సార్వత్రికానికి సంకేతమా? | present politics in national parties special story | Sakshi
Sakshi News home page

సార్వత్రికానికి సంకేతమా?

Published Wed, Dec 12 2018 4:45 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

present politics in national parties special story - Sakshi

ఢిల్లీలో పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడి వెనుదిరుగుతున్న ప్రధాని మోదీ

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో మూడు రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లో ఉండగా, ఒకటి ఈశాన్య రాష్ట్రం మిజోరం. మరొకటి తెలంగాణ. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలో లేదు. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం ఆ పార్టీపై పెద్దగా ఉండబోదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో–రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌–బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది.

రాజకీయ పండితులు ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సూచికగా పరిగణించారు. హిందీ బెల్ట్‌లో మళ్లీ బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ఫలితాలను బట్టి దేశంలో కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో  మహాకూటమిని సమర్థంగా నడిపించే నైతిక బలాన్ని ఈ ఫలితాలు రాహుల్‌కు అందిస్తాయని వారు చెబుతున్నారు.

పడిలేచిన కాంగ్రెస్‌
శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్‌ ఒకప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. 2014 నాటికి దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. బీజేపీ కేవలం ఏడు రాష్ట్రాల్లోనే అధికార పార్టీగా ఉంది. 2017 నాటికి కాంగ్రెస్‌ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, బీజేపీ బలం 21 రాష్ట్రాలకు పెరిగింది. గత రెండేళ్లుగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతుండటం, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోదీ ఇమేజ్‌ పని చేస్తుందా?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదని బీజేపీ అంటోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పనితీరు ప్రభావం ఉంటుందని, లోక్‌సభ విషయంలో ప్రధాని ప్రతిష్ట ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. యాక్సిస్‌ మై ఇండియా, ఇండియా టుడేలు  నిర్వహించిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలింది.

కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక కాదు
రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్‌ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన శత్రువు(బీజేపీ)ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్‌ రూపొందించుకోవాల్సి ఉంటుంది.

పప్పూ పాస్‌ హోగయా...
గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్‌ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదని, రాహుల్‌ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే, తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్‌ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్‌ గాంధీయే పోటీ అని నిరూపించాయి. పప్పూ పాస్‌ హోగయా అని బీజేపీ మద్దతుదారులే అంగీకరిస్తున్నారు. తాజా ఫలితాలు కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మొదటిది బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి.

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడవి చేజారాయంటే బీజేపీ తన తీరును సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట రెండో అంశం. ఎంపీ, రాజస్తాన్‌లలో బీజేపీ ఈ మాత్రమైనా నిలబడటానికి మోదీ చరిష్మానే కారణమన్న వాదన లేకపోలేదు. ఎన్నికల వ్యూహ రచనలో కూడా జాగరూకత అవసరమన్నది మూడో విషయం.  తాజా ఫలితాలు రాహుల్‌ గాంధీ బాధ్యతల్ని పెంచుతాయన్నది మరో కీలక విషయం.ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్‌ మరింత బాధ్యతాయుతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే, కాంగ్రెస్‌ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు ఇంకో ముఖ్య విషయం.



బీజేపీ బలం తగ్గుతోందా?
తాజా ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందని యాక్సిస్‌ మై ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సంస్థ రాజస్తాన్, మధ్య ప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లకంటే 35 సీట్ల వరకు పెరగొచ్చని తేలింది. బీజేపీ బలం 30కి తగ్గవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 62 లోక్‌సభ సీట్లున్నాయి. రాజస్తాన్‌ నుంచి ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి సంఖ్య 9కి పడిపోవచ్చని, ఆ పదహారు సీట్లు కాంగ్రెస్‌కు రావచ్చని ఆ సర్వే పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement