ఎన్నికలకు ముందే ఓటర్లకు డబ్బుల వరద!
Published Fri, Nov 11 2016 1:15 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
వచ్చే సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ వాటి కోసం ఇబ్బడి ముబ్బడిగా నిధులు సమీకరించుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఒక్కసారిగా ఉరుము లేని పిడుగులా పెద్దనోట్ల రద్దు ప్రకటన వచ్చింది. దాంతో ఈ డబ్బునంతా ఏం చేయాలో అర్థం కాక రాజకీయ పార్టీలు సతమతం అవుతున్నాయి. అయితే ఇందుకు ఒక తరుణోపాయాన్ని కూడా వాళ్లు కనుగొంటున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ముందస్తు గానే గ్రామీణ ఓటర్లకు డబ్బులు పంచేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకళ్ల దగ్గరే ఎక్కువ మొత్తం ఉంటే దాన్ని మార్చుకోవడం కష్టం అవుతుంది గానీ, డిసెంబర్ నెలాఖరులోపు వాటిని గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్ల వద్దకు చేరిస్తే.. వాళ్లు బ్యాంకులలో మార్చుకుని వినియోగించుకుంటారని, చివరి నిమిషంలో ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బు పంపిణీపై ఉండే నిఘానుంచి కూడా తప్పించుకోవచ్చని సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. యూపీలో త్రికోణ పోటీ తథ్యం కావడంతో అక్కడి పార్టీలన్నీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా సమాజ్‌వాదీ, బీఎస్పీ, బీజేపీ.. ఈ మూడు పార్టీల మధ్య పోరు చాలా గట్టిగా ఉంటుందని, ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఇప్పటివరకు వెల్లడైన ఎన్నికల సర్వేలలో తేలింది. దాంతో అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలను ముందుగానే సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగానే డబ్బులకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద మొత్తంలో ఉన్న డబ్బును డిసెంబర్ నెలాఖరు తర్వాత ఏమీ చేయలేం కాబట్టి.. ఈలోపే ఓటర్ల వద్దకు చేరిస్తే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ, చిట్టచివరి నిమిషంలో ఎవరు డబ్బులిస్తారన్నదే ఎన్నికల్లో ఓట్ల తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దాంతో ఒకవేళ ఇప్పుడు ఓటు కాంట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో డబ్బులు పంపిణీ చేసినా.. అది ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందన్నది అనుమానంగానే ఉంది. కానీ దగ్గరే ఉంచుకుంటే మాత్రం డిసెంబర్ నెలాఖరు తర్వాత అవి చిత్తుకాగితాలతో సమానం అవుతాయి. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి ఈ షాక్ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు పార్టీలో అంతర్గత తగాదాలు దాదాపు ప్రతిరోజూ పత్రికల ప్రధాన శీర్షికలలోనే ఉండేవి. కానీ, పెద్దనోట్ల రద్దు అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత.. అసలు ఆ పార్టీ విషయాలేవీ అసలు చర్చకే రావడం లేదు. పంజాబ్‌లో మాత్రం ప్రస్తుతం నదీజలాల వ్యవహారం నడుస్తోంది కాబట్టి కాస్తంత రాజకీయ వేడి కనిపిస్తోంది. మొత్తమ్మీద ముందస్తు డబ్బు పంపిణీ అనేది ఇప్పటివరకు భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఈసారి జరుగుతుందేమో చూడాలి.
Advertisement
Advertisement