న్యూఢిల్లీ: ‘‘అంబేద్కర్ చూపిన మార్గంలోనే తన ప్రభుత్వం నడుస్తోంద’న్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను సొంత పార్టీ ఎంపీలే నమ్మడంలేదు. రిజర్వేషన్ల ఎత్తివేతకు కుట్ర జరుగుతోందని బీజేపీ ఎంపీ సావిత్రి బాయి, పార్టీలో దళితులకు గౌరవం లేదన్న మరో ఎంపీ చోటేలాల్ వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే మరో బీజేపీ ఎంపీ.. ప్రధానిపై లేఖాస్త్రం సంధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ యశ్వంత్ సింగ్ శనివారం మోదీకి రాసిన లేఖలో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు.
బీజేపీ దళితులకు చేసిందేమీలేదు: ‘‘గడిచిన నాలుగేళ్లలో మన ప్రభుత్వం దేశంలోని 30 కోట్ల మంది దళితులకు చేసింది ఏమీలేదు. రిజర్వేషన్ వల్ల నేను ఎంపీగా గెలవడం తప్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీలేదు. కేవలం దళితుడిని కావడంవల్లే నా సామర్థ్యాన్ని పార్టీ వినియోగించుకోవడంలేదు..’’ అని ఎంపీ యశ్వంత్ సింగ్ పేర్కొన్నారు. ఇదే లేఖలో.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ సుప్రీంకోర్టుకు ఓ సూచన చేశారు.
ఎస్సీ, ఎస్టీ ఎంపీల అసంతృప్తి: ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత, గిరిజన ఎంపీలు ఒక్కొక్కరిగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. బహ్రెయిచ్ ఎంపీ సావిత్రి బాయి మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా.. బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్ బీజేపీ ఎంపీ చోటేలాల్.. మోదీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్.. పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని వాపోయారు. ఆ మరుసటి రోజే.. ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్ దోహ్రీ.. యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్ తప్పుడుకేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇప్పుడు నగీనా ఎంపీ యశ్వంత్.. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని బాంబు పేల్చారు. తాజా ఆరోపణలపై బీజేపీ అధిష్టానం స్పందించాల్సిఉంది.
పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు (యశ్వంత్ సింగ్, అశోక్ దోహ్రీ, సావిత్రి బాయి, చోటేలాల్)
Comments
Please login to add a commentAdd a comment