Rajasthan Election Result 2018
-
ముగ్గురు సీఎంల పట్టాభిషేకం
ఆ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం ఆనంద డోలికల్లో ముంచితే, మరోవైపు ఆ పార్టీని వెంటాడుతున్న సిక్కుల ఊచకోత కేసులో తీర్పు ఇరకాటంలో పడేసింది. 1984 నాటి ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చిన గహ్లోత్, కమల్‌నాథ్, బఘేల్ సీఎంలుగా ప్రమాణం చేయగా.. సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష పడింది. సిక్కుల ఊచకోతలో పాపం మూటగట్టుకున్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగా ఎలా ఎంపిక చేస్తారని బీజేపీ నిలదీసింది. ఈ ఘటనలన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం. సోమవారం ఉదయం రాజస్తాన్ సీఎంగా అశోక్ గహ్లోత్ జైపూర్‌లో, మధ్యాహ్నం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ భోపాల్‌లో, సాయంత్రం రాయ్‌గఢ్‌లో ఛత్తీస్‌గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్ ప్రమాణం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఆడంబరంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాలకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆర్జేడీ తదితర ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్‌నాథ్ రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. తర్వాత ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎం బఘేల్ రైతుల స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు. గహ్లోత్ ముచ్చటగా మూడోసారి.. జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ రాజస్తాన్‌కు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్లో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్యాణ్‌సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రిగా యువనేత సచిన్ పైలట్ ప్రమాణం చేశారు. రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాలుగో నేతగా గహ్లోత్ రికార్డు సృష్టించారు. గహ్లోత్ మొదటి సారిగా 1998లో, ఆ తర్వాత 2008లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆల్బర్ట్‌హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, మాజీ సీఎం వసుంధరా రాజే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముక్తిమోర్చా నేత హేమంత్ సోరేన్, జార్ఖండ్ వికాస్ మోర్చా నేత బాబూలాల్ మరాండీ, కర్ణాటక, ఏపీ సీఎంలు కుమారస్వామి, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 11వేల మంది కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో ఆల్బర్ట్ హాల్ కిటకిటలాడింది. చాలా మంది కుర్చీల పైకెక్కి తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారాన్ని ఆసక్తిగా తిలకించారు. దీంతో కొందరు నేతలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు హైరానా పడాల్సి వచ్చింది. గహ్లోత్, పైలట్ ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరు నేతల అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు చేపట్టింది. రాజధానికి వచ్చే రోడ్లన్నిటిలోనూ సోమవారం ట్రాఫిక్ స్తంభించింది. సఫా ధరించిన పైలట్ సచిన్ పైలట్(41) ప్రమాణ స్వీకారం సందర్భంగా తెల్లటి కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్‌తోపాటు తలపై రాజస్తానీ స్టయిల్ ఎర్రటి తలపాగా ‘సఫా’ ధరించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు ‘సఫా’ ధరించబోనంటూ 2014లో ఆయన శపథం చేశారు. గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన పైలట్..ఈసారి అసెంబ్లీకిఎన్నికయ్యారు. గహ్లోత్‌కు అభినందనలు చెబుతున్న మాజీ సీఎం వసుంధరా రాజే తలపాగాతో పైలట్ రుణమాఫీపై తొలి సంతకం మధ్యప్రదేశ్ 18వ సీఎంగా కమల్‌నాథ్ భోపాల్ మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్(72) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లోని లాల్‌పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులెవరూ లేకుండా ఆయన ఒక్కరే ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్‌కు ఎదురెళ్లిన కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఆయన్ను వేదికపైకి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చిన ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు మన్మోహన్సింగ్, దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్ త్రివేది, కర్ణాటక, పుదుచ్చేరి సీఎంలు కుమారస్వామి, నారాయణస్వామి, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు.. కాంగ్రెస్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్, బీజేపీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాశ్ జోషి, బాబూలాల్‌గౌర్ హాజరయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హాజరుకాలేదు. రూ.2 లక్షల రుణమాఫీ.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన సీఎం కమల్‌నాథ్ రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. దీంతో రాహుల్ గాంధీ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ అవుతాయి. సీఎం సంతకం అయిన వెంటనే రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ అరోరా ‘మధ్యప్రదేశ్‌లోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల్లో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న అర్హులైన రైతులకు చెందిన రూ.2 లక్షల లోపు రుణాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. భోపాల్‌లో సింధియా, కమల్‌నాథ్‌లతో చేతులు కలిపిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజకీయ లబ్ధి కోసమే అల్లర్ల అంశం 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటనలకు సంబంధించి తనపై ఎటువంటి కేసులు లేవని, చార్జిషీట్లు కూడా దాఖలు కాలేదని మధ్యప్రదేశ్ కొత్త సీఎం కమల్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అల్లర్లలో తన ప్రమేయం ఉందంటూ వెలువడుతున్న వార్తలు రాజకీయ లబ్ధి కోసం లేవనెత్తినవేనన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడా రు. ‘గతంలో పలుమార్లు ప్రమాణ స్వీకారం చేశాం. ఈ రోజు కూడా చేశా. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జిగా కూడా పనిచేశా. అప్పట్లో నాపైన ఎలాంటి కేసులు లేవు. చార్జిషీటు కూడా లేదు. ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్న విషయం మీకు తెలుసు’ అని కమల్‌నాథ్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బఘేల్ రాయ్‌పూర్: కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని బల్బీర్ జునేజా ఇండోర్‌స్టేడియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, భారీ వర్షం రాకతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సైన్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి మార్చాల్సి వచ్చింది. పెథాయ్ తుపాను ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో ముందుగా సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. అయితే, భారీ వర్షం కురియడంతో కార్యక్రమ వేదికను హడావుడిగా బల్బీర్ జునేజా ఇండోర్ స్టేడియంలోకి మార్చారు. బఘేల్‌తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ టీఎస్ సింగ్‌దేవ్, తామ్రధ్వజ్ సాహు కూడా ఈ కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, మాజీ సీఎం రమణ్‌సింగ్, పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రమాణం అనంతరం సీఎం బఘేల్ చెప్పారు. రాష్ట్రంలో 2018, నవంబర్ నాటికి 16.65 లక్షల మంది రైతులు సహకార, గ్రామీణ బ్యాంకుల నుంచి రూ.6,100 కోట్ల స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారని, వీటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పారు. బఘేల్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఐక్యతా రాగం...: సోమవారం జైపూర్‌లో అశోక్ గహ్లోత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఐక్యత తెలుపుతున్న నేతలు..ఎంకే స్టాలిన్, చంద్రబాబు, కమల్‌నాథ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి, రాహుల్, శరద్‌యాదవ్, జ్యోతిరాదిత్య సింథియా, మల్లికార్జున ఖర్గే, దేవెగౌడ అందరూ కలిసి ఒకే బస్సులో...: గహ్లోత్ ప్రమాణస్వీకార వేదిక వద్దకు బస్సులో వెళ్తున్న రాహుల్, మన్మోహన్, శరద్ పవార్, శరద్ యాదవ్, స్టాలిన్ తదితరులు మేనల్లుడికి అభినందనలు..: జ్యోతిరాదిత్యను ఆప్యాయంగా హత్తుకున్న మేనత్త, రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
గహ్లోత్.. అనే నేను
జైపూర్: చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో సోమవారం రాజస్తాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గహ్లోత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ కూడా ప్రమాణం చేస్తారు. రాజస్తాన్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గహ్లోత్ నేడు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని అశోక్ గహ్లోత్ తెలిపారు. సాధారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాలు రాజ్‌భవన్‌లో నిర్వహిస్తారు. అయితే 2003, 2013లో వసుంధరారాజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆల్బర్ట్ హాల్‌ను ఖరారు చేశామని కాంగ్రెస్ ప్రతినిధి సత్యేంద్రసింగ్ రాఘవ్ మీడియాకు తెలిపారు. వేడుక బహిరంగంగా జరపాలని నిర్ణయించడంతో 11 వేల మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. అద్భుతమైన నిర్మాణ శైలికి ఆల్బర్ట్ హాల్ ఒక ఉదాహరణ. 1876లో వేల్స్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ జైపూర్ సందర్శన సందర్భంగా ఈ భవనానికి పునాది పడింది. 1887లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. -
సీఎం గహ్లోత్, డిప్యూటీ పైలట్!
న్యూఢిల్లీ/జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నేత అశోక్ గహ్లోత్(67), యువ నేత సచిన్ పైలట్(41) మధ్య సయోధ్య సాధించేందుకు రాహుల్ గాంధీ చేసిన యత్నాలు ఫలించాయి. సీఎంగా అశోక్ గహ్లోత్‌ను, డిప్యూటీ సీఎం పదవికి పైలట్‌ను ఎంపిక చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆ ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎడారి రాష్ట్రం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ తెరదించారు. సీనియర్ నేత అశోక్ గహ్లోత్ ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయిచిందని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఇద్దరు నేతలు జైపూర్ చేరుకుని గవర్నర్ కల్యాణ్‌సింగ్‌తో భేటీ అవుతారని తెలిపారు. ప్రమాణ స్వీకారం తేదీ ఆ తర్వాతే ఖరారవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ‘మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. పైలట్‌తో కలిసి రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తా’ అని గహ్లోత్ తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో గహ్లోత్‌తో కలిసి అద్భుత ఫలితాలను సాధించాం. ఇదే జోరును 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కొనసాగిస్తుంది. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుంది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేస్తాం’ అని సచిన్ పైలట్ తెలిపారు. 2013 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్..ఇటీవలి ఎన్నికల్లో 99 స్థానాలను గెలుచుకుని బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంది. అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ నేత అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మూడుసార్లు చర్చలు జరిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధులపై పార్టీ సీనియర్ నేతలతోపాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనూ రాహుల్ భేటీ అయ్యారు. అంతిమ నిర్ణయాన్ని అధ్యక్షుడు రాహుల్‌కు వదిలేస్తూ ఎమ్మెల్యేలంతా తీర్మానించిన తర్వాత హైకమాండ్ నిర్ణయాలను పాటించి తీరాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేతలు తెలిపారు. అయితే, పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో రాహుల్ సఫలీకృతులయ్యారు. అందుకే ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు. అనంతరం ముగ్గురు నేతలు సంతోషాన్ని పంచుకుంటున్న ఫొటోతోపాటు ‘ది యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్తాన్’ అనే కామెంట్‌ను ట్విట్టర్లో ఉంచారు. మద్దతుదారుల ఆనందోత్సాహాలు సీఎంగా అశోక్ గహ్లోత్, డెప్యూటీ సీఎంగా సచిన్ పైలట్లను అధిష్టానం ఖరారు చేయడంతో ఇద్దరు నేతల మద్దతుదారులు పండుగ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి గహ్లోత్ మద్దతుదారులు జైపూర్‌లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆయనే సీఎం అవుతారని ఆసక్తిగా ఉన్న అభిమానులు పెద్ద సంఖ్యలో హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. సీఎంగా ఎంపికైన ప్రకటన వెలువడగానే స్వీట్లు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. డోళ్ల చప్పుళ్లతో నృత్యాలు చేశారు. సచిన్ పైలట్ మద్దతుదారులు కూడా సందడి చేశారు. పీసీసీ కార్యాలయం మద్దతుదారులతో నిండిపోయింది. ఇద్దరు నేతల నివాసాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింధియా తిరస్కారం.. సచిన్ అంగీకారం మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో సాధించిన విజయాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని దాదాపు మూడు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టాయి. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సీనియర్లు, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు సోనియా గాంధీ, ప్రియాంక కూడా పాలుపంచుకున్నారు. సింధియా, పైలట్లలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని రాహుల్, ప్రియాంక గట్టిగా వాదించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీనిద్వారా కాంగ్రెస్‌లో యువరక్తానికి ప్రాధాన్యం ఉంటుందనే విషయం చాటి చెప్పాలని వారు వాదించారని వెల్లడించాయి. అంతిమంగా వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్‌ను మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాదిత్య సింధియా తిరస్కరించగా రాజ స్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ అంగీకరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో సీఎం పీఠానికి అర్హత సాధించేందుకే పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 1988లో రాజీవ్ హయాంలో శివ్ చరణ్ మాథుర్ సీఎంగా ఉండగా గహ్లోత్ డిప్యూటీ సీఎంగా పని చేశారు. కాంగ్రెస్ కట్టప్ప.. గహ్లోత్! రాజస్తాన్ కాబోయే సీఎం గహ్లోత్ కాంగ్రెస్‌కు ‘కట్టప్ప’ వంటివారు. మూడు తరాలుగా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా వ్యవహరించడమే గహ్లోత్‌కు సీఎం పదవి దక్కేందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గహ్లోత్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయాల్లోకి ఆహ్వానించింది ఇందిరా గాంధీ. రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకు దోహదపడింది సంజయ్ గాంధీ. ఆయనను రాజస్తాన్ ప్రభుత్వంలో హోం మంత్రిని చేసి రాష్ట్ర రాజకీయాలకు పంపింది రాజీవ్ గాంధీ. సోనియాగాంధీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న గహ్లోత్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అనధికార మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ చంద్రగుప్తుడయితే గహ్లోత్ చాణక్యుడు. గాంధీ కుటుంబం మరుగున పడ్డ సమయంలో ప్రభుత్వ, పార్టీ పగ్గాలు చేపట్టిన పివీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారితో కూడా గహ్లోత్ సత్సంబంధాలు నెరపారు. ఆయన అనుసరిస్తున్న గాంధేయవాదం, ఆడంబరాలకు పోకుండా ఉండటం, నిజాయితీ, హుందాతనం ఇవన్నీ గహ్లోత్‌ను ఉత్తమ నేతగా తీర్చిదిద్దాయి. ఎన్నికల వ్యూహ రచనలో నిష్ణాతుడిగా పేరొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి భారీ మెజారిటీ రాని నేపథ్యంలో అనుభవజ్ఞుడు, రాజకీయ నిర్వహణ దక్షుడు అయిన గహ్లోత్ అవసరం రాష్ట్రానికి, పార్టీకి ఎంతైనా ఉందని అధిష్టానం భావించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ నుంచి మెజారిటీ సంఖ్యలో ఎంపీలను పంపాలంటే గహ్లోత్ వంటి రాజనీతిజ్ఞుడు సీఎం పీఠంపై ఉండాలని అధిష్టానం భావించింది. లోక్‌సభ ఎన్నికల వరకు గహ్లోత్‌ను తనతోనే ఉంచుకోవాలని రాహుల్ అనుకున్నారు. ‘పైలట్’కు కోపైలట్ బాధ్యతలు జైపూర్/న్యూఢిల్లీ: డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ యువనేత విమానాల్ని సైతం నడపగలడు. అంతే చాకచక్యంతో 2013లో ఘోర పరాజయం పాలైన పార్టీని 2018లో విజయతీరాలకు నడిపించారు. కానీ, శుక్రవారం నాటి పరిణామాలతో ఆయన కోపైలట్ బాధ్యతలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనే సచిన్ పైలట్(41)!. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కొడుకైన సచిన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి నియోజకవర్గం దౌసా నుంచి 2004లో ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. 1995లో అమెరికాలో పైలట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. 2013లో రాజస్తాన్‌లో పార్టీ ఘోర పరాజయం అనంతరం..మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాకా తలపాగా ధరించబోనని శపథం చేశారు. పీసీసీ చీఫ్ హోదాలో పార్టీని బలోపేతం చేసేందుకు, జనంతో మమేకమయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఇంగ్లిష్ వార్తా చానెళ్ల చర్చా కార్యక్రమాల్లో ధాటిగా మాట్లాడగలిగే సచిన్.. గ్రామీణ ప్రజలతోనూ అంతే సులువుగా మమేకమై పోతారనే పేరుంది. కాంగ్రెస్ విజయంతో పైలట్ మళ్లీ అందమైన ‘సాఫ’ ధరించనున్నారు. -
సింధియా, సచిన్‌లకు షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన. ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్‌కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్‌నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్ రేస్‌లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్‌కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్‌కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు. -
ఒక్క అడుగు దూరంలో..
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నా ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌కు ఆ పార్టీ కొద్ది దూరంలో నిలిచింది. సొంతంగా ప్రభుత్వాల ఏర్పాటుకు అరకొర సీట్లు తగ్గడంతో ఆ పార్టీ బీఎస్పీ సహా స్వతంత్రుల సహకారం ఆశిస్తోంది. రాజస్దాన్‌లో సాధారణ మెజారిటీకి ఒక స్ధానం కాంగ్రెస్‌కు తగ్గగా, మధ్యప్రదేశ్‌లో రెండు సీట్లు తక్కువగా వచ్చాయి. దీంతో ఇరు రాష్ట్రాల్లో బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ(ఎం) వంటి పార్టీలతో పాటు స్వతంత్రులతో జట్టు కట్టక తప్పని పరిస్థితి నెలకొంది. మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్‌కు కాంగ్రెస్ రెండు స్ధానాలు దూరంలో నిలవడంతో రెండు సీట్లు నెగ్గిన బీఎస్పీ, ఒక స్ధానంలో గెలుపొందిన ఎస్పీలతో కాంగ్రెస్ సంప్రదింపులు ప్రారంభించింది. ఇక్కడ బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇక రాజస్ధాన్‌లో బీజేపీ కంటే కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు గెలుపొందడం, మెజారిటీ మార్క్‌కు కేవలం ఒక స్ధానం మాత్రమే తగ్గడంతో కాంగ్రెస్ సేఫ్జోన్లో ఉంది. ఇక్కడ ఆరు సీట్లు నెగ్గిన బీఎస్పీ, రెండు సీట్లు కైవసం చేసుకున్న సీపీఐ(ఎం), ఇతర చిన్న పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్వతంత్రుల్లో కాంగ్రెస్ రెబెల్స్ ఎక్కువ మంది నెగ్గడంతో వారి సహకారం లభిస్తుందనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. -
అయిదు రాష్ట్రాల్లో తుది ఫలితాలు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో నూతనోత్సహం నింపగా, బీజేపీని నిరాశపరిచాయి. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీని కాంగ్రెస్ మట్టికరిపించింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ విస్పష్ట మెజారిటీ సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన స్ధానాల వివరాలు.. తెలంగాణ.. తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్ 88 స్ధానాల్లో గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిని మట్టికరిపించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. కారు జోరుకు కుదేలైన కాంగ్రెస్ కూటమి 21 స్ధానాలకు పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక స్ధానంలో, ఇతరులు 2 స్ధానాల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్కు 97,00,749 ఓట్లు (46.9 శాతం), కాంగ్రెస్‌కు 58,83,111 ఓట్లు (28.4 శాతం), బీజేపీ 14,50,456 ఓట్లు (7.0 శాతం), టీడీపీ 7,25,845(3.5 శాతం), స్వతంత్రులు 6,73,694 ఓట్లు (3.3 శాతం), ఎంఐఎం 5,61,089 ఓట్లు (2.7 శాతం), బీఎస్పీ 4,28,430 ఓట్లు (2.7 శాతం), ఎస్ఎంఎఫ్బీ 1,72,304 ఓట్లు (0.8 శాతం), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1,72,304 ఓట్లు (0.8 శాతం), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 1,14,432 ఓట్లు(0.7 శాతం) వచ్చాయి. మధ్యప్రదేశ్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరుసాగినా చివరకు కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు గెలుచుకోగా, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో స్వతంత్రులు, బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. బీజేపీకి 1,56,42,980 ఓట్లు(41శాతం), కాంగ్రెస్‌కు 1,55,95,153 ఓట్లు (40.9 శాతం), ఇండిపెండెంట్లకు 22,18,230 ఓట్లు (5.8 శాతం), బీఎస్పీకి 19,11,642 ఓట్లు (5 శాతం), సీజీపీకి 6,75,648 ఓట్లు (1.8 శాతం), ఎస్పీకి 4,96,025 ఓట్లు (1.3 శాతం), ఏఏఏపీకి 2,53,101 ఓట్లు (0.4 శాతం), ఎస్పీఏకేపీకి 1,56,486 ఓట్లు (0.4 శాతం), బీఏఎస్డీకి 78,692 ఓట్లు (0.2 శాతం), బీఎస్సీపీకి 71,278 ఓట్లు (0.2 శాతం) ఓట్లు లభించాయి. రాజస్ధాన్ ఎడారి రాష్ట్రం రాజస్ధాన్‌లో మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 99 స్ధానాలను హస్తగతం చేసుకోగా, బీజేపీ 73 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్ధానాల్లో, ఇతరులు అత్యధికంగా 21 స్ధానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 1,39,35,201 ఓట్లు (39.3 శాతం), బీజేపీకి 1,37,57,502 ఓట్లు (38.3 శాతం), ఇండిపెండెంట్లకు 33,72,206 ఓట్లు (9.5 శాతం), బీఎస్పీకి 14,10,995 ఓట్లు (4 శాతం), ఆర్‌ఎల్‌టీపీకి 8,56,038 ఓట్లు (2.4 శాతం), సీపీఎంకు 4,34,210 ఓట్లు (1.2 శాతం), బీజేపీకి 2,55,100 ఓట్లు (0.7 శాతం), ఏఏఏపీకి 1,35,826 ఓట్లు (0.4 శాతం), ఆర్సీడీకి 1,16,320 ఓట్లు (0.3 శాతం), బీవీహెచ్పీ 1,11,357 (0.3 శాతం) ఓట్లు లభించాయి. చత్తీస్‌గఢ్.. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్ధానాల్లో కాంగ్రెస్ మూడింట రెండొంతులు పైగా 68 స్ధానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభంజనంతో బీజేపీ బేజారైంది. పదిహేనేళ్ల పాటు చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం 15 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అజిత్ జోగి నేతృత్వంలోని జేసీసీ 7 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 61,44,192 ఓట్లు (43 శాతం), బీజేపీకి 47,07,141 ఓట్లు (33 శాతం), జేసీసీజేకు 10,86,531 ఓట్లు (7.6 శాతం), ఇండిపెండెంట్లకు 8,39,053 ఓట్లు (5.9 శాతం), బీఎస్పీకి 5,52,313 ఓట్లు (3.9 శాతం), జీజీపీకి 2,47,459 ఓట్లు (1.7 శాతం), ఏఏఏపీకి 1,23,526 ఓట్లు (0.9 శాతం), సీపీఐకి 48,255 ఓట్లు (0.3 శాతం), ఎస్హెచ్ఎస్కు 34,678 ఓట్లు(0.2 శాతం) దక్కాయి మిజోరం.. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 5 స్ధానాలు, బీజేపీ ఒక స్ధానం దక్కించుకోగా, ఇతరులు 8 స్ధానాల్లో గెలుపొందారు. మిజో నేషనల్ ఫ్రంట్‌కు 2,37,305 ఓట్లు (37.6 శాతం), కాంగ్రెస్‌కు 1,90,412 ఓట్లు (30.2 శాతం),ఇండిపెండెంట్లకు 1,44,925 ఓట్లు (22.9 శాతం), బీజేపీకి 50,749 ఓట్లు (8 శాతం), ఎన్పీఈపీకి 3626 ఓట్లు (0.6 శాతం), పీఆర్ఐఎస్ఎంపీకి 1262 ఓట్లు (0.2 శాతం), నోటాకు 2917 ఓట్లు (0.5 శాతం) లభించాయి. -
విజయం వైపు నడిపిన ‘పైలెట్’
జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్(41). ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ, వార్టన్ బిజినెస్ స్కూల్(యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా) నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. బీబీసీ ఢిల్లీ బ్యూరోతోపాటు, జనరల్ మోటార్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. 2000వ సంవత్సరంలో ఆయన తండ్రి రాజేష్ పైలెట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2004లో దౌసా నియోజకవర్గం నుంచి ఎన్నికై అతి పిన్న వయస్కుడైన ఎంపీగా చరిత్ర సృష్టించారు. 2009లో అజ్మీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఐటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూతురు సారాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సచిన్ 1995లో అమెరికాలో ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందారు. జాతీయ స్థాయి షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పలుమార్లు పాల్గొన్నారు. టెరిటోరియల్ ఆర్మీలో కమిషన్డ్ ఆఫీసర్‌గానూ పనిచేశారు. డ్రైవింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రముఖులు.. గెలుపోటములు రాజస్తాన్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వసుంధరా రాజే(ఝల్రాపటన్), పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్‌సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్‌ను ఝల్రాపటన్ నియోజకవర్గంలో వసుంధరాపై కాంగ్రెస్ బరిలోకి దించింది. వసుంధరా చేతిలో ఆయన 34,980 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘ్వాల్ భిల్వారా స్థానం నుంచి 74వేలకు పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్య నేతల్లో జోహ్రీలాల్ మీనా(రాజ్‌గఢ్–లక్ష్మణ్‌గఢ్), మదన్ ప్రజాపత్(పచ్‌పద్ర), జహీదా ఖాన్(కమన్), రామ్‌లాల్ జాట్(మండల్), ప్రశాంత్ బైర్వా(నివాయి) ఉన్నారు. అలాగే, బీజేపీ నేతల్లో సంతోష్(అనూప్‌గఢ్), కాలూరామ్(దాగ్), సామారామ్ గరైసా(పిండ్వారా–అబు), జగ్సిరామ్(రియోదార్) విజయం సాధించారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధుల్లో సందీప్ కుమార్(తిజారా), వజీబ్ అలీ(నాగర్) గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన సీపీఎం ఈసారి బల్వాన్ పునియా (భద్ర), గిరిధారీలాల్ మహియా (శ్రీ దుంగార్‌గఢ్)లను గెలిపించుకుంది. నీటి వనరుల మంత్రి రామ్ ప్రతాప్, రెవెన్యూ మంత్రి అమ్రారామ్, గోపాలన్ మంత్రి ఓతారాం దేవసి(సిరోహి), పర్యాటక శాఖ మంత్రి యూనస్‌ఖాన్ ఓటమి పాలయ్యారు. -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్‌కు సవాలే రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
సార్వత్రికానికి సంకేతమా?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో మూడు రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లో ఉండగా, ఒకటి ఈశాన్య రాష్ట్రం మిజోరం. మరొకటి తెలంగాణ. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలో లేదు. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం ఆ పార్టీపై పెద్దగా ఉండబోదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో–రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్–బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది. రాజకీయ పండితులు ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సూచికగా పరిగణించారు. హిందీ బెల్ట్‌లో మళ్లీ బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ఫలితాలను బట్టి దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని సమర్థంగా నడిపించే నైతిక బలాన్ని ఈ ఫలితాలు రాహుల్‌కు అందిస్తాయని వారు చెబుతున్నారు. పడిలేచిన కాంగ్రెస్ శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ ఒకప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. 2014 నాటికి దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. బీజేపీ కేవలం ఏడు రాష్ట్రాల్లోనే అధికార పార్టీగా ఉంది. 2017 నాటికి కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, బీజేపీ బలం 21 రాష్ట్రాలకు పెరిగింది. గత రెండేళ్లుగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతుండటం, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఇమేజ్ పని చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదని బీజేపీ అంటోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పనితీరు ప్రభావం ఉంటుందని, లోక్‌సభ విషయంలో ప్రధాని ప్రతిష్ట ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడేలు నిర్వహించిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్‌కు నల్లేరుపై నడక కాదు రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన శత్రువు(బీజేపీ)ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. పప్పూ పాస్ హోగయా... గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదని, రాహుల్ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే, తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్ గాంధీయే పోటీ అని నిరూపించాయి. పప్పూ పాస్ హోగయా అని బీజేపీ మద్దతుదారులే అంగీకరిస్తున్నారు. తాజా ఫలితాలు కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మొదటిది బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడవి చేజారాయంటే బీజేపీ తన తీరును సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట రెండో అంశం. ఎంపీ, రాజస్తాన్‌లలో బీజేపీ ఈ మాత్రమైనా నిలబడటానికి మోదీ చరిష్మానే కారణమన్న వాదన లేకపోలేదు. ఎన్నికల వ్యూహ రచనలో కూడా జాగరూకత అవసరమన్నది మూడో విషయం. తాజా ఫలితాలు రాహుల్ గాంధీ బాధ్యతల్ని పెంచుతాయన్నది మరో కీలక విషయం.ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ మరింత బాధ్యతాయుతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే, కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు ఇంకో ముఖ్య విషయం. బీజేపీ బలం తగ్గుతోందా? తాజా ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. దీని ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఉంటుందని యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సంస్థ రాజస్తాన్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇప్పుడున్న సీట్లకంటే 35 సీట్ల వరకు పెరగొచ్చని తేలింది. బీజేపీ బలం 30కి తగ్గవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 62 లోక్‌సభ సీట్లున్నాయి. రాజస్తాన్ నుంచి ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి సంఖ్య 9కి పడిపోవచ్చని, ఆ పదహారు సీట్లు కాంగ్రెస్‌కు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. -
పీఠం ఎవరిది?
రాజస్తాన్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్ గెహ్లాట్ ఒకవైపు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్ పైలెట్ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు మళ్లించడానికి సచిన్ పాటుపడ్డారు. రాహుల్ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్‌కు కలిసొచ్చే అంశం. ఇందిర మెచ్చిన గెహ్లాట్ అశోక్ గెహ్లాట్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హిందూత్వ కార్డు, రాహుల్ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్‌వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్‌సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్‌కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్ పైలెట్ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్ సేవలను రాజస్తాన్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమచారం. -
ఎడారి రాష్ట్రం ‘హస్త’ గతం
జైపూర్: ఊహించినట్లే రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ప్రభావం చూపాయి. వసుంధరా రాజే నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమి పాలయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రేసులో ఉన్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ సైతం తమతమ స్థానాల్లో గెలుపొందారు. ఇక సీఎం ఎవరో తేల్చాల్సిన బాధ్యత అధిష్టానంపై పడింది. ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ నేతను ఎన్నుకోనున్నారు. నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం రాజస్తాన్ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిలిపివేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్లు 100 కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 100, బీజేపీ 70 వరకు సీట్లు గెలుచుకున్నాయి. దీంతోపాటు బీఎస్పీ మూడు చోట్ల గెలిచి, మరో మూడు చోట్ల ముందంజలో ఉంది. భారతీయ ట్రైబల్ పార్టీ రెండు సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ మూడు చోట్ల మెజారిటీ దిశగా ఉంది. సీపీఎం ఒక స్థానం గెలుచుకుని, మరో చోట ముందంజలో ఉంది. దాదాపు 12 చోట్ల స్వతంత్రులు గెలిచే అవకాశా లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ మంగళవారం ఉమ్మడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ మధ్య సయోధ్య ఉందని చూపుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలెట్ మాట్లాడుతూ..స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్ధులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి రెబెల్స్‌గా బరిలోకి దిగి గెలుపొందిన చాలామంది మా పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. నేడు జైపూర్‌లో జరిగే కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీకి పరిశీలకునిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు’ అని తెలిపారు. ఈ సమావేశం అనంతరం పార్టీ పరిశీలకులు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పైలెట్, అశోక్ గెహ్లాట్లతోపాటు ఎమ్మెల్యేలందరితో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన నివేదికను అందజేస్తారు. బుధవారం సాయంత్రం జైపూర్‌లో మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఆ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ఎన్నికతోపాటు పలు విషయాలను ఈ సమావేశంలో చర్చిస్తారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. గెహ్లాట్, పైలెట్ కాకుండా మరెవరైనా సీఎం రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. ఎమ్యెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుని ఆ నివేదికను హైకమాండ్‌కు అందజేస్తాను. అంతిమ నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉంది’ అని కేసీ వేణుగోపాల్ వివరించారు. దేశమంతటా ఇదే ట్రెండ్: సచిన్ పైలెట్ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశమంతటా సాధిస్తుందని సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. రాష్ట్రంలో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇది చరిత్రాత్మక దినం’ అని పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్ధులు సహా భావసారూప్యం కలిగిన అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారు’ అని ఆయన తెలిపారు. ‘ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు, బీజేపీని వదిలి వచ్చే అభ్యర్ధులను కూడా కలుపుకుని పోతాం. మా పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అని గెహ్లాట్ తెలిపారు. -
నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్‌కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్‌లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్‌కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి. నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. -
బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో దిగజారిన బీజేపీ.. ఛత్తీస్‌గఢ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు. రాజస్తాన్‌లోనూ అదే పరిస్థితి.. రాజస్తాన్‌లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది. మిజోలో కాంగ్రెస్ చతికిల.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్ఎఫ్ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది. హోరాహోరీగా మధ్యప్రదేశ్.. కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి. -
సెమీస్ విజేత కాంగ్రెస్
నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఓటమిపాలైంది. మూడుసార్లు బీజేపీకే పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఈసారి రమణ్‌సింగ్ సర్కారును గద్దెదించారు. దీంతో 90 స్థానాల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అటు రాజస్తాన్‌లోనూ సీఎం వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకత కారణంగా కమలం పార్టీ 70 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొంది అధికారానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ (109), కాంగ్రెస్ (113) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది. హంగ్ వచ్చే సంకేతాలుండటంతో.. ఎస్పీ, బీఎస్పీ, ఇతరుల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అటు 40 స్థానాలున్న మిజోరంలో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్ 26 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. న్యూఢిల్లీ: రాజకీయ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కట్టబెట్టి కాంగ్రెస్‌కు మోదాన్ని, మూడు ప్రధాన రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపరిచి బీజేపీకి ఖేదాన్ని ఈ ఎన్నికలు మిగిల్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌కు ఘన విజయం అందించాయి. ఈ అసెంబ్లీ ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్, వ్యూహాల్లో మార్పులతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల రణరంగంలో దూకనున్నాయి. ఇప్పటివరకు రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తాజాగా రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ల్లో పరాజయం పాలైంది. రాజస్తాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 73, బీఎస్పీ 6, సీపీఎం 2, భారతీయ ట్రైబల్ పార్టీ 2, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 3, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో గెలుపొందారు. విజయం సాధించిన ఇండిపెండెంట్లలో అత్యధికులు కాంగ్రెస్ రెబెల్సే కావడం విశేషం. దాంతో మేజిక్ నెంబరైన 100ను సాధించడం కాంగ్రెస్‌కు కష్టమేం కాదు. అలాగే, చత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68 సీట్లు సాధించి కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ బీజేపీ 15 స్థానాలకే పరిమితమయింది. అజిత్ జోగి, మాయవతి కూటమికి 6 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కౌంటింగ్ సందర్భంగా మొదటి రౌండ్ నుంచి ఉత్కంఠభరిత పోరు నెలకొంది. రౌండ్, రౌండ్‌కీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యతలో హెచ్చుతగ్గులు వస్తూ, పార్టీ నేతలకు, అభ్యర్థులకు చెమటలు పట్టించాయి. మొత్తం 230 స్థానాల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు అర్ధరాత్రి వరకు చెరి 78 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 36, బీజేపీ 31 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. హంగ్ తప్పని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు మంగళవారం రాత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంను కూడా కాంగ్రెస్ తమ ఖాతా నుంచి చేజార్చుకుంది. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లతో ఘనవిజయం సాధించింది. మొత్తం 40 సీట్లలో కేవలం 5 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలుపొందింది. థాంక్యూ భారత్ రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం తన అధికారిక ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. మీరు ద్వేషానికి బదులు ప్రేమను ఎన్నుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యం గెలిచింది! భారత ప్రజానీకానికి కృతజ్ఞతలు. ప్రజలు ద్వేషానికి బదులు ప్రేమను, హింసకు బదులు అహింసను, అబద్ధానికి బదులు నిజాన్ని ఎంచుకున్నారని’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా! ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన నేతలకు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత తానెంతో నేర్చుకున్నానని, అలాగే, ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలు నిరుద్యోగానికి, అవినీతికి, రైతాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు. గెలుపోటములు సహజం ఈ ఎన్నికల్లో విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తామన్నారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, వాటికి అతీతంగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. -
వసుంధరా రాజె రాజీనామా
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తన పదవికి రాజీనామా చేశారు. హోరాహారీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించింది. కాగా, నూతన ప్రభుత్వం రాజస్ధాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని వసుంధరా రాజె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్ధుల సహకారం కూడా తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్‌తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. -
ఐదు రాష్ట్రాల ఫలితాలు: బీజేపీకి బిగ్ షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి తగిలిన అతిపెద్ద షాక్ నేటి ఫలితాలు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో నువ్వా, నేనా అన్నట్లు బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం, రాజస్థాన్‌లో వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి చత్తీస్‌గఢ్‌లో పాగా వేసిన బీజేపీని కాంగ్రెస్ పార్టీ గద్దె దించడం అసాధారణమే. తెలంగాణలో ఐదు స్థానాలు కలిగిన బీజేపీ, అత్యధిక స్థానాలకు పోటీ చేసి కనీసం 20 సీట్లనైనా గెలుచుకుందామని ఆశించి బొక్కా బోర్లా పడింది. ఇక మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యనే అధికార మార్పిడి జరగడం సర్వ సాధారణమే. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలన్నీ కూడా కొంత గతి తప్పాయి. జాతీయ సర్వేలన్నీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సూచించాయి. వాటి అంచనాలను తలకిందులు చేస్తూ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం విశేషం. తెలంగాణలో పాలకపక్షం టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పినా అఖండ విజయం సాధింస్తుందని ‘ఇండియా టుడే’ సర్వేనే అంచనా వేయగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడం కాంగ్రెస్ అధిష్టానంకు కొంత నిరుత్సాహం కలిగించే అంశమే. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకుగాను 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినదానికన్నా ఎక్కువ సీట్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1993 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తోంది. ఈసారి వసుంధర ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది. వసుంధర రాజె స్వతహాగా అహంభావి కావడం, ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం లేకపోవడం ఓటర్లకు ఆమెను దూరం చేస్తూ వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గజేంద్ర షెకావత్‌ను తొలగించడం, 2017లో వ్యతిరేకించినప్పటికీ వివాదాస్పద ‘పద్మావత్’ సినిమాను విడుదల చేయడం రాజ్‌పుత్‌లకు ప్రభుత్వం మీద కోపం తెప్పించింది. ఏప్రిల్–మే నెలల్లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం, నిరుద్యోగ సమస్య ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 55 శాతం ఉండగా, 2013 నుంచి వసుంధర రాజె ప్రభుత్వం ఏటా 15 లక్షలకు మించి ఉద్యోగాలను కల్పించలేక పోయింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కూడా పుట్టి ముంచాయి. మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ సీట్లు ఉండగా, అక్కడి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం 1998 సంవత్సరం నుంచి అలవాటు. వారు గతంలో బీజేపీకి ఓటు వేయగా, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్సే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా, 2013 ఎన్నికల్లో బీజేపీకి 44.88 శాతం ఓట్లతో 165 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 36.38 శాతంతో 58 సీట్లు వచ్చాయి. స్వయంగా వంద సీట్లను దాటిన కాంగ్రెస్ పార్టీ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ మద్దతుతో సుస్తిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో శివరాజ్ సింగ్ చౌహాన్ కొనసాగినప్పటికీ ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, రుణాలు మాఫీ చేయడం లేదని ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యతిరేకత ఉంది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2017లో మంద్సార్లో రైతులు నర్విహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 14 ఏళ్లలో ఏటా 17,600 ఉద్యోగాలను మాత్రమే కల్పించకలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం కూడా నిరుద్యోగులకు కోపం తెప్పించింది. జ్యోతిరాధిత్య సింధియా, కమల్ నాథ్లో ఎవరు ప్రభుత్వ సారథులో నిర్ణయించక పోవడం కూడా కాంగ్రెసకు కలిసి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోనూ.. మొత్తం సీట్లు 90. బీజేపీ పాలనలో 15 సంవత్సరాల నుంచి రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఆయన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. కాకపోతే నిరుద్యోగం, దారిద్య్రం, నక్సలిజం సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీల పరిధిలో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 40 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని, వరికి కనీస మద్దతు ధరను 2,500 రూపాయలు చేస్తామని, పేద కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యాన్ని ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి. ఫలితంగా అక్కడి రైతులు తమ చేతికి వచ్చిన వరి పంటలను ఇంకా కోయలేదు. ఇక మిజోరం ఫలితాలు మామూలే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తోంది. -
‘సీఎం అభ్యర్ధిని హైకమాండ్ నిర్ణయిస్తుంది’
జైపూర్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం రేసులో నిలిచిన అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్ధాన్‌లో తమ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం తర్వాత నిర్ణయిస్తుందన్నారు. యువ నేత సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్‌లు ఇరువురూ రాజస్ధాన్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. మరోవైపు రాజస్ధాన్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగిస్తూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీజేపీ 73 స్ధానాల్లో, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. -
రాజస్ధాన్‌లో మేజిక్ మార్క్‌కు చేరువగా కాంగ్రెస్
జైపూర్ : రాజస్ధాన్‌లో కాంగ్రెస్ ఆధిక్యత నిలుపుకుంటూ విజయపతాకం ఎగురవేసింది. పాలక బీజేపీతో హోరాహోరీ పోరులో సాధారణ మెజారిటీ సాధించే దిశగా సాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకుఅ అవసరమైన మేజిక్ ఫిగర్ 100 సీట్లు కాగా, కాంగ్రెస్ ఇప్పటికే 102 స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతుండగా, బీఎస్పీ ఐదు స్ధానాల్లో ఇతరులు 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. వసుంధరా రాజె నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ దిశగా కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సచిన్ పైలెట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. -
రాజస్తాన్‌లో కాంగ్రెస్ హవా
జైపూర్: ఊహించినట్టుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 108, బీజేపీ 76, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 145 స్థానాల వరకు గెల్చుకునే అవకాశముందు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ముఖ్యమంత్రి వసుంధర రాజె, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆధిక్యంలో ఉన్నారు. ఉదయ్‌పూర్ మంత్రి గులాబ్‌చంద్ కఠారియా వెనుకంజలో ఉన్నారు. -
సీఎం పదవికి వసుంధర రాజీనామా
రాత్రి 9.30 : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం వైపు అడుగులేస్తోంది. 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ 72 సీట్లలో మాత్రమే విజయం సాధించడంతో అధికారాన్ని కోల్పోనుంది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం వసుందర రాజే తన పదవికి రాజీనామా చేశారు.. కాంగ్రెస్ 89 చోట్ల విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 101. రాత్రి 8.30 : రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నుంచి ఎవరినీ, ఏ ఒక్క పార్టీని కూడా పంపించి వేయమని అన్నారు. బీజేపీ పిలుపునిచ్చిన ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదానికి కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. రాత్రి 8 : మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం లాల్ తన్హల్వా తన పదవికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో 36 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితమైంది. ఎంఎన్ఎఫ్ 26 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టనుంది. సాయంత్రం 7.30 : మిజో నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జొరాంతంగా.. గవర్నర్ కె.రాజశేఖరన్‌ను కలిశారు. 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. తమ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. సాయంత్రం 7: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం 6.30 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. కాంగ్రెస్ 104, బీజేపీ 71, బీఎస్పీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీఎం వసుంధర రాజే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. మరోవైపు రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పట్లానే తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఆరెల్డీ భరత్పూర్ స్థానంలో లీడింగ్ ఉంది. సాయంత్రం 6 : మిజోరాంలో ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్) అధికారం చేపట్టనుంది. మొత్తం 40 స్థానాలకు గాను ఆ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందామనునకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితం కాగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ తనహల్వా ఘోర పరాజయం పాలయ్యారు. ఆయన పోటీచేసిన రెండు చోట్లా ఓటమిచెందారు. సాయంత్రం 4.15 : రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 98, బీజేపీ 65, బీఎస్పీ 5, సీపీఎం 2, ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, 5 రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఈ ఎన్నికలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న తరుణంలో బీజేపీకి నిరాశాజనక ఫలితాలు వస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతుండడంతో.. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలవెలబోతోంది. సాయంత్రం 4 : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ 37,500 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 3.00: మధ్యప్రదేశ్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. మెజారిటీ ఇరు పార్టీలతో దోబుచులాడుతోంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. ఈసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 112, బీజేపీ 108, బీఎస్పీ 4, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 2.30: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 1.30: మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి కొనసాగుతోంది. మరోవైపు చత్తీస్‌గఢ్‌లో తొలుత వెనకంజలో ఉన్న సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం 3 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మధ్యాహ్నం 12.50: రాజస్తాన్‌లో 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అవసరమైతే ఇండిపెండెట్లను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం సచిన్ పైలట్ గెలిచే అవకాశం ఉన్న స్వతంత్రులతో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 12.20: మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావాలా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. మధ్యాహ్నం 12.10: ఛత్తీస్‌గఢ్‌లో విజయం దిశగా కాంగ్రెస్ ఉదయం 11.20: రాజస్తాన్‌లో కాంగ్రెస్ విజయం రాహుల్ గాంధీకి మేము అందించే కానుక- సచిన్ పైలెట్ ఉదయం 10.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ జోరు కొనసాగుతుంది. ఐజ్వాల్‌లోని ఎంఎన్ఎఫ్ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంటున్నారు. ఉదయం 10.10: ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముందజలో కొనసాగుతుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 9.50: రాజ్ నందగావ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఉదయం 9.40: మిజోరంలో ఎంఎన్ఎఫ్ ముందజలో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 72 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.20: సచిన్ పైలట్ నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 77 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉదయం 9.10: జలరాపాటన్ నియోజకవర్గం నుంచి రాజస్తాన్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ముందజలో ఉన్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి ముందజలో ఉన్నారు. ఉదయం 8.45: రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి నెలకొంది. ఉదయం 8.25: తొలి ట్రెండ్స్‌లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 5 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఉదయం 8.00: ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఉదయం 7.30: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్ (199), ఛత్తీస్‌గఢ్ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది.