
ఆ రూ. 124 కోట్లు ఎటు వెళ్తాయి?
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా అధికారులు మొత్తం రూ. 178 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో తగిన ఆధారాలు చూపించడంతో రూ. 54 కోట్లు తిరిగి ఇచ్చేశారు. మిగిలిన రూ. 124 కోట్లు ఎటు వెళ్తాయో.. ఏమవుతాయో తెలుసా?
ఈసీ వర్గాలు స్వాధీనం చేసుకున్న దాంట్లో పెద్దవాటా తమిళనాడుదే. ఇక్కడ దాదాపు రూ. 112.89 కోట్లు స్వాధీనమయ్యాయి. అందులో రూ. 46.80 కోట్ల నగదుకు సంబంధించిన లెక్కలు సరిపోవడంతో వాటిని తిరిగి ఇచ్చేశారు. అలాగే కేరళలో రూ. 24.66 కోట్లు స్వాధీనం చేసుకోగా, రూ. 1.67 కోట్లను తిరిగిచ్చేశారు.
నగదుతో పాటు నగలు, వాచీలు, ముక్కుపుడకలు, చెవి రింగులు.. ఇలా చాలావాటిని తాము స్వాధీనం చేసుకున్నామని, వాటిని ప్రస్తుతానికి ఒక గోడౌన్‌లో ఉంచి తర్వాత వేలం వేస్తామని తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖోనీ తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలువుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు. ధోవతులు, మద్యం లాంటివాటిని తగలబెట్టేస్తారట. ఇక మిగిలిన డబ్బు మొత్తం రాష్ట్ర ఖజానాకు వెళ్తుంది. దాంతో అక్రమ నగదు కాస్తా సక్రమంగా మారిపోయి.. ప్రజాధనం అవుతుంది. ఏదైనా నగదు స్వాధీనం విషయంలో కేసు నమోదైతే.. వాటిని సాక్ష్యాలుగా లాకర్‌లో ఉంచుతారు. కేసు తేలిన తర్వాతే వాటిని ఉపయోగించడం లేదా తిరిగి ఇవ్వడం చేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో సింటెక్స్ ట్యాంకులు, మొబైల్ రీచార్జి కార్డులు, మద్యం, చెవిరింగులు, ముక్కు పుడకలు, ధోవతులు... ఇలా చాలా రకాల సామగ్రి ఇచ్చి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.