ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సోనియా ఇచ్చిన వీడ్కోలు విందును రాహుల్ వీడ్కోలు విందుగా శివసేన నేత సంజయ్ రావుత్ అభివర్ణించారు. అదే సమయంలో ప్రధాని వీడ్కోలు పార్టీకి రాహుల్ హాజరు కాకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీకి హాజరు కాకపోవడమంటే ప్రధానిని అవమానించడమేనన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావుత్ మాట్లాడుతూ... ‘బుధవారం ఢిల్లీలో జరిగిన విందు కేవలం ప్రధాని వీడ్కోలు విందు మాత్రమే కాదు.. అది రాహుల్ వీడ్కోలు విందు కూడా. రాహుల్ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. అప్పుడప్పుడు సెలవుల్లో భారత్‌కు వస్తుంటారు.
ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ ఆయన అక్కడికే వె ళ్లాల్సి ఉంటుంది. ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని మిగులుస్తాయని ఇప్పటికే స్పష్టమైంది. బీజేపీ విషయం దాదాపుగా ఖాయమైంది. అందుకే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్న రాహుల్ ఫలితాల తీరు ఎలాఉండనుందో తెలుసుకొనే పార్టీకి హాజరు కాలేద’ని విమర్శించారు. దాదాపు రెండున్నర నెలలు తీవ్ర శ్రమకోర్చి ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారని, అందువల్లే ఆయన ప్రధాని విందుకు హాజరు కాలేకపోయారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందే(గురువారం రాత్రే) ఆయన ఢిల్లీకి రానున్నారని చెప్పారు.
ఫలితాల తర్వాతే ఏ నిర్ణయమైనా...
ఎన్డీయే అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైనట్లు సర్వేలు చెబుతున్నాయని, ఒకవేళ అదే జరిగితే కేంద్రంలో శివసేన ఎటువంటి పాత్ర పోషిస్తుందని అడిగిన ప్రశ్నకు రావుత్ సమాధానమిస్తూ ‘దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఏ నిర్ణయమైనా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే తీసుకుంటామ’న్నారు.
అది రాహుల్ వీడ్కోలు పార్టీ
Published Thu, May 15 2014 10:29 PM | Last Updated on Tue, Aug 14 2018 5:51 PM
Advertisement
Advertisement