ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అయితే మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? అనేదానిపై బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నవారి వారి జాబితా భారీగానే ఉంది. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి పీఠాలను ఎవరికి కట్టబెడతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. దీనిగురించి ఢిల్లీలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం విషయంలో బీజేపీ ఎప్పుటికి నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న అలానే మిగిలివుంది.
సోమవారం (డిసెంబర్ 11) జరగనున్న శాసనసభా పక్ష సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. అదే సమయంలో ఆదివారం (డిసెంబర్ 10) రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనేది ఆరోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రుల ఎంపిక కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు ముగ్గురు చొప్పున పరిశీలకులను బీజేపీ నియమించింది. రాజస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే వ్యవహరిస్తుండగా, మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గడ్‌లకు మనోహర్ లాల్ ఖట్టర్ , కే లక్ష్మణ్, ఆశా లక్రా పరిశీలకులుగా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా నియమించారు.
రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, మహంత్ బాలక్‌నాథ్ పేర్లు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగే శాసనసభా పక్ష సమావేశం తర్వాత ఇక్కడ సీఎం ఎవరనేది తేలనుంది. మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది డిసెంబర్ 11 నాటికి తెలియనుంది. సోమవారం భోపాల్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే సీఎం పేరు ఖరారు కానుంది.
కాగా రాజస్థాన్‌లోని 199 స్థానాలలో భారతీయ జనతా పార్టీ 115 సీట్లు గెలుచుకుంది. ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని 230 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 163 సీట్లు వచ్చాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ
Comments
Please login to add a commentAdd a comment