CM candidates
-
బీజేపీ సీఎంలు ఎవరో..?
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. అయితే ఈ రాష్ట్రాల్లో మూడింటిటో బీజేపీ అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్, మిజోరంలో జెడ్‌పీఎమ్ పవర్లోకి వచ్చాయి. తెలంగాణ, మిజోరంలో ఇప్పటికే సీఎం ఎవరో తేలిపోగా బీజేపీ పవర్లోకి వచ్చిన ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో ఇప్పటికీ ముఖ్యమంత్రులెవరో ఇంకా తేలలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డినే సీఎంగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మిజోరంలో ఎక్కువ సీట్లు గెలిచిన జెడ్‌పీఎమ్ చీఫ్ లాల్డూహోమా సీఎం పదవి చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్,రాజస్థాన్‌లలో సీఎం పదవికి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో పవర్లోకి వచ్చిన బీజేపీ నుంచి సీఎం పోస్టు కోసం మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గట్టిపోటీదారుగా ఉన్నారు. రాజస్థాన్‌లో సీఎం పదవి రేసులో మాజీ సీఎం వసుంధరరాజేతో పాటు బాబా బాలక్‌నాథ్, దియాకుమారీలు పోటీ పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరే మళ్లీ వినిపిస్తోంది. అయితే త్వరలోనే బీజేపీ ఈ రాష్ట్రాల్లో సీఎంలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య..గెహ్లాట్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు! -
కర్ణాటక గాయం బీజేపీకి గుర్తుందా?
ఎంత ప్రయత్నించినా.. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కాంగ్రెస్‌కు చేజార్చుకోవడం బీజేపీకి గట్టి షాకే ఇచ్చింది. మరికొద్ది నెలల్లో కీలకమైన లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం భయం. మరో పెద్ద రాష్ట్రమైన రాజస్తాన్‌లో వసుంధర రాజె తదితర ముఖ్య నేతల మధ్య కీచులాటలు. ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇంటి పోరు. వీటన్నింటినీ ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ను సమర్థంగా ఢీకొట్టేందుకు అన్ని మార్గాలనూ కమలదళం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ముందస్తుగా ప్రకటించకుండా జాగ్రత్త పడుతోంది. తద్వారా ముఖ్య నేతల పరస్పర కుమ్ములాటలను అదుపు చేయడంతో పాటు కీలక సమయంలో వారెవరూ సహాయ నిరాకరణ చేయకుండా చూడవచ్చని భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఎన్ని క్యాంప్‌లో ! మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ... ఇలా సీనియర్లంతా తలో వర్గంగా విడిపోయి కుమ్ములాటల్లో యమా బిజీగా ఉన్నారు. దాంతో కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మానే ప్రధానంగా నమ్ముకుని సాగాల్సిన పరిస్థితి! ఈ పరిస్థితుల్లో చౌహాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం నేతల విభేదాలను చేజేతులా పెంచడమే అవుతుందని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా చూసుకున్నా అది చేటు చేసేదేనని అభిప్రాయపడుతోంది. అందుకే ముఖ్యమంత్రి అభ్యర్థి మాటెత్తకుండానే ప్రచార పర్వాన్ని ముగించే పనిలో పడింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికీ బీజేపీకి అతి పెద్ద నేతగా మాజీ సీఎం రమణ్‌సింగ్ ఉన్నా ఆయనపైనా పార్టీలో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్, ఎమ్మెల్యే అజయ్ చందార్కర్, సీనియర్ నేత నంద్‌కుమార్ సాయ్ లాంటివాళ్లు ఆయన నాయకత్వం పట్ల అసంతృప్తి సెగలు కక్కుతున్నారు. అసలే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న అంచనాల మధ్య ఈ తలనొప్పులు బీజేపీ అధిష్టానాన్ని మరింత చికాకు పెడుతున్నాయి. అందుకే ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరినీ ముందస్తుగా ప్రకటించబోమని బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జి దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. రాజస్థాన్‌లోనూ రచ్చే రాజస్తాన్‌లో మాజీ సీఎం వసుంధరా రాజె సింధియాకు, సీనియర్ నేతలు అర్జున్‌రామ్ మేఘ్వాల్ తదితరులకు ఉప్పూ నిప్పుగా ఉంటోంది. సింధియా వర్గపు నేత కైలాశ్ మేఘ్వాల్ తాజాగా అర్జున్‌రామ్‌పై విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు. దాంతో అధిష్టానం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై వ్యతిరేకత పరాకాష్టకు చేరిందన్నది బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అవినీతి, అమసర్థత తదితర కారణాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. తమ నేతల మధ్య పోరు ఇందుకు అడ్డంకిగా మారకూడదని పట్టుదలగా ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు నిత్యం రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరుపుతూ వారు కట్టుదాటకుండా చూసే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే ఇలా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల వర్గ పోరును అదుపు చేయడం వంటి ప్రయోజనాలు దక్కే మాటెలా ఉన్నా నష్టాలు జరిగే ఆస్కారమూ ఉందన్న భావన వ్యక్తమవుతోంది. బాధ్యతనంతా భుజాలపై వేసుకుని రాష్ట్ర పార్టీ యంత్రాంగం మొత్తాన్నీ ఒక్కతాటిపై నడిపే నాయకుడంటూ లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్న అభిప్రాయం బీజేపీలోనే కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. కర్ణాటకలో యడ్యూరప్పను పక్కన పెట్టి అంతా అధిష్టానమే అన్నట్టుగా వ్యవహరించి భంగపడ్డ వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
నన్నే సీఎంగా ఉండమన్నారు!
చండీగఢ్: పంజాబ్‌లో గెలుపు ఖరారు కాలేదు కానీ, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు మాత్రం పెరిగిపోతున్నారు. గతేడాది సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్ వైదొలిగిన అనంతరం 42 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు తనను సీఎంగా సమర్థించారని కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖడ్ చెప్పారు. అభోర్‌లో ఒక సమావేశంలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో మం గళవారం ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఆ సమయం లో తనకు 42 మంది, సుఖీందర్ సింగ్ రణ్‌ధవాకు 16 మంది, మహారాణి ప్రణీత్ కౌర్ (అమరీందర్ భార్య)కు 12 మంది, సిద్ధూకు 6 గురు, చన్నీకి ఇద్దరు మద్దతు పలికారని సునీల్ చెప్పారు. ఈ నెల 6న ప్రకటించే అవకాశం? పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థ్ధి పేరును ఈనెల 6న రాహుల్‌గాంధీ ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే సోనియా గాంధీ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. శక్తి యాప్‌లో కార్యకర్తల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం సేకరిస్తోంది. దీంతో పాటు రెండ్రోజులుగా సామాన్య ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటోంది. ఆరున పంజాబ్‌లో పర్యటించి అభ్యర్ధి పేరును రాహుల్ ప్రకటించవచ్చని అంచనా. గత కొన్ని వారాలుగా తమనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సునీల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
పైలట్, సింధియాలకు డిప్యూటీలతో సరి..?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్ వైపు మొగ్గుచూపిన కాంగ్రెస్ హైకమాండ్, రాజస్ధాన్‌లోనూ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్‌లో సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లను డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు మొగ్గుచూపుతోంది. సీఎం రేసులో ముందున్న సీనియర్లకు అవకాశం ఇస్తూ యువ నేతలను ఉప ముఖ్యమంత్రి పదవులతో సంతృప్తిపరచాలన్నది రాహుల్ వ్యూహంగా చెబుతున్నారు. మరోవైపు రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లలో సీఎం పదవికి తీవ్రంగా పోటీపడుతున్న యువ నేతలు సచిన్ పైలట్, సింధియాలు అనుచరగణంతో దేశ రాజధానికి చేరుకోవడంతో కసరత్తు సంక్లిష్టంగా మారింది. రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. యువనేతలు పైలట్, సింధియాలను పార్టీ పక్కనపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి అనుచరులు ఏఐసీసీ కార్యాలయం వద్ద నినాదాలతో హోరెత్తించారు. సీనియర్లకు సహకరించాల్సిందిగా పైలట్, సింధియాలను రాహుల్ సహా అగ్రనేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. -
పీఠం ఎవరిది?
రాజస్తాన్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్ గెహ్లాట్ ఒకవైపు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్ పైలెట్ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు మళ్లించడానికి సచిన్ పాటుపడ్డారు. రాహుల్ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్‌కు కలిసొచ్చే అంశం. ఇందిర మెచ్చిన గెహ్లాట్ అశోక్ గెహ్లాట్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హిందూత్వ కార్డు, రాహుల్ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్‌వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్‌సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్‌కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్ పైలెట్ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్ సేవలను రాజస్తాన్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమచారం. -
కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎంలు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారని, కానీ వారిలో వారే పోట్లాడుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మోదీ బుధవారం 5 లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. ఇప్పటికే నీరసించిన కాంగ్రెస్.. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ పనితీరు వల్ల బీజేపీకి ఏమాత్రం పోటీనిచ్చే స్థితిలో లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల మధ్యప్రదేశ్‌లో లేవనెత్తడానికి కాంగ్రెస్‌కు ఎలాంటి సమస్యలు కనిపించడం లేదని, అందుకే నిస్సహాయ స్థితిలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఫొటోలను చూపి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు. కొత్తగా ఓటేయబోతున్న బాలికల్లో 90 శాతం మంది బీజేపీకే మద్దతిస్తున్నట్లు తాను ఓ టీవీ కార్యక్రమంలో చూశానని అన్నారు. వాటిని వినోదంగానే చూడండి.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌సింగ్‌లను మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘కాంగ్రెస్‌కు ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉన్నారు. కానీ వారిలో ఒకరంటే ఒకరికి పడదు. మరో డజను మంది కూడా సీఎం పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. వారెవరూ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరు’ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న తప్పుడు సమాచారానికి ఎలా స్పందించాలని ఓ కార్యకర్త ప్రశ్నించగా..అలాంటి వార్తలను వినోదంగానే భావించాలని సూచించారు. సీతారాముల వివాహ ఊరేగింపునకు మోదీ డిసెంబర్ 12న అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ వరకు జరిగే సీతారాముల ప్రతీకాత్మక వివాహ ఊరేగింపు కార్యక్రమానికి మోదీని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఆహ్వానించనున్నారు. మోదీకి త్వరలో∙ ఆహ్వానం వస్తుందని మీడియాలో వార్తలొచ్చాయి. బరాత్‌ను రాముని జన్మస్థలం అయోధ్య నుంచి సీతాదేవి పుట్టినిల్లు జనక్‌పూర్‌కు మోదీ తీసుకురానున్నారు. నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’కు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 21న ఎర్రకోటలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. -
కర్ణాటక సీఎం నేనే..!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ఒక వైపు కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం.. మే 17, 18లలో ముహూర్తం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని మోదీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో బాధ్యతలు చేపడతా. రెండు చోట్లా గెలుస్తా చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతా. నాన్నకు బర్త్‌డే గిఫ్ట్‌గా.. మా జేడీఎస్ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా. -
యూపీ సీఎం రేసులోకి దూసుకొచ్చిన మరో పేరు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చరిత్రాత్మక విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరు అవతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి మూడు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ నేతలు సిద్ధార్థ్ నాథ్, యోగి ఆదిత్యానంద, కేశవ ప్రసాద్ మౌర్య ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందున్నారని.. ఇప్పటివరకు వినిపించగా.. ఇప్పుడు తాజాగా లక్నో మేయర్ దినేశ్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్చార్జిగా వ్యవహరించిన దినేశ్ శర్మ సీఎం అభ్యర్థి రేసులో ముందున్నారని అంటున్నారు. యూపీలో బీజేపీ విజయం క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్రమోదీదేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ విజయం ఖరారైన వెంటనే లక్నోలోని తన నివాసంలో కార్యకర్తలతో కలిసి ముందే హోలీ ఆడిన ఆయన.. సీఎం రేసులో మీరున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు. ఇది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ’నేను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమే. బీజేపీ రాష్ట్ర ప్రధాన నేతను కావాలన్న ఉద్దేశం నాకు లేదు. పార్టీ జాతీయ కార్యవర్గం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించనుంది’ అని పేర్కొన్నారు.