New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
సీఎం అభ్యర్థులు వీళ్లే..?
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది.
బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment