సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంపై సాగుతున్న చర్చలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జోక్యం చేసుకున్నారు. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా రాహుల్ గాంధీని నిలువరిస్తే కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సరితూగే స్ధాయి కలిగిన నేత కాంగ్రెస్‌లో లేరని రౌత్ శివసేన పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి 23 మంది ఆ పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల శివసేన ఎంపీ విస్మయం వ్యక్తం చేశారు. సీనియర్ నేతలు పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా నిరోధించిన వారు ఎవరని ప్రశ్నించారు. రాహుల్‌కు నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా అడ్డుకుంటే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని రౌత్ వ్యాఖ్యానించారు. చదవండి : శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే
కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీయేతరుడి ఎన్నిక మంచి ఉద్దేశమే అయినా ఆ 23 మందిలో అలాంటి సామర్థ్యం ఉన్న నేత ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ చావులేని వృద్ధ మహిళ వంటిదని ఆ పార్టీ దివంగత నేత వీఎన్ గాడ్గిల్ అభివర్ణించేవారని, అలాంటి పార్టీని ఎలా కాపాడుకోవాలో రాహుల్ నిర్ణయించుకోవాలని రౌత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని, అన్ని స్ధాయిల్లో చురుకుగా ఉండే పూర్తికాల అధ్యక్షులను నియమించాలని 23 మంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ వంటి 23 మంది నేతలు సంతకాలు చేశారు. కాగా సోనియా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ లేఖ రాయడం పట్ల సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్ సీనియర్ నేతలపై మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కయ్యారని సీనియర్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన సీనియర్లు రాజీనామాకు సిద్ధపడగా వారిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment