five state elections
-
మూడోరోజూ మార్కెట్ ముందుకే...
ముంబై: స్టాక్ సూచీలు గురువారం స్వల్పంగా లాభపడి మూడోరోజూ ముందడుగేశాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, దేశీయ క్యూ2 జీడీపీ వృద్ధి రేటు, అక్టోబర్ ద్రవ్యలోటు డేటా వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. అమెరికా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ట్రేడింగ్‌లో 460 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 87 పాయింట్లు పెరిగి 66,988 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు బలపడి 20,133 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు నవంబర్ నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపు కావడంతో ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫార్మా, కన్జూమర్, రియలీ్ట, పారిశ్రామిక, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతం మేర లాభపడ్డాయి. బ్యాంకులు, యుటిలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్ స్టాక్ సూచీలు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 5 పైసలు బలహీనపడి 83.37 వద్ద స్థిరపడింది. -
నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఈసీ ప్రెస్‌మీట్..
సాక్షి, ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది. వివరాల ప్రకారం.. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. #Election2023 Election dates for Mizoram, Chhattisgarh,Madhya Pradesh, Rajasthan & Telangana to be announced today at 12 noon by Election Commission of India. pic.twitter.com/YTOrIPlLo4 — Aishwarya Paliwal (@AishPaliwal) October 9, 2023 ఇక, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. స్థానిక నాయకత్వం.. ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. నో వారసత్వం.. ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్.. బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్‌లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన. ఛత్తీస్గడ్.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్‌ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం. తెలంగాణ.. ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్‌లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది. మిజోరాం.. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు. ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
ఈ విజయం ఎలా సాధ్యమైంది?
నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుందని ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిరూపించాయి. కేంద్ర పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే గీటురాయి. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజకీయ వివేచనను ప్రశ్నించాయి. ఈ విజయానికి కారణమైన ప్రభుత్వ నమూనా ఏమిటి? ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. నూతన భారత్ వైపుగా సాగే ప్రయాణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మ. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయానికిగానూ, నా తోటి కార్యకర్తలకూ, పార్టీ నేతలకూ, తోటి ముఖ్యమంత్రులకూ అభినందనలు తెలుపుతున్నాను. ఈ చారిత్రక విజయం వైపు మనల్ని ఏది నడిపించింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చాను. భారత రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం మూల మలుపును తీసుకొచ్చింది. ప్రజలను హృదయంలో నిలుపుకొన్న సరికొత్త పాలనా వ్యవస్థ, పరిపాలన ఆ సంవత్సరమే ఉనికిలోకి వచ్చింది. నరేంద్ర మోదీ పాలనా నమూనా దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలేసిందనడానికి ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే గీటురాయి అని చెప్పాలి. మోదీ ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే శక్తిమంతంగా పనిచేస్తుందనీ, రాష్ట్రాల ఎన్నికల్లో అది పెద్దగా ప్రభావం చూపదనీ రాజకీయ పండితులు చెబుతూ రావడంతో ప్రతిపక్ష పార్టీలు దాని ఆధారంగా అనేక తప్పులెక్కలు వేసుకున్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, కులపరమైన ప్రయోగాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అనుకూలంగా పనిచేయలేదు. ఈ ఫలితాలు సాంప్రదాయిక రాజ కీయ వివేచనను ప్రశ్నించాయి. సత్పరిపాలనను కీలకంగా తీసుకోని అల్పరాజకీయాలను అవి తుంగలో తొక్కాయి. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోనూ (37 సంవత్సరాలు), ఉత్తరా ఖండ్‌లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీనే మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రజాతీర్పు ఇంత అద్భుతంగా ఉంటుందని కొన్ని సంవత్స రాల క్రితం అయితే ఏ రాజకీయ పండితుడూ, వ్యూహకర్తా ఊహించ లేదు. ఈ అభివృద్ధి నమూనా ఏమిటి? మరి, మోదీ ప్రభుత్వ నమూనా అంటే ఏమిటి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేను చాలా సన్నిహితంగా ఈ నమూనాను పరిశీలుస్తూ అసోంలో విజయం కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. ప్రధానిపై ప్రజలు పెట్టుకున్న అసాధారణ విశ్వాసం, అభిమానంలో ఈ నమూనా పాదుకుని ఉంది. ఇది సహకారాత్మక సమాఖ్య వ్యవస్థ సూత్రాలతో ప్రభావితమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి కార్యాలయంతో, ఇతర కేంద్ర మంత్రివర్గ కార్యాలయాలతో సంపూర్ణంగా మిళితం అయ్యాయి కాబట్టే ప్రధాని ప్రారంభించిన కీలక పథకాలను కూడా అత్యంత నిర్దిష్టంగా చివరివరకూ అమలు చేయగలుగుతున్నారు. ఈ డబుల్ ఇంజిన్ పాలనా నమూనా వల్లే పథకాలను అమలు చేయగలుగుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ప్రశంసిస్తున్నాయి. ఇదే గేమ్ చేంజర్ అయింది. ఉత్తరప్రదేశ్ ఉదంతమే తీసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన వల్ల 2.5 కోట్లమంది రైతులు ప్రయోజనం పొందారు. ఇక ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిద 1.5 కోట్ల సిలిండర్లను ఉత్తరప్రదేశ్ మహిళలు పొందగలిగారు. అంటే ఆఖిల భారత స్థాయిలో ఇది 17 శాతం అన్నమాట. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పది లక్షల గృహాలు నిర్మించి ఇచ్చారు. 1.3 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులను యూపీలో పంపిణీ చేశారు. మరో 15 కోట్లమంది ప్రజలు ప్రధాని గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ కార్డులు పొందారు. మణిపూర్‌లో ఈ పథకం కింద 22 లక్షలమంది ప్రజలు ఉచిత రేషన్ కార్డులు పొందారు. మరో 60 వేల గృహాలను పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ విజయవంతమైన పాలనకు సాక్ష్యాధారాలు. అలాగే ఈశాన్య భారత రాష్ట్రాలు, తీర ప్రాంత రాష్ట్రాలపై ప్రధాని ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లే గోవా, మణిపూర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాలపై తమ విశ్వాసాన్ని మళ్లీ ప్రకటించారు. నేరుగా అందించే తరహా సంక్షేమం 2014 నుంచి ప్రధాని నరేంద్రమోదీ కొన్ని పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందువల్లనే కుటుంబం ఒక యూనిట్‌గా అసలైన అభివృద్ధినీ, దారిద్య్ర నిర్మూలననూ సాధించడానికి వీలుపడింది. జిల్లాల అభి వృద్ధితో మొదలై బ్లాక్ అభివృద్ధి వరకు పథకాలు సాధించిన విజయం గానీ, జల్ జీవన్ మిషన్ గానీ, దేశవ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం గానీ ఏది తీసుకున్నా సరే... నూతన భారత్ వైపుగా సాగే ప్రయా ణంలో అత్యంత వెనుకబడిన ప్రజానీకాన్ని కలుపుకొని పోవడమే లక్ష్యంగా కేంద్ర పథకాలు అమలవుతూ వచ్చాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంతో సరిపెట్టుకోకుండా, భారతీయ పౌరులతో ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడమే ఈ పాలనా నమూనాకు ఆత్మగా నిలుస్తుంది. జన్‌ధన్, ఆధార్, మొబైల్ త్రయం వంటి టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా పేదల్లోని నిరు పేదలకు ప్రయోజనాలను నేరుగా అందించే తరహా సంక్షేమ నమూనాకు ఈ పాలనా నమూనా అత్యంత సన్నిహితంగా ఉంటుంది. టెక్నాలజీ ప్రాతిపదికన సాగే ఈ వైఖరి ఉచిత సరఫరా యంత్రాంగానికి సరైన నిర్వచనం ఇచ్చింది. ‘యూపీఏ’ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఖరి ఉండేది కాదు. వాస్తవానికి మోదీ ప్రభుత్వ నమూనా ఆయన రేడియో షో ‘మన్ కీ బాత్’కు విస్తృత రూపమే అని చెప్పాలి. ఈ షోలో ఆయన తన ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతారన్నది తెలిసిందే. దీన్ని మరింతగా వివరించాలంటే, ఈ నమూనా నుంచి పుట్టుకొచ్చిన అన్ని పథకాలూ అంటే పీఎం ఉజ్వల, పీఎం కిసాన్, జన్ ధన్, ఎన్ఆర్ఈజీఏ, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం గరీబ్ కళ్యాణ్... ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించిన అన్ని రాష్ట్రాల్లోనూ విజయవంతంగా అమలవుతూ వచ్చాయి. ఈ పథకాలకు చాలావరకు కేంద్రమే నిధులిచ్చింది గానీ రాష్ట్రస్థాయిలో అమలయ్యాయి. ప్రధానమంత్రి కార్యాలయంతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహితంగా సమన్వయంతో పనిచేసింది కాబట్టే ఈ విజయం సాధించగలిగాము. ప్రధాని నిర్దేశించిన అన్ని పథకాలూ లబ్ధిదారులకు అందేలాగా అమలు చేయాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రిగా నేను తీసుుకున్నాను. పథకాలే గెలిపించాయి ఇటీవలే ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎమ్ కిసాన్, పీఎమ్ ఉజ్వల, జన్‌ధన్, ఆయుష్మాన్ భారత్ పథకాలను అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వ పథకాలుగా భావించారని 2022 సీఎస్డీఎస్ పోస్ట్ పోల్ సర్వే నివేదించింది. ప్రత్యేకంగా ఈ పథకాల లబ్ధిదారులు, ముఖ్యంగా పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా లబ్ధి పొందినవారే బీజేపీకి ఎక్కువగా ఓటేశారని సర్వేలు చెప్పాయి. ఈ వివరాలు బీజేపీ కార్యకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తలేదు గానీ... ఇతరులకు మాత్రం ఈ నమూనా ప్రభుత్వ వ్యతిరేకతనూ, వ్యతిరేక ప్రచారాన్నీ తటస్థం చేసిందని బోధపడేలా చేసింది. ప్రధానమంత్రి కార్యాలయంతో అవాంఛిత ఘర్షణలకు దిగే వారికీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉద్దేశపూర్వకంగా వంచించే వారికీ ఎన్నికల్లో విజయాలు సిద్ధించవని రాజకీయ పరిశీలకులకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుణపాఠం నేర్పాయి. పంజాబ్ దీనికి చక్కటి ఉదాహరణ. నూతన భారత ఓటర్లు అభివృద్ధిని డిమాండ్ చేస్తున్నారు గానీ డ్రామాలను కాదు. నవభారతంలో అభివృద్ధి మాత్రమే చిట్టచివరి డెలివరీగా ఉంటుంది. దీనికోసం రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా శ్రమించాల్సి ఉంటుంది. భారతదేశాన్ని మరోసారి విశ్వగురుగా మార్చాలనే దార్శనికతతో మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను జరుపుకొంటున్నాం. మనం కలిసి పనిచేయడం ద్వారానే ఈ లక్ష్యాన్ని సాధించగలం. మోదీ నమూనా ఈ లక్ష్యాన్ని సాధించేలా కనబడుతోంది. హిమంతా బిశ్వ శర్మ వ్యాసకర్త అస్సాం ముఖ్యమంత్రి (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో...) -
యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?
ఉత్తరప్రదేశ్‌లో ఆరు దశల ఓటింగ్ తర్వాత పార్టీల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటిదాకా అన్ని దశల పోలింగ్‌లో తగ్గిన ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నదే ఆ చర్చ. దీనిపై బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు వాటికి అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ‘నిశ్శబ్ద నో షో’, అంటే ఓటేయని వారి వల్ల ఎవరికి నష్టమన్నదే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషకుల మధ్య ఇప్పుడు హాట్ టాపిక్. ‘తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాన్ని మారుస్తుందా అంటే, కచ్చితంగా తారుమారు చేస్తుంది. కానీ అది ఎవరికి లాభం, ఎవరికి నష్టమో తేలాలంటే 10వ తేదీ దాకా ఎదురు చూడాల్సిందే’ అని బెనారస్ హిందూ యూనివర్సిటీ మాలవీయ రీసెర్చి సెంటర్ కు చెందిన ప్రొఫెసర్ కవితా షా అన్నారు. తగ్గిన పోలింగ్ శాతాలపై ఆమె అధ్యయనం చేస్తున్నారు. ఓటు వేయకపోవడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొలి, రెండో విడత పోలింగ్‌లో 2017 కంటే ఈ సారి పోలింగ్ శాతం తగ్గింది. 2017లో తొలి దశలో 64.6 శాతం, రెండో దశలో 65.5 శాతం నమోదైతే ఈసారి 62.5, 64.7 శాతానికి తగ్గింది. మూడు, నాలుగో దశల్లో కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగలేదు. ‘ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినప్పుడు పోలింగ్ శాతం పెరుగుతుందంటారు. కానీ యూపీలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని భావిస్తున్నాను’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (జేఎన్‌యూ) హెచ్ఓడీ ఆర్.నరేంద్రకుమార్ విశ్లేషించారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిన జిల్లాల్లో ఆయన తన రీసెర్చి విద్యార్థులతో పర్యటిస్తున్నారు. రాజధాని లక్నోకు పొరుగున ఉన్న సీతాపూర్ పట్టణంలో 2017లో 61.8 శాతం పోలింగ్ జరిగితే ఈసారి 52.6కు పడిపోయింది. అంటే దాదాపు 35 వేల ఓట్లు పోలవలేదు. 2017లో ఇక్కడ బీజేపీ 24 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచింది. సీతాపూర్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాల్లో సగటున 62.7% ఓటింగ్ నమోదైంది. ఇది కూడా గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6 శాతం తక్కువ. ఆ ఎన్నికల్లో బీజేపీ వీటిలో ఏడింటిని గెలుచుకుంది. అయితే, ‘గతంలో ఆగ్రా సౌత్, శ్రీనగర్, ఉన్నావ్ వంటిచోట్ల బీజేపీ పెద్ద పెద్ద మెజారిటీలతో గెలిచింది. కాబట్టి అలాంటి చోట్ల ఓటింగ్ శాతం తగ్గినా బీజేపీ అభ్యర్థులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు’ అని ఇండియన్ జర్నల్ అఫ్ పొలిటికల్ సైన్స్ (వారణాసి) డైరెక్టర్ వి.కె.బాజ్‌పేయి విశ్లేషించారు. 139 సీట్లలో తగ్గింది! తొలి నాలుగు దశల్లోని 231 స్థానాల్లో చూసుకుంటే ఏకంగా 139 చోట్ల ఓటింగ్ శాతం బాగా తగ్గింది. సీతాపూర్, సేవాత నియోజకవర్గాల్లో 2017తో పోలిస్తే 9 శాతం తగ్గుదల ఉంది. ఆరు స్థానాల్లో ఎటువంటి మార్పు కనిపించకపోగా 86 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం కాస్త పెరిగింది. తక్కువ నమోదైన 139 సీట్లలో 28 చోట్ల దాదాపు 10 వేల చొప్పున ఓట్లు తగ్గాయి. వీటిలో 24 సీట్లను 2017లో బీజేపీ గెలుచుకుంది. అయితే వాటిలో చాలావరకు తక్కువ ఓట్ల తేడాతో గెలిచినవే. ఉదాహరణకు సీతాపూర్ జిల్లాలోని మహోలీలో కేవలం 3,700 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది. ఇక్కడ 2017లో 68.7 శాతం ఓటింగ్ జరిగితే ఈసారి 63.5కు తగ్గింది. ఇది ఎవరిపై, ఎలా ప్రభావం చూపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్న కర్హాల్ నియోజకవర్గంలోనేమో పోలింగ్ ఈసారి 7 శాతం పెరిగింది. తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలపై ప్రభావం చూపుతుందా? 2017లో 403 సీట్లకు గాను బీజేపీ రికార్డు స్థాయిలో ఏకంగా 312 నెగ్గి అఖండ విజయం సాధించినప్పుడు కూడా ఓవరాల్ ఓటింగ్ శాతం తక్కువే నమోదైంది. కాబట్టి ఈసారి మరో ఒకట్రెండు శాతం తగ్గినా అది మొత్తం ఫలితాలపై ప్రభావం చూపుతుందా అంటున్న వారూ లేకపోలేదు. ‘ఇక్కడ బీజేపీ, ఎస్పీ మధ్య పోటీ తీవ్రంగా లేదు. ఓటింగ్ శాతం తగ్గడానికి అదీ ఓ కారణం కావచ్చు. అంతమాత్రాన తక్కువ ఓటింగ్ శాతం వల్ల ఫలితాలే తారుమారు అవుతాయనుకోవడం పొరపాటు. మా ప్రభుత్వమే కొనసాగాలనుకునే వారు ఓటింగ్‌పై బహుశా ఆసక్తి చూపలేదేమో’ అని వారణాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఓటేయకపోవడానికి కారణాలెన్నో ‘ఓటరు ఓటేయలేదంటే, లిస్ట్‌లో పేరు కనిపించకపోవడం, పోలింగ్ బూత్ దూరంగా ఉండటం వంటి అనేక కారణాలుండొచ్చు’ అని వారణాసి అదనపు జిల్లా మేజిస్టేట్, రిటర్నింగ్ అధికారి కౌశల్ రాజ్ శర్మ సాక్షి ప్రతినిధులతో చెప్పారు. ఓటేయాలని తాము విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వివరించారు. -వారణాసి (యూపీ) నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధులు కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి. -
Budget 2022 : ఇవాళ్టి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఇలా..
బడ్జెట్ 2022లో భాగంగా ఇవాళ్టి ఉదయం(సోమవారం) నుంచి పార్లమెంట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యూహాల్లో ప్రతిపక్షాలు సిద్ధం అయ్యాయి. పైగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పైగా పెగాసస్ ప్రకంపనలతో ఉభయసభల్లో తమ వాణి బలంగా వినిపించేందుకు పోటాపోటీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. సాక్షి, న్యూఢిల్లీ: ఇక నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతుండగా.. ఇవాళ్టి షెడ్యూల్లో కేవలం ఆర్థికసర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం 30 నిమిషాలపాటు సాగనుంది. ప్రసంగం అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మొదటి రోజే ఉభయసభల్లోనూ 'ఎకనామిక్ సర్వే' (2021-2022)ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి. మంత్రి బడ్జెట్ ప్రసంగానంతరం రాజ్యసభ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇవాళ తొలి రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాజ్యసభ మొదలవ్వనుంది. ఉభయసభల్లోనూ వేర్వేరుగా ప్రధాని రెండు సార్లు మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. అలాగే మ.3 గంటలకు అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉండగా.. సా.5 గం. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో వర్చువల్‌గా బడ్జెట్ షెషన్పై మరోసారి అఖిలపక్ష భేటీ జరగనుంది. అదే విధంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపైనా పార్టీలకు ఆయన పలు సూచనలు చేయనున్నారు. రేపు, అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు కేంద్ర కేబినెట్ భేటీ అయ్యి బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. ఫిబ్రవరి 2 నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా షిఫ్ట్ పద్ధతిలో లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలు. రాజ్యసభ కార్యక్రమాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అనంతరం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్‌సభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈసారి రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ తొలి విడత సమావేశాలు, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. టీఆర్ఎస్ ఎంపీల నిరసన! పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు నుంచే నిరసన తెలపాలని తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిర్ణయించారు. గత ఏడు ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయం చేయడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిరసన పేరిట రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడంతో పాటు పార్లమెంటు బయట, లోపల నిరసనలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. -
కరోనానే పెద్ద పరీక్ష!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటు ఎన్నికల సంఘానికి అటు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. గడిచిన పది రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 70 శాతానికి పైగా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం లేకపోవడం కలవరపెట్టేలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంతమేర పుంజుకుంటుందన్నది ప్రశ్నగానే మారింది. మరిన్ని రోజులు నిషేధమే! దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇంతకింతకీ పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నెల 8న దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.72 లక్షలు ఉండగా, అదే రోజున రోజువారీ కేసుల సంఖ్య 1.41 లక్షలుగా ఉంది. అయితే క్రమంగా పెరుగుతూ ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20.18 లక్షల వరకు చేరగా, రోజువారీ కేసులు 3.47 లక్షలకు చేరాయి. ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క యూపీలోనే పది రోజుల కిందటి కేసుల సంఖ్యతో పోలిస్తే కేసులు 11 వేల నుంచి 18వేలకు చేరాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృష్ట్యానే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఈ నెల 15వరకు ఉన్న నిషేధాన్ని ఎన్నికల సంఘం 22 వరకు పొడిగించింది. 22 తర్వాత సైతం దీనిపై షరతులతో కూడిన సభలకు అనుమతించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ పంజాబ్‌లో 79 శాతం, మణిపూర్‌లో 58 శాతం మాత్రమే పూర్తయింది. యూపీలో రెండో విడత వ్యాక్సినేషన్ 56.40 శాతమే పూర్తవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఈసీ సూచించింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా లేకపోవడం, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం ఇస్తోంది. బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఓటర్లను చేరుకునేందుకు నానాయాతన పడుతున్న పార్టీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ప్రచారాలు మొదలుపెట్టాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఏ ప్లాట్ఫారంలో లేని ఓటర్లను చేరుకోవడం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. -
మా నిజాయితీని ప్రధానినే ఒప్పుకున్నారు: కేజ్రీవాల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా.. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టుసాధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నిస్తున్న తెలిసిందే. ఈ తరుణంలో ప్రచారంలోకి దిగిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం గోవాలో పర్యటించారు. గోవా ప్రజలు, అభివృద్ధి కోసం 13 పాయింట్ల ఎజెండాతో కూడిన 'విజన్ ప్లాన్'ను అమలు చేయనున్నట్టు ప్రకటించడంతో పాటు పనిలో పనిగా బీజేపీపైనా సెటైర్లు పేల్చారు. ఆదివారం గోవాలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన పార్టీల్లో ఆప్ అత్యంత నిజాయితీ ఉన్న పార్టీ అని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అంతేకాదు సర్టిఫికెట్ ఆఫ్ హానెస్టీ(నిజాయితీ) కూడా ఇచ్చారు అంటూ వెటకారం ప్రదర్శించారు. మోదీగారు నా మీద, మనీశ్ సిసోడియా మీద సీబీఐ దాడులు చేయించారు. మా ఎమ్మెల్యేలను 21 మందిని అరెస్ట్ చేయించారు. 400 ఫైల్స్‌ను పరిశీలించాలని ఒక కమిషన్ కూడా వేశారు. ఏం ఒరిగింది? ఏం జరగలేదు.. అవినీతిరహిత పాలన అనేది మా డీఎన్ఏలోనే ఉంది అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. PM Modi has given AAP the Certificate of India's MOST HONEST party since independence Modi ji unleased CBI, Police raids on me, @msisodia; arrested 21 MLAs, formed commission to examine 400 files & found NOTHING Corruption-free governance is in our DNA- CM @ArvindKejriwal pic.twitter.com/xa33Czko4l — AAP (@AamAadmiParty) January 16, 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎజెండాను తు.చ.తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న జరిగే ఎన్నికల కోసం గోవా ప్రజలు ఎదురు చూస్తున్నారని, గతంలో బీజేపీ, కాంగ్రెస్ తప్ప మరో మార్గం లేని గోవా ప్రజలకు ఇప్పుడు 'ఆప్' ఆశాకిరణమని అన్నారు. ఆ రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. .@ArvindKejriwal's 13-point agenda for Goa: 1️⃣Employment for all 2️⃣Start Mining 3️⃣Grant Land Rights 4️⃣Edu Revolution 5️⃣Health Revolution 6️⃣End Corruption 7️⃣1000/month 4 women 8️⃣Solve Farmer issues 9️⃣Boost Trade 🔟Boost Tourism 1️⃣1️⃣24x7 Free Bijli 1️⃣2️⃣24x7 Free Pani 1️⃣3️⃣Fix Roads pic.twitter.com/xJu6NUC03I — AAP (@AamAadmiParty) January 16, 2022 హామీలు ఏంటంటే.. గోవా 'విజన్ ప్లాన్'లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 13 పాయింట్ల ఎజెండాతో ముందుకు వెళ్తుందని కేజ్రీవాల్ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన మహిళలందరికీ ప్రతినెలా రూ.1,000 సాయం అందిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యటకరంగాన్ని అభివృద్ధి చేస్తామని, నిరంతరాయ విద్యుత్, నీటిని ఉచితంగా అందిస్తామని, రోడ్లను మెరుగుపరుస్తామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, జిల్లాల్లో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన కోసం మెహల్లా క్లినిక్‌లు, ఆసుపత్రులు తెరుస్తామని, రైతులతో చర్చించి వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, వ్యాపార వ్యవస్థను క్రమబద్ధీకరించి, సులభతరం చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉపాథికి నోచుకోని వారికి నెలకు రూ.3,000 సాయం చేస్తామని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని, మైనింగ్ పనులు ప్రారంభిస్తామని, భూమి హక్కులు పునరుద్ధరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ఆంక్షల పొడగింపు
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇక 300 మందితో ఇండోర్(క్లోజ్డ్) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ కెపాసిటీ లో 50% మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మఇిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మొత్తంగా మార్చి 10న జరగనుంది. -
ఎన్నికలు పెట్టాలా వద్దా... డైలమా
-
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది
-
కొనసాగుతున్న 5 రాష్ట్రాల పోలింగ్
-
ముగిసిన పోలింగ్: అసోంలో భారీగా.. తమిళనాడులో స్వల్పంగా
లైవ్ అప్డేట్స్: ► నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్ నమోదైంది. పలు కేంద్రాల్లో వరుసలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. పశ్చిమ బెంగాల్: 76.84 తమిళనాడు : 65.11 కేరళ : 67.96 అసోం : 81.85 పుదుచ్చేరి : 78.03 ► నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్ నమోదైంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివస్తున్నారు. 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పశ్చిమ బెంగాల్: 76.84 తమిళనాడు : 61.34 కేరళ : 69.24 అసోం : 78.32 పుదుచ్చేరి : 76.46 4 గంటల వరకు పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 67.27 తమిళనాడు : 53.35 కేరళ : 59.91 అసోం : 68.31 పుదుచ్చేరి : 66.36 3 గంటల వరకు పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 43.40 కేరళ : 51.4 అసోం : 54.73 పుదుచ్చేరి : 54.27 ► రెండు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 40.94 కేరళ : 51.4 అసోం : 53.23 పుదుచ్చేరి : 54.21 ► ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 53.89 తమిళనాడు : 39.61 కేరళ : 43.3 అసోం : 53.23 పుదుచ్చేరి : 53.35 ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శంకర్. ► డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ భార్య కిరుతిగ ఉదయనిధి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా హీరో సిద్ధార్థ్ ఓటు వేశారు. ► ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు తమిళనాడులో 22.92 శాతం, అసోంలో 33.18 శాతం, కేరళలో 31. 62 శాతం, పుదుచ్చేరి 35. 71 శాతం, పశ్చిమ బెంగాల్ 34.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులుపేర్కొన్నారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.29 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు కేరళలో 23.33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా సినీ నటి కుష్బూ, నటుడు విక్రమ్ ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తమిళనాడులోని విరుగంబక్కంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ► నటుడు విజయ్ చెన్నై నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల వరకూ 16.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారలు పేర్కొన్నారు. ► చెన్నైలోని తేనాంపేట్‌లో డీఎంకే అధినేత స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి ఓటు హక్కు వినయోగించుకున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు. ► కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. యానాం అసెంబ్లీ స్థానంలో పోలింగ్ కొనసాగుతోంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం తరలివస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ ఓటు వేశారు. ► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తెలు శృతిహాసన్, అక్షర హాసన్ చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా తిరువాన్మయూర్‌లో నటుడు అజిత్ ఓటు వేశారు. ► పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్ధి శ్రీధరన్ఓటు వేశారు. అదేవిధంగా చెన్నైలో సినీ నటుడు రజనీకాంత్ ఓటు వేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అసోంలో తుది విడత పోలింగ్‌లో భాగంగా 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మే 2న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించన్నారు. కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రధాని మోదీ ప్రచారం చేసినా...
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. అయితే ఆయన ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాల పరిధిలో 70 శాతం నియోజక వర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని ‘ఇండియాస్పెండ్’ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. 80 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 30 చోట్ల మోదీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వాటిల్లో 23 సీట్లను బీజేపీ గెలుచుకోగా, 57 సీట్లలో ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 54 నియోజకవర్గాల పరిధిలో 22 ఎన్నికల ర్యాలీలు (అంటే 70 శాతానికిపైగా) ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించగా, 22 సీట్లను (41 శాతం) గెలుచుకోగలిగింది. ఇక చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లోని 26 నియోజక వర్గాల పరిధిలో మోదీ ఎనిమిది ర్యాలీలు నిర్వహించగా, ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. మిజోరం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి 58 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ 27 సీట్లను గెలుచుకుంది. 42 సీట్లను కోల్పోయిందని ఇండియాస్పెండ్ విశ్లేషించింది. ఈ విషయంలో మోదీ కన్నా యోగి పర్యటించిన ప్రాంతాల్లోనే బీజేపీ కాస్త ఎక్కువ విజయం సాధించింది. మోదీ పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 28.75 స్థానాల్లో, యోగి పర్యటించిన ప్రాంతాల్లో బీజేపీ 39.3 శాతం విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యోగి 27 బహిరంగ సభలు నిర్వహించగా, 37 స్థానాలకుగాను 21 స్థానాల్లో బీజేపి విజయం సాధించింది. ఇక చత్తీస్‌గఢ్‌లో యోగి 23 ర్యాలీలు నిర్వహించగా, బీజేపీ కేవలం ఐదు సీట్లను గెలుచుకుంది. -
ఎన్నికల్లో తగ్గుతున్న మహిళా విజేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 678 సీట్లకుగాను కేవలం 62 సీట్లలో మాత్రమే మహిళలు విజయం సాధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో 9.30 కోట్ల మంది మహిళలు ఉండగా, వారిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. 2013–2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 77 ఉండగా, అంటే 11 శాతం ఉండేదని భారత ఎన్నికల కమిషన్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రితంసారి కన్నా ఎక్కువ మందే పోటీ చేసినప్పటికీ తక్కువ మంది గెలవడం గమనార్హం. ఒక్క చత్తీస్‌గఢ్‌లో మాత్రమే గతం కన్నా ఈసారి ఎక్కువ మంది విజయం సాధించారు. మిజోరంలో పది లక్షలకుపైగా కలిగిన జనాభాలో 49 శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం శూన్యం. ప్రజాస్వామ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం కాదని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా గెలవడమని అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రితికా కుమార్ వ్యాఖ్యానించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొని ఎన్నికవడమే కాకుండా మళ్లీ పోటీచేసి కూడా విజయం సాధిస్తున్నారని ఆన్నారు. వరుసగా గత మూడు ఎన్నికల నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువ మందే పోటీ చేస్తున్నప్పటికీ వారు ఎక్కువగా గెలవలేక పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 2,716 మంది అభ్యర్థులకుగాను 235 మంది మహిళలు పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 108 మంది, 2008 ఎన్నికల్లో 226 మంది మహిళలు పోటీ చేశారు. ఫలితాల్లో మాత్రం వెనకబడుతున్నారు. 2008లో 25 మంది, 2013లో 30 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మహిళలు మాత్రమే విజయం సాధించారు. ఇక రాజస్థాన్‌లో 2008లో 154 మంది, 2013లో 152 మంది పోటీ చేయగా ఈసారి ఏకంగా 182 మంది పోటీ చేశారు. 2013 ఎన్నికల్లో 25 మంది విజయం సాధించగా, ఈసారి 22 మంది మాత్రమే విజయం సాధించారు. పోటీ చేస్తున్న వారి సంఖ్యలో గెలుస్తున్న వారి సంఖ్యను తీసుకుంటే మగవారికన్నా మహిళలే ఎక్కువ విజయం సాధిస్తున్నారు. రాజస్థాన్‌లో మొత్తం పోటీ చేసిన వారి సంఖ్యలో మహిళల శాతం ఎనిమిది ఉండగా, విజయం సాధించిన వారిలో వారి శాతం 11.5 శాతం ఉండడమే అందుకు ఉదాహరణ. నేషనల్ ఎలక్షన్ వాచ్ అధ్యయనం ప్రకారం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈసారి 12 శాతం సీట్లను మహిళలకు ఇచ్చారు. అన్ని పార్టీలకన్నా అతి తక్కువగా తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ 3 శాతం సీట్లనే మహిళలకు ఇచ్చింది. ఇక ఓ మహిళ అధ్యక్షులుగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ 9 శాతం టిక్కెట్లను మహిళలకు ఇచ్చింది. వివిధ పార్టీల తరఫున పోటీ చేసిన మహిళల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ మంది విజయం సాధించారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా ఇలాంటి వివరాలు అవసరమని రితికా కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
యోగి ‘రాముడి’కథ ఎవరికి నచ్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మిజోరం మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం సాగించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ఏకంగా 74 ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రతి చోటు ఆయన రాముడిని ప్రస్థావించి ఓ చోటుకు రాముడికి ఉన్న సంబంధాన్ని అనుబంధాన్ని వివరించడంతోపాటు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలో ప్రజలందరిని సమానంగా చూసే రామరాజ్యం తీసుకొస్తామని ఆయన చెప్పారు. టెర్రరిస్టులకు మాత్రం బిర్యానీ తినిపించమని, బుల్లెట్లు తినిపిస్తామని చెప్పారు. ఆదిత్యనాథ్ చత్తీస్‌గఢ్ వెళ్లినప్పుడు అది రాముడి తల్లిగారి ఊరని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు రాముడు వనవాసం సమయంలో దండకారణ్యంలో తిరిగాడని చెప్పారు. మధ్యప్రదేశ్ వెళ్లినప్పుడు రాముడిని సవాల్ చేసిన పరుశరాముడి ప్రాంతమని తెలిపారు. రాజస్థాన్ వెళ్లినప్పుడు అది రాముడి కుడిభుజమైన బజరంగ్ బాలి ప్రాంతమని ఆలిని ఓడించడానికి ఆయన ఒక్కడు చాలని వ్యాఖ్యానించారు. ముస్లింల పక్షపాతంటూ కాంగ్రెస్‌ను ఆయన ఆలితో పోల్చారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో యోగి మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి దేశ వనరులు మొట్టమొదట చెందాల్సిందీ ముస్లింలకని మన్మోహన్ చెప్పారని, మరప్పుడు హిందువులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విభజించు పాలించి రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకే దేశంలో టెర్రరిస్టులు తయారవుతున్నారని, టెర్రరిస్టులకేమో బిర్యానీ తినిపిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి 2006లో ప్రధాని మన్మోహన్ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీ మతస్థులను, ముఖ్యంగా ముస్లింలను వెనకబడిన వారిగా గుర్తించామని, వారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదిత్యయోగే కాకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 31 సభల్లో, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 56 చోట్ల ప్రసంగించినా లాభం లేకపోయింది. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ రాణించగలిగింది. మిగతా అన్ని రాష్ట్రాల్లో పరాజయాన్ని మూటకట్టుకుంది. -
సీఎం పదవికి వసుంధర రాజీనామా
రాత్రి 9.30 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం వైపు అడుగులేస్తోంది. 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 72 సీట్లలో మాత్రమే విజయం సాధించడంతో అధికారాన్ని కోల్పోనుంది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వసుందర రాజే తన పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ 89 చోట్ల విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 101. రాత్రి 8.30 : రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఎవరినీ, ఏ ఒక్క పార్టీని కూడా పంపించి వేయమని అన్నారు. బీజేపీ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. రాత్రి 8 : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం లాల్ తన్హల్వా తన పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో 36 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితమైంది. ఎంఎన్ఎఫ్ 26 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టనుంది. సాయంత్రం 7.30 : మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జొరాంతంగా.. గవర్నర్ కె.రాజశేఖరన్‌ను కలిశారు. 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. సాయంత్రం 7: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం 6.30 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ 104, బీజేపీ 71, బీఎస్పీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీఎం వసుంధర రాజే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. మరోవైపు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పట్లానే తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఆరెల్డీ భరత్పూర్ స్థానంలో లీడింగ్ ఉంది. సాయంత్రం 6 : మిజోరాంలో ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) అధికారం చేపట్టనుంది. మొత్తం 40 స్థానాలకు గాను ఆ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందామనునకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితం కాగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ తనహల్వా ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన పోటీచేసిన రెండు చోట్లా ఓటమిచెందారు. సాయంత్రం 4.15 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 98, బీజేపీ 65, బీఎస్పీ 5, సీపీఎం 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతుండడంతో.. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. సాయంత్రం 4 : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ 37,500 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 3.00: మధ్యప్రదేశ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మెజారిటీ ఇరు పార్టీలతో దోబుచులాడుతోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 112, బీజేపీ 108, బీఎస్పీ 4, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 2.30: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 1.30: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో తొలుత వెనకంజలో ఉన్న సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12.50: రాజస్తాన్‌లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం సచిన్ పైలట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 12.20: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మధ్యాహ్నం 12.10: ఛత్తీస్‌గఢ్‌లో విజయం దిశగా కాంగ్రెస్ ఉదయం 11.20: రాజస్తాన్‌లో కాంగ్రెస్ విజయం రాహుల్ గాంధీకి మేము అందించే కానుక- సచిన్ పైలెట్ ఉదయం 10.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు కొనసాగుతుంది. ఐజ్వాల్‌లోని ఎంఎన్ఎఫ్ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం 10.10: ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముందజలో కొనసాగుతుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 9.50: రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఉదయం 9.40: మిజోరంలో ఎంఎన్ఎఫ్ ముందజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.20: సచిన్ పైలట్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.10: జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు. ఉదయం 8.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది. ఉదయం 8.25: తొలి ట్రెండ్స్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఉదయం 8.00: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 7.30: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్ (199), ఛత్తీస్‌గఢ్ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. -
కమలం కదలికలపై 'గులాబీ' కన్ను!
కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నా.. బీజేపీ దూకుడుపై అధికార పార్టీ నజర్ - ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హవాతో ‘కమలం’ జోరు - తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ - రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు - వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్ఎస్ - సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు చర్యలు షురూ.. సాక్షి, హైదరాబాద్: యూపీలో ఘనవిజయం ధీమాతో బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందా? అంతర్గత విభేదాలతో కాంగ్రెస్.. వలసలతో నిర్వీర్యమై టీడీపీ చేతులెత్తేస్తున్నాయన్న అంచనాతో కమలం పార్టీ 2019 ఎన్నికలకు ఇప్పట్నుంచే అస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని ఇటీవల కమలనాథులు పదేపదే చెప్పడం వెనక వ్యూహమిదేనా? టీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు, ప్రతివ్యూహంపై కొనసాగుతున్న సమాలోచనలను బట్టి చూస్తే ఇవే అభిప్రాయాలు కలుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గులాబీ దళం నిశితంగా పరిశీలిస్తోందని విదితమవుతోంది. రెండేళ్ల ముందు నుంచే.. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువుండగానే టీఆర్ఎస్ దూకుడు పెంచింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. పార్టీ 16వ ప్లీనరీ సందర్భంగా జిల్లాకో మినీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఇదంతా కేడర్‌ను సమీకరించుకుని, స్థిర పరుచుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది. అయితే టీఆర్ఎస్ ఇంత దూకుడుగా వెళ్లడానికి కారణం.. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందని గుర్తించడమేనని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో, ప్రణాళికాబద్ధంగా, ఒక వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోందన్న అంచనాకు టీఆర్ఎస్ వచ్చిందని చెబుతున్నారు. పక్కా ప్రణాళికతో.. ముఖ్యంగా బీజేపీ తెలంగాణవ్యాప్తంగా ఏడు లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. అందులో ఆరు నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను ఇన్చార్జులుగా కూడా నియమించి నియోజకర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది. వాటిలో తొలి సమావేశం భువనగిరిలో జరగగా కేంద్ర మంత్రి జవదేకర్ హాజరయ్యారు. మిగతా సమావేశాలనూ త్వరలోనే నిర్వహించే అవకాశముంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఇన్చార్జిగా వస్తున్నారని, నిజామాబాద్‌కు నితిన్ గడ్కరీ, కరీంనగర్‌కు పురుషోత్తం రూపాల, మహబూబ్‌నగర్‌కు అనంత్ కుమార్, వరంగల్‌కు పొన్ను రాధాకృష్ణ ఇన్చార్జులుగా వ్యవహరిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇక్కడి నుంచి దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక దానికి కూడా ఇన్చార్జి బాధ్యతలను ఓ కేంద్ర మంత్రికి అప్పజెప్పనున్నట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాలపైనా దృష్టి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి గతంలో బీజేపీ గెలిచిన అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నారని.. వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల (అర్బన్ ప్రాంతపు)లో కూడా పట్టు పెంచుకునే దిశలో బీజేపీ అడుగులు వేస్తోందన్న సమాచారాన్ని టీఆర్ఎస్ సేకరించినట్లు తెలుస్తోంది. కనీసం 35 అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి పెట్టనుందని చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ గురి టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న ఆ సామాజికవర్గం ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలుగా ముద్రపడిన వారి వివరాలు సేకరించి వారితో ఢిల్లీ నేతలే రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం. కొద్దికాలం క్రితం టీఆర్ఎస్లో చేరిన ఓ పార్లమెంట్ సభ్యుడితో బీజేపీ సీనియర్ నేత ఒకరు ఢిల్లీలో మంతనాలు జరిపారు. కొందరు కాంగ్రెస్ నాయకులతోనూ బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరి నాటికి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సర్వే ఫలితాలతో కేసీఆర్ ధీమా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ఎంపీల పనితీరుపై ఓ సర్వే చేయించారు. రాష్ట్రంలోని పదిహేడు లోక్‌సభ నియోజకవర్గాల్లో పదిహేను చోట్ల టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని పార్టీ నేతల అంతర్గత సమావేశంలో ప్రకటించారు. సికింద్రాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని, హైదరాబాద్ స్థానం ఎంఐఎం ఖాతాలో చేరుతుందన్న అభిప్రాయంతో టీఆర్ఎస్ ఉంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై, అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పరిస్థితిపై కూడా కేసీఆర్ సర్వే చేయించారు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు సరిగాలేని చోట కూడా పార్టీ పరిస్థితి బాగుందన్న విషయం సర్వేలో తేలింది కాబట్టి ధీమాగానే ఉన్నారు. కానీ ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగడం, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయంతో ఆత్మవిశ్వాసంలో ఉన్న బీజేపీ... తెలంగాణపై దృష్టి సారించిందన్న విషయాన్ని టీఆర్ఎస్ సీరియస్‌గానే భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్‌నే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నా.. ఈ మధ్య బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగడంతో అధికార పార్టీ అప్రమత్తమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్లే సంస్థాగత కార్యక్రమాలను పెంచిందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందన్న విషయాన్ని ఓ అధికార పార్టీ ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ప్రతి రాజకీయ పార్టీకి వారి వారి వ్యూహాలు ఉంటాయి. ఎక్కడ ‘కమ్యూనల్’సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి అవకాశం ఉందో.. అక్కడే వారు (బీజేపీ) దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు హిందూ సంఘాల నేతలు వాటిలో కొన్ని చోట్ల మీటింగులు కూడా పెట్టిపోయారు. అయినా టీఆర్ఎస్ ఎందుకు బెంబేలు పడిపోవాలి. ఎవరి రాజకీయం వారిదే. మా పార్టీకి ప్రజల ఆదరణ తప్పక ఉంటుంది..’’అని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ దూకుడును తేలిగ్గా తీసుకోవడం లేదని, ప్రతివ్యూహ రచనలో టీఆర్ఎస్ ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కాంగ్రెస్‌లో సణుగుడు
చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు వినబడుతున్నాయి. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ వరస ఓటములు చవిచూస్తున్న పార్టీకి ఇదేమీ వింతకాదు. అలా జరగకపోతేనే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మణిశంకర్ అయ్యర్ వంటి సీనియర్ నేతలు మొదలుకొని ప్రియా దత్ వరకూ... సత్యబ్రత్ చతుర్వేది నుంచి సందీప్ దీక్షిత్ వరకూ ఎవరికి వారు బాహాటంగా మాట్లాడుతున్నారు. గుండెకే శస్త్ర చికిత్స జరగాలని ఒకరంటే... పార్టీకి ఆటో ఇమ్యూన్ వ్యాధి పట్టుకున్నదని మరొకరం టున్నారు. నాయకత్వం మారితే తప్ప ఫలితం ఉండదని ఇంకొకరు చెబుతున్నారు. సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా అవసరమైన మార్పులకు సిద్ధపడతామో లేదో తేల్చుకోవాలని మరొకరు సూచిస్తున్నారు. అసలు నాయకత్వం వహించడం మాట వదిలిపెట్టి కూటమి ఎత్తుగడలకు సిద్ధపడమని మణిశంకర్ అయ్యర్ హితవు పలికారు. ఎవరు అడిగినా అడగకపోయినా ఓటమి దాపురించినప్పుడు ఆత్మ పరిశీ లన చేసుకోవడం సారథులుగా ఉన్నవారికి తప్పనిసరి. సీనియర్ నేతలను పిలవడం జరిగిన తప్పిదాలేమిటి... లోటుపాట్లేమిటన్న అంశాలను చర్చించడం కూడా అవసరం. కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాను వీటన్నిటికీ అతీత మన్నట్టు వ్యవహరిస్తారు. తాజాగా వెల్లడైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన తీరు మారలేదు. ‘విపక్షంలో ఉన్నప్పుడు ఎగుడు దిగుళ్లుంటాయి, తప్పదు. ఉత్తరప్రదేశ్‌లో మేం కాస్త దెబ్బతిన్నాం... అంతే’ అంటూ ఆయన నిర్వికారంగా మాట్లాడటాన్ని చూసి పార్టీలోని సీనియర్లు బెంబేలెత్తుతు న్నారు. యూపీ పరాభవం ఎలాంటిదో ఆయనకు బొత్తిగా అర్ధమైనట్టు లేదన్నదే వారి బాధ. ఆ రాష్ట్రం కాంగ్రెస్‌ను దశాబ్దాల క్రితం మరిచిపోవడం నిజమే అయినా ఇప్పుడు తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఈ ఎన్నికల్లో పాలకపక్షమైన సమాజ్‌వాదీ పార్టీతో కట్టిన కూటమి ఏమాత్రం కలిసిరాకపోగా ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కు పడి పోయింది. కలిసి పోటీచేద్దాం... రారమ్మని సమాజ్‌వాదీ పిలిచినప్పుడు తన స్థోమ తేమిటో, స్థాయేమిటో గ్రహించుకోకుండా ఇదే అదునని 150కి తక్కువైతే కుదరదని కాంగ్రెస్ బేరాలకు దిగింది. గత్యంతరం లేదు గనుక చివరకు అఖిలేష్ 105 స్థానాలు ఇవ్వకతప్పలేదు. అతి చిన్న పార్టీగా అందరూ భావించే అప్నాదళ్ బీజేపీ ఇచ్చిన 11 స్థానాలూ తీసుకుని 9 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ ఏడుకు పరి మితమై చిన్నబోయింది. సమాజ్‌వాదీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగా చూసిన రోజుల్లో కూడా ఒంటరిగా బరిలోకి దిగి ఇరవయ్యో, పాతికో గెల్చుకుంది. ఇప్పుడు అంతకన్నా హీనస్థితిలో పడిపోయింది. రాహుల్ ప్రాతినిధ్యం వహించే అమేథీ పరిధిలోని అయిదు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది. సోనియా నియోజకవర్గం రాయ్‌బరేలీ పరిధిలోని అయిదు స్థానాల్లో రెండుచోట్ల మాత్రం పార్టీ గట్టెక్కింది. అమేథీ, రాయ్బరేలీలు రెండూ కాంగ్రెస్ కంచుకోటలు. కష్టకాలంలో కూడా ఆ పార్టీకి అండగా నిలబడిన ఆ కోటలు కూడా ఇప్పుడు కూలి పోయాయి. పంజాబ్‌లో పార్టీ విజయాన్ని... గోవా, మణిపూర్లలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించడాన్ని చూపి ఉత్తరప్రదేశ్ పరాభవాన్ని, దాని సారాన్ని మరుగున పరచా లనుకున్నవారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. పంజాబ్‌లో వరసగా రెండుసార్లు అధికారంలో ఉండటం వల్ల అకాలీదళ్–బీజేపీ కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. అది ఓటమిపాలు కావడం అనివార్య మని చాలా ముందుగానే తేలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యూహాత్మకంగా అడుగులేసి ఉంటే ఆ పార్టీకే విజయం దక్కేది. ముఖ్యంగా నవజోత్‌సింగ్ సిద్ధు చేతులు కలపడానికి సిద్ధపడినప్పుడు ఆప్ మీనమేషాలు లెక్కించడం కాంగ్రెస్‌కు వరమైంది. గోవా, మణిపూర్లలో పెద్ద పార్టీగా అవతరించినా అది నిమ్మకు నీరెత్తి నట్టు ఉండిపోవడంతో బీజేపీ చకచకా పావులు కదిపింది. ఫలితాలొచ్చిన వెంటనే గవర్నర్లను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించమని అడిగి ఉంటే వేరుగా ఉండేది. వారు ఆచితూచి అడుగేయక తప్పని స్థితి ఏర్పడేది. గోవాలో అయితే కనీసం కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవడమన్న సమస్య ఉంది. మణిపూర్‌లో అదేమీ లేదు. సీఎంగా ఇబోబీ సింగ్ ఉన్నారు. పెద్ద పార్టీగా తననే ఆహ్వానిస్తే బలనిరూపణ చేసుకుంటానని ముందుగా వెళ్లి ఆయన చెప్పలేకపోయారు. అంతో ఇంతో మెరుగ్గా ఉన్నచోట కూడా పార్టీ ఇలా నిస్తేజంగా మిగిలిపోవడం ఎంత విషాదం! గోవాలో తమకు అన్యాయం జరిగిపోతున్నదని సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టిన ప్పుడు కూడా ధర్మాసనం అడిగిన మొదటి ప్రశ్న గవర్నర్‌ను ఎందుకు కలవలే దన్నదే. ఆ ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర జవాబు లేదు. పెద్ద పార్టీగా ఆ రెండు చోట్లా తమ వంతు ప్రయత్నం తాము చేయాలని రాహుల్‌కు తట్టకపోతే పోయింది... దశాబ్దాలుగా కోటరీ ముఖ్యులుగా చలామణి అవుతున్న నేతలంతా ఏమయ్యారు? వారి అనుభవమంతా ఎటుపోయింది? పార్టీ ఇప్పుడున్న తీరు సరిగా లేదని ఎవరివరకో ఎందుకు... రాహుల్‌గాంధీకే అనిపిస్తోంది. 2014లో ఓడిపోయిన వెంటనే ఆయన ఈ మాటన్నారు. పార్టీ అధ్యక్ష స్థానంలో తన తల్లి, ఉపాధ్యక్ష స్థానంలో తాను ఉండి ఇలా అనడం అయో మయానికి దారితీస్తుందని ఆయన గ్రహించలేకపోయారు. ఒక దాని తర్వాత మరొకటిగా వచ్చిపడుతున్న ఎన్నికల వల్ల పార్టీ అంతర్మథనానికి తీరిక చిక్కడం లేదని కొందరంటున్న మాటలు చెల్లుబాటు కావు. బీజేపీకి మాత్రం ఆ పరిస్థితి లేదా? ఆ పార్టీ బిహార్‌లో దెబ్బతిన్నాక గుణపాఠం నేర్చుకోలేదా? ఏదో ఒక సాకుతో ఇలాగే కాలక్షేపం చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆయన తెలుసుకోవడం లేదు. వచ్చే ఏడాది కర్ణాటక, గుజరాత్, హిమాచల్, త్రిపుర, మిజోరం ఎన్నికలుంటాయి. అప్పుడీ స్వరాలు మరింత బిగ్గరగా వినబడతాయి. ఆ తర్వాత ఎటూ లోక్‌సభ ఎన్నికలు తప్పవు. ఈ దశలోనైనా సమూల ప్రక్షాళనకు సంసిద్ధం కాకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని రాహుల్ గ్రహించడం ఉత్తమం. -
నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా
-
నాలుగు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: అమిత్ షా
పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు అవుతాయని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్లు వచ్చిన తర్వాత.. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని, ఐదు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయా ప్రాంతాలు కొత్త ఎత్తులను చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాలకు గాను కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కూడా ధన్యావాదాలు చెప్పారు. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో స్వాతంత్ర్యం తర్వాత ఇంత పెద్ద విజయం ఇదేనని ఆయన అన్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయని ఆయన స్ఫష్టంగా చెప్పారు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజల విజయమని, వాళ్ల విశ్వాసం సాధించిన విజయమని, నరేంద్రమోదీ నాయకత్వం సాధించిన విజయం అన్నారు. మోదీ ప్రభుత్వం మూడేళ్లలో గరీబ్ కళ్యాణ్ యోజన, ఇతర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే ఈ విజయాలు వచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పనితీరును ప్రజలు స్వాగతించారని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటు చిన్న చిన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా లాంటివి ప్రజలను ఆకట్టుకున్నాయని చెబుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ నిలిచారన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలు చూపించిన విశ్వాసాన్ని నిలబెట్టుకోడానికి ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు నూటికి నూరుశాతం నిలబడ్డారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మీద, బీజేపీ మీద బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయని, యూపీ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పినప్పుడు చాలామంది తమను ఎద్దేవా చేశారని అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలు చాలాకాలం నుంచి సుస్థిరమైన, పనిచేసే ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాయని, ప్రజలు మోదీ మీద, బీజేపీ మీద ఉంచిన విశ్వాసాన్ని రాబోయే ఐదేళ్ల పాటు నిలబెట్టుకుంటామని చెప్పారు. ఇక అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లోని పది సీట్లకు గాను ఆరుచోట్ల బీజేపీ గెలిచిందని.. తాను కాంగ్రెస్ గురించి ఇంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పబోనని అన్నారు. ఇంతకుముందు కంటే కూడా ఆయా స్థానాల్లో తమ పరిస్థితిని మెరుగుపరుచుకున్నామన్నారు. -
అన్ని చోట్లా అధికార పార్టీలకు షాక్!
న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు ఎదురు గాలి వీచింది. ప్రభుత్వాలపై వ్యతిరేకత వ్యక్తమైంది. శనివారం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్ హవా కనిపించినా.. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలకు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ప్రజలు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎస్పీ ఎన్నికల బరిలో నిలిచినా అధికారం నిలబెట్టుకోలేకపోతోంది. ప్రస్తుత సమాచారం మేరకు బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పదు. పంజాబ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ప్రజలు అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచి మెజార్టీకి చేరువవుతోంది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న ఆప్ మూడో స్థానంలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లతో పోలిస్తే గోవా, మణిపూర్లలో అధికార పార్టీలపై ఆ స్థాయిలో వ్యతిరేకత లేకపోయినా ఎదురుగాలి తప్పలేదు. గోవాలో అధికార బీజేపీ వెనకబడింది. మణిపూర్‌లో అధికార కాంగ్రెస్ కు హోరాహోరీ పోరు ఎదురైంది. ప్రస్తుత సరళిని పరిశీలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ పూర్తి మెజార్టీ సాధించే అవకాశం కనిపించడం లేదు. -
ఆ గొంతుకలను విందాం!
మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రధానమంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. ఈ సందర్భాన్ని యాదృచ్ఛికమని అందామా లేక మరేదైనా సంకేతమా? మొన్న, అంటే మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినం. సరిగ్గా ఈరోజే ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ యాదృచ్ఛికత మనల్ని రాజకీయాల్లో మహిళల స్థితిగతుల గురించి ఆలోచించేలా చేస్తుంది. నానాటికీ తీసికట్టు మొట్టమొదటగా చెప్పాలంటే వారి పరిస్థితి ఏమంత బాగా లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొత్తం 4,823 మంది అభ్యర్థులు పోటీకి నిలబడగా వారిలో మహిళల సంఖ్య 445 మాత్రమే. అంటే కేవలం 9 శాతం. వెనుకబాటుతనం మూలంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలా ఉందేమో అని మీరనుకుంటే, పంజాబ్‌ను తీసుకోండి. ఆ రాష్ట్రంలో పోటీకి నిలబడ్డ మొత్తం 1,145 మంది అభ్యర్థులలో 81 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. ఇది అక్షరాస్యతతో ముడి వడిన సమస్య కూడా కాదు. ఎందుకంటే అక్షరాస్యతలో ఈ ఐదింటి కన్నా ముందున్న రాష్ట్రం గోవా. కానీ అక్కడ కూడా ఎన్నికల బరిలోకి దిగిన 251 మంది అభ్యర్థులలో 18 మంది, అంటే 7 శాతం మాత్రమే మహిళలు. రాజకీయ ఉద్యమాల్లో మహిళ భాగస్వామ్యానికి పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా లేకపోవడం అంతకన్నా ఆందోళన కలిగించే విషయం. ఆ రాష్ట్రంలో 637 మంది అభ్యర్థులలో మహిళా అభ్యర్థులు కేవలం 56 మందే. అంటే 9 శాతం కన్నా తక్కువే. ఇంకా ఘోరమైన విష యమేమిటంటే, మహిళల నాయకత్వంలో సాగే మణిపురీ సమాజం ఈ విష యంలో మిగతా అన్ని రాష్ట్రాల కన్నా వెనుకబడి పోవడం. అక్కడి మహిళలు ఆస్తులకు యజమానులు. మార్కెట్లు నిర్వహిస్తారు. అఫ్స్పా వ్యతిరేక ఉద్య మంలోనూ వారిదే ముందు వరుస. కానీ మణిపూర్‌లో ఎన్నికల గోదాలోకి దిగిన 265 మంది అభ్యర్థులలో 11 మంది, అంటే 4 శాతం మాత్రమే మహి ళలు. ఇటు మాయావతి నాయకత్వం ఫలితంగానైనా ఉత్తరప్రదేశ్‌లో మహిళల భాగస్వామ్యంలో పెంపుదల జరగలేదు, అటు ఇరోం షర్మిలా ఎన్నికలలో అడుగుపెట్టినందుకైనా మణిపూర్‌లో మార్పు రాలేదు. ఇది ఆ ఐదు రాష్ట్రాల సమస్య కాదు రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడం అనేది కేవలం ఈ 5 రాష్ట్రాలకో లేదా ఒక్క అభ్యర్థిత్వానికో మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అన్ని రాష్ట్రాలలోనూ మహిళా అభ్యర్థుల నిష్పత్తి దాదాపు ఇదే స్థాయిలో ఉంది. అభ్యర్థులలో మహిళల సంఖ్య ఏ మేరకు తక్కువగా ఉంటుందో, చివరకు ఎన్నికయ్యే ప్రతినిధులలోనూ వారి నిష్పత్తి అదే స్థాయిలో ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళా అభ్యర్థులు విజయం సాధించే రేటు కాస్త ఎక్కువ కాబట్టి విధానసభ, లోక్‌సభల్లో వారి నిష్పత్తి వారికి లభించే అభ్యర్థిత్వం కన్నా కాస్త ఎక్కువే ఉంది. ప్రస్తుతం దేశంలోని అసెంబ్లీలన్నింటిలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యలో మహిళలు 9 శాతం ఉన్నారు. లోక్‌సభలో 12 శాతం మహిళా సభ్యులున్నారు. గడచిన ఇరవై ఏళ్లలో ఈ నిష్పత్తిలో కాస్త మెరుగుదల ఉన్నప్పటికీ మొత్తంగా చూసినపుడు పరిస్థితిలో పెద్ద మార్పు లేదనే చెప్పాలి. ఇరవై ఏళ్లుగా పంచాయితీ, ముని సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లభిస్తుండడం వల్ల వారి ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ దీని ప్రభావం విధానసభలలో తగినంత లేదు. కింది స్థాయిలో మహిళా నాయకత్వం రూపొందుతోంది. ఎన్నికల్లో మహిళలు పురు షులతో సమానంగా ఓట్లు వేస్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలూ ఇప్ప టికీ పురుషుల గుప్పిట్లోనే ఉన్నాయి. అసలు సమస్యేమిటంటే రాజకీయ పార్టీ లేవీ మహిళలకు టిక్కెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేవు. అసలు వాస్తవాలు వేరు వాస్తవానికి కనిపిస్తున్న ఈ అంకెలకన్నా మహిళల గొంతులు మరీ బల హీనంగా ఉన్నాయి. మహిళా అభ్యర్థులలో, చట్టసభలకు ఎన్నికైన మహిళ లలో ఒక పెద్ద భాగం పలుకుబడి గల రాజకీయ కుటుంబాలకు చెందిన కూతుళ్లదీ, కోడళ్లదీ. వీరికి స్వతంత్రమైన అస్తిత్వం అంటూ ఉండదు. ఏదో ఒక అనివార్య పరిస్థితిలో సదరు కుటుంబం పురుషుడికి బదులుగా మహిళను ముందుకు తీసుకొచ్చి ఎన్నికలలో నిలబెడుతుంది. అయితే ఆ మహిళ పురుషుల అదుపాజ్ఞలలోనే పని చేస్తుంది. ఈ మహిళా ప్రతినిధులకు మహిళా సమస్యలతో గానీ, మహిళా ఉద్యమాలతో గానీ ఎలాంటి సంబంధం ఉండదు. అట్లాగే చట్టసభలకు ఎన్నికయ్యే మహిళలకు మంత్రివర్గాల్లో స్థానం లభించడం కూడా అంతంత మాత్రమే. ఇకపోతే మహిళలు మహిళా లేదా బాల సంక్షేమ శాఖలకు మాత్రమే మంత్రులుగా ఉంటారు తప్ప హోంశాఖ, ఆర్థిక శాఖ వంటి శక్తిమంతమైన మంత్రిత్వశాఖలు వారికి నేటికీ అందని ద్రాక్షలుగానే ఉన్నాయి. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ రికార్డు చాలా అధ్వానంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటులకు ఎన్నికైన మహిళా సభ్యుల అంతర్జాతీయ సగటు 22 శాతంగా ఉంది. ఉత్తర యూరప్ లోని స్కాండినేవియన్ దేశాలలో మహిళా పార్లమెంటేరియన్ల శాతం 40 కన్నా ఎక్కువగా ఉంది. బొలీవియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో కూడా వీరి శాతం 40 దాటింది. ఆఖరుకు మన పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో సైతం మహిళా ఎంపీల సంఖ్య 20 శాతంకన్నా ఎక్కువగా ఉంది. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మహిళా ప్రాతినిధ్యం అనే అద్దంలో భారత ప్రజాస్వామ్యపు కురూపితనం స్పష్టంగానే కళ్లకు కడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కుదుపుతున్న వివక్ష మన చట్టసభలలో మహిళల గొంతు బలహీనంగా ఉండడం వల్ల దాని ప్రభావం కేవలం మహిళల పైనే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం పైనే పడు తోంది. ఎక్కువ మంది మహిళలు ఎన్నికైనంత మాత్రాన మన పార్లమెంటు, అసెంబ్లీలు ఎకాయెకిన గౌరవప్రదంగా, నిజాయితీకి నిలువుటద్దంలా మారి పోకపోవచ్చు కానీ, వారి ఉనికి వల్ల కొంత ప్రభావమైతే తప్పక పడుతుంది. పార్లమెంటు, విధానసభల సభ్యులు మహిళలు అయినప్పుడు మహిళలపై నిత్యం జరిగే హింస, లైంగిక వేధింపుల కేసుల విషయంలో పోలీసులపై, అధికారులపై తప్పక కొంత ఒత్తిడి పనిచేస్తుంది. కనీసం అధికార కారిడార్లలో ఊడలు దిగిన మగ పెత్తనం కొంతైనా తగ్గుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట్లలో రేషన్ కొరత, నీటి కొరత లేదా మద్యపానం పెచ్చ రిల్లడం వంటి అంశాలపై చర్చ తప్పకుండా జరుగుతుంది. మరేది జరగక పోయినా, కనీసం సాధారణ మహిళలలో తాము తమ సమస్యను ఎంపీ, ఎమ్మెల్యే లేదా అధికారి దృష్టికి తీసుకెళ్లగలమనే ధైర్యమయితే పెరుగుతుంది. ఇక అసలు విషయం ఏమిటంటే, పార్లమెంటు, విధానసభల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య పెరిగేదెలా? ఇందుకోసం రాజకీయాల స్వభావ స్వరూ పాల్లో మార్పు రావాలన్నది తేటతెల్లం. నేతల సంస్కారంలో, పార్టీల సంస్కృ తిలో మార్పు రావాలి. అయితే ప్రపంచ దేశాల అనుభవాలను బట్టి చూస్తే ఇది మాత్రమే సరిపోదు. మహిళా రిజర్వేషన్ బిల్లును తేవాల్సిందే మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం చట్టపరమైన అనివార్యత కూడా అవసరమే. ఈ దృష్టితోనే 1996లో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభ, విధానసభలలో 33 శాతం సీట్లు మహి ళలకు కేటాయించాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అయితే ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నేను కూడా ఈ లోపాలను ఎత్తి చూపుతూ రాశాను. వాటిని సవరించాలని డిమాండ్ చేశాను. అయితే గడచిన 21 ఏళ్లలో ఈ దిశగా జరిగిన ప్రగతి శూన్యం. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటు ముందుకు వచ్చినా ఏదో ఒక నాటకానికి తెరలేపి లేదా ఏదో ఒక సాకు చెప్పి దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అనేక చర్చోపచర్చల తర్వాత 2010లో దీనిని రాజ్యసభలో ఆమోదించారు. కానీ ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇది లోక్ సభలో చర్చకు నోచుకోలేదు. చివరకు లోక్‌సభ కాలవ్యవధి పూర్తి కావడంతో బిల్లు రద్దయిపోయింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాన మంత్రిని ఒక ప్రశ్న అడగాలని తప్పక ఆశిస్తారు–ఎవరి సలహా ఆశించకుండా ఒక్క దెబ్బతో పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం తీసుకోగలిగిన ప్రధాని 21 ఏళ్ల క్రితం ప్రముఖ పార్టీలన్నింటి ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ ప్రతిపాదనను అమలులోకి తెచ్చే సాహసం చేయగలరా అన్నదే ఆ ప్రశ్న. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు మొబైల్ : 98688 88986 , Twitter : @_YogendraYadav -
పంచతంత్రం 17th February 2017
-
ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన తొలి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించిన దేశంలోని అతి పెద్ద హిందీ పత్రిక ‘దైనిక్ జాగరన్’పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మిగతా విడతల పోలింగ్‌పై నిజంగా ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అసలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయా? నిజమయ్యేది ఉంటే గతంలో పలు పత్రికలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పరస్పరం విరుద్ధంగా ఎందుకున్నాయి? ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించడం సమంజసమేనా? పలు విడుతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికలు కమిషన్ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తున్నదో తెలిసి ఓటరు తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీవైపు మొగ్గుచూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపుకోసం చివరి నిమిషంలో ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే 2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకరావడం ద్వారా ఎన్నికల ముగియకుండానే ఎగ్జిట్ పోల్స్‌ను నిర్వహించ కూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధం తీసుకొచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించడమంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని హరించడమేనని మొదటి నుంచి మీడియా ఆరోపిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించవచ్చని, ఓటరు కూడా తప్పుదోవ పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి, మరో పార్టీకి ఓటేసునట్లు చెప్పవచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం మవుతున్నాయి. ఇందులో ఏదీ జరిగినా తదుపరి విడత పోలింగ్‌ల్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం అందరిపైన ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు. ఓపీనియన్ పోల్స్‌లో యూపీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలకు భిన్నంగా దైనిక్ జాగరన్ పత్రిక వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. అంటే తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పత్రిక తర్వాత విడతల ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూపించి ఉండాలి. లేదా అండర్ కరంట్‌గా ఓ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటున్న ఓటర్లు ఎగ్జిట్ పోల్స్‌నే తప్పుదారి పట్టించి ఉండాలి. చివరకు ఏ ఫలితమొచ్చినా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుంది. -
ఎన్నికలు–నోట్ల రద్దు వేరువేరు!
ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే! ► రామమందిరం జాతీయ స్వాభిమానాంశం ► అభివృద్ధే ఎజెండా ► సాక్షి ఇంటర్వ్యూ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షి ప్రతినిధి : దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీతోపాటుగా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల్లో నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఎంత? అభివృద్ధి నినాదం పనిచేస్తుందా? లేక రామమందిరం మరోసారి ఊపిరిపోస్తుందా? మణిపూర్‌లో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? అనే అంశాలపై మణిపూర్‌లో పార్టీ బాధ్యతలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంట ర్వ్యూవిశేషాలు. ఐదు రాష్ట్రాల్లో పరిస్థితిపై... ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవటం మాకు చాలా కీలకం. ఐదుచోట్లా గెలిచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. యూపీలో ఎస్పీ–కాంగ్రెస్ ఏకమై బీజేపీ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తున్నాయి. ప్రజలకు మోదీ పాలనపై అపారమైన విశ్వాసం ఉంది. ప్రజలు అభివృద్ధినే విశ్వసిస్తారు. మా ప్రచారం కూడా అభివృద్ధి ఎజెండాగానే సాగుతోంది. యూపీలో కచ్చితంగా కనీస మెజారిటీని సంపాదిస్తాం. పంజాబ్‌లో గట్టిపోటీ ఉంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత సహజమే. అయినా మాకే విజయావకాశాలున్నాయి. గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లోనూ గెలుస్తాం. ఓట్లకోసమే ‘రామమందిరం’ మళ్లీ తెరపైకి తెచ్చారన్న విమర్శలపై ఈ ఆరోపణలు అర్థరహితం. 1989 నుంచీ బీజేపీ అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ స్వాభిమానాంశంగా గుర్తించి మేనిఫెస్టోలో పెడుతూ వస్తోంది. దీన్ని మతపరమైన అంశంగా మేమెప్పుడూ గుర్తించలేదు. రామమందిర నిర్మాణం అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించటం సరికాదు. ట్రిపుల్ తలాక్‌పై..: ట్రిపుల్ తలాక్ అంశం మేం లెవనెత్తింది కాదు. ముస్లిం మహిళలే తమ స్వాభిమానం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాతే ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పమని సుప్రీంకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం స్పందించింది. మణిపూర్‌లో పరిస్థితేంటి? మణిపూర్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. దీనికి కారణం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వమే. తన పీఠాన్ని కాపాడుకునేందు కు నాగాలు, మైతీల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ వచ్చింది. అదే నేటి పరిస్థితి (బంద్‌లు హింసాత్మకంగా మారాయి)కి కారణమైంది. చాలా సమస్యలు మణిపూర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మేం కూడా ‘చేంజ్, ప్రొగ్రెస్, డెవలప్మెంట్’ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. నోట్లరద్దు... బీజేపీకి వరమా? శాపమా? నోట్లరద్దు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం. అయినా ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే విశ్లేషణ చేయాలి. ఒకటి మాత్రం స్పష్టం. దేశంలో 70–80 శాతం ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం. 2019 ఎన్నికలే మోదీ ప్రభుత్వం పనితీరుకు రెఫరెండం. -
బీజేపీ సెల్ఫ్‌గోల్ చేసుకుందా?
ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణం. కానీ, అప్పటి వరకు పార్టీ జెండాను భుజాన మోసి ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను విస్మరించి కొత్తవారికి మాత్రమే టికెట్లు ఇస్తూ పోతే పాతవాళ్లలో తీవ్ర అసంతృప్తి రేగక తప్పదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క మణిపూర్ తప్ప.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీలోకి కొత్త నాయకుల రాక వెల్లువెత్తుతోంది. కానీ, టికెట్ల కేటాయింపు వ్యవహారం మాత్రం దాదాపు నాలుగు రాష్ట్రాల్లోను ఆ పార్టీకి తలనొప్పిగానే మారింది. కొత్తవాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ క్రమంగా బలహీన పడటంతో పాటు, సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నట్లు అవుతోంది. యూపీలో పాతిక మంది బయటివాళ్లే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బయటి వాళ్లకు టికెట్లు ఎక్కువగానే ఇచ్చింది. ఇది సొంత పార్టీ వాళ్లను ఆగ్రహానికి గురిచేసింది. యూపీలో బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మొత్తం 149 మంది అభ్యర్థులుండగా.. వాళ్లలో 25 మంది ఈమధ్యే పార్టీలో చేరినవారు. గత సంవత్సరం పార్టీలో చేరిన బీఎస్పీ మాజీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య.. తన కోటాలో రావల్సినన్ని టికెట్లు రాలేదని ఆగ్రహంగా ఉన్నారు. దాంతో పార్టీ నుంచి బయటకు వెళ్లాలని కూడా చూస్తున్నారు. తివారీ ఎందుకు ఇక ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్డీ తివారీని బీజేపీలో చేర్చుకోవడంపై అక్కడ తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తన కొడుకు టికెట్ కోసం ఆయన బీజేపీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయనకు సంబంధించిన అశ్లీల సీడీలు బయటపడిన నేపథ్యంలో అలాంటి వ్యక్తిని ఎందుకు దగ్గరకు తీసుకోవాలని అంటున్నారు. దాంతో తివారీ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గింది. ఆయన చేరలేదని.. కేవలం రోహిత్ మాత్రమే చేరాడని చెప్పింది. తివారీ కేవలం బీజేపీకి మద్దతు మాత్రమే పలికారని చెప్పింది. ఇలా వచ్చారు.. అలా టికెట్ ఇచ్చారు ఉత్తరాఖండ్‌లో మొత్తం 64 మంది అభ్యర్థులను ప్రకటించగా, అందులో 15 మంది బయటివారే. జనవరి 16వ తేదీన ఆ రాష్ట్ర రెవెన్యూ, నీటి పారుదల శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య తన కొడుకు సంజీవ్, మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ రావత్‌లతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వాళ్లు చేరిన కొద్ది గంటలకే బీజేపీ ఉత్తరాఖండ్ అభ్యర్థుల జాబితా రాగా.. అందులో ఈ మూడు పేర్లూ ఉన్నాయి. ఇంతకుముందు హరీష్ రావత్ సర్కారుపై తిరుగుబాటు చేసిన పలువురు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్లిచ్చారు. దీంతో పార్టీలో ఎప్పటినుంచో ఉన్నవాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. పంజాబ్ చీఫ్ అసంతృప్తి పంజాబ్‌లో టికెట్ల కేటాయింపుతో అసంతృప్తి చెందిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి విజయ్ సంప్లా సిద్ధపడ్డారు. అయితే, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆయనను బుజ్జగించి వెనక్కి పంపారు. ఒక సిటింగ్ ఎమ్మెల్యేను తప్పించి, తాను చెప్పిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలన్నది సంప్లా డిమాండు. గోవాలో తిరుగుబాట్లు గోవాలో ఇప్పటికే బీజేపీ తిరుగుబాట్లతో ఇబ్బంది పడుతోంది. 2016 ఆగస్టులో నాటి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ వేలింగ్‌కర్ ప్రాంతీయ భాష విషయంలో ఆగ్రహించి, గోవా సురక్షా మంచ్ (జీఎస్ఎం) అనే పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), శివసేన కలిసి కూటమిగా ఏర్పడి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 35 చోట్ల ఈ కూటమి పోటీ చేస్తోంది. ఎంజీపీ కూడా ఇంతకుముందు బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. -
ఆట మొదలైంది.. విజయం మాదే..
చండీగఢ్: పంజాబ్, గోవా ఎన్నికల్లో తమదే విజయమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. ఆట మొదలైంది.. పంజాబ్, గోవాల్లోని అధికార పార్టీలకు పతనం ప్రారంభమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 4న జరగబోయే పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లో ఆప్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలైనందున పంజాబ్, గోవా ప్రజలు ఇక కేవలం తమకే మద్దతిస్తారని, ఆప్ తరఫున పని చేస్తారని పేర్కొన్నారు. పంజాబ్‌లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్యేలే తమ సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. గోవాలో మాత్రం మాజీ జైళ్ల శాఖ జనరల్ ఇన్స్పెక్టర్ ఎల్విస గోమెస్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లు వెల్లడించారు. -
ఎన్నికలకు ముందే ఓటర్లకు డబ్బుల వరద!
వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ వాటి కోసం ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమీకరించుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఉరుము లేని పిడుగులా పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చింది. దాంతో ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థం కాక రాజకీయ పార్టీలు సతమతం అవుతున్నాయి. అయితే ఇందుకు ఒక తరుణోపాయాన్ని కూడా వాళ్లు కనుగొంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ముందస్తు గానే గ్రామీణ ఓటర్లకు డబ్బులు పంచేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకళ్ల దగ్గరే ఎక్కువ మొత్తం ఉంటే దాన్ని మార్చుకోవడం కష్టం అవుతుంది గానీ, డిసెంబర్ నెలాఖరులోపు వాటిని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్ల వద్దకు చేరిస్తే.. వాళ్లు బ్యాంకులలో మార్చుకుని వినియోగించుకుంటారని, చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బు పంపిణీపై ఉండే నిఘానుంచి కూడా తప్పించుకోవచ్చని సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. యూపీలో త్రికోణ పోటీ తథ్యం కావడంతో అక్కడి పార్టీలన్నీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా సమాజ్‌వాదీ, బీఎస్పీ, బీజేపీ.. ఈ మూడు పార్టీల మధ్య పోరు చాలా గట్టిగా ఉంటుందని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఇప్పటివరకు వెల్లడైన ఎన్నికల సర్వేలలో తేలింది. దాంతో అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగానే డబ్బులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును డిసెంబర్ నెలాఖరు తర్వాత ఏమీ చేయలేం కాబట్టి.. ఈలోపే ఓటర్ల వద్దకు చేరిస్తే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, చిట్టచివరి నిమిషంలో ఎవరు డబ్బులిస్తారన్నదే ఎన్నికల్లో ఓట్ల తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దాంతో ఒకవేళ ఇప్పుడు ఓటు కాంట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో డబ్బులు పంపిణీ చేసినా.. అది ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందన్నది అనుమానంగానే ఉంది. కానీ దగ్గరే ఉంచుకుంటే మాత్రం డిసెంబర్ నెలాఖరు తర్వాత అవి చిత్తుకాగితాలతో సమానం అవుతాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఈ షాక్ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీలో అంతర్గత తగాదాలు దాదాపు ప్రతిరోజూ పత్రికల ప్రధాన శీర్షికలలోనే ఉండేవి. కానీ, పెద్దనోట్ల రద్దు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత.. అసలు ఆ పార్టీ విషయాలేవీ అసలు చర్చకే రావడం లేదు. పంజాబ్‌లో మాత్రం ప్రస్తుతం నదీజలాల వ్యవహారం నడుస్తోంది కాబట్టి కాస్తంత రాజకీయ వేడి కనిపిస్తోంది. మొత్తమ్మీద ముందస్తు డబ్బు పంపిణీ అనేది ఇప్పటివరకు భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఈసారి జరుగుతుందేమో చూడాలి. -
ప్రజా చైతన్యమా, పార్టీల దైన్యమా?
విశ్లేషణ భారత్‌ను వివిధ జాతుల సమాహారంగా భావిస్తూ, ఇది ఏకశిలా సదృశమైన ‘భారత జాతి’ మాత్రమే కాదన్న సిద్ధాంతాన్ని బీజేపీ అంగీకరిస్తున్నదా? అలాంటిదేమీ లేదు. అంటే ఇది అసోం ప్రజల జాతీయ భావాన్ని వాడుకుని, ఈశాన్య భారతంలో అధికారం చేపట్టాలన్న ఎత్తుగడల పొత్తు మాత్రమే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే 1.5 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అసోంలో బీజేపీ విజయం నిరూపించినదేమంటే అవకాశవాద పొత్తుల ఎత్తుగడలలో కాంగ్రెస్ కంటే బీజేపీదే పైచేయి. క్రమం తప్పకుండా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం, లేదా ప్రత్యేక పరిస్థితులలో మధ్యంతర ఎన్నికలు జరగడం - ఇవి మాత్రమే ప్రజాస్వా మ్యంలో పరిపాలన రూప ఔన్నత్యానికి ప్రతిబింబాలు కావు. మరేమిటి? ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ నిర్వహణ ఎలా ఉంది? దానితో ప్రజాజీవితంలో ఏ మేరకు సానుకూల మార్పు చోటు చేసుకుంది? వివిధ మతాలకు, సంస్కృ తులకు ఆవాసమైన ఈ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలకు అత్యంతా వశ్యకమైన లౌకికతత్వం ఏ మేరకు విస్తరించింది? ఏ విధమైన అక్రమ నిర్బం దాలు, అణచివేతలు లేకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రజలు ఏ మేరకు అనుభవిస్తున్నారు? వంటి అంశాలను అధ్యయనం చేయడం, విశ్లేషించు కోవడం హేతుబద్ధమనిపించుకుంటుంది. ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధించింది? ఆయా పార్టీలకు పడిన ఓట్ల శాతం ఎలా ఉంది వంటి అంశాలను పట్టుకుని పార్టీల పేర్ల చుట్టూ పరిభ్రమించకుండా; ఎలాంటి విధానాలకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు? ఆ విధానాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు ప్రజా శ్రేయస్సుకు దోహద పడగలవు అనే అంశాలను స్పృశించడం ముఖ్యం. అలాగే ప్రజాభిప్రాయాన్ని గమనించడం మరింత అవసరం. జనం ఓటింగ్‌లో పాల్గొని ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక గుర్తుకు ముద్ర వేసి, అక్కడితో తమ బాధ్యత అయిపోయిందని భావిస్తున్నారేమో పరిశీలించాలి. ఈ మొత్తం తతంగంలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష పరోక్ష ప్రలోభాల ప్రభావం ఏ మేరకు? అలాగే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రాజకీయ పార్టీలు నెరవే రుస్తున్నాయా? ఒకవేళ అవి హామీల సంగతి మరచిపోతే, వాటిని అమలు జరిపించుకునేందుకు ప్రజలకు వ్యవస్థాగత అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఐదేళ్ల దాకా ఆగాలా? ఇంతలో రాజకీయ పార్టీ, ఎన్నికైన అభ్యర్థి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చునా? ఇలాంటి అంశాలపై విశ్లేషణ మాత్రమే ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రక్రియ స్వరూప స్వభావాలను వెల్లడిస్తుంది. ఈ ప్రచార యుగంలో ప్రచారార్భాటాలు, ప్రసార ప్రావీణ్యాలు ఒక వాస్తవం. ఇవి వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, దాని ఫలితం, ప్రభావం ఏ విధంగా ఉంది? పార్టీలు ప్రవచించే సిద్ధాంతాలకీ, వాటి తక్షణ ఆచరణకు మధ్య వైరుధ్యం ఎలాంటిది? అవకాశవాద రాజకీయాలను, పదవీ వ్యామోహంతో వ్యవహరించే నేతలను ప్రజలు పట్టించుకున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? అలాంటి జాడ్యాలకు ఏ విధంగా కనువిప్పు కలిగిస్తున్నారు? ఇలాంటివి మాత్రమే ప్రజాస్వామ్య ప్రక్రియ అమలును సమీక్షించే క్రమంలో సమాధానాల కోసం చూడవలసిన ముఖ్యాంశాలు. ఇలా పేర్కొనడమంటే ఈ మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నార్థకం చేయడం కాదు. ప్రజా చైతన్యాన్ని శంకించడం కూడా కాదు. ఒక ప్రహసనంలా, మొక్కుబడిగా ఎన్నికలు జరిగి ప్రయోజనం లేద ని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన ఎన్నికలు, ప్రజాప్రాతినిధ్య సంస్థలు, రాజకీయ పార్టీలు అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకోవాలి. ఆంధ్రలో సరికొత్త ఆరంభం ఆంధ్రప్రదేశ్ అనుభవం పై ప్రశ్నలకు చక్కని ఉదాహరణ. 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం గెలుపొంది, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఏం జరిగింది? ‘బీజేపీ మతతత్వ పార్టీ, 2004లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాం, ఇక అలాంటి తప్పిదం చేయబో’నని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ శిక్షార్హుడని చంద్రబాబు ఎలుగెత్తి చాటారు. 2014 ఎన్నికలు ప్రకటించేసరికి వాటన్నిటినీ పూర్వపక్షం చేసేశారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, బీజేపీ తోనే పొత్తు పెట్టుకున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదా నెలకు రెండు వేల రూపాయల భృతి - ఇలా చంద్రబాబు వాగ్దానాల వర్షం కురిపించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఆ హామీల ఊసే లేదు. పైగా ఆ వాగ్దానాల మాటేమిటని నిలదీసిన మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులకు లాఠీలతో సమాధానం చెప్పారు. గణాంకాల మేరకు, ప్రజా స్వామ్య ప్రక్రియ ద్వారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం అధికారం పొందిన మాట వాస్తవం. కానీ ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ ఆధారంగానే, ఇది ప్రజల విజయంగా చెప్పడం దుస్సాహసం కాదా! 2015లో జరిగిన పలు ఎన్నికలలో రాజకీయ పార్టీల తీరు ఇదే తీరున సాగింది. చెప్పే మాటకూ, ఆచరణకు మధ్య ఆమడ దూరం అన్న తీరులో బీజేపీ వ్యవహరించింది. తన భావజాలానికి పూర్తి విరుద్ధమైనప్పటికీ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పీడీపీతో పొత్తు పెట్టుకుంది. ప్రభు త్వంలో భాగస్వామి అయింది. ‘కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనడానికి ముందు అక్కడి ప్రజల హృదయాలను గెలవాలి’ అని ఎవరైనా అంటే, వారిని దేశద్రోహులుగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ భావించేవి. కానీ పీడీపీ ఈ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధమైన వైఖరి కలిగినది. అంటే అధికారం కోసమే బీజేపీ, పీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇది బీజేపీ విజయమా? అవకాశవాద పొత్తు విజయమా? అసోంలో అవకాశవాద విజయం మొన్న అసోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తీరూ ఇంతే. అక్కడ బీజేపీ విజయాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ‘భారత జాతి’, ‘అఖండ భారత్’ ఆ పార్టీ నినాదాలు. ‘అసోం, అసోం జాతీయుల ప్రయోజనాలకే రక్షణ. అన్యులకు ఇక్కడ అవకాశం లేదు’ అన్న నినాదం అందుకున్న పార్టీ అసొం గణపరిషత్(ఏజీపీ). ఇదే నినాదంతో ఒకప్పుడు ఏజీపీ అధికారం చేపట్టింది. అలాగే బోడోల్యాండ్ పార్టీ. బోడో ప్రాంతం ఆ తెగలకే చెందాలంటుంది. ‘భారతజాతి’, ‘అఖండ భారత్’ అని నినదించే పార్టీ బోడో పార్టీతో, ఏజీపీతో పొత్తు పెట్టుకుంది. పోనీ బీజేపీ భావజాలాన్ని మార్చుకుందా? భారత్‌ను వివిధ జాతుల సమాహారంగా భావిస్తూ, ఇది ఏకశిలా సదృశమైన ‘భారత జాతి’ మాత్రమే కాదన్న సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నదా? అలాంటిదేమీ లేదు. అంటే ఇది అసోం ప్రజల జాతీయ భావాన్ని వాడుకుని, గుడారంలో ఒంటె మాదిరిగా ఈశాన్య భారతంలో అధికారం చేపట్టాలన్న ఎత్తుగడల పొత్తు మాత్రమే. కాబట్టి ఇది అసోం ఫలితాన్ని ప్రజావిజయంగా భావిం చలేం. అంతేకాదు, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే 1.5 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కనుక అసోం ఎన్నికలలో బీజేపీ విజయం నిరూపించినదేమంటే అవకాశవాద పొత్తుల ఎత్తుగడలలో కాంగ్రెస్ కంటే బీజేపీదే పైచేయి. తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలలో ఏ పార్టీ గెలిచినా, తమిళ జాతీయవాదమే గెలిచినట్టు. ఓట్లు కొనుగోలు చేసేందుకు పార్టీలు తమ నిధుల నుంచి గాక, ప్రభుత్వ ఖజానా నుంచే ‘ఉచితాలు’ అంద జేస్తామంటూ ఓటర్లకు గాలం వేయడంలో ద్రవిడ పార్టీలు దొందూ దొందే! లెఫ్ట్‌కు బెంగాల్, కేరళ అనుభవాలు బెంగాల్లో మమతా బెనర్జీ గెలుపు ఏ అంచనాలకూ అందదు. అక్కడ సుభాశ్ చంద్రబోస్, బి.సి.రాయ్, జ్యోతిబసు వంటివారు వారి వారి రాజ కీయ సంస్థలకే ప్రతినిధులు కారు. బెంగాలీ జాతీయతకు ప్రతినిధులు. బసు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ, ఆ బెంగాలీ జాతీయ అంశం మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలోని వామపక్ష సంఘటనకు కలసివచ్చింది. బసు తర్వాత, ఆ స్థాయి నాయకుడిని ఆ కూటమి సృష్టించుకోలేక పోయింది. పైగా, కేంద్రం అనుసరిస్తున్న ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు 2006-11 మధ్య బెంగాల్లో వామపక్ష సంఘటన ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల ముందుంచకుండా అదే విధానాలను అనుసరించడం ద్వారా సింగూర్ - నందిగ్రామ్ వంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. నాటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం రైతుకూలీల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నది. రైతులపై కాల్పులకు కూడా వెనకాడకుండ ఆ పాలన అమా నవీయంగా వ్యవహరించింది. దీనితో సహజంగా సీపీఎం వెనుక ఉండాల్సిన రైతులు, కష్టజీవులు, అసంఘటిత కార్మికులు తదితరులు పార్టీకి దూరమ య్యారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వామపక్ష సంఘటనపై ఆ ప్రజల తరఫున తీవ్ర పోరాటం చేసి, తనవైపు తిప్పుకో గలిగారు మమతా బెనర్జీ. పైగా మధ్యతరగతి కూడా ఆమె పక్షానజేరి ఆమెకు ఒక బెంగాలీ జాతీయనేత స్థాయి కల్పించారు. కేంద్ర నిర్ణయానికి విరుద్ధంగా బెంగాల్ ప్రత్యేక పరిస్థితిలో మమతా బెనర్జీ దూకుడు, దుస్సాహసాలకు అడ్డుకట్ట వేయాలని బెంగాల్ సీపీఎం భావించింది. ఆ క్రమంలోనే ఇన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని సీపీఎం చేసిన నిర్ణయం ఫలించలేదు. ‘కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోక పోయినట్లయితే బీజేపీ రెండవస్థానంలో ఉండేది’ అంటూ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి చేసిన వ్యాఖ్యలోని వాస్తవాన్ని అటుంచితే, కాంగ్రెస్‌తో ఒప్పందాన్ని బెంగాల్ ప్రజానీకం చేత పార్టీ మెప్పించలేక పోయింది. ఫలితంగా, ఈ అవగాహనను ప్రజలు అర్థం చేసుకోలేక, అవకాశ వాదంగానే భావించారు. సీపీఎం కూటమి మూడో స్థానంలోకి దిగజారడం దాని ఫలితమే. ఇకనైనా మిగిలిన ఆర్థిక, రాజకీయ పోరాటాలతోపాటు ‘బెంగాలీ జాతీయత’ అంశంపై కూడా అక్కడి వామపక్షాలుదృష్టి పెట్టాలి. మరొకమాట. ఈ ఫలితాలతో ఏ ‘జాతీయ పార్టీ’ దేశంలో అన్ని జాతుల (పోనీ రాష్ట్రాల) ఆమోదం పొందిందని చెప్పే వాతావరణం లేదు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా ఏ జాతీయ పార్టీ దేశాన్ని పాలించే స్థాయిలో తీర్పును పొందలేదనే అనిపిస్తున్నది. ఇక కేరళలో ప్రతి ఎన్నికలలోనూ అధి కారంలో ఉన్న కూటమిని ఓడించడం, ప్రతిపక్ష కూటమికి విజయం చేకూర్చడం ఆనవాయితీ. వామపక్షాలకు అడ్డదారులా? ఏది ఏమైనా ఏంగిల్స్ అన్నట్టు ‘ఎన్నికలు ప్రజా చైతన్యానికి గీటురాళ్లు!’ ప్రజా ఉద్యమమే ప్రజా చైతన్యాన్ని పెంచుతుంది. వామపక్షాలు ఈ విషయంపై శ్రద్ధపెట్టి ఎక్కడికక్కడ పాలకుల అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ ధోరణులను ఎండగడుతూ, ఆర్థిక పోరాటాలమీదే కాదు, సామాజిక, జాతీయ అంశాలపై ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంచాలి! ఓట్ల కోసం సీట్ల కోసం అడ్డదారులు తొక్కడం దోపిడీదారుల పార్టీలకు చెల్లుతుందేమోగానీ, వామపక్ష శక్తులకు కాదు. ఏపి విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు 9848069720 -
కెప్టెన్ దుకాణం ఇక బంద్!
అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్‌గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్‌మేకర్‌గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
సీపీఎం సంచలన నిర్ణయం
కేరళలో ఎల్డీఎఫ్కు విజయాన్ని అందించిన కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్‌కు చుక్కెదురైంది. పినరయి విజయన్ను ముఖ్యమంత్రిగా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించేందుకు సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఉదయం తిరువనంతపురంలో సమావేశమైంది. ఈ సమావేశానికి అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్ కరత్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోనే.. విజయన్ను ముఖ్యమంత్రిగా చేస్తామని అగ్రనేతలు చెప్పడంతో అచ్యుతానందన్ నొచ్చుకుని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే సమావేశం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారికంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి ఇంకా ఎక్కడా ప్రకటించలేదు. 92 ఏళ్ల వయసులో కూడా లెఫ్ట్ ఫ్రంట్ విజయం కోసం కష్టపడిన తనను కనీసం కొన్నాళ్లయినా ముఖ్యమంత్రి పదవిలో ఉండనిచ్చి, ఆ తర్వాత పినరయి విజయన్(72)కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని అచ్యుతానందన్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సమావేశం జరుగుతుండగా మధ్యలోనే లేచి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లిపోయారని అంటున్నారు. -
కెప్టెన్ ఎలా ఓడాడంటే..!
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా తానే కింగ్ అన్నాడు. కింగ్ మేకర్ అయ్యే సమస్యే లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తాను మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప.. వేరేవాళ్లను కానివ్వబోనంటూ డీఎంకేతో కూడా పొత్తుకు నై అన్నాడు. చివరకు ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డాడు.. అతడే కెప్టెన్ విజయకాంత్. దాదాపు ప్రతి పార్టీ ఆయన పార్టీ అయిన డీఎండీకేతో పొత్తు పెట్టుకోవాలని భావించాయి. కానీ, ఇప్పుడు చూస్తే తాను పోటీ చేసిన చోట డిపాజిట్ కూడా కోల్పోయాడు. కెప్టెన్ పోటీ చేసిన ఉళుందర్పట్టై స్థానంలో అన్నాడీఎంకే అభ్యర్థి విజయం సాధించగా, డీఎంకే అభ్యర్థి రెండోస్థానంలో ఉన్నారు. కెప్టెన్ ఓడిన విషయం తెలియగానే ట్విట్టర్ రకరకాల జోకులతో మోతెక్కిపోయిది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న డీఎండీకే 41 స్థానాలు గెలవడంతో పాటు రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జయతో కలిసి అధికారం పంచుకున్నా.. ఏడాది తర్వాత బయటకు వచ్చేశాడు. పాలధరలు, బస్సు చార్జీలు పెంచినందుకు తనకు కోపం వచ్చిందని, అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలతో కలిసి ప్రజాసంక్షేమ కూటమి పేరుతో సొంత కుంపటి పెట్టుకుని సీఎం అవుదామని కలలుగన్నాడు. కానీ, ఒకవైపు అన్నాడీఎంకే ప్రభంజనం, మరోవైపు డీఎంకే కూడా 98 సీట్లు సాధించడంతో కెప్టెన్ పార్టీకి, ఆయన కూటమికి కనీసం ఒక్క స్థానం కూడా దక్కకుండా పోయాయి. -
నాటి ల్యాప్‌టాప్‌లే నేటి ఓట్లయ్యాయి!!
ఐదేళ్ల క్రితం కూడా తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని జయలలిత హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆమె సీఎం అయిన తర్వాత విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చారు. అలా తీసుకున్నవాళ్లలో చాలామంది ఈసారి ఎన్నికలు వచ్చే సమయానికి తొలిసారి ఓటుహక్కు పొందారు. సహజంగానే, అమ్మకు ఓట్లు వేసేశారు. అవును.. ఈసారి తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేకతను సైతం తోసిరాజని జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం వెనుక యువ ఓటర్ల ప్రభావం చాలానే ఉందని చెబుతున్నారు. దానికితోడు ఈసారి కూడా పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు, ప్రతి కుటుంబానికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పడం లాంటివి బాగానే పనిచేశాయి. మరోవైపు ఇప్పటికే అమలుచేస్తున్న అమ్మ క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం.. ఇలాంటివి కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మీద బాగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను చాలా ఆలస్యంగా విడుదల చేసింది. అందులో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పెళ్లికూతుళ్లకు బంగారు ఆభరణాలు ఇస్తామని, ఉద్యోగాలు చేసుకునే మహిళలు మోపెడ్లు కొనుక్కుంటే వారికి 50% సబ్సిడీ ఇస్తామని, మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు ఇస్తామని హామీల వర్షం కురిపించారు. అయితే, పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం ఈ ప్రలోభాలకు పెద్దగా లొంగలేదనే చెప్పాలి. ఎందుకంటే చెన్నైలో డీఎంకే 10 స్థానాలు గెలుచుకుంది. ఇలాంటి చోట్ల ఉచిత హామీలు పనిచేయడం కష్టమేనని బ్రాండింగ్ నిపుణుడు డాన్ కవిరాజ్ చెప్పారు. అయితే.. దీర్ఘకాలిక లక్ష్యాల కంటే ఇలాంటి ఉచిత హామీల వల్లే ఓట్లు ఎక్కువగా పడతాయని, వీటివల్ల ఓటర్ల అభిప్రాయాలు మారే అవకాశం కచ్చితంగా ఉంటుందని జేఎన్‌యూలో సెంటర్ ఫర్ పొలిటికల్ సైన్సెస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజయ్ గొడవర్తి అభిప్రాయపడ్డారు. -
అళగిరి దెబ్బ కొట్టాడా?
మదురై.. ఈ ప్రాంతం అంతా కరుణానిధి పెద్దకొడుకు అళగిరికి పెట్టని కోట. అక్కడ ఆయన గీసిందే గీత.. చెప్పిందే వేదం. కానీ అలాంటి మదురై ప్రాంతంలో ఉన్న మొత్తం 10 సీట్లకు గాను డీఎంకే 8 చోట్ల ఓడిపోయింది. ఎందుకిలా జరిగిందని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. అళగిరి ప్రత్యేకంగా డీఎంకేను ఓడించడానికి ఏమీ చేయలేదనే చెబుతున్నారు. కానీ... అతడు ఒక్క మాట చెప్పినా కనీసం ఆరుచోట్ల డీఎంకే గెలిచేది. ఈసారి తాను డీఎంకేకు ఓటు వేసే ప్రసక్తి లేదని ఇంతకుముందే అళగిరి స్పష్టం చేశారు. అంతేకాదు, కొన్ని ప్రచారసభల సమయంలో కూడా అసలు ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఎలా గెలుస్తారన్న కామెంట్లు కూడా చేసినట్లు వినికిడి. అంతేకాదు.. ఆయన మద్దతుదారులంతా కలిసి డీఎంకే ఓటమి కోసం కంకణం కట్టుకుని మరీ పనిచేశారట. డీఎంకే బహిష్కృత నేత అయిన అళగిరి.. తాను తన తండ్రి పార్టీ ఓటమి కోసం ఏమీ చేయలేదని.. అసలు తనకు రాజకీయాలంటేనే ఆసక్తి పోయిందని పైకి చెబుతున్నారు. త్వరలోనే అన్నాడీఎంకేలో చేరుతారన్న ప్రచారం కూడా అళగిరి మీద ఉంది. దాంతో ఆయన కావాలనే తండ్రి పార్టీ ఓటమి కోసం తన అనుచరులతో గట్టిగానే పనిచేయించినట్లు చెబుతారు. పార్టీలోను, కుటుంబంలోను గొడవలు రాకూడదన్న ఉద్దేశంతో పెద్దకొడుకు అళగిరిని కరుణానిధి 1980లలోనే మదురైకి పంపేశారు. అక్కడ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ పార్టీ పత్రిక మురసోలిని నడిపించాలని చెప్పారు. అయినా.. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న కోరిక, తండ్రి తర్వాత సీఎం అవ్వాలన్న ఆకాంక్ష అళగిరిని ఆపలేకపోయాయి. దాంతో చివరకు కరుణ.. పార్టీ నుంచే అతడిని బహిష్కరించారు. -
'అందుకే బీజేపీ ఆ ఒక్క సీటు గెలిచింది'
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల యూడీఎఫ్‌ను కేరళ ఓటర్లు తిరస్కరించారు. కేరళ అభివృద్ధికి ఎల్డీఎఫ్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ ఓట్లు కొన్ని బీజేపీకి బదిలీ అవ్వడం వల్ల ఒక సీటు గెలిచింది. పశ్చిమ బెంగాల్లో మా పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటాం. తమిళనాడులో డబ్బు కీలక పాత్ర పోషించింది. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశాయి. అస్సాంలో మరో సెక్యులర్ ప్రత్యామ్నాయం లేక బీజేపీ గెలిచింది. 15 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది’ అని ఏచూరి పేర్కొన్నారు. -
తాతయ్యకు టాటా చెప్పేశారు...
చెన్నై: తమిళనాడు ప్రజలు తాతయ్యకు టాటా చెప్పి...అమ్మకు మరోసారి పట్టం కట్టారు. దీంతో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి ఖాయమనే సంప్రదాయాన్ని అన్నాడీఎంకే తిరగరాసింది. సంప్రదాయాన్ని పాటిస్తారని, ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశలు పెట్టుకుంటే డీఎంకేకు భంగపాటే మిగిలింది. ఈసారి తనకు అధికారం ఖాయమని, ఆరోసారి ముఖ్యమంత్రి తానే అవుతానని కలలు కన్న కురువృద్ధుడు, డీఎంకే చీఫ్ కరుణానిధికి ఘోర పరాభవమే ఎదురైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'కరుణ' చూపకపోవడంతో డీఎంకే కూటమి పరాజయం పాలైంది. దీంతో ప్రతిపక్ష స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం మాదే, సందేహమైతే సర్వేలు చూడండి అంటూ డీఎంకే శ్రేణులు ధీమా వ్యక్తం చేసినా ఎగ్జిట్ పోల్స్ ఊదరగొట్టినా... అన్నాడీఎంకే మాత్రం అంత సీన్ లేదని స్పష్టం చేసింది. సూర్యబింబం పూర్తిస్థాయిలో వెలుగులు ప్రసరించలేకపోవడంతో రెండాకుల జోరు కొనసాగింది. సీఎంగా సిక్సర్ కొట్టాలనుకున్న కరుణా నిధి ఆశలు అడియాసలు కాగా తంబీల మనసును చూరగొన్న అమ్మ అందలం ఎక్కేందుకు సిద్ధమైంది. తమిళనాడులో మొత్తం 232 సీట్లకు గానూ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 134 స్థానాలు దక్కించుకుంది. ఇక డీఎంకే 97, ఇతరులకు ఒక్క స్థానం దక్కింది. -
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఇలా...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కొన్నిచోట్ల ఊహించినట్లుగానే రాగా.. తమిళనాడులో మాత్రం ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. పశ్చిమబెంగాల్లో ఇంతకుముందు 2011లో జరిగిన ఎన్నికలలో ఇతర పార్టీలతో కూటమిగా పోటీ చేసినప్పటి కంటే, ఈసారి ఒంటరి పోటీలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధిస్తోంది. దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీకి దగ్గరగా ఉంది. అసోంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీఎం తరుణ్ గొగోయ్‌ను కాదని, బీజేపీ నేత శర్వానంద సోనోవాల్‌కు ప్రజలు పట్టంగట్టారు. అలాగే కేరళలో అవినీతి ఆరోపణలలో కూరుకుపోయిన ఊమెన్ చాందీని దించి, ఎల్డీఎఫ్ కూటమిని గెలిపించారు. పుదుచ్చేరిలో మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడేలా ఉంది. వివిధ రాష్ట్రాలలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.. పశ్చిమబెంగాల్ (294) పార్టీ గెలుపు 2011 ఫలితాలు టీఎంసీ 211 184 లెఫ్ట్ 76 62 బీజేపీ 6 ఇతరులు 1 అసోం (126) గెలుపు 2011 ఫలితాలు బీజేపీ 86 05 కాంగ్రెస్ 26 79 ఏఐయూడీఎఫ్ 13 18 ఇతరులు 1 తమిళనాడు (234) ఆధిక్యం గెలుపు అన్నాడీఎంకే 02 131 డీఎంకే 02 97 ఇతరులు 0 0 డీఎండీకే 0 0 కేరళ (140) ఆధిక్యం గెలుపు ఎల్డీఎఫ్ 0 88 యూడీఎఫ్ 1 50 బీజేపీ 0 1 ఇతరులు 0 0 పుదుచ్చేరి (30) గెలుపు 2011 ఫలితాలు కాంగ్రెస్ 17 07 ఏఐఎన్ఆర్సీ 8 15 అన్నాడీఎంకే 4 05 ఇతరులు 1 03 -
రెచ్చిపోయిన తృణమూల్ కార్యకర్తలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు రెచ్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో పార్టీ కార్యక్రతలు సంబరాలు చేసుకున్నారు. అయితే సంబరాలు కాస్తా శ్రుతిమించి హింసకు దారి తీసింది. ఆసన్సోల్లో సీపీఎం కార్యాలయంపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయం లోపలకు చొచ్చుకువెళ్లి ఫర్నిచర్, ఫైళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా కార్యాలయానికే నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికార పీఠం సొంతం చేసుకుంది. కాగా పశ్చిమ బెంగాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అలాగే కేరళలో ప్రజలు అభివృద్ధికి ఓటేశారని ఆయన అన్నారు. తీర్పునిచ్చిన కేరళ ప్రజలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఏచూరి తెలిపారు. -
ఊహించినదే.. నథింగ్ స్పెషల్: నితీశ్
పట్నా: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవే అని, ప్రత్యేకతేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ...గెలుపు సారధిలుకు అభినందనలు తెలిపారు. యూపీలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. -
వరుసగా 13వ సారి ఆయన గెలిచారు
చెన్నై : చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైనా, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు. తిరువరూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 13వ సారి 65వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటివరకూ కరుణానిధి ఇప్పటివరకూ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. కాగా అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. తమిళనాడు ప్రజలు మరోసారి జయలలితకు జై కొట్టారు. ఇక ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావటంతో డీఎంకే భంగపాటు పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను డీఎంకే సొమ్ము చేసుకోలేకపోవడంతో రెండో స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. భారీగా ఉచిత వరాలు ప్రకటించినా, ప్రజలు మాత్రం 'కరుణ' చూపలేదు. అయితే చెన్నై నగరంలో మాత్రం మెజార్టీ స్థానాల్లో డీఎంకే ఆధిక్యం కొనసాగుతోంది. -
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: గొగోయ్
గువహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ అంగీకరించారు. అయితే రాష్ట్రంలో అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ ఇకపై నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని గొగోయ్ అన్నారు. అసోం ప్రజలు గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని, ఈసారి తమకు ప్రతిపక్ష హోదాని ఇచ్చారని తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం తన అధికార నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమని, అయితే ఓటమిపై తాను నిరాశ పడటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు. కాగా అసోంలో కాంగ్రెస్ పరాజయం మూటగట్టుకున్నా, తరుణ్ గొగోయ్ మాత్రం టిటాబోర్ నుంచి విజయం సాధించారు. బీజేపీ సీఎం అభ్యర్థి సర్బానంద సోనోవాల్‌కు తరుణ్ గొగోయ్ అభినందనలు తెలిపారు. కాగా ఈశాన్య భారతంలో తొలిసారి కమలం వికసించింది. దీంతో 15ఏళ్ల కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడినట్లు అయింది. మార్పు కోసమే అసోం ప్రజలు బీజేపీకీ ఓటేశారని ఆపార్టీ సీనియర్ నేత రాంమాధవ్ వ్యాఖ్యానించారు. అసోంలో తమకు 49శాతం ఓట్లు వచ్చాయన్నారు. మరోవైపు బీజేపీ కీలక నేత హిమంత శర్మ విజయం సాధించారు. మరోవైపు అసోంలో విజయం సాధించిన నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
నా తుది శ్వాస వరకూ పోరాడుతా: జయలలిత
చెన్నై: అపూర్వ విజయాన్ని అందించిన తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు చాలవని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. 32ఏళ్ల చరిత్రను తిరగరాసిన జయలలిత మరోసారి అధికార పీఠం ఎక్కనున్నారు. చారిత్రాక విజయం అందించిన ప్రజలకు, మద్దతుదారులకు పురచ్చితలైవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదని, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితమని ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుతాననని, ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తన తుది శ్వాస వరకూ తమిళనాడు అభివృద్ధికి కృషి చేస్తానని జయలలిత స్పష్టం చేశారు. పార్టీ విజయానికి పాటుపడిన పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా తమిళనాట అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. దీంతో జయలలిత నివాసం పోయిస్ గార్డెన్ వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోవైపు అమ్మకు అభినందనలు పరంపర వెల్లువెత్తింది. పార్టీ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు అమ్మ నివాసానికి క్యూ కట్టారు. బాణాసంచా పేల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. -
ఇంత భారీ ఓటమి ఊహించలేదు: సీఎం
ఇంత దారుణమైన, భారీ ఓటమిని తాము ఊహించలేదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే ఫైనల్ అని, ఎన్నడూ ఊహించని ఓటమిని అంగీకరిస్తున్నామని పుత్తుపల్లిలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే తాము భావించాము గానీ అలా జరగలేదన్నారు. ఎందుకిలా జరిగిందన్న విషయాన్ని అంచనా వేసేందుకు చర్చించుకుంటామన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు మాత్రం కేవలం 23 మంది మాత్రమే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూడీఎఫ్ కూటమి మొత్తానికి 46 సీట్లు వచ్చేలా ఉన్నాయి. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కటమికి 92 స్థానాలు వచ్చేలా ఉన్నాయి. బీజేపీ కేవలం ఒక్కచోట గెలిచింది. అయినా.. ఆ పార్టీ కేరళలో బోణీ కొట్టడం ఇదే మొదలు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన పీసీ జార్జి కూడా గెలిచారు. యూడీఎఫ్ చైర్మన్‌గా కూడా తాను ఈ పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఊమెన్ చాందీ చెప్పారు. -
32 ఏళ్ల తర్వాత.. జయలలిత రికార్డు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో రెండు చోట్ల అధికార మార్పిడి జరిగింది. ఆ రెండు చోట్లా పురుషులే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న తరుణ్ గొగోయ్ అసోంలోను, గత ఎన్నికల తర్వాత కేరళ సీఎం అయిన ఊమెన్ చాందీ.. ఇద్దరూ తమ అధికారాన్ని ఈసారి నిలబెట్టుకోలేకపోయారు. అయితే.. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు మహిళలు జయలలిత, మమతా బెనర్జీ మాత్రం చరిత్ర తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తమిళనాడులో నిజానికి ఇప్పటివరకు ఎంజీ రామచంద్రన్ తర్వాత ఏ ఒక్కరూ రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లూ ప్రతిసారీ అధికార మార్పిడి జరుగుతూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం జయలలిత రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ కూడా రికార్డు సృష్టిస్తున్నారు. ఆమె కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. అందులోనూ ఇంతకుముందు ఆమెకు వచ్చిన స్థానాల కంటే కూడా ఎక్కువ వచ్చేలా కనిపిస్తున్నాయి. 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రస్తుతం టీఎంసీకి 184 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 216 స్థానాలలో టీఎంసీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీని దీదీ సాధించినట్లయింది. -
తాను మునిగి.. కరుణను ముంచిన కెప్టెన్
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పరాజయానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కెప్టెన్ విజయకాంతే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కెప్టెన్ తాను మునగడంతో పాటు.. కరుణను కూడా ముంచేశాడని చెబుతున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగానే ఎన్నికల్లో తమంతట తాముగా విజయం సాధించలేని కొన్ని పార్టీలు.. కొంతమేర ఓట్లను చీల్చుకోవడంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు విజయం సాధించడం అసాధ్యం అవుతుంది. తమిళనాడులో సరిగ్గా ఇదే జరిగిందని విశ్లేషకులు వివరించారు. అమ్మ పాలనపై కొంతమేర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో 91 ఏళ్ల వయసులో కరుణానిధి మండుటెండల్లో కూడా ఉధృతంగా ప్రచారం చేయడంతో ఆయన మీద సానుభూతి కలిగింది. కానీ, అదే సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ రంగప్రవేశం చేయడం, ప్రజాస్వామ్య కూటమి పేరుతో కొన్ని పార్టీలను జత చేసుకోవడంతో కొంతమేర ఓట్లు చీలిపోయాయి. చాలా స్థానాల్లో డీఎంకే - అన్నాడీఎంకే అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా అతి స్వల్పంగా ఉంది. అదే డీఎంకే, ప్రజాస్వామ్య కూటమి ఓట్లను కలుపుకొంటే మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టే కెప్టెన్ తాను స్వయంగా సీఎం కాలేకపోయినా.. ముఖ్యమంత్రి కావాలన్న కరుణానిధి ఆశలకు కూడా గండికొట్టారు. -
కెప్టెన్ హీరో కాదు.. జీరోనే!
అంతన్నాడు ఇంతన్నాడే.. గంగరాజు నట్టేట్లో ముంచేశాడే అన్నట్లుగా తయారైంది కెప్టెన్ విజయకాంత్ పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ముఖ్యమంత్రి కుర్చీ సొంతం చేసుకుంటానని చెప్పిన కెప్టెన్.. అసలు ఖాతాయే తెరవలేదు. స్వయంగా విజయకాంత్ కూడా తాను పోటీ చేసిన స్థానంలో వెనుకంజలోనే ఉన్నారు. డీఎండీకే అధినేతగా పరుష వ్యాఖ్యలు చేసి, మీడియాపై కూడా మండిపడిన విజయకాంత్, చివరకు సొంత పార్టీ నేతలపై కూడా అనుచితంగా ప్రవర్తించారు. గురువారం ఉదయం జాతీయ మీడియాలో ప్రసారమైన ఇంటర్వ్యూలో అయితే.. తాను హీరోనని, కరుణానిధి విలన్ అని, జయలలిత లేడీ విలన్ అని కూడా వ్యాఖ్యానించారు. కానీ చివరకు తాను పోటీ చేసిన ఉళుందుర్ పెట్టాయ్ నియోజకవర్గంలో మూడోస్థానంలో నిలిచారు. అక్కడ ఆధిక్యంలో అన్నాడీఎంకే ఉండగా, రెండో స్థానంలో డీఎంకే ఉంది. ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య కూటమిని కూడా ఏర్పాటుచేశారు. రజనీకాంత్‌లా పిరికివాడిని కానని ఒక సమయంలో వ్యాఖ్యానించడంతో రజనీ అభిమానులు కెప్టెన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. తన పార్టీ అభ్యర్థులలో ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయిన విజయకాంత్.. చివరకు తాను కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో కెప్టెన్ తాను మునగడంతో పాటు ఓడను కూడా ముంచేశాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
తమిళనాడులో అంచనా తప్పింది
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్లు ఉత్కంఠ రేపాయి. తొలుత డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపించినా, మళ్లీ అమ్మ పుంజుకుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో కడపటి వార్తలు అందేసరికి అన్నా డీఎంకే 141 స్థానాల్లోను, డీఎంకే 86 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. జాతీయ మీడియా మొత్తం డీఎంకే అధికారంలోకి రావడం ఖాయమని చెప్పగా, అంచనా తప్పింది. స్థానికంగా ఉన్న తమిళ చానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అమ్మకే ఆధిక్యం వస్తోంది. గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. కరుణ కుమార్తె కనిమొళి, కొడుకు స్టాలిన్, ఇంకా ముఖ్యమైన నేతలంతా అక్కడే ఉండి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నారు. తుది ఫలితాలు వెలువడే సమయానికి వాళ్లంతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జయ నివాసం పోయస్ గార్డెన్స్ వద్ద సందడి నెలకొంది. -
మళ్లీ నేనే సీఎం.. నాలుగోసారి మాదే హవా!
గువాహటి: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కొట్టిపారేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మాల్సిన అవసరం లేదని, అందుకే వాటిని తాను అంగీకరించనని చెప్పారు. గతంలోనూ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని ఎన్నో పర్యాయాలు నిరూపితమైందని పేర్కొన్నారు. గతంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించానని నేటి ఫలితాలలో కూడా తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ గెలుపుతో వరుసగా నాలుగోసారి సీఎం తానే అవ్వనున్నట్లు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము అధికారం నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా చేసిందేమి లేదన్నారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నించారు. మరోవైపు అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడయ్యాయి. -
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ లో కొత్త ట్విస్ట్
చెన్నె: తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొత్త మలుపు తిరిగాయి. స్థానిక మీడియాలో జయలలితకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. పోలింగ్ చివరి 2 గంటల్లో అధికార అన్నాడీఎంకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని వెల్లడించింది. అన్నాడీఎంకే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని తంతి టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే 111, డీఎంకే 99, మూడో ఫ్రంట్ 3, పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తెలిపింది. వేదారణ్యం స్థానంలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది. జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఐదు ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి మాత్రమే అన్నాడీఎంకు అధిక సీట్లు వస్తాయని పేర్కొంది. మిగతా నాలుగు డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిపాయి. అన్నాడీఎంకు 139 స్థానాలు ఖాయమని సీఓటర్-టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా కట్టింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ మై ఇండియా ఫలితాలు తిరగబడొచ్చని అన్నారు. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. పుదియ తలైమురై ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 164, డీఎంకే 66 కుముదమ్ రిపోర్టర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 162, డీఎంకే 41, డీఎంకే 15 -
కాంగ్రెస్ పార్టీకి గుదిబండ ఎవరు?
రెండేళ్ల పాలనలో అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేకపోయినా.. మోదీకి మాత్రం ప్రజలు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారట. కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద గుదిబండగా రాహుల్ గాంధీ అవతరిస్తున్నారట. ఈ విషయాలన్నింటినీ ఎవరు చెప్పారో తెలుసా? ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కేవలం అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయాన్నే కాదు.. ఇంకా చాలా సంగతుల గురించి సమాచారం సేకరించాయి. అప్పుడే ఈ పై విషయాలు కూడా తెలిశాయని సెఫాలజిస్టులు చెప్పారు. అసోంలో తరుణ్ గొగోయ్ సుదీర్ఘ పాలనకు అంతం పలుకుతూ తొలిసారి అక్కడ కాషాయ జెండా ఎగరేస్తున్నారని.. బీజేపీ, ఏజీపీ, బీపీఎఫ్‌లతో కూడిన ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తం ఓటర్లలో మూడోవంతు ముస్లింలే ఉన్న అసోంలో హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా పడేందుకు మోదీ- అమిత్ షా పన్నిన వ్యూహాలు గట్టిగా పనిచేశాయని అంటున్నారు. బిహార్, ఢిల్లీలలో ఎదురుదెబ్బ తిన్న అమిత్‌షాకు ఈ విజయం మంచి ఊరట అవుతుందని భావిస్తున్నారు. కేంద్రం విషయానికొస్తే.. మోదీ పాలన ప్రారంభమై రెండేళ్లు దాటుతుండటంతో ఈ పాలనపై కూడా ఎగ్జిట్ పోల్స్ సమయంలో ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలోనే మోదీకి, ఆయన పథకాలకు మంచి మార్కులు వేసిన ఓటర్లు.. రాహుల్ గాంధీ విషయంలో మాత్రం పెదవి విరిచారట. ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద గుదిబండగా తయారవుతున్నాడని కూడా చాలామంది అభిప్రాయపడినట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి. అసోంలో ఇప్పటికే ఉన్న అధికారాన్ని కోల్పోవడంతో పాటు.. పశ్చిమబెంగాల్లో వామపక్షాలతో కలిసినా చావుదెబ్బ తినడం ఆ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటో స్పష్టం చేస్తోందంటున్నారు. తమిళనాడులో డీఎంకేతో కలిసి అధికారాన్ని పంచుకోబోతున్నా.. అక్కడ ప్రాంతీయ పార్టీదే పెద్దన్న పెత్తనం అవుతుంది. పైపెచ్చు, డీఎంకే ఇప్పటికే 2జి స్కాంలో పీకల్లోతు కూరుకుపోయింది. అలాంటి పార్టీతో జతకట్టి, ఒకటి.. అర పదవులు పంచుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండబోదని అంటున్నారు. కేరళలో కూడా అధికారం కోల్పోతోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేంద్రంలో రెండేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదని విమర్శలు వస్తున్నా.. అసోంలో కొత్తగా అధికారం సాధించడంతో పాటు కేరళలో తొలిసారి ఒకటో రెండో స్థానాలలో బోణీ కొట్టబోతోందని అంటున్నారు. దానికితోడు అధికారం రాని రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజాదరణకు మాత్రం లోటు లేదని సర్వేలలో పాల్గొన్నవారు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టడానికి ఇప్పుడప్పుడే సమయం ఆసన్నం కానట్లే అనుకోవాలేమో! -
ఆ రూ. 124 కోట్లు ఎటు వెళ్తాయి?
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా అధికారులు మొత్తం రూ. 178 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో తగిన ఆధారాలు చూపించడంతో రూ. 54 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మిగిలిన రూ. 124 కోట్లు ఎటు వెళ్తాయో.. ఏమవుతాయో తెలుసా? ఈసీ వర్గాలు స్వాధీనం చేసుకున్న దాంట్లో పెద్దవాటా తమిళనాడుదే. ఇక్కడ దాదాపు రూ. 112.89 కోట్లు స్వాధీనమయ్యాయి. అందులో రూ. 46.80 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కలు సరిపోవడంతో వాటిని తిరిగి ఇచ్చేశారు. అలాగే కేరళలో రూ. 24.66 కోట్లు స్వాధీనం చేసుకోగా, రూ. 1.67 కోట్లను తిరిగిచ్చేశారు. నగదుతో పాటు నగలు, వాచీలు, ముక్కుపుడకలు, చెవి రింగులు.. ఇలా చాలావాటిని తాము స్వాధీనం చేసుకున్నామని, వాటిని ప్రస్తుతానికి ఒక గోడౌన్లో ఉంచి తర్వాత వేలం వేస్తామని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖోనీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలువుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ధోవతులు, మద్యం లాంటివాటిని తగలబెట్టేస్తారట. ఇక మిగిలిన డబ్బు మొత్తం రాష్ట్ర ఖజానాకు వెళ్తుంది. దాంతో అక్రమ నగదు కాస్తా సక్రమంగా మారిపోయి.. ప్రజాధనం అవుతుంది. ఏదైనా నగదు స్వాధీనం విషయంలో కేసు నమోదైతే.. వాటిని సాక్ష్యాలుగా లాకర్లో ఉంచుతారు. కేసు తేలిన తర్వాతే వాటిని ఉపయోగించడం లేదా తిరిగి ఇవ్వడం చేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో సింటెక్స్ ట్యాంకులు, మొబైల్ రీచార్జి కార్డులు, మద్యం, చెవిరింగులు, ముక్కు పుడకలు, ధోవతులు... ఇలా చాలా రకాల సామగ్రి ఇచ్చి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. -
లేటు వయసులోనూ ఇరగదీశారు!!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వాళ్లిద్దరూ 90 ఏళ్లు దాటినవాళ్లే. సాధారణంగా ఆ వయసు వచ్చిందంటే కృష్ణా రామా అనుకుంటూ.. ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్లిపోతాడా అని ఎదురు చూస్తుంటారు. కానీ, ఇద్దరు వృద్ధులు మాత్రం తమకు వయసు మీద పడుతున్నా మనసు మాత్రం ఇప్పటికీ యంగే అంటున్నారు. ఎన్నికల బరిలో దూసుకెళ్లి తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. వారిలో ఒకరు తమిళనాడులోని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కాగా, మరొకరు కేరళలో సీపీఎం కురువృద్ధ నేత వీఎస్ అచ్యుతానందన్. కరుణానిధికి రేపు జూన్ 3వ తేదీకి 92 ఏళ్లు నిండుతాయి. ఇక వీఎస్ అచ్యుతానందన్ వయసు ఇంకా ఎక్కువ. ఆయనకు 93 ఏళ్లు. సాధారణంగా రాజకీయాల్లో వయసు గురించి మరీ అంత ఎక్కువగా పట్టించుకోరు. కొన్ని జాతీయ పార్టీల యువజన విభాగాల అధ్యక్షులు 40 ఏళ్లకు పైబడిన వాళ్లు కూడా ఉంటారు. కానీ, 90 ఏళ్లు దాటాయంటే మాత్రం వ్యూహాలు రచించడం, వేగంగా దూసుకెళ్లడం కొంత కష్టమే. అందులోనూ కరుణానిధి చాలా కాలంగా వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. మోటారైజ్డ్ వీల్ చైర్ సాయంతోనే ఆయన తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. దాంట్లోనే వెళ్లి ప్రచారం కూడా చేశారు. ఇటీవల జాతీయ మీడియా ప్రతినిధులు తమిళనాడు ఎన్నికలకు ముందు ఈసారి స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించినప్పుడు కూడా.. డీఎంకే అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని, తనకు ఏమైనా అయితే తప్ప స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేడని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లే ముఖ్యమంత్రి జయలలిత మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలోను, తమిళ ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోను ఆయన ఒకరకంగా విజయం సాధించినట్లేనని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇక కేరళలో కూడా వీఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆయన కూడా 93 ఏళ్ల వయసులోనూ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొంటూ ఎన్నికల్లో దూసుకెళ్లారు. నిజానికి సొంత కూటమిలోనే పినరయి విజయన్ లాంటి నేతల నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీ ఉన్నా.. వాళ్లందరి కంటే తానే దానికి సమర్థుడినని చెప్పడమే కాక, నిరూపించుకున్నారు కూడా. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ కూటమికి దాదాపు 79 వరకు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సాధారణ మెజారిటీ అంటే 71 సీట్లు వస్తే చాలు. దాంతో అచ్యుతానందన్ సీఎం కావడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. -
పుదుచ్చేరిలో హస్తం హవా!
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) ప్రతిపక్ష హోదాకు పరిమితం కాక తప్పదని సర్వేలు అంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామికి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-డీఎంకే 14, ఏఐఎన్ఆర్సీ 9, అన్నాడీఎంకే 2, ఇతరులు 2 సీట్లు దక్కించుకునే అవకాశముందని సీఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్ఆర్సీ 8-12, అన్నాడీఎంకే 1-4 సీట్లు దక్కించుకోనున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది. -
జయలలితకు షాక్!
చెన్నై: తమిళనాడులో 'అమ్మ'కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత నిలుపుకోవడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. కురువృద్ధుడు కరుణానిధిపై తమిళ ఓటర్లు కరుణ చూపారని అంటున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 114-118, అన్నాడీఎంకే 95-99, పీడబ్ల్యూఎఫ్ 14, బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తమిళనాడు న్యూస్ నేషన్ సర్వే వెల్లడించింది. డీఎంకే 124-140, అన్నాడీఎంకే 89-101, బీజేపీ 0-3 సీట్లలో విజయం సాధించే అవకాశముందని తమిళనాడు ఇండియాటుడే అంచనా వేసింది. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తమిళనాడు యాక్సిస్ ఇండియా సర్వే తెలిపింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 69.19 శాతం పోలింగ్ నమోదైంది. 8 జిల్లాల్లో వర్షాలు కురవడంతో పోలింగ్ సమయాన్ని రాత్రి 7 గంటలకు వరకు పొడిగించారు. పోలింగ్ శాతం మరింత పెరగనుంది. ఈ నెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
అసోంలో తొలిసారిగా 'కమల' వికాసం!
గువాహటి: అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అసోం ఓటర్లు చరమగీతం పాడబోతున్నారని వెల్లడించాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 79 నుంచి 93 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఇండియాటుడే-యాక్సిస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 26 నుంచి 33, ఏఐయూడీఎఫ్ కు 6-10 స్థానాలు దక్కే అవకాశముందని వెల్లడించింది. బీజేపీ కూటమికి 81, కాంగ్రెస్ 33, ఏఐయూడీఎఫ్ 10 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఏబీపీ-ఆనంద సర్వే అంచనా వేసింది. బీజేపీ కూటమి 57, కాంగ్రెస్ 41, ఏఐయూడీఎఫ్ 18, ఇతరులు 10 చోట్ల విజయం సాధిస్తారని సీఓటర్ సర్వే తెలిపింది. బీజేపీ కూటమి 90, కాంగ్రెస్ 27, ఏఐయూడీఎఫ్ 9 స్థానాల్లో గెలిచే అవకాశముందని అసోం టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. ఈనెల 19న కౌంటింగ్ జరగనుంది. -
మమతా బెనర్జీకే పట్టం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ రెండో పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని పేర్కొన్నాయి. బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ 178, వామపక్ష కూటమి 110 సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ ఆనంద్ సర్వే వెల్లడించింది. బీజేపీ ఖాతా తెరవనుందని తెలిపింది. ఇతరులు 5 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది. తృణమూల్ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, బీజేపీ 4, ఇతరులు 3 చోట్ల గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. తృణమూల్ 233-253, వామపక్ష కూటమి 38-51, బీజేపీ 1-5 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని బెంగాల్ ఇండియా టుడే సర్వే వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 19న ఓట్లు లెక్కించనున్నారు. -
డబ్బులు ఎవరికి ఇచ్చారు.. ఎవరిచ్చారు: సుష్మా
విదేశాల నుంచి కేరళీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వ్యాఖ్యలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాల నుంచి తాము వేలాది మంది కేరళీయులను విడిపించి తీసుకొచ్చామని, వాళ్లందరికీ డబ్బులు ఎవరు, ఎవరికి చెల్లించారని ఆమె ప్రశ్నించారు. లిబియా నుంచి 29 మంది భారతీయులను విడిపించడానికి తాము డబ్బులు చెల్లించామంటూ చాందీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. తనకైతే ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. భారతదేశ పౌరుల పట్ల ఇది తమ ప్రాథమిక బాధ్యత కాబట్టి తాము ఇదంతా చేస్తున్నాము తప్ప.. ఇందులో డబ్బులకు సంబంధించిన ప్రశ్న లేనే లేదని అన్నారు. ఈనెల 16వ తేదీన కేరళలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాలకు సంబంధం లేని అంశాలను కూడా నేతలు వాడుకుంటున్నారు. Mr.Chandy - We evacuated thousands of Indians from Kerala from Iraq, Libya and Yemen. Who paid for them ? — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You said 'Kerala paid for 29 Indians evacuated from Libya.' — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 Mr.Chandy - You started this debate - as to Who paid ? Not me. We always did this because this is our pious duty towards our citizens. — Sushma Swaraj (@SushmaSwaraj) 12 May 2016 -
ప్రధాని 'సోమాలియా' వ్యాఖ్యలపై భగ్గుమన్న ట్విట్టర్ జనం
'దేవుడి సొంత ప్రదేశం' అని పేరున్న కేరళ రాష్ట్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమాలియాతో పోల్చడంతో ఆయనపై ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కేరళలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. ప్రజల ఆరోగ్యం, అభివృద్ధిలో కేరళ సోమాలియా కన్నావెనుకబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలు, దళిత యువతిపై అత్యాచారం, హత్య లాంటి విషయాల్లో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. అయితే.. మోదీ ఇలా వ్యాఖ్యానించడంపై ట్విట్టర్ జనాలు తీవ్రంగా స్పందించారు. 'పో మోన్ మోదీ' అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇది ఓ మళయాళం సినిమాలోని ఫేమస్ డైలాగ్ 'పో మోనే దినేశా'కు పేరడీ. 'ఇక చాలు, ఇంటికి వెళ్లు' అని దీనికి అర్థం. ఎన్నికల్లో గెలుపు కోసమే ప్రధాని ఇలా వ్యాఖ్యానించారని, రాష్ట్రాన్ని సోమాలియాతో పోల్చడం సిగ్గుచేటని కేరళ సీఎం ఊమెన్ చాందీ అన్నారు. సోమాలియా లాంటి కరువు దేశం లక్షణాలు ఒక రాష్ట్రంలో ఉన్నాయనడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మే 16న కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సోలార్ కుంభకోణం, ఒక మహిళ సీఎం మీద, ఆయన కుమారుడి మీద చేసిన ఆరోపణల లాంటివి సంచలనం సృష్టించాయి. -
ఆమె సూపర్ ఫాస్ట్ గురూ!
ఐదు రాష్ట్రాలకు ఎన్నికల తేదీలు ప్రకటించి మినీ సార్వత్రిక సంగ్రామానికి తెరతీశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. ఆయన అలా తేదీలు ప్రకటించారో.. లేదో, అదేరోజు సాయంత్రం తమ రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనం సృష్టించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలకు కూడా పశ్చిమబెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్నాయి. వీటన్నింటికీ ఒకేసారి తేదీలను ప్రకటించారు. కానీ, ఈ ఐదు రాష్ట్రాల్లో టీఎంసీ తప్ప ఏ ఒక్క పార్టీ కూడా అసలు ఒక్క స్థానానికి కూడా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. మమతమ్మ మాత్రం పెద్ద ఫైలు పట్టుకుని సాయంత్రం మీడియాను పిలిచి మొత్తం అన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెప్పారు. దాంతో ప్రత్యర్థులు సహా ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే ఇంత ప్రిపరేషన్ ఉండటం అసాధ్యమని, దాన్ని సాధ్యం చేసి చూపించిన ఘనత కేవలం మమతకే దక్కుతుందని అంటున్నారు. వరుసగా రెండోసారి కూడా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీ విజయకేతనం ఎగరేయడం దాదాపు ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. మమతా దీదీ ఏర్పాట్లు ఈ స్థాయిలో ఉంటే.. ఇక ప్రత్యర్థి పార్టీలు కోలుకోవడం కష్టంలాగే కనిపిస్తోంది. కమ్యూనిస్టులు సహా మరే ఇతర పార్టీ ఇంకా అసలు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తులు మొదలుపెట్టక ముందే అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకేందుకు సిద్ధంగా ఉంటే.. వాళ్లకు చాలా ఎక్కువ సమయం దొరుకుతుంది. దాంతో విజయావకాశాలు మరింత మెరుగుపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రత్యర్థులకు అందకుండా ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ మహా ఫాస్ట్ అని చెబుతారు. మరీ ఇంత ఫాస్టా అని మిగిలినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట. -
ఇద్దరు మహిళా సీఎంలు మళ్లీ గెలిచేనా?
ఇది ఎన్నికల నామ సంవత్సరం. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీకి శుక్రవారం ఎన్నికల నగారా మోగింది. దేశ రాజకీయాలనే మలుపు తిప్పనున్న ఈ ఎన్నిలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పలు కారణాల వల్ల తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. తమళనాడు సీఎం జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ పార్టీలు మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి. రాజకీయ పరిస్థితులు కూడా వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అదే జరిగితే జయలలిత నాలుగో విడత ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగుతారు. 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెరదించిన మమతా బెనర్జీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఈ ఇరువురు తమ తమ రాష్ట్రాల్లో బలమైన, శక్తిమంతమైన నాయకులే కాకుండా ఇద్దరు మహిళలే అవడం విశేషం కాగా, ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 81 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పవనాలను తట్టుకొని వారు వాటిని గెల్చుకోగలగారు. తమిళనాడులో జయలలిత ప్రధాన ప్రత్యర్థి కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కుస్తీ పడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పొత్తును ప్రకటించడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్న సినీనటుడు విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకే కూడా పొత్తుకు మొగ్గు చూపడం డీఎంకేకు కలిసొచ్చే అవకాశం. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీచేసిన విజయ్‌కాంత్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకొచ్చేసరికి దూరం జరగడం గమనార్హం. తమిళనాడులో కూడా తాము బలమైన శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేసుకోవాలని చూస్తున్న బీజేపీ ఇప్పటికీ విజయ్‌కాంత్‌తో చర్చలు జరుపుతూనే ఉంది. కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ పార్టీ నుంచి వైదొలిగి వేరే పార్టీ పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీన పడింది. జీకే వాసన్ నాయకత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అన్నాడీంకేతో వెళ్లే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. వైకో నాయకత్వంలోని ఎండీఎంకే, మిగతా చిన్న పార్టీలైన వీసీకే, డీకే, సీపీఐ, సీపిఎం, ముస్లిం లీగ్ పార్టీలు కూడా డీఎంకే నాయత్వంలోని కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల డీఎంకే నైతికస్థైర్యం పెరగనుంది. ప్రజాదరణ పొందిన ఎన్నో 'అమ్మ' పథకాలు జయలలితకు కలిసొచ్చే అంశాలు. మమతా దీదీ పట్టు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బలంగా ఉన్నారు. 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఆమె పార్టీ విజయం సాధిస్తూ వచ్చారు. 34 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వామపక్షం ఇప్పటికీ రాష్ట్రంలో బలహీనంగానే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకొని వెళ్లినా మమతకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా రాష్ట్రంలో తృతీయ శక్తిగానే ఉండడంతో టీఎంసీకి, వామపక్షాల నేతృత్వంలోని కూటమి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. చాందీపై ఆరోపణల వెల్లువ కేరళ సీఎం ఊమెన్ చాందీ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అయినా ఊమెన్ చాందీ ఇప్పటికీ పాపులర్ నాయకుడే. పినరయి విజయన్ నాయత్వంలోని ఎల్డీఎఫ్ ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటు కేరళ ఓటర్లకు ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పటికే వెలువడిన పలు పోల్ సర్వేలు కూడా లెఫ్ట్ ఫ్రంట్కే పట్టం గడుతున్నాయి. అయితే విజయన్, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ వర్గాలు ఆధిపత్యం కోసం పోటీ పడడం ప్రతికూల అంశం. రికార్డు సీఎం.. తరుణ్ గొగోయ్ అసోంలో ఎక్కువ కాలం కొనసాగుతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తరుణ్ గొగోయ్ ఇప్పటికే రికార్డు సృష్టించారు. గత 15 సంవత్సరాలుగా ఆయనే సీఎం. ఆయనను తప్పించేందుకు పార్టీలోనే ఎన్నో ప్రయత్నాలు, కుట్రలు జరిగినా తన చాతుర్యంతో పదవిని నిలబెట్టుకున్నారు. ఒకప్పటి ఆయన సన్నిహితుడు హిమంత విశ్వశర్మ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ తన కేంద్రమంత్రి సర్వానంద సోనోవాల్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అసోం గణ పరిషత్ పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అంశం. మరో పార్టీ ఏయూడీఎఫ్ ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకోవడం, 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో కొనసాగడం, ఏజీపీతో పొత్తు కారణంగా ఈసారి బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. కొత్త పార్టీతో రంగస్వామి కేవలం 30 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని పెట్టిన ఎన్ రంగస్వామి.. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన పాపులర్ లీడర్. -
నోటాకూ ఓ ఎన్నికల గుర్తు!
నోటా... భారతీయ ఎన్నికల విధానంలోనే ఓ విప్లవాత్మక మార్పు. పైన ఉన్న అభ్యర్థులెవరూ తమకు ఇష్టం లేని పక్షంలో ఓటుహక్కును వదులుకోకుండా.. ఓటు వేస్తూనే, ఎవరికీ వేయకుండా ఉండే పద్ధతి ఇది. ఇన్నాళ్లూ దానికి 'నోటా' అనే ఇంగ్లీషు అక్షరాలు మాత్రమే ఈవీఎంలో కనిపించేవి. కానీ తొలిసారిగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నోటాకు కూడా ఓ గుర్తును ఉపయోగించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును ప్రకటించే సందర్భంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్‌తో సంప్రదించి, ఓ గుర్తును రూపొందించామని ఆయన మీడియాకు చెప్పారు. 2013 అక్టోబర్ 11వ తేదీ నుంచి నోటా అమలులోకి వచ్చింది. -
ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తాం
ఎన్నికల షెడ్యూలు అలా విడుదల అయ్యిందో లేదో... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే తన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఆరు దశల్లో పశ్చిమబెంగాల్‌కు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మమత చెప్పారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియా ఈసారి సిలిగురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నారు. అలాగే ఉత్తర హౌరా నుంచి లక్ష్మీరతన్ శుక్లా, బాలీ నుంచి వైశాలి దాల్మియా పోటీ చేస్తారని ఆమె అన్నారు. 2011 ఎన్నికలలో తమ పార్టీ తరఫున మొత్తం 31 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారని, ఈసారి వారి సంఖ్య 45కు పెరిగిందని మమత వివరించారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌కు 2011లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌యూసీ పార్టీలతో కలిసి టీఎంసీ పోటీచేసింది. అప్పట్లో ఈ కూటమికి మొత్తం 227 స్థానాలు వచ్చాయి. టీఎంసీ ఒక్కటీ విడిగా 184 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 42, ఎస్యూసీకి ఒక స్థానం దక్కాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మెజారిటీ సొంతంగానే దక్కడంతో ఈసారి ఒంటరిపోరువైపే మమత మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ!
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో అధికార బీజేపీ ప్రభుత్వం గట్టిపోటిని ఎదుర్కోంటుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటినిస్తోంది. మొత్తం 90 స్ఠానాల్లో ఇప్పటి వరకు 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల సమాచారం ప్రకారం బీజేపీ 38, కాంగ్రెస్ పార్టీ 41, 4 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నాయి. గత అసెంబ్లీలో బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. దంతేవాడ లో దివంగత కాంగ్రెస్ నాయకుడు మహేంద్ర కర్మ సతీమణి దేవతి కర్మ అధిక్యం -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే విజయం: అమిత్ జోగి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అమిత్ జోగి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55-60 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల బీజేపీ దుష్ప్రరిపాలనకు ఛత్తీస్‌గఢ్ ఓటర్లు ముగింపు పలుకుతారని కాంగ్రెస్ నేత ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు, చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న 72 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ఇక అజిత్ జోగి, అమిత్ జోగి, ఆయన భార్య... కోటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘ముందస్తు’కు కాంగ్రెస్ కసరత్తు?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నదా..? ఢిల్లీలో పరిణామాలు, అందుతున్న సంకేతాలు ఈ దిశగానే ఉన్నాయంటూ పీటీఐ వార్తాసంస్థ కథనం తెలియజేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో కోసం 15 రోజుల్లోగా సమాచారం పంపాల్సిందిగా శుక్రవారంనాడు వివిధ రాష్ట్రాల విభాగాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి వర్తమానమందింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు దేశం మొత్తానికి వర్తించే సూచనలు, సలహాలు కూడా పంపించవచ్చని కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నవంబర్ - డిసెంబర్లలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టవచ్చని ఆ వర్గం పేర్కొంటున్నది. అదీగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక మెరుగైన ఫలితాలు సాధించలేకపోతే తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందని ఆ వర్గం హెచ్చరిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరగాల్సి ఉంది. అయితే మరి కొందరు నాయకులు మాత్రం ముందస్తు ఎన్నికల ఊహాగానాలను కొట్టిపడేస్తున్నారు. చివరిరోజు వరకూ పదవీకాలం పూర్తి చేయడానికే పార్టీ మొగ్గుచూపుతుందంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడం కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఏఐసీసీ ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని నియమించింది. పొత్తుల అంశాన్ని పరిశీలించడం కోసం సీనియర్ నాయకుడు, రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నాయకత్వంలో ఉప సంఘాన్ని కూడా నియమించారు. అయితే ఆంటోనీ కమిటీ ఇప్పటివరకూ పని ప్రారంభించిన దాఖలాలు లేవు. కమిటీ ఇంతవరకూ ఎన్నిసార్లు సమావేశమైందనే విషయాన్ని కూడా ఆంటోనీ వెల్లడించడం లేదు. మేనిఫెస్టో, ప్రభుత్వ కార్యక్రమాలపై వేసిన ఉపసంఘానికి కూడా ఆంటోనీయే నాయకత్వం వహిస్తున్నారు. కమ్యూనికేషన్, పబ్లిసిటీపై ఉపసంఘానికి దిగ్విజయ్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.