సాక్షి, ముంబై : అయోధ్య భూమిపూజ సందర్భంగా రామ జన్మభూమి ట్రస్ట్ చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ హోం క్వారంటైన్‌లోకి వెళ్తారా అని శివసేన పార్టీ సూటిగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ నిలదీశారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
‘ఆగస్ట్ 5 న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజలో మహంత నృత్య గోపాల్ దాస్ పాల్గొన్నారు. ఆయన మాస్కు పెట్టుకోలేదు. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొన్నారు. మోదీ భక్తితో గోపాల్ దాస్ చేతిని కూడా పట్టుకున్నారు. అందుకే మోదీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి’అని రౌత్ డిమాండ్ చేశారు. (చదవండి : కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్ )
అలాగే కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్‌పై కూడా సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. భాబీజీ పాపడ్ తింటే కరోనా రాదన్న మేఘవాల్ వ్యాఖ్యలపై రౌత్ మండిపడ్డారు. భారత్ భాబీజీ పాపడ్ దగ్గరే ఆగిపోయిందని, రష్యా మాత్రం కోవిడ్ -19 కు వ్యాక్సిన్ కనిపెట్టి ఆత్మ నిర్భరతను చూపిందన్నారు. మనం మాత్రం ఆత్మ నిర్భర భారత్‌పై ఉపన్యాసాలు ఇస్తూనే ఉంటామని కేంద్రంపై రౌత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
(చదవండి : వాజ్‌పేయితో ఉన్న వీడియోను షేర్ చేసిన మోదీ)
కాగా, అయోధ్య భూమి పూజలో పాల్గొన్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల నేపథ్యంలో ఆయనకు పరీక్షలు నిర్వహించగా, ఆగస్ట్ 13న కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాలని శివసేన డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment