బీజేపీ విక్టరీ: మళ్లీ తెరపైకి రాం మందిరం
బీజేపీ విక్టరీ: మళ్లీ తెరపైకి రాం మందిరం
Published Sat, Mar 11 2017 6:20 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
ముంబై : ఉత్తరప్రదేశ్ లో భారీ ఆధిక్యంలో విజయం సాధించిన బీజేపీకి శివసేన అభినందనలు తెలిపింది. అభినందనలతో పాటు మళ్లీ రాం మందిరం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయోధ్యలో రాం మందిరం త్వరలో కడతారని ఆశిస్తున్నామని శివసేన పేర్కొంది. ''రాముడిని వనవాసంలో ఉంచే కాలం ముగిసింది. ఇప్పుడిక అయోధ్యలో రాం మందిరం కడతారని మేము ఆశిస్తున్నాం'' అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. ఎంతోకాలంగా కలిసిమెలిసి ఉన్న శివసేన, బీజేపీలు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయి. నువ్వానేనా అంటూ పోటీపడిన ఎన్నికల్లో శివసేన గెలుపొందింది.
నేడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ యూపీలో తన విజయ భావుటా ఎగురవేసింది. బీజేపీ విక్టరీని తాము స్వాగతిస్తున్నామని, ఈ గెలుపుకు ప్రధానికి కంగ్రాట్స్ చెబుతున్నట్టు సంజయ్ రౌత్ చెప్పారు. ప్రజలు మార్పుకు ఓటు వేశారని, ఈ మేరకే విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమిల ఓటమిపై స్పందించిన సంజయ్ రౌత్, ఎన్నికల్లో ఓడిపోయిన వారు శివసేన ప్రాధాన్యతను, పవర్ ను గుర్తించాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఎలాగైతే తాము మహారాష్ట్రను పాలించకుండా ఆపగలిగామో తెలుసుకోవాలన్నారు. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో యూపీ 324స్థానాలను కైవసం చేసుకుని, భారీ విజయాన్ని దక్కించుకుంది.
Advertisement