అందువల్లే బీజేపీ గెలిచిందనుకుంటే పొరపాటే!
ముంబై: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ విజయంపై ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. రుణాలు మాఫీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు హామీ ఇవ్వడం వల్లే యూపీలో బీజేపీ గెలిచిందని శివసేన వ్యాఖ్యానించింది. రుణమాఫీ హామీ వల్ల వచ్చిన ఫలితమే ఈ ఎన్నికల విజయమని, దీనిని పెద్దనోట్ల రద్దుకు లభించిన ఆమోదంగా కమలనాథులు భావించరాదని వ్యాఖ్యానించింది.
పేరుకు మిత్రపక్షాలైన బీజేపీ-శివసేన మధ్య ప్రస్తుతం అంతంతమాత్రంగానే సంబంధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. ఈ నేపథ్యంలో వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై శివసేన విమర్శలు సంధిస్తున్నది. యూపీలో విస్తారమైన ప్రచారం చేయడం వల్లే పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి లాభించిందని, ఇక పంజాబ్‌లో అధికార బీజేపీ-అకాలీదళ్ కూటమి మట్టికరిచిందని శివసేన అధికార పత్రిక 'సామ్నా' తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. మనోహర్ పారికర్‌లాంటి బడా నేత ఉన్నప్పటికీ గోవాలో బీజేపీ 15 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయిందని నిశిత విమర్శలు గుప్పించింది.