పీఠం ఎవరిది? | congress party decides who is rajasthan cm | Sakshi
Sakshi News home page

పీఠం ఎవరిది?

Published Wed, Dec 12 2018 4:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress party decides who is rajasthan cm - Sakshi

జైపూర్‌లో మీడియా సమావేశంలో సచిన్‌ పైలెట్, అశోక్‌ గెహ్లాట్‌ల కరచాలనం

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్‌ గెహ్లాట్‌ ఒకవైపు, రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్‌ పైలెట్‌ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్‌ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్‌ పైలెట్‌ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్‌ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్‌ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు మళ్లించడానికి సచిన్‌ పాటుపడ్డారు. రాహుల్‌ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్‌కు కలిసొచ్చే అంశం.


ఇందిర మెచ్చిన గెహ్లాట్‌

అశోక్‌ గెహ్లాట్‌ను కూడా కాంగ్రెస్‌ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్‌. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్‌ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి.  అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే,  ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్‌ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ హిందూత్వ కార్డు, రాహుల్‌ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్‌వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్‌సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్‌కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్‌ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్‌ పైలెట్‌ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్‌ సేవలను రాజస్తాన్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్‌ ఉన్నట్టు సమచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement