యూపీ సీఎం రేసులోకి దూసుకొచ్చిన మరో పేరు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చరిత్రాత్మక విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఎవరు అవతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీఎం అభ్యర్థిగా బీజేపీ నుంచి మూడు పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ నేతలు సిద్ధార్థ్ నాథ్, యోగి ఆదిత్యానంద, కేశవ ప్రసాద్ మౌర్య ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందున్నారని.. ఇప్పటివరకు వినిపించగా.. ఇప్పుడు తాజాగా లక్నో మేయర్ దినేశ్ శర్మ పేరు తెరపైకి వచ్చింది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన దినేశ్ శర్మ సీఎం అభ్యర్థి రేసులో ముందున్నారని అంటున్నారు. యూపీలో బీజేపీ విజయం క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్రమోదీదేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ విజయం ఖరారైన వెంటనే లక్నోలోని తన నివాసంలో కార్యకర్తలతో కలిసి ముందే హోలీ ఆడిన ఆయన.. సీఎం రేసులో మీరున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు. ఇది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ’నేను కేవలం పార్టీ కార్యకర్తను మాత్రమే. బీజేపీ రాష్ట్ర ప్రధాన నేతను కావాలన్న ఉద్దేశం నాకు లేదు. పార్టీ జాతీయ కార్యవర్గం తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించనుంది’ అని పేర్కొన్నారు.