మోదీ ప్రచారం.. షా వ్యూహం కలసి వచ్చాయి
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. యూపీ ప్రజలు కులమతాలకు అతీతంగా, అభివృద్ధి ఎజెండాకు ఓటు వేశారని బీజేపీ నాయకులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం కలసి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కాసేపట్లో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 300కు పైగా సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఓటమిని అంగీకరించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ కూడా ఈ రోజు రాజీనామా చేస్తారు. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా, గోవా, మణిపూర్‌లలో హోరాహోరీ పోరు నెలకొంది.