యూపీలో బీజేపీ ఎందుకు భయపడుతోంది!
గతకొన్ని నెలలుగా అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటకు.. అఖిలేశ్ యాదవ్ సైకిల్ గుర్తును కైవసం చేసుకోవడంతో తెరపడింది. పార్టీ అధినేత, తండ్రి ములాయం నుంచి చాకచక్యంగా పార్టీ గుర్తును సొంతం చేసుకున్న అఖిలేశ్ ఇప్పుడు మరో ఎన్నికల చతురతకు తెరలేపబోతున్నారు.
అదే.. బిహార్ శైలిలో ఇటు కాంగ్రెస్ పార్టీతో, అటు ఆరెల్డీతో మహాకూటమికి తెరలేపడం. అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయని, ఇరు పార్టీల యువనేతలు రాహుల్, అఖిలేశ్ భేటీ అయి.. అధికారికంగా ప్రకటించడమే తరవాయి అని ఇరు పార్టీల వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. కాంగ్రెస్, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆరెల్డీ పార్టీలకు పొత్తులో భాగంగా 120-125 సీట్లు కేటాయించే అవకాశముందని, మిగతా సీట్లలో ఎస్పీ పోటీచేస్తుందని సమాచారం. బిహార్ మహాకూటమి శైలిలో ఏర్పాటు అవుతున్న ఈ కూటమి బీజేపీకి తలనొప్పిగా మారింది. యూపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది.
2015 నవంబర్ లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో బద్ధ విరోధులైన నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అప్పటివరకుమోదీ హవాతో విజయాల బాటలో ఉన్న బీజేపీకి ఈ మహాకూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మోదీ అభివృద్ధి అజెండాను తోసిపుచ్చి మరీ లోకల్ హీరో నితీశ్ కు బిహార్ ప్రజలు జైకొట్టారు.
బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుందా?
బిహార్ తో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ లో కులసమీకరణాలు భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ ఎస్సీ, కాంగ్రెస్, ఆరెల్డీ కూటమి బీజేపీకి గట్టి పోటీనిచ్చే అవకాశముంది. ఇక ఎస్పీలో జరిగిన అంతర్గత కుటుంబపోరు.. అఖిలేశ్‌కు జనాదరణను పెంచింది. మరోవైపు అమేథి, రాయబరేలి, సుల్తాన్ పూర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉంది. ఈటా, కనౌజ్, మధ్య యూపీలో ములాయం ఏళ్లకిందట నెలకొల్పిన క్షేత్రస్థాయి ఓటర్ల బలం ఎస్పీకి కలిసిరానుంది.
భీష్మ పితామహుడిగా ములాయం!
కన్న కొడుకుతో జరిగిన కుటుంబపోరులో ఓడిపోయిన ములాయం భీష్మ పితామహుడిగా అవతరించే అవకాశముందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడు భౌతికంగా కౌరవుల పక్షం నిలిచినా.. వారి ప్రత్యర్థులైన పాండవులు గెలువాలని కోరుకున్నాడు. ఇప్పడు ములాయం కూడా తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పక్షం నిలిచినా.. తన కొడుకు అఖిలేశ్ ఘనవిజయం సాధించాలని మానసికంగా కోరుకుంటున్నారని వారు అంటున్నారు. అఖిలేశ్ గెలుపు కోసం ఆయన ఏదైనా చేసే అవకాశముందని చెప్తున్నారు.
ఇక బీజేపీకి యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం పెద్ద ప్రతికూలతగా మారింది. ఇప్పటికే సీఎం అఖిలేశ్ అభివృద్ధి అనుకూల నాయకుడిగా జనాల్లోకి చొచ్చుకెళ్లారు. బిహార్ లో బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ముఖంతో ఎన్నికలకు వెళ్లి భంగపడింది. స్థానిక నేతలను పక్కనబెట్టడం కూడా దెబ్బతీసింది. ఇప్పడు యూపీలో కూడా బలమైన స్థానిక నేత లేకపోవడం మైనస్ పాయింట్ గా మారింది. కొన్ని కారణాల వల్ల వరుణ్ గాంధీని బీజేపీ పక్కనపెట్టేసింది. మరోవైపు బిహార్ తో పోల్చుకుంటే యూపీలో ప్రధాని మోదీ చాలా తక్కువ ఎన్నికల సభలలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల నుంచి బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుందా? మళ్లీ గెలుపు బాట పడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.