రాత్రి 9.30 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం వైపు అడుగులేస్తోంది. 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 72 సీట్లలో మాత్రమే విజయం సాధించడంతో అధికారాన్ని కోల్పోనుంది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వసుందర రాజే తన పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ 89 చోట్ల విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 101.
రాత్రి 8.30 : రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఎవరినీ, ఏ ఒక్క పార్టీని కూడా పంపించి వేయమని అన్నారు. బీజేపీ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది.
రాత్రి 8 : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం లాల్ తన్‌హల్వా తన పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో 36 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితమైంది. ఎంఎన్‌ఎఫ్ 26 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టనుంది.
సాయంత్రం 7.30 : మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జొరాంతంగా.. గవర్నర్ కె.రాజశేఖరన్‌ను కలిశారు. 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
సాయంత్రం 7: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
సాయంత్రం 6.30 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ 104, బీజేపీ 71, బీఎస్పీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీఎం వసుంధర రాజే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. మరోవైపు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పట్లానే తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఆరెల్డీ భరత్‌పూర్ స్థానంలో లీడింగ్ ఉంది.
సాయంత్రం 6 : మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) అధికారం చేపట్టనుంది. మొత్తం 40 స్థానాలకు గాను ఆ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందామనునకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితం కాగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ తనహల్వా ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన పోటీచేసిన రెండు చోట్లా ఓటమిచెందారు.
సాయంత్రం 4.15 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 98, బీజేపీ 65, బీఎస్పీ 5, సీపీఎం 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతుండడంతో.. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది.
సాయంత్రం 4 : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ 37,500 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మధ్యాహ్నం 3.00: మధ్యప్రదేశ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మెజారిటీ ఇరు పార్టీలతో దోబుచులాడుతోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 112, బీజేపీ 108, బీఎస్పీ 4, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మధ్యాహ్నం 2.30: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది.
మధ్యాహ్నం 1.30: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో తొలుత వెనకంజలో ఉన్న సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మధ్యాహ్నం 12.50: రాజస్తాన్‌లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం సచిన్ పైలట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
మధ్యాహ్నం 12.20: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.
మధ్యాహ్నం 12.10: ఛత్తీస్‌గఢ్‌లో విజయం దిశగా కాంగ్రెస్
ఉదయం 11.20: రాజస్తాన్‌లో కాంగ్రెస్ విజయం రాహుల్ గాంధీకి మేము అందించే కానుక- సచిన్ పైలెట్
ఉదయం 10.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. మిజోరంలో ఎంఎన్‌ఎఫ్ జోరు కొనసాగుతుంది. ఐజ్వాల్‌లోని ఎంఎన్‌ఎఫ్ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.
ఉదయం 10.10: ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముందజలో కొనసాగుతుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఉదయం 9.50: రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.
ఉదయం 9.40: మిజోరంలో ఎంఎన్‌ఎఫ్ ముందజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఉదయం 9.20: సచిన్ పైలట్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజోరంలో ఎంఎన్‌ఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఉదయం 9.10: జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు.
ఉదయం 8.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది.
ఉదయం 8.25: తొలి ట్రెండ్స్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
ఉదయం 8.00: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
ఉదయం 7.30: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్ (199), ఛత్తీస్‌గఢ్ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది.
Comments
Please login to add a commentAdd a comment