న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఐదు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది.
స్థానిక నాయకత్వం..
ఇదే ఏడాది కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉపఎన్నికలలోనూ బీజేపీ వెనుకబడటంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ పార్టీ ప్రధానంగా 'మోదీ నాయకత్వాన్ని' నమ్ముకోగా రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో 'పార్టీ సమిష్టి నాయకత్వానికి' పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యమున్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం.
నో వారసత్వం..
ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఎలాంటి ప్రస్తావన చేయకుండా ఉంటే స్థానిక నాయకులకు తమ అభ్యర్థిత్వాన్ని బలపరచుకునే అవకాశం కల్పించినట్లు ఉంటుందన్నది అధిష్టానంని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదే విధంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోన్న ప్రధాని తమ పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. ప్రస్తుత సంచరం ప్రకారం బీజేపీ ఒక కుటుంబం నుంచి ఒకే టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్..
ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి తోడు నలుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ జనరల్ సెక్రెటరీ విజయ్ వర్గియా కూడా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారు. శివరాజ్ సింగ్ భవితవ్యంపై ఎలాంటి సూచనలు లేని కారణంగా వీరిలో ఎవరినైనా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్..
బీజేపీ అదే ఫార్ములాను రాజస్థాన్‌లో కూడా అమలు చేయాలని చూస్తోంది. ఇక్కడైతే బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధికి కొదవే లేదు. గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్, కిరోడీ లాల్ మీనా, దియా కుమార్, రాజ్యవర్ధన్ రాథోడ్, సుఖవీర్ సింగ్, జౌన్‌పురియాలతో పాటు సింధియా రాజ కుటుంబీకురాలు వసుంధరా రాజే కూడా ఉండనే ఉన్నారు. వీరిలో కూడా అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ యోచన.
ఛత్తీస్‌గడ్..
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ కాస్త భిన్నమైన ప్రణాలికను అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్ మేనల్లుడు విజయ్ బాఘేల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కుటుంబ వైరం ద్వారా లబ్దిపొంది పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపీ అధిష్టానం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. విజయ్ ఈసారి ఎన్నికల్లో పఠాన్ జిల్లాలోని దుర్గ్ నుంచి పోటీ చేయనున్నారు. 2003 నుంచి భూపేష్, విజయ్‌ల మధ్య ఈ స్థానంలో ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. వీరితోపాటు కేంద్రమంత్రి రేణుకా సింగ్, రాజ్యసభ ఎంపీ సరోజ్ పాండే తోపాటు మాజీ ముఖ్యమంత్రి రామం సింగ్ కూడా ఉన్నప్పటికీ బాఘేల్ కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చింది బీజీపీ అధిష్టానం.
తెలంగాణ..
ఇప్పటివరకు దక్షిణాదిన ఖాతా తెరవని బీజేపీకి ఈసారి కొద్దోగొప్పో ఊరటనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. మిషన్ సౌత్‌లో భాగంగా ఇక్కడ కూడా సీఎం అభ్యర్థిత్వానికి నాయకుల మధ్య పోరే కొలమానం కానుంది. ఇక్కడ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ లలో ఎవరైనా సీఎం కావచ్చు. అభ్యర్థిని మాత్రం ముందు ప్రకటించకుండా ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని సూచించింది.
మిజోరాం..
ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో క్లిష్టతరమైన రాష్ట్రం మిజోరాం. ఈ రాష్ట్రానికి పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో జరిగిన అల్లర్లు ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయండంలో సందేహంలేదు. దీంతో బీజేపీ ఇక్కడ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరముంది. వారి ప్రధాన అజెండా 'మోదీ నాయకత్వం' 'స్థానిక సమిష్టి నాయకత్వం' రెండూ ఇక్కడ పనిచేయకపోవచ్చు.
ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక
Comments
Please login to add a commentAdd a comment