ఉత్తరప్రదేశ్ సీఎం పీఠంపై ఆదిత్యనాథ్
- నేడు లక్నోలో ప్రమాణ స్వీకారం
- సస్పెన్స్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం
- తీవ్ర తర్జన భర్జనల అనంతరం ప్రకటన
- డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ
- అనూహ్యంగా యోగి పేరు తెరపైకి
- శనివారం ఉదయం నుంచీ హైడ్రామా
- హాజరుకానున్న మోదీ, అమిత్ షా, బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై వారం రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు బీజేపీ అధిష్టానం తెరదించింది. చివరి నిమిషం వరకు తీవ్ర తర్జన, భర్జనల అనంతరం హిందూత్వ ఐకాన్ యోగి ఆదిత్యనాథ్ (44)కు సీఎం పదవిని అప్పగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, మనోజ్ సిన్హాలతోపాటు పలువురి పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చినప్పటికీ.. గోరఖ్‌పూర్ ఎంపీవైపే మొగ్గుచూపింది. శనివారం లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభాపక్షం సమావేశంలో యోగి పేరును ఖరారు చేసింది.
సీఎం రేసులో ముందు వరసలో కనిపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ సీనియర్ నేత, లక్నో మేయర్ దినేశ్ శర్మలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాన్షీరాం స్మృతి ఉప్‌వన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2.15కు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాతోపాటుగా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఎన్డీఏ పాలిత సీఎంలకూ ఆహ్వానం అందినట్లు సమాచారం.
ఏకగ్రీవంగా ఆమోదం
పార్టీ శాసన సభాపక్ష సమావేశం అనంతరం యూపీ పరిశీలకులు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, భూపేంద్ర యాదవ్‌లు మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సురేశ్ ఖన్నా ఆదిత్య పేరును ప్రతిపాదించగా.. మిగిలిన వారు బలపరిచారన్నారు. అధిష్టానం యోగి పేరును ప్రతిపాదించినా ఎమ్మెల్యేలు మరెవరినైనా సీఎంగా ఉండాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే.. ఏకగ్రీవంగా అం దరూ ఆదిత్యనాథ్‌ను ఆమోదించారని వెంకయ్య తెలిపారు. ‘కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఈ తీర్పునిచ్చారు. అన్ని వర్గాలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుని తమ మద్దతును తెలియజేశాయి’ అని వెంకయ్య తెలిపారు. యోగి పేరును సీఎంగా ప్రకటించగానే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వేదిక వద్దకు చేరుకుని ఆయన్ను పూల దండలతో ముంచెత్తారు. యూపీకి ఆదిత్య 32వ ముఖ్యమంత్రిగా నాలుగో బీజేపీ సీఎంగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
శనివారం పెరిగిన అ‘టెన్షన్’
సీఎం ఎవరనే అంశంపై గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఆసక్తి ఎక్కువైంది. శనివారం ఉదయం లక్నో చేరుకున్న రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా గుళ్లో పూజలు నిర్వహించారు. దీంతో సిన్హా సీఎం అవుతున్నారనే ప్రచారం ఎక్కువైంది. దీన్ని ఆయన ఖండించినా ప్రచారం ఆగలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఢిల్లీలోనే మకాం వేసి ఉండటంతో ఆయన లాబీయింగ్ చేస్తున్నారని.. ఓబీసీ నేతగా అవకాశాలు ఆయనకూ ఉండొచ్చని వార్తలొచ్చాయి. రాజ్‌నాథ్ సింగ్ పేరు యథావిధిగానే మొదటి స్థానంలో ఉంది. ఈ సమయంలో.. ఢిల్లీకి రావాలంటూ యోగి ఆదిత్యనాథ్‌కు పిలుపురావటంతో సమీకరణాలు చాలా వేగంగా మారిపోయాయి. చర్చోపచర్చల తర్వాత.. పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి రెండు గంటల ముందు మౌర్య, ఆదిత్య ఒకే విమానంలో లక్నోకు చేరుకున్నారు. అయితే సమావేశం ప్రారంభానికి ముందు హైడ్రామా నెలకొంది. లోక్ భవన్లో కేంద్ర పరిశీలకులతో యోగి ఆదిత్య, మౌర్య సమావేశమయ్యారు. ఈ మధ్యలోనే దినేశ్ శర్మను సమావేశంలోకి పిలిచారు. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. విచిత్రమేంటంటే సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎవరూ యూపీ శాసన సభ్యులు కారు. కాగా, సీఎంతోపాటు ఇద్దరు కూడా ప్రస్తుత శాసనసభలో సభ్యులు కారు. ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌కు, మౌర్య ఫుల్పూర్ ఎంపీలుగా ఉండగా.. దినేశ్ శర్మ లక్నో మేయర్. సీఎం పేరు ప్రకటించకముందే యోగి వ్యక్తిగత భద్రతను పెంచారు.
ఆశ్చర్యకరంగా యోగి ఎంపిక!
అభివృద్ధి రాజకీయాల గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించటం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. బీజే పీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిర నిర్మాణం ముందడుగు పడుతుందంటూ ఇటీవలి ఎన్నికల్లో యోగి ప్రచారం చేశారు. అయితే ఆదిత్యనాథ్‌కు బీజేపీ అధిష్టానంతో అంత గొప్పగా సం బంధాల్లేవు. పలు సందర్భాల్లో పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారాయన.
సుపరిపాలన అందిస్తా: యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయటంపైనే దృష్టి సారించనున్నట్లు యూపీ సీఎంగా ఎంపికైన యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ నినాదాన్ని తాను కొనసాగిస్తానన్నారు. గవర్నర్ రాంనాయక్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘నాపై విశ్వాసం ఉంచిన ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ రాంనాయక్‌కు కృతజ్ఞతలు. యూపీకి సుపరిపాలన అందిస్తాను. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని నేను విశ్వసిస్తున్నా’ అని యోగి తెలిపారు.