
సాక్షి, ముంబై : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పనులు చర్చనీయంగా మారాయి. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకుని మరీ షేక్ హ్యాండ్ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం.. వంటి చర్యలతో రాహుల్ గాంధీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితో సహా సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రాహుల్ చేసిన పనిని తప్పుబట్టారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ విషయమై రాహుల్‌ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం రాహుల్ చర్యను తనకు అనుకూలంగా మార్చుకుంది. లోక్‌సభలో రాహుల్ మోదీకి ఇచ్చింది కౌగిలింత కాదని.. ఆయనకదో గట్టి షాక్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
రాహులే అసలైన విజేత..
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం తీర్మానంలో మోదీ నెగ్గినప్పటికీ అసలైన విజేత మాత్రం రాహులేనని సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఉటంకిస్తూ.. ఓడిపోయిప్పటికీ తమ అద్భుత ప్రదర్శన ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న క్రొయేషియా జట్టు లాగే.. రాహుల్ కూడా తన ప్రసంగం, చర్యలతో ప్రజలను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో జరిగిన సంఘటనల ద్వారా రాహుల్ నిజమైన రాజకీయ నాయకుడినని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ చర్యలను డ్రామా అంటూ విమర్శిస్తున్న వారంతా ప్రతీ రాజకీయ నాయకుడు డ్రామాలాడుతారన్న విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందని హితవు పలికారు. కాగా శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనకుండా శివసేన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment