Mizoram Election Result 2018
-
మిజోరం కొత్త సీఎం ప్రమాణం
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) అధ్యక్షుడు జోరంథంగా శనివారం ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ రాజశేఖరన్ ఐజ్వాల్‌లోని రాజ్ భవన్లో ప్రమాణం చేయించారు. మిజోరాం శాసనసభలో మొత్తం 40 స్థానాలుండగా ఇటీవలి ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 సీట్లు గెలవడం తెలిసిందే. జోరంథంగా 1998, 2003ల్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 11 మంది మంత్రుల్లో ఐదుగురు కేబినెట్ మంత్రులు. తాన్లూ్యయాకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. గతపదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరిన లాల్జిర్లియానాకు కూడా కేబినెట్ మంత్రి పదవి దక్కడం గమనార్హం. తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బైబిల్లోని వాక్యాలను చదివి ప్రార్థనలు చేశారు. క్రైస్తవ పాటలను కూడా ఆలపించారు. తొలిసారిగా జోరంథంగా, ఆయన మంత్రులు మిజో భాషలో ప్రమాణం చేశారు. -
‘మిజోరం’థంగ ప్రభంజనం
ఐజ్వాల్/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి గత నెల 28న జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) విజయదుందుభి మోగించింది. తాజాగా మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా, అధికార కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లకే పరిమితమయింది. అంతేకాకుండా మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లా పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు చంఫాయి సౌత్, సెర్ఛిప్ల్లో ఓటమి పాలయ్యారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే సీటుకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో ఎంఎన్ఎఫ్ 37.6 శాతం, కాంగ్రెస్ పార్టీ 30.2 శాతం, బీజేపీ 8 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 21 స్థానాలు అవసరం కావడంతో దాదాపు పదేళ్ల తర్వాత ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరంథంగ(74) మిజోరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్ఎంఎఫ్ నేతలు జోరంథంగను పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. దీంతో జోరంథంగ మంగళవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ కె.రాజశేఖరన్‌ను కలుసుకున్నారు. అసెంబ్లీలో తమకే మెజారిటీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్ఈడీఏ), ఎన్డీయేలో తాము భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ లేదా కాంగ్రెస్ తో కలిసి మిజోరంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము 26 స్థానాలు సాధించినందున సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, రోడ్ల పునరుద్ధరణ, సామాజిక–ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల(ఎస్‌ఈడీపీ)ను చేపడతామని ప్రకటించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా.. గవర్నర్‌ను కలుసుకుని రాజీనామాను సమర్పించారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రతిపక్షాల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేశామన్నారు. మిజోరం అసెంబ్లీకి 2008, 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా 32, 34 స్థానాలతో అధికారాన్ని నిలుపుకుంది. తాజా ఓటమితో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రకంపనలు రేపుతున్న పుస్తకం.. తీవ్రవాదిగా పనిచేసే రోజుల్లో జోరంథంగ మిజో భాషలో ‘మిలరి’అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో ఈశాన్య భారతంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు చైనా, పాక్‌లు ఏవిధంగా సాయం చేశాయో ఆయన విపులంగా వివరించారు. మిజో తీవ్రవాదులకు ఢాకాలో పాక్ శిక్షణ, ఆయుధాలను అందించడాన్ని, 1971 యుద్ధం తర్వాత ఈ సాయం ఆగిపోవడాన్ని అందులో ప్రస్తావించారు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోరంథంగ మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో మయన్మార్‌లోని అటవీప్రాంతం గుండా కొన్ని రోజులపాటు నడిచితూర్పుపాకిస్తాన్(బంగ్లాదేశ్)లో ఆశ్రయం పొందేవాళ్లమని తెలిపారు. మిలరీ పేరుతో రాసిన తన ఆత్మకథను త్వరలోనే విడుదల చేస్తానని ప్రకటించారు. అయితే ఇందులోని అంశాలు వివాదాస్పదం అవుతాయనీ, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లకు మింగుడుపడబోవని వ్యాఖ్యానించారు. ప్రత్యేక మిజోరం ఉద్యమం సమ యంలో తాము చైనా సుప్రీం లీడర్ మావో, ప్రధాని చౌ ఎన్ లై, కమ్యూనిస్టు నేతలు లిన్బావో, చియాంగ్ చింగ్‌తో భేటీ అయ్యామని జోరంథంగ బాంబు పేల్చారు. భారత్‌లో అశాంతి సృష్టించేందుకు అప్పట్లో తమలాంటి గెరిల్లాలకు చైనా ప్రభుత్వం ఆయుధాలు అందజేసిందని గుర్తుచేసుకున్నారు. ఇంగ్లిష్ సాహిత్యం నుంచి తీవ్రవాదం వైపు.. ఇంఫాల్‌లోని డీఎం కళాశాలలో డిగ్రీ చదివేరోజుల్లో తీవ్రవాదం పట్ల ఆకర్షితులైన జోరంథంగ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)లో చేరారు. ఈ ప్రాంతంలో 1959లో కరువు సందర్భంగా మిజో పర్వతప్రాంతాల్లో వందలాది మంది ఆకలికి అలమటించి, ప్లేగు వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలకు ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు మిజో కల్చరల్ సొసైటీ అనే సంస్థ ముందుకొచ్చింది. కాలక్రమంలో ఇది మిజో నేషనల్ ఫెమిన్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్ఎఫ్)గా, చివరికి మిజో నేషనల్ ఫ్రంట్‌గా మారింది. 1966, మార్చి 1న ఎంఎన్ఎఫ్ నేత లాల్డెంగా నేతృత్వంలోని ఈ సంస్థ భారత్ నుంచి మిజోరంకు స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ సందర్భంగా ఉద్యమంలో చేరిన జోరంథంగ లాల్డెంగా విశ్వాసాన్ని చూరగొ న్నారు. దీంతో ఆయన 1969లో ఎంఎన్ఎఫ్ కార్య దర్శిగా, మరో పదేళ్లకు ప్రవాసంలో ఉన్న మిజోరం ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. అజ్ఞాతంలో ఉంటూనే బీఏ(ఇంగ్లిష్ ఆనర్స్) ఉత్తీర్ణులయ్యారు. శాంతిచర్చల సందర్భంగా మిజోరం ప్రతినిధిగా లాల్‌డెంగాతో కలిసి పాక్, యూరప్‌లో జోరంథంగ పర్యటించారు. చివరికి భారత ప్రభుత్వంతో 1986, జూన్ 30న శాంతిఒప్పందం కుదరడంతో మరుసటి ఏడాది మిజోరం రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో లాల్డెంగా ముఖ్యమంత్రిగా, జోరంథంగ ఆర్థికం, విద్యాశాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. 1990, జూలై 7న లాల్డెంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో చనిపోవడంతో ఆ యన స్థానంలో జోరంథంగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1998, 2003లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల పాటు మిజోరంను పాలిం చారు. 2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిపాలైంది. -
కాంగ్రెస్ ముక్త ఈశాన్యం
మిజోరం ఓటర్లు సంప్రదాయానికి కట్టుబడ్డారు. ప్రతి పదేళ్లకు అధికారపార్టీని మార్చే సంప్రదాయానికి అనుగుణంగా 2008 నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తప్పించి మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)కు పట్టంకట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనీ, తద్వారా ఈశాన్య భారతంలో కనీసం ఒక్క రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో స్థానిక పార్టీలతో కలిసి అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలు సైతం కల్లలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అభివృద్ధి కుంటుపడటం, మంత్రుల అవినీతి.. వెరసి ఎంఎన్ఎఫ్కు ప్రజలు మొత్తం 40 సీట్లలో 26 స్థానాలను కట్టబెట్టారు. ఎంఎన్ఎఫ్ శాసససభా పక్షనేతగా మంగళవారం ఎన్నికైన ఆ పార్టీ అధ్యక్షుడు జోరంథంగ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్‌ను నమ్మని మిజోలు.. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం ఐదు సీట్లకే పరిమితం కావడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తున్న సమయంలో కూడా మిజోరంలో తన పట్టునిలుపుకున్న కాంగ్రెస్ ఈ సారి దారుణంగా దెబ్బతింది. 2008లో 32 సీట్లు, 2013 ఎన్నికల్లో 34 సీట్లు గెలుచుకుని బలాన్ని పెంచుకుంటూ వస్తుండటంతో ఈ సారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. మోదీ హవానే తట్టుకుని నిలబడ్డ ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా చరిష్మాతో ప్రభుత్వ వ్యతిరేకతను సులభంగా అధిగమించవచ్చన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కాంగ్రెస్ రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్నా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. దీనికితోడు పలువురు కాంగ్రెస్ మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, ఎన్నికలకు ముందు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరడం వంటివి పార్టీ పతనానికి దారి తీశాయని వ్యాఖ్యానిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అమల్లో ఉన్న సంపూర్ణ మద్య నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సడలించడం ఓటమికి మరో కారణమంటున్నారు. బీజేపీ భగీరథ ప్రయత్నం.. మిజోరంలో పాగా వేసేందుకు కమలనాథులు గత 25 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఈసారి కూడా ఫలించలేదు. మిజోరంలోని 40 నియోజకవర్గాల్లో 39 స్థానాల్లో ఈసారి బీజేపీ అభ్యర్థులను నిలబెట్టగా ఒక్క బుద్ధాధన్ ఛక్మా మాత్రమే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాగంగా తమపై ఉన్న హిందుత్వ పార్టీ ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలను అమలు చేసింది. మిజోరంలో 87 శాతం ప్రజలు క్రైస్తవులే. ఈ నేపథ్యంలో ఇద్దరు మతాధికారులకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ హయాంలో క్రైస్తవులకు రక్షణ లేదనీ, బీజేప ప్రభుత్వం ఏర్పడితే మరింత మెరుగైన శాంతిభద్రతలు ఏర్పడుతాయని ప్రచారం చేసింది. మిజోరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. రాబోయే క్రిస్మస్ పండుగను మిజోలు బీజేపీ పాలనలో చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అయితే మద్య నిషేధం సహా బీజేపీ తమ మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను మిజోరం ప్రజలు నమ్మలేదు. పదేళ్ల తర్వాత అధికారం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి, కుంటుపడిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్‌కు కలిసివచ్చాయి. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల, 2013 ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఎన్ఎఫ్ ఈ సారి ఏకంగా 26 సీట్లు దక్కించుకోవడం ఘనవిజయమని ఎన్నికల విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం తెస్తామన్న ఎంఎన్ఎఫ్ హామీని ప్రజలు విశ్వసించారని అందుకే దానిక ఓటేశారని వారంటున్నారు. బీజేపీకి తమకు సంబంధం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టామని పార్టీ అధినేత జోరంథంగ చెప్పారు.పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, సరైన రోడ్లు కూడా లేక ప్రజలు అవస్థలు పడ్డారని ఆయన అన్నారు. సైద్ధాంతికంగా ఎంఎన్ఎఫ్–బీజేపీల మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నప్పటికీ, యూపీఏ కంటే ఎన్డీఏ వల్లే ప్రజలకు మేలు కలుగుతుందన్న భావనతో ఎన్డీయే కూటమిలో చేరామన్నారు. పొత్తును మిజో ప్రజలు అర్థం చేసుకున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. -
అంతా రాహుల్ వల్లే..
న్యూఢిల్లీ: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ పాలిట ముప్పుగా మారారా? 2019 లోక్‌సభ ఎన్నికలనాటికి రాహుల్ ప్రాభవం దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరిస్తుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబిస్తున్నారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీతో నువ్వా?నేనా? అన్న రీతిలో తలపడుతోంది. గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగడం నాయకుడి లక్షణమనీ, దీన్ని రాహుల్ పాటిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ అప్పటికీ, ఇప్పటికీ ఎంతో పరిణతి సాధించారని చెబుతున్నారు. తప్పుల్ని సరిదిద్దుకున్నారు.. ఈ విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.సుశీలా రామస్వామి మాట్లాడుతూ..‘మంచి నాయకుడు అనేవాడు గతంలో తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాడు. ప్రజల సమస్యలను సావధానంగా వింటాడు. ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అదే చేస్తున్నారు. ఏడాది క్రితం కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రాహుల్‌కు, ఇప్పటి రాహుల్‌కు చాలాతేడా ఉంది. ఆయన బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలకమైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో మెరుగైన ఫలితాలు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని 65 స్థానాల్లో బీజేపీ 62 సీట్లను గెలుచుకోగలిగింది. మిజోరంతో పాటు తెలంగాణలో ఓటమి పాలైనప్పటికీ రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రా ల్లో పురోగతి సాధించడం కీలక పరిణామం’ అని వ్యాఖ్యానించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడే మహాకూటమిలో కాంగ్రెస్ కీలకంగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. విపక్షాల ఏకీకరణతోనే విజయం.. రాహుల్‌గాంధీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదనీ, బలవంతంపై, అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని సెంటర్ ఫర్ అడ్వొకసీ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ మనీషా తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో రాహుల్ బాగానే పనిచేసినప్పటికీ అంచనాలను అందుకోలేదు. ఏదేమైనా ఈ ఫలితాలు విపక్షాల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఓ జాతీయస్థాయి నేతగా గ్రామీణ భారతంలోని ప్రజలకు చేరువకావడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. మోదీని దీటుగా ఎదుర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు వీలుగా విపక్షాలను రాహుల్ ఎలా కలుపుకుని పోతారన్న దానిపైనే ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుంది’ అని వెల్లడించారు. మోదీ–షా ద్వయం వ్యూహాలకు తిరుగుండదన్న భావన తాజా ఫలితాలతో పటాపంచలు అయ్యాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల నేతలు, కేడర్ కూడా కారణమని ఆమె గుర్తుచేశారు. అంతా రాహుల్ వల్లే: కాంగ్రెస్ రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోవడానికి రాహుల్ గాంధీ జరిపిన సుడిగాలి పర్యటనలు, రోడ్‌షో లే కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ ఏకంగా 82 బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఏడు రోడ్ షోల్లో పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రైతులు, యువత, సామాన్యుల సమస్యలను, రఫేల్ ఒప్పందాన్ని రాహుల్ ప్రస్తావించారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న హామీ గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపిందన్నారు. రాహుల్ నిబద్ధత, అంకితభావం కారణంగానే పార్టీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోగా ఇలాంటి అద్భుత విజ యాన్ని కాంగ్రెస్ అందుకుందని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల ఫలితాలతో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణుల నైతిక బలం రెట్టింపు అయిందనీ, మిత్రపక్షాలను ఏకం చేసి బీజేపీని 2019లో ఇంటికి సాగనంపేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. -
అధికారంపై ధిక్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్‌గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్‌లో సత్తా చాటింది. 2019 లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది. మరోసారి అదే పంథా.. గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఎట్టకేలకు ఛత్తీస్‌గఢ్‌లో మార్పు.. గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. రైతులే నిర్ణయించారా..! సెమీఫైనల్స్‌లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
సార్వత్రికానికి సంకేతమా?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో మూడు రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లో ఉండగా, ఒకటి ఈశాన్య రాష్ట్రం మిజోరం. మరొకటి తెలంగాణ. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలో లేదు. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం ఆ పార్టీపై పెద్దగా ఉండబోదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో–రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్–బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది. రాజకీయ పండితులు ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సూచికగా పరిగణించారు. హిందీ బెల్ట్‌లో మళ్లీ బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ఫలితాలను బట్టి దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని సమర్థంగా నడిపించే నైతిక బలాన్ని ఈ ఫలితాలు రాహుల్‌కు అందిస్తాయని వారు చెబుతున్నారు. పడిలేచిన కాంగ్రెస్ శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ ఒకప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. 2014 నాటికి దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. బీజేపీ కేవలం ఏడు రాష్ట్రాల్లోనే అధికార పార్టీగా ఉంది. 2017 నాటికి కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, బీజేపీ బలం 21 రాష్ట్రాలకు పెరిగింది. గత రెండేళ్లుగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతుండటం, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఇమేజ్ పని చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదని బీజేపీ అంటోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పనితీరు ప్రభావం ఉంటుందని, లోక్‌సభ విషయంలో ప్రధాని ప్రతిష్ట ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడేలు నిర్వహించిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక కాదు రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన శత్రువు(బీజేపీ)ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. పప్పూ పాస్ హోగయా... గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదని, రాహుల్ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే, తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్ గాంధీయే పోటీ అని నిరూపించాయి. పప్పూ పాస్ హోగయా అని బీజేపీ మద్దతుదారులే అంగీకరిస్తున్నారు. తాజా ఫలితాలు కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మొదటిది బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడవి చేజారాయంటే బీజేపీ తన తీరును సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట రెండో అంశం. ఎంపీ, రాజస్తాన్‌లలో బీజేపీ ఈ మాత్రమైనా నిలబడటానికి మోదీ చరిష్మానే కారణమన్న వాదన లేకపోలేదు. ఎన్నికల వ్యూహ రచనలో కూడా జాగరూకత అవసరమన్నది మూడో విషయం. తాజా ఫలితాలు రాహుల్ గాంధీ బాధ్యతల్ని పెంచుతాయన్నది మరో కీలక విషయం.ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ మరింత బాధ్యతాయుతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే, కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు ఇంకో ముఖ్య విషయం. బీజేపీ బలం తగ్గుతోందా? తాజా ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందని యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సంస్థ రాజస్తాన్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లకంటే 35 సీట్ల వరకు పెరగొచ్చని తేలింది. బీజేపీ బలం 30కి తగ్గవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 62 లోక్‌సభ సీట్లున్నాయి. రాజస్తాన్ నుంచి ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి సంఖ్య 9కి పడిపోవచ్చని, ఆ పదహారు సీట్లు కాంగ్రెస్‌కు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. -
నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్‌కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్‌లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్‌కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి. నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. -
సెమీస్ విజేత కాంగ్రెస్
నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఓటమిపాలైంది. మూడుసార్లు బీజేపీకే పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి రమణ్‌సింగ్ సర్కారును గద్దెదించారు. దీంతో 90 స్థానాల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అటు రాజస్తాన్‌లోనూ సీఎం వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకత కారణంగా కమలం పార్టీ 70 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొంది అధికారానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ (109), కాంగ్రెస్ (113) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది. హంగ్ వచ్చే సంకేతాలుండటంతో.. ఎస్పీ, బీఎస్పీ, ఇతరుల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అటు 40 స్థానాలున్న మిజోరంలో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్ 26 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. న్యూఢిల్లీ: రాజకీయ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కట్టబెట్టి కాంగ్రెస్‌కు మోదాన్ని, మూడు ప్రధాన రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపరిచి బీజేపీకి ఖేదాన్ని ఈ ఎన్నికలు మిగిల్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌కు ఘన విజయం అందించాయి. ఈ అసెంబ్లీ ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్, వ్యూహాల్లో మార్పులతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల రణరంగంలో దూకనున్నాయి. ఇప్పటివరకు రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తాజాగా రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ల్లో పరాజయం పాలైంది. రాజస్తాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 73, బీఎస్పీ 6, సీపీఎం 2, భారతీయ ట్రైబల్ పార్టీ 2, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 3, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో గెలుపొందారు. విజయం సాధించిన ఇండిపెండెంట్లలో అత్యధికులు కాంగ్రెస్ రెబెల్సే కావడం విశేషం. దాంతో మేజిక్ నెంబరైన 100ను సాధించడం కాంగ్రెస్‌కు కష్టమేం కాదు. అలాగే, చత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68 సీట్లు సాధించి కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ బీజేపీ 15 స్థానాలకే పరిమితమయింది. అజిత్ జోగి, మాయవతి కూటమికి 6 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కౌంటింగ్ సందర్భంగా మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠభరిత పోరు నెలకొంది. రౌండ్, రౌండ్‌కీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యతలో హెచ్చుతగ్గులు వస్తూ, పార్టీ నేతలకు, అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. మొత్తం 230 స్థానాల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు అర్ధరాత్రి వరకు చెరి 78 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 36, బీజేపీ 31 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. హంగ్ తప్పని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు మంగళవారం రాత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంను కూడా కాంగ్రెస్ తమ ఖాతా నుంచి చేజార్చుకుంది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లతో ఘనవిజయం సాధించింది. మొత్తం 40 సీట్లలో కేవలం 5 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలుపొందింది. థాంక్యూ భారత్ రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన అధికారిక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. మీరు ద్వేషానికి బదులు ప్రేమను ఎన్నుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యం గెలిచింది! భారత ప్రజానీకానికి కృతజ్ఞతలు. ప్రజలు ద్వేషానికి బదులు ప్రేమను, హింసకు బదులు అహింసను, అబద్ధానికి బదులు నిజాన్ని ఎంచుకున్నారని’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా! ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన నేతలకు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత తానెంతో నేర్చుకున్నానని, అలాగే, ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలు నిరుద్యోగానికి, అవినీతికి, రైతాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. గెలుపోటములు సహజం ఈ ఎన్నికల్లో విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తామన్నారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, వాటికి అతీతంగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రి హాట్రిక్ మిస్?
అతిచిన్న రాష్ట్రం మిజోరంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. దేశంలో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ మెరుగైన తీరుతో దూసుకుపోతుండగా మిజోరాంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగిలింది. ఏ మాత్రం రేసులో లేని నిరాశజనక ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఎంఎన్ఎఫ్ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సీట్లలో విజయం సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ ఖాయం అయినట్టే. అయితే ఆరంభంలో కొంచెం జోరుగా ఉన్న కాంగ్రెస్ అంతకంతకూ ఆధిక్యాన్ని కోల్పోతూ తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో అందనంత దూరంలో కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు నెట్టేశారు. బీజేపీ కూటమి రెండు స్థానాల్లో లీడ్‌లో ఉంది. జోరాం పీపుల్స్ మూవ్మెంట్(జేపీఎం) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వెనుకంజలో సీఎం స్వయంగా ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ వెనకంజలో ఉన్నారు. సొంత నియోజకవర్గం సెర్చిప్‌లో జీపీఎం అభ్యర్థి లాల్దూ హోమా కంటే వెనుకబడి ఉండగా అటు చంపైలో కూడా వెనుకంజలో ఉన్నారు. కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న రాష్ట్రాల్లో మిజోరం ఒకటి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మిజోరం విజయం చాలా ప్రతిష్టాత్మకం. ఇక్కడ మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. అంటే 21 అంతకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. -
సీఎం పదవికి వసుంధర రాజీనామా
రాత్రి 9.30 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం వైపు అడుగులేస్తోంది. 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 72 సీట్లలో మాత్రమే విజయం సాధించడంతో అధికారాన్ని కోల్పోనుంది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వసుందర రాజే తన పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ 89 చోట్ల విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 101. రాత్రి 8.30 : రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఎవరినీ, ఏ ఒక్క పార్టీని కూడా పంపించి వేయమని అన్నారు. బీజేపీ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. రాత్రి 8 : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం లాల్ తన్హల్వా తన పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో 36 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితమైంది. ఎంఎన్ఎఫ్ 26 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టనుంది. సాయంత్రం 7.30 : మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జొరాంతంగా.. గవర్నర్ కె.రాజశేఖరన్‌ను కలిశారు. 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. సాయంత్రం 7: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం 6.30 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ 104, బీజేపీ 71, బీఎస్పీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీఎం వసుంధర రాజే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. మరోవైపు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పట్లానే తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఆరెల్డీ భరత్పూర్ స్థానంలో లీడింగ్ ఉంది. సాయంత్రం 6 : మిజోరాంలో ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) అధికారం చేపట్టనుంది. మొత్తం 40 స్థానాలకు గాను ఆ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందామనునకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితం కాగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ తనహల్వా ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన పోటీచేసిన రెండు చోట్లా ఓటమిచెందారు. సాయంత్రం 4.15 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 98, బీజేపీ 65, బీఎస్పీ 5, సీపీఎం 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతుండడంతో.. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. సాయంత్రం 4 : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ 37,500 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 3.00: మధ్యప్రదేశ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మెజారిటీ ఇరు పార్టీలతో దోబుచులాడుతోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 112, బీజేపీ 108, బీఎస్పీ 4, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 2.30: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 1.30: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో తొలుత వెనకంజలో ఉన్న సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12.50: రాజస్తాన్‌లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం సచిన్ పైలట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 12.20: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మధ్యాహ్నం 12.10: ఛత్తీస్‌గఢ్‌లో విజయం దిశగా కాంగ్రెస్ ఉదయం 11.20: రాజస్తాన్‌లో కాంగ్రెస్ విజయం రాహుల్ గాంధీకి మేము అందించే కానుక- సచిన్ పైలెట్ ఉదయం 10.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు కొనసాగుతుంది. ఐజ్వాల్‌లోని ఎంఎన్ఎఫ్ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం 10.10: ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముందజలో కొనసాగుతుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 9.50: రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఉదయం 9.40: మిజోరంలో ఎంఎన్ఎఫ్ ముందజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.20: సచిన్ పైలట్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.10: జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు. ఉదయం 8.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది. ఉదయం 8.25: తొలి ట్రెండ్స్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఉదయం 8.00: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 7.30: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్ (199), ఛత్తీస్‌గఢ్ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది.