎస్‌ను విపక్షాలు ఇరుకున పెట్టగలిగాయి. అకాల వర్షాలకు పంట నష్టపరిహారం, పింఛన్లు, ఆహారభద్రతా కార్డులు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, భూ క్రమబద్దీకరణ తదితర పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై విపక్షాలు దృష్టిసారించారు. పాలకుల అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు ఎజెండాగా విపక్షాలు అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు, విమర్శల పర్వానికి తెరతీశాయి. తాజాగా ఆర్టీసీ సమ్మెను కూడా విపక్షాలు ఆయుధంగా మలుచుకున్నాయి.
కాంగ్రెస్‌కు చెందిన జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృతుంజయం తదితరులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు పంట నష్టపరిహారం, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, మంత్రుల తీరును ఎండగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితర సీనియర్ నేతలు జిల్లాలో క్షేత్రస్థాయికి వెళ్లి నష్టపోయిన పంటను స్వయంగా పరిశీలించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్షాన్ని ఎండగట్టారు. ఇక టీడీపీ సైతం ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచింది.
విపక్షాల దాడిని ఎదుర్కోవడానికి టీఆర్‌ఎస్ నేతలు సైతం ప్రత్యారోపణలకు తెరతీశారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, మరో మంత్రి కేటీఆర్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బోరుునపల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్‌లు విపక్షాలపై విరుచుకుపడడం సంచలనానికి దారితీసింది. వాటర్‌గ్రిడ్ ప్రారంభానికి ముందే అవినీతి మసిపూయడం విపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనమని ఈటెల రాజేందర్ తదితరులు విపక్షాలపై ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పనితీరుపై, అవినీతి ఆరోపణలు, రైతు సంక్షేమం వంటి అంశాలపై అసెంబ్లీ వేదికగా కానీ, మర్కెడైనా కానీ చర్చకు సిద్ధమంటూ ఈటెల ఇటీవల సవాల్ విసిరారు. మితభాషిగా పేరున్న ఆయన విపక్షాలపై ఎదురుదాడి చేయడంతో పాటు ‘తేల్చుకుందాం..’ రమ్మంటూ సవాల్ విసరడంతో జిల్లా రాజకీయాల్లో వేడి మరింత రాజుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.విజయరమణారావు టీఆర్‌ఎస్ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు బహిరంగ చర్చకు రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. వ్యవసాయంతో సంబంధం లేని ఎమ్మెల్యేలను ఇజ్రాయిల్‌లో జరిగిన రైతు సదస్సు పంపించారని, గ్రానైట్ వ్యాపారుల నుంచి ప్లీనరీ కోసం రూ.2 కోట్లు వసూలు చేశారని, సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులకు, వారి సంబంధీకులకే కేటారుంచారని ఆరోపణలు సంధించారు.
విజయ్ వ్యాఖ్యలపై కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ అంతే ఘాటుగా స్పందిస్తూ బహిరంగ చర్చకు టైం, ప్లేస్ చెప్పాలని సవాల్ కు సై అన్నారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఘోర ఓటమిని చవిచూసి ఇన్నాళ్లూ అంటీముట్టన ట్లుగా వ్యవహరించిన విపక్ష నాయకులు ఆరోపణల స్వరాన్ని పెంచుతున్నారు. మొన్నటి వరకు విపక్షాల ఆరోపణలను ఎదుర్కోవడంపై పెద్దగా దృష్టిపెట్టని టీఆర్‌ఎస్ సైతం అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగింది. నగర నాయకుల నుంచి సాక్షాత్తూ మంత్రుల వరకు విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ముందు వరుసలో ఉంటున్నారు. పార్టీల నడుమ మొదలైన విమర్శల పర్వం రాన్రాను వ్యక్తిగత దూషణలకు తావిస్తుండడం అటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయూంశంగా మారింది.
సై అంటే.. సై
Published Sun, May 10 2015 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
Advertisement