సాక్షి, ముంబై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి శివసేన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోందని శివసేన వ్యాఖ్యానించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
శివసేనకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్.. ఒక టీవీ చర్చాకార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపట్ల దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలు.. ప్రజలను ఆలోచనలో పడేశాయని ఆయన చెప్పారు. ఈ రెండు అంశాల వల్లే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతాయని జోస్యం చెప్పారు.
అదే సమయంలో రాహుల్ గాంధీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని చెప్పారు. ‘దేశంలో చాలామంది తామే గొప్ప అనుకునే నేతలు.. రాహుల్ గాంధీని పప్పు అని పిలుస్తున్నారు. ఇది చాలా తప్ప’ని ఆయన చెప్పారు. ప్రస్తుత గుజరాత్, హిమాచల్ ఎన్నికలతో పాటు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment