ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో కమలం సునామీ రేపింది. కాషాయ హోలీతో సత్తా చాటింది. 403 స్థానాలు ఉన్న యూపీలో బీజేపీ ఏకంగా 320కిపైగా స్థానాలు సొంతం చేసుకునే దిశగా కదులుతోంది. రాజకీయంగా దేశంలో అత్యంత కీలకమైన యూపీలో బీజేపీ మూడింట రెండొంతులకుపైగా స్థానాలు కైవసం చేసుకోవడం గమనార్హం. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం 324 స్థానాలు గెలుపొందగా, ఎస్పీ కూటమి 54 స్థానాలు (ఒక స్థానంలో ఆధిక్యం), బీఎస్పీ 19 స్థానాలు సాధించగా, ఇతరులు ఐదు స్థానాలు గెలుపొందారు.
ఇక అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని అంగీకరించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమికి అఖిలేషే కారణమని ములాయం సింగ్ యాదవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. భారీ విజయం సాధిస్తున్న బీజేపీలో ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు సిద్ధార్థ్ నాథ్, యోగి ఆదిత్యానంద, మౌర్య సీఎం రేసులో ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో కమలం వికసించింది. ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక బీఎస్పీకి మరోసారి పరాజయం ఎదురైంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. యూపీలో మొత్తం 403 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా, మరో 293 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి 70, బీఎస్పీ 18 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ సరళిని బట్టి బీజేపీ భారీ విజయం సాధించే అవకాశముంది.
యూపీలో చాలా ప్రాంతాల్లో బీజేపీ సత్తాచాటుతోంది. ఎస్పీ, కాంగ్రెస్ కంచుకోటల్లోనూ కమలం పాగా వేస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు సైతం వెనుకంజలో ఉన్నారు. ములాయం కోడలు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మరదలు అయిన అపర్ణా యాదవ్ వెనుకంజలో ఉన్నారు. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణపై బీజేపీ నేత రీటా బహుగుణ ముందంజలో ఉన్నారు. కాగా శివపాల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
ఈ రోజు యూపీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.
యూపీ వివరాలు:
- లక్నో కంటోన్మెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ.. ఎస్పీ అభ్యర్థి అపర్ణపై 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
- బీఎస్పీ నేతలు ముక్తర్ అన్సారీ, ఆయన కొడుకు అబ్బాస్ అన్సారీ, సోదరుడు సిగ్బతుల్లా వెనుకంజ
- రేప్ కేసులో పరారీలో ఉన్న మంత్రి గాయత్రి ప్రజాపతి వెనుకంజ
- స్వార్‌లో మంత్రి ఆజం ఖాన్ కొడుకు అబ్దుల్లా వెనుకంజ
- నోయిడాలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు, బీజేపీ అభ్యర్థి పంకజ్ సింగ్ ఆధిక్యం
- అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ముందంజ
- రాంపూర్‌లో మంత్రి ఆజం ఖాన్ ఆధిక్యం
- జశ్వంత్ నగర్‌లో ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ ముందంజ
- కాంగ్రెస్ కంచుకోట అమేధిలో బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం
- యూపీలో మెజార్టీకి 202 సీట్లు అవసరంగా కాగా బీజేపీ 300కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది
- కౌంటింగ్ ప్రారంభం నుంచి బీఎస్పీ సత్తాచాటలేకపోయింది. ఓ దశలో 36 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. క్రమేణా తగ్గింది
- అధికార సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి తొలి నుంచి వెనుకంజలో ఉంది
- ఎమ్మెల్సీగా ఉన్న సీఎం అఖిలేష్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు
- ఓటమికి అఖిలేషే కారణమని, పార్టీ పగ్గాలు ములాయంకు అప్పగించాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు
- కుందా నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఐఎన్‌డీఎస్పీ నేత రాజభయ్యా ముందంజ
- ఉత్తరప్రదేశ్ సీఎం రేసులో బీజేపీ నేతలు సిద్ధార్థ్ నాథ్, యోగి ఆదిత్యానంద, మౌర్య పేర్లు వినిపిస్తున్నాయి
ఫలితాలపై నాయకుల స్పందన
- కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. భారత రాజకీయాల్లో ఇదో కొత్త అధ్యాయం - కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
- అభివృద్ధి ఎజెండా చూసి కులమతాలకు అతీతంగా బీజేపీకి పట్టంకట్టారు- కేంద్ర మంత్రి జవదేవకర్
- ఉత్తరప్రదేశ్ కాస్తా.. ఉత్తమప్రదేశ్‌గా మారింది- బీజేపీ అధికార ప్రతినిధి స్వరాజ్
- ప్రజా తీర్పును గౌరవిస్తాం కానీ.. ఓటు బ్యాంకు రాజకీయాలు గెలవడం బాధాకరం- కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా
- ప్రియాంక గాంధీ ఓ కాగితపు పులి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా బీజేపీని గెలిపించారు- కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
-
ప్రధాని మోదీ అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపించాయి- బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా