ఐసీయూలో బీజేపీ చీఫ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఆ పార్టీ యూపీ శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. బీపీ సంబంధిత సమస్యలు రావడంతో ఆయనను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని, పరిస్థితి మెరుగుపడితే ఆయనను శుక్రవారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మౌర్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు.
403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ ఒక్కటే 312 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలు పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే మౌర్య ఆస్పత్రి పాలు కావడం గమనార్హం.