
ముంబై : నిరుద్యోగ వంటి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని రాజీనామాను కోరవచ్చని శివసేన ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా 10 కోట్ల మంది జీవనోపాధిని కోల్పోయారని, 40కోట్ల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం తమ పార్టీ పత్రిక సామ్నాలో రోక్‌తోక్ అనే తన కాలమ్‌లో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. (చదవండి : అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..)
మోదీ ప్రభుత్వం దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టిందని ఆరోపించారు. కరోనా సంక్షోభం వల్ల జీతాలపై ఆధారపడే మధ్య తరగతి ప్రజలు ఉద్యోగాలు కోల్పోగా, వాణిజ్యం, పరిశ్రమలు సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్
‘ప్రజల సహనానికి ఒక పరిమితి ఉంది. వారు కేవలం ఆశ, హామీల మీద మనుగడ సాగించలేరు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఘటనే ఇందుకు నిదర్శనం. కరోనావైరస్ మహమ్మారి, దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు ఉన్నాయి. భారత్‌లో కూడా ఇలాంటి వ్యతిరేక రావొచ్చు’అని ఆయన అభిప్రాయపడ్డారు.
రఫేల్ యుద్ధ విమానాల లాంటి వాటితో నిరుద్యోగా, ఆర్థిక సవాళ్లను అధిగమించలేమని చెప్పుకొచ్చారు.రాజస్థాన్‌లో (కాంగ్రెస్ నేతృత్వంలోని) గెహ్లోత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరిగాయని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని ఆయన తన కాలమ్‌లో పేర్కొన్నారు. (చదవండి: ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..)
అలాగే బంగారం రేట్లు 51,000కి పైగా పెరిగిందని తన కాలమ్‌లో ప్రస్తావించారు. ‘సంక్షోభం, ఉపాధి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సంక్షోభం అవకాశానికి దారి తీస్తుందని చెప్పడం చాలా సులభం. అయితే, ప్రజలు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో ఎవరికీ తెలియదు’అని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment