సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవి తమకు దక్కుతుందని ఆశించిన కాంగ్రెస్ యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్‌లకు నిరాశ తప్పలేదు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పేరును పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించి ఆయన స్థానంలో సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌ను ప్రతిపాదించడంతో అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కావాల్సిన మెజారిటీకి ఒక్క సీటు తక్కువ రావడం, ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్‌కు కేవలం ఐదు సీట్ల దూరంలో ఉండడం వల్ల అనుభవజ్ఞులు కావాలన్నది సీనియర్ల వాదన.
ఇక రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేసి, సచిన్ పైలట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. అయితే డిప్యూటీ సీఎం పదవికి సచిన్ పైలట్ పేరును స్వయంగా అశోక్ గెహ్లాట్ తిరస్కరించారని తెల్సింది. పార్టీకి పూర్తి మెజారిటీ రాని ప్రస్తుత సమయంలో సంకీర్ణ రాజకీయాలు నడపాలంటే రెండు అధికారిక కేంద్రాలు ఉండరాదన్నది గెహ్లాట్ వాదన. యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్‌లకు వయస్సు ఉన్నందున వారికి మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉంటుందన్నది పార్టీలో సీనియర్ల వాదన. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును కాంగ్రెస్ పార్టీ ముందుగా ఖరారు చేయలేదు. అలా చేస్తే ముఠాలు ఏర్పడుతాయని, ఫలితంగా పరాజయం ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావించింది.
మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌లు పార్టీలో ఆధిపత్య పోరును పక్కనపెట్టి పార్టీ విజయం కోసం చిత్తశుద్ధితో కషి చేశారు. రాహుల్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇస్తారని వారి నమ్మి ఉండవచ్చు. అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు రాహుల్ గాంధీ పార్టీలో యువతకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ తర్వాత జూనియర్లతోపాటు సీనియర్లను కలుపుకుపోవాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ ఆఫీసు బేరర్లు కేసీ వేణుగోపాల్, అవినాశ్ పాండేలు సచిన్‌కు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రయిన అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర ప్రజల్లో మంచి పేరు కూడా ఉంది. ఇక కమల్‌నాథ్ వరుసగా తొమ్మదోసారి పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని కూడా పార్టీ అధిష్టానం ఆయనకే మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.
చత్తీస్‌గఢ్ రేస్‌లో
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి పార్టీ రాష్ట్ర చీఫ్ భూపేశ్ భాగెల్, అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి చరణ్‌దాస్ మహంత్; పార్టీ ఏకైక ఎంపీ తామ్రధ్వాజ్ సాహు పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడే అయినప్పటికీ భాగెల్‌కు పదవి దక్కక పోవచ్చు. రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోను రాసిన టీఎస్ సింగ్ దేవ్‌కు దక్కవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి శాసన సభ్యులు తమ నాయకుడిని అధికారికంగా ఎన్నుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment