గువహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అంగీకరించారు. అయితే రాష్ట్రంలో అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ ఇకపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని గొగోయ్ అన్నారు. అసోం ప్రజలు గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని, ఈసారి తమకు ప్రతిపక్ష హోదాని ఇచ్చారని తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం తన అధికార నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని, అయితే ఓటమిపై తాను నిరాశ పడటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు. కాగా అసోంలో కాంగ్రెస్ పరాజయం మూటగట్టుకున్నా, తరుణ్ గొగోయ్ మాత్రం టిటాబోర్ నుంచి విజయం సాధించారు. బీజేపీ సీఎం అభ్యర్థి సర్బానంద సోనోవాల్కు తరుణ్ గొగోయ్ అభినందనలు తెలిపారు.
కాగా ఈశాన్య భారతంలో తొలిసారి కమలం వికసించింది. దీంతో 15ఏళ్ల కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడినట్లు అయింది. మార్పు కోసమే అసోం ప్రజలు బీజేపీకీ ఓటేశారని ఆపార్టీ సీనియర్ నేత రాంమాధవ్ వ్యాఖ్యానించారు. అసోంలో తమకు 49శాతం ఓట్లు వచ్చాయన్నారు. మరోవైపు బీజేపీ కీలక నేత హిమంత శర్మ విజయం సాధించారు. మరోవైపు అసోంలో విజయం సాధించిన నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.